మహారాష్ట్ర: 'కన్ను మూసినా తెరిచినా కనిపించేది నీటి సమస్యే.. పరిష్కరించేవారికే నా ఓటు' #MyVoteCounts

భారతదేశంలో సుమారుగా 46 శాతం మంది మహిళలు రోజులో కనీసం 15 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ సమయం నీళ్లు తెచ్చుకోవడానికే కేటాయిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్యపై యువ ఓటర్లేమంటున్నారు? బీబీసీ 'మై ఓట్ కౌంట్స్' సిరీస్‌లో భాగంగా- తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకోబోతున్న 18 ఏళ్ల మహారాష్ట్ర యువతి యశోద జోలేపై బీబీసీ ప్రతినిధులు అనఘా పాఠక్, పీయూష్ నాగ్పాల్ అందిస్తున్న కథనం ఇది.
''నా జీవితం ఈ నీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నేను నిద్రలేవగానే గుర్తొచ్చే మొదటి విషయమూ అదే. నిద్ర పోయే ముందు గుర్తొచ్చే చివరి విషయమూ అదే'' అని యశోద చెప్పారు. తమకు ఎవరు నీటి సదుపాయం కల్పిస్తే వారికే రాబోయే ఎన్నికల్లో ఓటేస్తానని యశోద తెలిపారు. ''నేనొక్కదాన్నే కాదు మా గ్రామానికి చెందిన మహిళలందరూ వారికే ఓటేస్తారు'' అని చెప్పారు.
ఆమెది మహారాష్ట్రలోని జవహర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో నాలుగు నెలలపాటు 3,287 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడంతో మిగిలిన ఏడాదంతా నీటి కొరతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
రోజులో చాలాసేపు నీళ్లు తోడటంతోనే గడిపేస్తుంటానని యశోద తెలిపారు.
''నాలుగేళ్ల పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలివారు వరకు ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఇక్కడ అదే పనిచేస్తూ కనిపిస్తారు. వీరిలో గర్భిణులు కూడా ఉంటారు. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, లింగ భేదానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం నీటికొరతను పెద్ద సమస్యగా భావించడం లేదు. ఎందుకంటే ముందు మా గ్రామంలోని పురుషులే దీనిని సమస్య అనుకోవడం లేదు కాబట్టి. ఈ నీళ్లు ఊరికే వస్తున్నాయని వాళ్లనుకుంటారు. మేం నీళ్ల పన్ను కూడా కట్టకపోవడంతో మా గ్రామంలో కుళాయిలన్నీ అలంకార ప్రాయమైపోయాయి'' అని ఆమె వివరించారు.

'పక్క గ్రామంలో గ్రామపెద్దే నీళ్లు ఆపేశారు'
పక్కనే ఉన్న మరో గ్రామంలో గ్రామపెద్దే ఇంటి దగ్గర కుళాయిలకు నీళ్లు ఆపేశారని యశోద చెప్పారు. ''ఎందుకంటే- ఇంటి ముందే నీళ్లు ఉంటే మహిళలు నీటిని వృథా చేస్తారని చెబుతున్నారు. ఆయన నీటిని ఆదాచేయాలనుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలనుకుంటున్నారు. కానీ ఏం చేస్తే బాగుంటుందనే విషయం మహిళలను ఆయనెప్పుడూ అడగలేదు'' అని ఆమె ఆక్షేపించారు.
ప్రభుత్వానిది కూడా ఇదే తీరని, వారెప్పుడూ మహిళల అభిప్రాయాన్ని తీసుకోరని, ఎందుకంటే కేబినెట్‌లో కూడా చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారని యశోద వ్యాఖ్యానించారు.
''రాబోయే ఐదేళ్లలో నేను చదువు పూర్తిచేసి పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకుంటున్నా. నేను జవహర్ ప్రాంతాన్ని వదిలి నీరు సమృద్ధిగా ఉన్న చోటకు వెళ్లి స్థిరపడాలనుకుంటున్నా'' అని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- #MyVoteCounts: 'గ్రామీణ విద్యార్థుల సమస్యలు తీర్చేవారికే నా ఓటు'
- #MyVoteCounts: ఉద్యోగాలు ఇచ్చే పార్టీకే ఓటేస్తా
- ట్రంప్ స్నేహితుడి మీడియా సంస్థ నా ప్రైవేటు ఫొటోలతో నన్ను బెదిరిస్తోంది: అమెజాన్ అధినేత
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యారిలా
- మీకు ప్రభుత్వం నేరుగా డబ్బిస్తే మంచిదేనా, కాదా?
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- 'కల తీర్చుకుందామని అమెరికా వెళ్లా.. ఇలా జరుగుతుందనుకోలేదు.. అసలు కారణం తెలిస్తే అమ్మానాన్న తట్టుకోలేరు'
- గర్భనిరోధక పిల్ రోజూ వేసుకోవచ్చా.. ఇది అందరికీ ఎందుకు పని చేయదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









