అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్టు: కల తీర్చుకుందామని వెళ్లా.. ఇలా జరుగుతుందనుకోలేదు - తెలుగు యువకుడి ఆవేదన

డాలర్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మాది రైతు కుటుంబం. మా తల్లిదండ్రులకు నేను అమెరికా నుంచి ఎందుకు వచ్చేశానో తెలియదు. అసలు కారణం తెలిస్తే వాళ్లు చనిపోతారేమోనన్న భయం నాకు. నేను సెలవులకు వచ్చానని అనుకుంటున్నారు" అని చెప్పారు తెలంగాణ యువకుడు వీరేష్ (పేరు మార్చాం).

అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రంలో అధికారులు సృష్టించిన, ఉనికేలేని 'ఫార్మింగ్టన్ యూనివర్శిటీ'లో ప్రవేశాలు పొందిన భారతీయ విద్యార్థుల అరెస్టు, ఇతర పరిణామాల నేపథ్యంలో భారత్‌కు వచ్చేసిన విద్యార్థుల్లో 30 ఏళ్ల వీరేష్ ఒకరు. ఆయన ఫిబ్రవరి 4న హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనతో బీబీసీ తెలుగు ఫోన్‌లో మాట్లాడింది.

దక్షిణ తెలంగాణకు చెందిన వీరేష్ వారి కుటుంబంలో అమెరికా వెళ్లిన తొలి వ్యక్తి. అమ్మానాన్నలకు నిజం చెప్పే ధైర్యంలేక అమెరికాలో ఉండేందుకు ఎచ్ 1 వీసా వచ్చిందని, దానికి సంబంధించిన పనిపై వచ్చానని చెప్పానని తెలిపారు.

''ఏంచేయాలో అర్థం కావట్లేదు. కనీసం ఒక నెల పాటు ఆలోచించుకునే సమయం దొరుకుతుందని అలా అబద్ధం చెప్పాను. వాస్తవం ఏమిటంటే, నాపై రూ.10 లక్షల అప్పు ఉంది. అది నా పైచదువుల కోసం తీసుకున్నది. ఇప్పుడు అప్పు ఆరు నెలల్లో తీర్చాలి. అనుకున్న మాస్టర్స్ డిగ్రీ కూడా లేదు'' అంటూ ఆయన విచారం వ్యక్తంచేశారు.

ప్రవేశాలపై ప్రచారం

2013లో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న వీరేష్ 2014 డిసెంబరులో కాలిఫోర్నియాలోని నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ(ఎన్‌పీయూ)లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు.

"నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఒక్కణ్నే కొడుకుని. 'మా అమ్మానాన్నను బాగా చూసుకోవాలి, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి' అన్న కలతో అమెరికా వెళ్లాను. కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి పనిచేస్తే కొంచెం సంపాదించుకోవచ్చని ఆశ పడ్డాను" అని ఆయన వివరించారు.

2016 మేలో ఎన్‌పీయూకున్న సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితశాస్త్రం(ఎస్‌టీఈఎం) ప్రోగ్రామ్‌ అక్రెడిటేషన్ రద్దయింది. అప్పటికే కాలిఫోర్నియాలో ఐటీ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు వీరేష్.

"నాకు నెలకు నాలుగు వేల డాలర్లు వచ్చేది. నా నెల ఖర్చు 1,500 డాలర్ల వరకు ఉండేది. చదువుతున్న కాలేజీలో అక్రెడిటేషన్ రద్దు కావటంతో వీరే కాలేజీకి వెళ్లే ఆలోచనలో ఉండగా, యూనివర్శిటీ అఫ్ ఫార్మింగ్టన్ గురించి ఒక పరిచయస్తుడు తెలిపారు. పెద్దగా ఆప్షన్స్ లేక అక్కడే అడ్మిషన్ తీసుకున్నా" అని ఆయన వెల్లడించారు.

2017లో H1 వీసా కోసం వీరేష్ దరఖాస్తు చేసుకున్నారు. లాటరీ పద్ధతిలో ఇచ్చే ఈ వీసాకు వీరేష్ ఎంపికయ్యారు. అయితే మరిన్ని పత్రాలు కావాలంటూ దీనిని అమెరికా అధికారులు పెండింగ్‌లో ఉంచారు. 2019 జనవరి 29న దీనిని ఆయనకు తిరస్కరించారు.

జనవరి 30న అమెరికాలో అధికారులు విద్యార్థులను అరెస్టు చేసే సమయానికి తాను కాలిఫోర్నియాలోని తన నివాసంలోనే ఉన్నట్లు వీరేష్ తెలిపారు. "ముందు నమ్మలేదు. ఒక రోజు తర్వాత సమాచారం అందింది. ఒక్కసారిగా నా భవిష్యత్తు ఇలా అయ్యిందేంటి అని భయం వేసింది. వెంటనే భారత్ తిరిగి వచ్చేందుకు విమాన టికెట్ కొనుక్కునే ప్రయత్నం చేశాను. ఫిబ్రవరి 1న టికెట్ కోసం చూస్తే దొరకలేదు. ప్రయాణ తేదీ దగ్గర్లోనే ఉండటంవల్ల టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. టికెట్ కొనుక్కోవడానికి స్నేహితుడి వద్ద అప్పు తీసుకొని తిరిగి ఇల్లు చేరుకున్నాను" అని ఆయన వివరించారు.

తన పైచదువు కోసం బ్యాంకులో రూ.15 లక్షల అప్పు తీసుకున్నానని, అందులో రూ.9 లక్షలు కట్టేయగా, ఇంకా రూ.6 లక్షల అప్పు, దానిపై ఒక రూ.4 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉందని వీరేష్ వివరించారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు.

చాలా మంది స్నేహితులు అమెరికా నుంచి వెనక్కు వచ్చేశారు

ఈ వారంలో తన స్నేహితులు చాలా మంది అమెరికా నుంచి వెనక్కు వచ్చేశారని ఆయన చెప్పారు. అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులకు సాయపడుతున్న అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ డైరెక్టర్ వెంకట్ మంతెన డెట్రాయిట్ నుంచి బీబీసీతో మాట్లాడారు. అరెస్టు అయిన విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు ర్యాండీ సమోన, ఎడ్వర్డ్ బజోకా అనే ఇద్దరు న్యాయ నిపుణులకు బాధ్యతలు అప్పగించినట్టు వెంకట్ చెప్పారు. ఈ భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణవారేనని ప్రస్తావించారు.

ఫార్మింగ్టన్ యూనివర్సిటీ డే1 కరిక్యులమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఈ కారణంవల్లే ఎక్కువ మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాన్నిఎంచుకున్నారని ఆయన వివరించారు. (అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాక డే 1 సీపీటీ అవకాశం దొరికితే పనిచేసుకుంటూ చదవచ్చు. కానీ వరుసగా రెండోసారీ సబ్జెక్టు మార్చి మరో మాస్టర్స్ కోర్సులో చేరిన వారికి ఆ అవకాశం దక్కదు.)

"2018 ఆగస్టు 9న వచ్చిన ఒక మెమో ఒకేస్థాయి డిగ్రీలో వేరే సబ్జెక్టులో రెండోసారి చేరిన వారికి డే 1 సీపీటీ అవకాశం రాదని స్పష్టం చేసింది. ఆ విషయం తెలిసినప్పటికీ విద్యార్థులు అదే ఎంచుకున్నారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం చదువు పూర్తయ్యాక ఆరు నెలల్లో దేశాన్ని వదిలిపెట్టాలి. లేకపోతే మరోసారి అమెరికా రాకుండా మూడేళ్ల వరకు నిషేధం విధిస్తారు" అని వెంకట్ వివరించారు.

130 మందిని అదుపులోకి తీసుకున్నారని, వీరిలో 122 మంది విద్యార్థులని, మిగతా ఎనిమిది మంది ఈ వర్సిటీలో ప్రవేశాలు పొందడంలో విద్యార్థులకు సహకరించినవారని ఆయన తెలిపారు. ఆ 8 మంది తప్ప అందరూ ఇమ్మిగ్రేషన్ మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ఇమ్మిగ్రేషన్ మోసాలకు పాల్పడ్డవారు కావాలంటే బాండ్ అప్లికేషన్ వేయాలి. దాంతోపాటు జడ్జి అనుమతితో దేశం విడిచి వెళ్లవచ్చు(వాలంటరీ డిపార్చర్). కానీ ఆ అప్పీళ్లు విచారణకు రావడానికి కూడా 5 నుంచి 20 రోజుల వరకు సమయం పట్టొచ్చు. విద్యార్థుల అదృష్టం బావుండి రెండూ ఒకేసారి విచారణకు వస్తే వారు త్వరగా దేశం విడిచి వెళ్లొచ్చు.

uof

ఫొటో సోర్స్, uof

'చదువుతూ పనిచేసే అవకాశముంటే అదే ఎంచుకుంటాం కదా'

అమెరికాలో ఉంటున్న కొంత మంది తెలుగువారితో బీబీసీ తెలుగు మాట్లాడింది. వారిలో ఒకరు పి.శ్రీనివాస్. "చదువుకుంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంటే దానికే మొగ్గు చూపుతారు కదా. అలా అవకాశమున్న కాలేజీల్లో ప్రవేశాలు తీసుకుంటారు. అందులోనూ భారత్‌తో పోలిస్తే అమెరికాలో ఐటీలో పనిచేస్తే కాస్త ఎక్కువే సంపాదించవచ్చు. సాధారణంగా ఒక మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత H1 వీసా వచ్చేలోపు మళ్లీ మాస్టర్స్ డిగ్రీకి దరఖాస్తు చేస్తారు. ఎందుకంటే దాంతో ఇక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది" అని ఆయన వివరించారు.

శ్రీనివాస్ 2010లో అమెరికా వెళ్లారు. అక్కడ ఒక మాస్టర్స్ డిగ్రీ అయిన తర్వాత H1 వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అది రాకపోవడంతో మళ్లీ రెండో మాస్టర్స్ డిగ్రీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం H1 వీసా వచ్చింది.

"ఇండియాతో పోలిస్తే అమెరికాలో పనితీరు, జీవనశైలి కాస్త మెరుగ్గా ఉంటాయి. ఆదాయం కూడా ఎక్కువే. అది చూసి ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ కాకపోతే ఆస్ట్రేలియా వెళ్లేవాడిని. చాలా మంది ఆలోచన నాలాగే ఉంటుంది. కొంత మంది కొన్నేళ్లు ఉండి వెళ్లిపోదామనుకునే వారు కూడా ఉన్నారు" అని శ్రీనివాస్ తెలిపారు.

హైదరాబాద్‌లో నివాసముంటున్న సుధారాణి కుమారుడు, కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమార్తెను అమెరికాలో ఉంటున్న తెలుగు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసారు. "పిల్లలు అమెరికాలో ఉన్నారు అంటే సమాజంలో ఒక హోదా. అంతే కాదు, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా. అప్పులు చేయాల్సి వస్తది. తప్పదు. కానీ అవి తీర్చే డబ్బు కూడా సంపాదించగలరు అక్కడ. పెళ్లి సంబంధాలు కూడా బాగా వస్తాయి మరి" అని ఆమె నవ్వుతూ చెప్పారు.

నా కల తీరాలంటే అమెరికా వెళ్లాల్సిందే.. వెళ్తా: వీరేష్

అవకాశం ఉంటే మళ్లీ అమెరికా వెళ్తానని వీరేష్ తెలిపారు. '''నా కల సాకారం కావాలంటే నేను అమెరికా పోవాల్సిందే. ఇప్పుడు ఎలాంటి అవకాశం ఉంటుందనేది తెలుసుకుంటున్నాను. ఏ మాత్రం అవకాశమున్నా మళ్లీ ఎప్పటికైనా అమెరికా వెళ్లాలన్నద నా కోరిక" అని ఆయన చెప్పారు.

అమెరికాలో తెలుగు విద్యార్థులకు సంబంధించి రోజుకో గాథ బయటకు వస్తోంది.

నిబంధనల గురించి తెలిసీ ప్రవేశాలు పొందినవారు, ముందు జాగ్రత్తతో వెనక్కు వచ్చేసినవాళ్లు, అసలీ గొడవ బయటకు రాకముందే, పోలీసులకు దొరికిపోయి వెనక్కు వచ్చేసిన వారు, ఇంట్లో అప్పు చేసి పంపిస్తే, అక్కడ ఉద్యోగం దొరక్క, ఎలాగోలా ఉందామని అడ్డదారిలో వీసా సంపాదిస్తే ఇరుక్కుపోయినవారు.. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.

అయోమయంలో యువతి

తాజా వ్యవహారం బయట పడకముందే పోలీసులకు చిక్కి పదేళ్ల నిషేధం ముప్పును ఎదుర్కొంటున్న ఒక అమ్మాయి తన బాధను బీబీసీతో పంచుకున్నారు. 22 ఏళ్ల స్రవంతి (పేరు మార్చాం) ఇంజినీరింగ్ తర్వాత పీజీ చదవడానికి గతంలో అమెరికా వెళ్లారు. అక్కడి ఎన్‌పీయూలో 2016 నాటికి ఆమె చదువు పూర్తైంది. తరువాత ఆమెకు ఏడాది వరకూ అమెరికాలో పనిచేసేందుకు అనుమతి దొరికింది. కానీ ఆ ఏడాదిలో ఆమెకు అక్కడ ఉద్యోగం దొరకలేదు. చట్ట ప్రకారం అనుకున్న సమయంలో ఉద్యోగం రాకపోతే సొంత దేశం వెళ్లిపోవాలి. కానీ ఆమె వెళ్లలేకపోయారు. అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం కోసం ఫార్మింగ్టన్ యూనివర్శిటీలో చేరారు.

ఈ ఏడాది జనవరి 30న అంతర్గత భద్రతా విభాగం అధికారులు కాలిఫోర్నియాలోని ఆమె ఇంటికి వచ్చి ప్రశ్నించారు. తనకు యాంకిల్ మానిటర్ వేశారని, సమాచారం ఇవ్వకుండా దేశం వదలి వెళ్లవద్దని ఆదేశాలు ఇచ్చారని ఆమె బీబీసీకి వివరించారు. అనుమానం ఉన్న వ్యక్తుల కదలికలు గుర్తించడానికి, వాళ్లు నిర్బంధం దాటి వెళ్లకుండా జీపీఎస్ బ్యాండ్ కాలికి వేస్తారు. వారు ఎక్కడికి వెళ్లినా పోలీసులు దీని సాయంతో గుర్తించొచ్చు.

అప్పటికే ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరిన ఒక స్నేహితురాలి ద్వారా ఆమె అందులో చేరారు. ఆమె ఫీజు కట్టారు కానీ ఒక్కసారి కూడా వర్సిటీకి వెళ్లలేదు. వర్సిటీ వెబ్‌సైట్ కూడా చూడలేదు. కోర్సులు అనుకున్న సమయానికి మొదలుకానప్పుడు ఎందుకని ఆరా తీయలేదా అని ప్రశ్నించగా ఆమె ఏ సమాధానమూ ఇవ్వలేదు.

ప్రస్తుతం ఆమె సొంతంగా భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అలా పంపాలంటే మరో పదేళ్లపాటు ఏ విధంగానూ అమెరికాలో కాలు పెట్టకుండా ఉండేందుకు ఆమె ఒప్పుకోవాలి. అంటే ఆమెపై పదేళ్ల నిషేధం వేస్తుంది అక్కడి ప్రభుత్వం. కానీ స్రవంతికి ఆ నిషేధం ఇష్టం లేదు. అమెరికా నుంచి భారత్‌కు వచ్చేయాలి, కానీ నిషేధం ఉండకూడదు అంటే కోర్టులో విన్నవించుకోవాలి. జడ్జి కావాలనుకుంటే ఆ నిషేధాన్ని తగ్గించగలరు. ఆ విచారణకు హాజరు కావాలంటే మార్చి వరకూ ఎదురు చూడాలి.

"నేను గందరగోళంలో ఉన్నాను. నాకు భారత్ వెనక్కు వచ్చేయాలని ఉంది కానీ భవిష్యత్తు అయోమయంగా ఉంది" అని చెప్పింది స్రవంతి. "నేనిప్పుడు రోజంతా ఇంట్లోనే ఉంటున్నాను. ఇంక చేయడానికి ఏమీ లేదు. డబ్బులు కూడా అయిపోతున్నాయి." అంటూ తన పరిస్థితి వివరించింది.

ఆమె తండ్రి ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్. లక్షల రూపాయలు అప్పు చేసి ఆమెను అమెరికా పంపారు. ఇప్పుడా కుటుంబం కూడా అయోమయంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)