గాంధీలో జాత్యహంకారం ఉండేదా?

ఫొటో సోర్స్, Getty Images
గాంధీ 'జాత్యహంకారి' అంటూ ఆఫ్రికా దేశం ఘనాలోని అక్రాలో ఘనా విశ్వవిద్యాలయం తమ క్యాంపస్ నుంచి ఆయన విగ్రహాన్ని తొలగించింది. మహాత్మా గాంధీపై ఈ విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ అంశంపై బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ రాసిన కథనం ఇదీ...
హక్కులు, సమానత్వం, స్వాతంత్ర్యం కోసం, వలస పాలనకు వ్యతిరేకంగా అహింసాయుత విధానంలో సమర్థంగా పోరాడిన నాయకుడిగా మహాత్మా గాంధీ పేరుగాంచారు. ఆయనో మతతాత్వికుడనీ, వివేకవంతుడైన రాజకీయ నాయకుడనీ చెబుతారు.
మరి గాంధీ 'జాత్యహంకారి' కూడానా? గాంధీ జీవితంపై ఏడేళ్లపాటు అధ్యయనం చేసి 2015లో పుస్తకం వెలువరించిన దక్షిణాఫ్రికాలోని విద్యావేత్తలు అశ్విన్ దేశాయ్, గులాం వాహెద్ ఆయన జాత్యహంకారేనని ఆరోపిస్తున్నారు.
గాంధీ దక్షిణాఫ్రికాలో 1893 నుంచి 1914 వరకు రెండు దశాబ్దాలకు పైగా నివసించారు. అక్కడ భారతీయుల హక్కుల సాధన కోసం ఆయన ఉద్యమించారు.

ఫొటో సోర్స్, EMMANUEL DZIVENU/JOYNEWS
''అప్పట్లో దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లు, వివిధ జాతుల మిశ్రమమైన కలర్డ్స్ గ్రూపు ప్రజలకు కూడా రాజకీయ హక్కులు ఉండేవి కావు. శరీర వర్ణం ప్రాతిపదికగా వీరికి బ్రిటిష్ పాలకులు ఈ హక్కులను నిరాకరించారు. వీరి పోరాటాన్ని, భారతీయుల పోరాటాన్ని గాంధీ వేర్వేరుగా చూశారు'' అని 'ద సౌత్ ఆఫ్రికన్ గాంధీ: స్ట్రెచర్-బేరర్ ఆఫ్ ఎంపైర్' అనే పుస్తకంలో అశ్విన్ దేశాయ్, గులామ్ వాహెద్ రాశారు.
అన్యాయమైన చట్టాల రద్దు కోసం, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ, వాణిజ్యంలో స్వేచ్ఛ కోసం ఉద్యమించేటప్పుడు గాంధీ భారతీయుల గుర్తింపును ప్రత్యేకంగా చూశారని, ఇతరులతో సమానంగా చూడలేదని వారు ఆరోపించారు.
భారతీయుల సమస్యలపై పోరాడేటప్పుడు భారతీయులను స్థానికులైన ఆఫ్రికన్ల నుంచి వేరు చేసి, ప్రత్యేకంగా పరిగణించేలా గాంధీ రాజకీయ వ్యూహాలు ఉండేవని పుస్తక రచయితలు పేర్కొన్నారు. తొలినాళ్లలో గాంధీ వైఖరి శ్వేతజాతీయుల తీరులా ఉండేదన్నారు. ఒప్పంద కూలీల దీనస్థితిని గాంధీ పట్టించుకోలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
''రాజ్యాధికారం శ్వేతజాతీయుల చేతుల్లోనే కొనసాగాలని గాంధీ విశ్వసించారు. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు చాలా కాలం నల్లజాతి ఆఫ్రికన్లను 'కఫీర్లు' అని వ్యవహరించారు'' అని పుస్తక రచయితలు పేర్కొన్నారు. కఫీర్లు అనడం అత్యంత అగౌరవకర సంభోదన.
1893లో నాటల్ కాలనీ పార్లమెంటుకు గాంధీ రాసిన ఒక లేఖనూ రచయితలు తమ పుస్తకంలో ప్రస్తావించారు. ''స్థానికులైన ఆఫ్రికన్ల కంటే భారతీయులు కొంచెం మెరుగనే భావన నాటల్ కాలనీ అంతటా ఉంది'' అని ఆయన అందులో వ్యాఖ్యానించారు.
జోహన్నెస్‌బర్గ్‌లో 'కూలీ లొకేషన్'గా పిలిచే అపరిశుభ్ర మురికివాడలో పెద్ద సంఖ్యలో ఆఫ్రికన్లు, భారతీయులు కలిసి ఉండేవారు. భారతీయులతో కఫీర్లను కలిపి ఉంచడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, అక్కడి నుంచి 'కఫీర్ల'ను పంపించేయాలని కోరుతూ సంబంధిత కౌన్సిల్‌కు గాంధీ 1904లో లేఖ రాశారు. స్థానిక ఆఫ్రికన్ల మాదిరి భారతీయులు యుద్ధ నృత్యాలు చేయరని, కఫీర్‌లు తాగే బీరు తాగరని అదే సంవత్సరంలో మరో సందర్భంలో రాశారు.
1905లో డర్బన్‌లో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఆస్పత్రిలో కఫీర్లను, భారతీయులను ఎలాంటి విచక్షణ లేకుండా కలిపి ఉంచినంత కాలం ఈ వ్యాధి ఉంటుందని అప్పుడు గాంధీ వ్యాఖ్యానించారు.
గాంధీలో జాతి వివక్ష కోణం పూర్తిగా కొత్తేమీ కాదని చరిత్రకారులు చెబుతారు. జాతి ఆధారంగా మనుషులను వర్గీకరించడాన్ని ప్రోత్సహించేందుకు బ్రిటన్ వలస ప్రభుత్వంతో గాంధీ కలిసి పనిచేశారని కొందరు దక్షిణాఫ్రికన్లు ఎప్పుడూ ఆరోపిస్తుంటారు. గాంధీ జాత్యహంకారి అంటూ 2015 ఏప్రిల్‌లో జోహన్నెస్‌బర్గ్‌లో గాంధీ విగ్రహానికి ఒక యువకుడు తెల్లరంగు పులమగా, పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అప్పట్లో #Gandhimustfall అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
లోపాలున్నప్పటికీ అత్యధికుల కన్నా గాంధీ గొప్పవారు: మనవడు
గాంధీ జాత్యహంకారి అనే ఆరోపణలపై గాంధీ జీవితకథ రాసిన ఆయన మనవడు రాజ్‌మోహన్ గాంధీ స్పందించారు. 24 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా చేరుకున్న గాంధీ కొన్ని సందర్భాల్లో అక్కడి నల్లజాతీయుల పట్ల కొన్ని అపోహలు కలిగి ఉన్నారని, అవగాహన లేకుండా వ్యవహరించారని, ఇందులో ఏ మాత్రం సందేహం లేదని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల సాధనకు గాంధీ చేసిన పోరాటం నల్లజాతీయుల హక్కుల పోరాటానికి బాటలు పరిచిందని అభిప్రాయపడ్డారు.
గాంధీలో కూడా లోపాలున్నాయని, అయినప్పటికీ ఆయన తన సమకాలికుల్లో అత్యధికుల కంటే ఎక్కువ ప్రగతిశీల, విప్లవాత్మక ఆలోచనలున్న నాయకుడని రాజ్‌మోహన్ చెప్పారు.
ప్రముఖ చరిత్రకారుడు, 'గాంధీ బిఫోర్ ఇండియా' పుస్తక రచయిత రామచంద్ర గుహ రాసిన ఓ విషయం ఈ సందర్భంలో ప్రస్తావనార్హం.
''దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులకు సంపూర్ణ సమానత్వం కోసం నినదించేంత పరిస్థితులు 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఏర్పడలేదు'' అని ఆయన రాశారు.
గాంధీది ఎన్నో కోణాలతో కూడిన సంక్లిష్టమైన జీవితమని, ఆయనలో జాత్యహంకారం ఉందని విమర్శించడం పైపైన మాట్లాడటమే అవుతుందని మరో విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
ఈ అభిప్రాయాలతో అశ్విన్ దేశాయ్, గులాం వాహెద్ ఏకీభవించలేదు.

ఫొటో సోర్స్, Elliott & Fry/Getty Images
ఈ విషయాల్లో ఆయన జాత్యహంకారే: అశ్విన్ దేశాయ్
''ఆర్య సహోదరుల భావన(ఆర్యన్ బ్రదర్‌హుడ్)పై గాంధీకి విశ్వాసం ఉండేది. నాగరికతలో ఆఫ్రికన్ల కన్నా శ్వేతజాతీయులు, భారతీయులు ఉన్నతులని ఆయన భావించేవారు. ఆఫ్రికన్లపై పెత్తనం చేయడంలో శ్వేతజాతీయులతో చేతులు కలపాలనే ఆసక్తి ఆయనకు ఉండేది. ఈ విషయాల్లో ఆయన జాత్యహంకారే'' అని అశ్విన్ దేశాయ్ బీబీసీతో అప్పట్లో వ్యాఖ్యానించారు.
''మైనారిటీలైన శ్వేతజాతీయుల రాజ్యాధికారాన్ని గాంధీ ఆమోదించారు. ఈ విషయంలో వారికి జూనియర్ భాగస్వామిగా ఉండేందుకు ఆసక్తి చూపారు. కానీ ఈ విషయంలో ఆయన విజయవంతం కాలేకపోయారు. అయ్యుంటే వర్ణవివక్ష ఘోరాలకు అందరం జవాబిచ్చుకోవాల్సి వచ్చేది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయా అంశాల్లో గాంధీని జాత్యహంకారిగా పరిగణించే పక్షంలో, దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య పోరాట యోధుల్లో ఒకరుగా ఆయన గుర్తింపు ఎలా పొందగలరని అశ్విన్ ప్రశ్నించారు.
దక్షిణాఫ్రికాలో వలస పాలకుల పెత్తనంలో గాంధీ ఒక పాత్రధారి అని, ఈ నేపథ్యంలో చూసినప్పుడు దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్రను ఎంత వరకు పరిగణించగలమని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
'గాంధీ కన్నా ముందే ఆ పోరాటం మొదలైంది'
దక్షిణాఫ్రికాలో నల్లజాతీయుల హక్కుల పోరాటానికి గాంధీ బాటలు పరిచారనే వాదనను అశ్విన్ దేశాయ్ తోసిపుచ్చారు. దక్షిణాఫ్రికా గడ్డపై గాంధీ అడుగు పెట్టడానికన్నా చాలా ముందే వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలైందని చెప్పారు.
''మీరు మాకో న్యాయవాదిని ఇచ్చారు. మేం మీకో మహాత్ముడిని ఇచ్చాం'' అని గాంధీని ఉద్దేశించి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో తన స్నేహితుడు ఒకరు అన్నారంటూ 'గాంధీ బిఫోర్ ఇండియా' పుస్తకంలో రామచంద్ర గుహ రాసిన మాటలను అశ్విన్ దేశాయ్ తోసిపుచ్చారు.
ఈ వ్యాఖ్య విడ్డూరమైనదని, గాంధీ పేద ఆఫ్రికన్లపై అధిక పన్నులను సమర్థించిన, వలస రాజ్య క్రూరత్వంపై స్పందించని వ్యక్తి అని ఆయన ఆక్షేపించారు.

ఫొటో సోర్స్, AFP
అశ్విన్ దేశాయ్, గులాం వాహెద్‌లే కాదు, 2013లో బ్రిటన్ చరిత్రకారుడు పాట్రిక్ ఫ్రెంచ్ కూడా గాంధీని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ రాశారు. గాంధీ విషయంలో భారతీయ కోణానికి విరుద్ధమైన వైఖరిని వీరు వినిపించారు.
మహోన్నతుల్లోనూ లోపాలుంటాయి. గాంధీ కూడా అందుకు మినహాయింపు కాకపోవచ్చు.
గాంధీని జాత్యహంకారి అంటూనే, ప్రపంచవ్యాప్తంగా సమానత్వం, గౌరవం కల్పించాలనే డిమాండ్లకు ఆయన ఊతమిచ్చారనీ చెప్పారు అశ్విన్ దేశాయ్, గులాం వాహెద్.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ సిరీస్: బీబీసీ ప్రత్యేక కథనాలు
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
- గాంధీ మహాత్ముడిగా మారేందుకు పురికొల్పిన ఆ అవమానానికి 125 ఏళ్లు
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- జాత్యహంకారి అంటూ గాంధీ విగ్రహాన్ని తొలగించిన ఘనా యూనివర్శిటీ
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








