ఉర్జిత్ పటేల్: ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా

ఫొటో సోర్స్, Getty Images
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.
వ్యక్తిగత కారణాల వల్లే తాను పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు.
‘చాలా ఏళ్లుగా ఆర్బీఐలో వివిధ హోదాల్లో సేవలందించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఆర్బీఐ సిబ్బంది, అధికారులు, యాజమాన్యం శ్రమ వల్లే బ్యాంకు ఎన్నో మైలురాళ్లను అందుకుంది. ఈ సందర్భంగా నేను నా తోటి ఉద్యోగులు, ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. వాళ్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ఉర్జిత్ ప్రకటించారు.
ఉర్జిత్ పటేల్ రాజీనామాపై ప్రధాని మోదీ స్పందించారు.
‘ఆర్థికపరమైన విషయాలను లోతుగా అర్థం చేసుకోవడంలో అత్యంత ప్రతిభావంతులు డాక్టర్. ఉర్జిత్ పటేల్. కష్టాల్లో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను గాడిన పెట్టిన వ్యక్తి ఆయన. ఆయన హయాంలో ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వం పొందింది. నిష్కళంకమైన ఒక గొప్ప ప్రతిభావంతుడు ఉర్జిత్ పటేల్. ఆర్బీఐలో ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అని మోదీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ఆర్బీఐ గవర్నర్‌గా, డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్. ఉర్జిత్ పటేల్ ఈ దేశానికి అందించిన సేవలు ప్రశంసనీయం. ఆయనతో కలిసి పనిచేసినందుకు ఆనందంగా ఉంది. మరి కొంత కాలంపాటు ఆయన ప్రజా సేవలో కొనసాగాలని కోరుకుంటున్నాను" అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
‘ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన విషయం ఇది’, అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.
‘పరిస్థితిలో ఏ మార్పూ లేదని, సమస్యలు ముందు ఎలా ఉన్నాయో, ఇప్పుడూ అలానే ఉన్నాయని ఉర్జిత్ పటేల్ రాజీనామా నిరూపిస్తోంది. ఆర్బీఐ పనిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది అనడానికి ఈ రాజీనామానే ఉదాహరణ’ అని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.
నిజానికి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారంటూ గతంలోనే వార్తలొచ్చాయి. కానీ ఆ సమయంలో ఆయన దానిపైన స్పందించలేదు.
ఈ ఏడాదిలో జరిగిన రకరకాల పరిణామాలు ఆర్బీఐకి ప్రభుత్వానికి మధ్య దూరం పెరగడానికి కారణమయ్యాయి.
1. వడ్డీ రేట్లు
వడ్డీ రేట్లను తగ్గించలేదన్న కారణంగా ప్రభుత్వం ఆర్బీఐపైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించలేదు సరికదా, వాటిని ఇంకా పెంచింది.
దీన్ని రిజర్వు బ్యాంకు తన స్వతంత్ర అధికారంగా భావిస్తుంది. ఈ పరిణామం వల్ల ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య ఇబ్బందికర వాతావరణం నెలకొంది.

ఫొటో సోర్స్, RBI
2. బ్యాంకులపై షరతులు
ఫిబ్రవరిలో ఆర్బీఐ జారీ చేసిన ఓ సర్క్యులర్‌లో ఎన్‌పీఏ(నిరర్థక ఆస్తులు)లను నిర్వచించడంతో పాటు రుణాలు మంజూరు చేయడానికి అవసరమైన షరతులను మరింత కఠినతరం చేసింది. ఇది కూడా వివాదానికి ఓ కారణమైంది.
ఆర్బీఐ నిర్ణయం బ్యాంకులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అత్యంత కఠినమైన విధానం అని ప్రభుత్వం భావించింది. ఈ ఉత్తర్వుల కారణంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు మినహా మిగతా బ్యాంకులు రుణాలు అందించలేవేమోననే సందేహం నెలకొంది.

3. నీరవ్ మోదీ ‘కుంభకోణం’
నీరవ్ మోదీ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు బయటికి వచ్చిన సమయంలోనే ఆర్బీఐపైన నిఘాకు సంబంధించిన పాలసీల గురించి ప్రభుత్వం ప్రశ్నించింది.
అదే సమయంలో ప్రభుత్వ బ్యాంకులపైన మరింత నిఘా పెట్టేందుకు తమ అధికార పరిధి పెంచాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కోరారు. అలా చేస్తేనే ప్రభుత్వ బ్యాంకులు కూడా ప్రైవేటు బ్యాంకుల తరహాలో పనిచేస్తాయని ఆయన చెప్పారు.
4. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఉదంతం
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) సంస్థ ఆర్థిక సమస్యల కారణంగా తన రుణాలను చెల్లించడానికి ఇబ్బందిపడిన సమయంలో, అలాంటి ‘నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్’ కంపెనీలకు రుణాల చెల్లింపుల విషయంలో కొంత ఊరట కల్పించమని ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ, ఆర్బీఐ ఆ దిశగా ఎలాంటి అడుగులూ వేయలేదు.

5. నచికేత్ మోర్ తొలగింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుల్లో ఒకరైన నచికేత్ మోర్‌ను, ఆయన పదవీ కాలం పూర్తవడానికి రెండేళ్ల ముందే తప్పించారు. ఈ విషయంలో నచికేత్‌కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు.
నచికేత్ అనేక విషయాల్లో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. అందుకే ఆయన్ను పదవి నుంచి తొలిగించారని భావిస్తున్నారు. ఇది కూడా బ్యాంకు అధికారులకూ, ప్రభుత్వానికీ మధ్య దూరం పెరగడానికి కారణమైంది.
6. ప్రభుత్వ చెల్లింపులు
ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల కోసం ప్రత్యేక విభాగాన్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆర్బీఐ దీనిని బహిరంగంగానే వ్యతిరేకించింది.
ఆర్బీఐ తన వెబ్‌సైట్‌లో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ నోటును ప్రచురించి తన నిరసనను తెలియజేసింది. ఆ తరువాత ఆర్బీఐ స్వతంత్ర అధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమని ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు: ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుంది?
- తెలంగాణ ఎన్నికలు: 64 నియోజకవర్గాల్లో 5 శాతం కన్నా ఎక్కువ పెరిగిన ఓటింగ్
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
- రామమందిరం నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుందా?
- కృష్ణా జిల్లా: స్వైన్ ఫ్లూ రోగులు ఉన్నారని ఊరినే వెలివేశారు
- క్యాథలిక్ చర్చిలో పవిత్ర కన్యలు: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








