‘ఆర్బీఐకి ప్రభుత్వాన్ని ఎదిరించే హక్కు ఉండదు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియరంజన్ డాష్
- హోదా, ఎకనమిక్ ఎఫైర్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
సోమవారంనాడు సుదీర్ఘంగా సాగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మీటింగ్‌ను ప్రభుత్వానికీ, ఆర్బీఐకి మధ్య తాత్కాలిక సంధిగా మీడియా సంస్థలు అభివర్ణించాయి. ఆర్బీఐ, ప్రభుత్వం... రెండు వర్గాలు కాస్త మెత్తబడి రాజీ కుదుర్చుకున్నాయి అని ఇంకొందరన్నారు. సమావేశానికి ముందు మాత్రం మీడియా దాన్ని ఆర్బీఐకి, ప్రభుత్వానికి మధ్య యుద్ధంగా పేర్కొంది.
కానీ, ఆర్బీఐకి, ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగడం అనేది ఉండదు. అలాంటి మీడియా హెడ్‌లైన్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్బీఐకి స్వతంత్రంగా పనిచేసుకునే హక్కు ఉంది. కానీ, అది పూర్తి సర్వ స్వతంత్ర సంస్థ ఏమీ కాదు.
అది ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటూ ఆర్థికపరమైన విధానాల్లో స్వతంత్రత కలిగిన ఏజెన్సీ. అంతేకానీ, యూఎస్ ఫెడరల్ రిజర్వ్స్ లానో, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లానో పూర్తి స్వయం ప్రతిపత్తి దానికి లేదు.
ప్రస్తుతం ఆర్బీఐ పూర్తిగా స్వతంత్ర సంస్థ అనే భావన కలిగించే ప్రయత్నం జరుగుతోంది. కానీ, నిజానికి అది ప్రభుత్వానికి చెందిన సంస్థే. ప్రభుత్వానికి సూచనలు చేసే వెసులుబాటు ఆర్బీఐకి ఉంటుంది. కానీ, ప్రభుత్వాన్ని ఎదిరించే హక్కు దానికుండదు. ఆర్థిక విధానాలను నియంత్రించే ఉద్ధేశంతో 1934 ఆర్బీఐ యాక్ట్‌కు అనుగుణంగా దాన్ని ఏర్పాటు చేశారు. ఇతర బ్యాంకుల, ఆర్థిక సంస్థల రుణాలను నియంత్రించే హక్కు దానికుంటుంది.
సెక్యురిటిస్ మార్కెట్‌ను నియంత్రించే సెబి(సెక్యురిటిస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా), ప్రైవేటు ఇన్సురెన్స్ సంస్థలను నియంత్రించే ఐఆర్‌డీఎఐ(ఇన్సురెన్స్ రెగులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) లాంటిదే ఆర్బీఐ కూడా.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి ఏ స్థాయిదో చెప్పడానికి రెండేళ్ల కిందటి పెద్ద నోట్ల రద్దే పెద్ద ఉదాహరణ. ఒకటి, పెద్ద నోట్ల రద్దును ప్రధాని ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మాత్రమే దాని గురించి ఆర్బీఐకి సమాచారమిచ్చారు. రెండు, ఆర్బీఐ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. మూడు, ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆర్బీఐకి ఎలాంటి పాత్ర లేదు.
మరోపక్క ఆర్బీఐ నిర్వాహక స్వతంత్రతను మోదీ ప్రభుత్వం కూడా తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించిన మాటా నిజమే. ఆర్‌బీఐ అధికారుల మీద ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం తన సొంత మనుషులు కొందర్ని నియమించింది. ప్రభుత్వం తీసుకున్న అప్రయోజక నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటి. స్వదేశంతో పాటు విదేశీ ఆర్థికవేత్తలు కూడా దాన్ని విమర్శించారు. నిజానికి ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ పూర్తిగా వ్యతిరేకించి ఉండాల్సింది. కానీ, అది అలా చేయలేదు. ఎలాంటి చప్పుడూ చేయకుండానే ఆ నిర్ణయాన్ని అంగీకరించింది.
ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. అందుకే అంతిమంగా ప్రభుత్వం మాట నెగ్గుతుంది. ఒకవేళ ఆర్బీఐకి, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తితే చివరికి ప్రభుత్వం మాటను అంగీకరించడం మినహా ఆర్బీఐకి మరో మార్గం లేదు.
ఆర్బీఐ దగ్గరున్న దాదాపు 3.6లక్షల కోట్ల రూపాయల మిగులు ఆదాయమే రెండు వర్గాల మధ్య ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఆర్బీఐకు వచ్చిన లాభాల రూపంలో ఈ డబ్బును తమకు అందించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ, ప్రభుత్వానికి అది తగదని ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ సూచించారు.
అంతమాత్రాన ఆర్బీఐకి, ప్రభుత్వానికి మధ్య వివాదం పెరిగిందనడం సరికాదు. నిజానికి ఆర్బీఐని డబ్బు అడిగే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఆ డబ్బుకు అంతిమంగా యజమాని ప్రభుత్వమే. ఈ విషయంలో చివరికి ప్రభుత్వానిదే పైచేయిగా నిలుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు మిగులు ఆదాయం ఉంది కాబట్టి సరిపోయింది. అదే, ఒకవేళ ఆర్బీఐకి ఆదాయ లోటు ఎదురైతే, ఆ సమయంలో దాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. మిగులు ఆదాయం నుంచి ప్రభుత్వానికి డబ్బిచ్చే ప్రక్రియ ఎప్పట్నుంచో ఉంది. మరి ఇప్పుడు దానికి ఏమైంది?
నిజానికి ఈ విషయంలో రెండు వర్గాలు నిపుణుల సలహా తీసుకోవాలి. సోమవారం నాడు జరిగిన సమావేశంలో దానికి మార్గం సుగమమైంది. ఆర్బీఐ మిగుల ఆదాయంపై సూచించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతమాత్రాన ఒక వర్గం వెనక్కుతగ్గిందని, మరో వర్గం పైచేయి సాధించిందని కాదు.
ఆర్బీఐ మిగులు ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత వెళ్లాలి; ఆర్బీఐ దగ్గర ఎంత ఉండాలి; ఎలాంటి పరిస్థితుల్లో మిగులు ఆదాయాన్ని సమీకరించుకోవాలి; మిగులు ఆదాయాన్ని ప్రభుత్వానికి అందిస్తే ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?... ఇలాంటి అంశాలను కొత్తగా ఏర్పడ్డ కమిటీ విశ్లేషిస్తుంది.
ఎక్కువ మిగులు ఆదాయం ఆర్థిక వ్యవస్థపైన ఎప్పుడూ సానుకూల ప్రభావాన్నే చూపుతుంది. దానివల్ల మార్కెట్‌లో ఆర్బీఐపైన నమ్మకం పెరుగుతుంది. విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం పొందడానికి అది కీలకం. ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరాను మిగులు ఆదాయమే నిర్దేశిస్తుంది. అధికారిక కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తుంది. దాని దగ్గర డబ్బుంటేనే అందరిలోనూ భరోసా ఏర్పడుతుంది.
ఇప్పుడు, ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు ఎందుకు కావాలన్నదే ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ బడ్జెట్ కాస్త ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం. దీనికి చాలా కారణాలున్నాయి. జీఎస్‌టీ ద్వారా పెరుగుతుందునుకున్న రాబడి పెరగలేదు. ప్రైవేటీకరణ ద్వారా కూడా ఆశించినంత ఆదాయం రాలేదు. మరోపక్క ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం చేస్తున్న ఖర్చు పెరగిపోయింది. అందుకే ఈ పథకాల కోసం ఆర్బీఐ మిగులు ఆదాయం నుంచి కొంత వాటా తీసుకోవాలని ప్రభుత్వం భావించింది.
డిసెంబర్ 22న ఆర్బీఐ బోర్డు మళ్లీ సమావేశమవుతుంది. అంతకంటే ముందే కొత్త కమిటీ తన సూచనలను రెండు వర్గాలకు అందిస్తుందన్నది నా నమ్మకం.
(పీఆర్ డాష్... బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్‌తో మాట్లాడారు. స్పష్టత కోసం ఆ సంభాషణను స్వల్పంగా ఎడిట్ చేశాం)
ఇవి కూడా చదవండి
- అభిప్రాయం: సుష్మా స్వరాజ్ రాజకీయ జీవితం ముగిసినట్లేనా?
- తెలంగాణలో 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- మధ్యప్రదేశ్‌లో వరుసగా మూడు దఫాలుగా బీజేపీ ఎలా గెలిచిందంటే..
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
- ఇందిరను ఫిరోజ్ మోసం చేశారా? ఇందులో నిజమెంత?
- ప్రతి నెలా జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, ఈ ఆరు సూత్రాలు పాటించండి
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








