బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని థెరిసా మేని పదవి నుంచి తొలగించే మార్గాలేంటి?

థెరిసా మే

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం యురోపియన్ దేశాల్లో చర్చంతా బ్రెగ్జిట్ చుట్టూనే నడుస్తోంది. బ్రెగ్జిట్ ఒప్పందంపైన ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే విఫలమైతే, ఆమె తన పదవిని కోల్పోయే అవకాశం ఉందనే మాటలూ వినిపిస్తున్నాయి.

ఇంతకీ అసలు బ్రిటన్ ప్రధానిని అర్ధంతరంగా తొలగించడానికి అవకాశం ఉందా?

క్లుప్తంగా చెప్పాలంటే... అక్కడ ప్రధానిని ఉన్నఫళంగా తొలగించడానికి నేరుగా ఎలాంటి పద్ధతీ లేదు. ఏ పార్టీ అధికారంలో ఉందనే దానిపైన ప్రధాని తొలగింపు ఆధారపడి ఉంటుంది. ప్రధాని కన్సర్వేటివ్ పార్టీకి చెందినవారైతే ఒకలా, లేబర్ లేదా ఇతర పార్టీల అభ్యర్థి అయితే ఆ ప్రక్రియ మరోలా ఉంటుంది.

ప్రస్తుతం బ్రిటన్‌లో కన్సర్వేటివ్/టోరీ ప్రభుత్వం అధికారంలో ఉంది. థెరిసా మే ఆ పార్టీతో పాటు ప్రభుత్వానికీ నాయకత్వం వహిస్తున్నారు.

కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు తమ పార్టీ నాయకురాలిని తొలగించాలనుకుంటే ‘వోట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్’ జరగాలి. అంటే... పార్లమెంటులో ఉన్న ఆ పార్టీ సభ్యులంతా తమ నాయకురాలిపై విశ్వాసం ఉందో, లేదో చెబుతూ ఓటు వేయాలి.

ఆ ప్రక్రియ ఇలా ఉంటుంది...

టోరీ ఎంపీ జాకోబ్ రీస్ అవిశ్వాస లేఖను సమర్పించనున్నారు

ఫొటో సోర్స్, Hoc

ఫొటో క్యాప్షన్, టోరీ ఎంపీ జాకోబ్ రీస్ అవిశ్వాస లేఖను సమర్పించనున్నారు

1. ఓటింగ్‌ను కనీసం 15శాతం ఎంపీలు కోరాలి

విశ్వాస పరీక్ష జరగాలంటే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కనీసం 15శాతం ఎంపీలు ఆ పరీక్ష నిర్వహించాలని కోరుతూ లేఖ రాయాలి.

ప్రస్తుతం పార్లమెంటులో కన్జర్వేటివ్ ఎంపీల బలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కనీసం 48మంది ఎంపీలు తమ నాయకురాలిపై విశ్వాసం లేదని తెలుపుతూ కన్సర్వేటివ్ ప్రైవేట్ సభ్యుల కమిటీకి లేఖ రాయాలి.

ఒకవేళ ఆ విశ్వాస పరీక్షలో ప్రధాని గెలిస్తే, ఆమె పదవిలో కొనసాగొచ్చు. మళ్లీ ఏడాది వరకు ఎలాంటి విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

అదే ఆ విశ్వాస పరీక్షలో ప్రధాని విఫలమైతే, తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కొత్త ప్రధాని ఎన్నిక జరుగుతుంది.

ఈయూ జెండా

ఫొటో సోర్స్, Getty Images

నాయకత్వ పోటీ

కన్సర్వేటివ్ ఎంపీలు తమ నాయకురాలిని తొలగిస్తే, మళ్లీ నాయకత్వం కోసం మరో పోటీ జరుగుతుంది. విశ్వాస పరీక్షలో ఓడిపోయిన వ్యక్తికి ఆ పోటీలో పాల్గొనే అవకాశం ఉండదు.

సాధారణంగా ఇద్దరు అభ్యర్థులను పార్టీ నాయకత్వ పోటీ కోసం ఎంపీలు ఎంపిక చేస్తారు. కానీ, ప్రస్తుతం బ్రెగ్జిట్‌కు డెడ్‌లైన్ దగ్గర పడుతుండటంతో కొత్త నాయకుడిని ఎంపిక చేయడం పార్టీకి అంత సులువు కాదు. దానికి తోడు, కన్జర్వేటివ్‌ పార్టీలో బ్రెగ్జిట్ విషయంలో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వ పోటీ జరిగితే మొత్తంగా పార్టీలో చీలికలు ఏర్పడే ప్రమాదముంది.

థెరిసా మే

ఫొటో సోర్స్, HoC

ఫొటో క్యాప్షన్, బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో తన క్యాబినెట్ మద్దతు పొందేందుకు థెరిసా మే కష్టపడాల్సి వచ్చింది

2. సాధారణ ఎన్నికలు

దేశంలో సాధారణ ఎన్నికలను నిర్వహించాలని పార్లమెంటును ఒత్తిడి చేయడం ద్వారా కూడా ప్రధానిని మార్చవచ్చు. ఈ పద్ధతిలో అధికార పార్టీ (కన్సర్వేటివ్) తప్పనిసరిగా మద్దతివ్వాల్సిన అవసరం కూడా లేదు.

యూకేలో సాధారణ ఎన్నికలకు పిలుపునివ్వడానికి రెండు మార్గాలున్నాయి.

ఏ పార్టీకి చెందినవారైనా సరే మూడింట రెండొంతుల మంది ఎంపీలు ముందస్తు ఎన్నికలను కోరితే దానికి మార్గం సుగమమవుతుంది. అంటే, హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఉన్న 650 మంది సభ్యుల్లో కనీసం 434 మంది ముందస్తు ఎన్నికలకు మద్దతివ్వాలి.

ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం మరో పద్ధతి.

ఆ తీర్మానాన్ని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆమోదిస్తే, 14 రోజుల్లోగా ఎక్కువ మంది ఎంపీల మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి. అలా జరగని పక్షంలో పార్లమెంటును రద్దు చేసి ముందస్తు సాధారణ ఎన్నికలకు పిలుపునిస్తారు.

కన్సర్వేటివ్ ప్రభుత్వం పడిపోయినప్పటికీ, ప్రధాని పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది థెరిసా మే నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. ఆమె ప్రధానిగా ఉంటూనే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఎన్నికల తరువాత హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మెజారిటీ దక్కించుకోలేకపోతే ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)