బ్రెగ్జిట్: ‘విడాకుల’ ఒప్పందంలో ఏముంది? తరువాత ఏం జరగొచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
యురోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలిగే ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. రెండు పక్షాలు సజావుగా విడిపోవడానికి వీలు కల్పించే బ్రెగ్జిట్ ఉపసంహరణ ఒప్పందాన్ని యూకే ప్రధాని థెరిసా మే ఆమోదించారు.
యూకే, ఈయూ ప్రతినిధులు కూడా ఆ ముసాయిదాను అంగీకరించారు. తదుపరి ఆ ఒప్పందంపై యూకే ఎంపీలతో పాటు యురోపియన్ యూనియన్‌లోని 27 ఇతర సభ్య దేశాల ఆమోదముద్ర కూడా పడాలి. అప్పుడే 2019 మార్చిలో యూకే విడిపోవడానికి అవకాశం కలుగుతుంది.
ఒప్పందంలో ఏముంది?
బ్రెగ్జిట్ అనంతరం పౌరుల హక్కుల గురించిన ప్రస్తావన ఆ ఒప్పందంలో ఉంది. దాని ప్రకారం, ప్రస్తుతం ప్రజలు ఎక్కడ ఉంటున్నారో, అక్కడే చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, కుటుంబ సభ్యులతో కలిసి స్థిరపడటానికి అవకాశం ఉంటుంది.
ఈయూ నుంచి యూకే వైదొలిగిన అనంతరం పూర్తి స్థాయిలో సంబంధాలు తెంచుకోవడానికి అనువుగా 21నెలల పరివర్తనా కాలాన్ని ఆ ఒప్పందం కేటాయించింది.
విడిపోయే సమయంలో యురోపియన్ యూనియన్‌కు యూకే చెల్లించాల్సిన 39బిలియన్ పౌండ్ల (దాదాపు 3.6లక్షల కోట్లు)కు సంబంధించిన ప్రస్తావన కూడా ఒప్పందంలో ఉంది. దీనినే ‘విడాకుల బిల్లు’ అని పిలుస్తున్నారు.
ఉత్తర ఐర్లాండ్‌కు, ఐర్లాండ్‌కు మధ్య సరిహద్దు ఏర్పాటు చేయకూడదనే నిర్ణయానికి కూడా ఈ ఒప్పందం కట్టుబడి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఐరిష్ సరిహద్దు వివాదాన్ని ఎలా పరిష్కరించారు?
ఈయూ, యూకే మధ్య చర్చల్లో ప్రధాన అంశంగా నిలిచింది ఐరిష్ సరిహద్దు విషయమే. ఉత్తర ఐర్లాండ్... యూకేలో భాగంగా ఉంది. ఐర్లాండ్... ఈయూలో భాగంగా ఉంది. బ్రెగ్జిట్ తరువాత కూడా ఉత్తర ఐర్లాండ్, ఐర్లాండ్ మధ్య రాకపోకలు ఎప్పటిలానే కొనసాగాలని, గార్డులు తనిఖీలకు అవకాశం కల్పించే సరిహద్దును ఏర్పాటు చేయకూడదని రెండు పక్షాలు కోరుకుంటున్నాయి.
చాలాకాలంగా కొనసాగుతున్న శాంతి వాతావరణానికి సరిహద్దులు విఘాతం కలిగిస్తాయని రెండు పక్షాలు భావిస్తున్నాయి. సరిహద్దుకు బదులుగా ఓ రక్షణ వలను ఏర్పాటు చేసేందుకు రెండు పక్షాలు అంగీకరించాయి.
దీని వల్ల ఐర్లాండ్ నుంచి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చే ఆహార పదార్థాలు, ఇతర వస్తువులకు ఎలాంటి తనిఖీలు ఉండవు. కానీ, యూకే నుంచి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చే వస్తువులు మాత్రం కొత్త నిబంధనలకు లోబడి ఉంటాయి.
యూకేకు ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య ఎలాంటి సరిహద్దు నిర్మించినా సహించబోమని ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన డీయూ పార్టీ తెలిపింది. యూకే ప్రధాని థెరిసా మే ప్రభుత్వం అధికారంలో కొనసాగాలంటే డీయూ పార్టీకి చెందిన ఎంపీల ఓట్లు కావాల్సిందే. అందుకే ముందు జాగ్రత్త చర్యగానే ఉత్తర ఐర్లాండ్‌లో రక్షణ వలను నిర్మిస్తామని, దాన్ని ఉపయోగించే అవకాశం రాదని థెరిసా మే అంటున్నారు.

ఫొటో సోర్స్, PA
వాణిజ్య ఒప్పందం సంగతేంటి?
బ్రెగ్జిట్ ఒప్పందానికి సంబంధించిన 585 పత్రాలకు తోడు భవిష్యతులో యూకే, ఈయూ సంబంధాలు ఎలా ఉండబోతాయనే దానిపైనా ముసాయిదాను రూపొందించారు. దీన్ని కూడా రెండు పక్షాలు ఆమోదిస్తే 2020 తరువాత అందులోని నిబంధనలు అమల్లోకి వస్తాయి.
‘స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం, ఉత్పత్తుల విషయంలో పూర్తి సహకారం, సున్నా పన్నుల విధానం’ లాంటి అంశాలకు ఆ పత్రాల్లో చోటు కల్పించారు.
ఐరిష్ సరిహద్దు సమస్యను, రక్షణ వల అవసరాన్ని ఈ వాణిజ్య ఒప్పందం పరిష్కరించాలని రెండు పక్షాలు కోరుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తు ఏంటి?
బ్రెగ్జిట్ ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదించేందుకు నవంబర్ 25న అత్యవసర ఈయూ సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఆ తరువాతే థెరిసా మే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోనున్నారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఆమె బ్రిటన్ ఎంపీల ఆమోదముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.
థెరిసా మే సొంత పార్టీకి చెందిన కొందరు సభ్యులతో పాటు ప్రతిపక్షాల సభ్యులు కూడా ఈ ఒప్పందంపై వ్యతిరేకంగా ఉన్నారు. కీలక ఓట్ల కోసం థెరిసా మే, డీయూ పార్టీని నమ్ముకున్నప్పటికీ వాళ్లు కూడా ఒప్పందానికి వ్యతిరేకంగానే ఓటేసేట్లు కనిపిస్తున్నారు. ఆ ఒప్పందం వల్ల యూకేలో చీలిక వస్తుందని డీయూ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఒకవేళ ఓటింగ్‌లో థెరిసా మే ఓడిపోతే, ఆమె మరోసారి ఈయూతో చర్చలను కోరుకోవచ్చు. కానీ, ఓటింగ్ థెరిసాకు అనుకూలంగా రాకపోతే ప్రధానిగా థెరిసా మే ప్రస్థానం ముగుస్తుందని చాలామంది భావిస్తున్నారు. దాంతో సాధారణ ఎన్నికలకు తెరలేవొచ్చు, లేదా కొత్త ప్రధాని ఎన్నిక జరగొచ్చు.
ఓటింగ్ ఫలితాలు ప్రతికూలంగా వస్తే, ‘బ్రెగ్జిట్’ గడువును థెరిసా ముందుకు జరుపుతారని, మరో రెఫరెండానికి పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు ఎంపీలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెగ్జిట్: తరువాత ఏం జరగొచ్చు
- ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదం కోసం ఈయూ సమావేశంలో ప్రవేశపెడతారు
- ముసాయిదా ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుంది
రెండు పక్షాలు ఆమోదిస్తే...
- ఈయూ ఉపసంహార బిల్లును యూకే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి
- ఆ ఒప్పందాన్ని 51శాతం మెజారిటీతో యురోపియన్ పార్లమెంటు అంగీకరించాలి
- ఈయూ కౌన్సిల్ సూపర్ మెజారిటీతో ఆ ఒప్పందాన్ని అంగీకరించాలి (27 ఈయూ దేశాల్లో కనీసం 20 దేశాలు ఆమోదించాలి. ఆ దేశాలు కనీసం 65శాతం ఈయూ జనాభాకు ప్రాతినిథ్యం వహించాలి)
- యూకే 2019 మార్చిలో ఈయూ నుంచి వైదొలగుతుంది
- 2021 డిసెంబర్ వరకు పరివర్తనా కాలంలో యూకే, ఈయూలో కొనసాగుతుంది
ఏదో ఒక దశలో యూకే లేదా ఈయూ ఒప్పందాన్ని ఆమోదించకపోతే...
- ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి యూకే వైదొలగొచ్చు
- ఒప్పందంపై మళ్లీ చర్చలు జరగొచ్చు
- యూకేలో సాధారణ ఎన్నికలకు తెరలేవొచ్చు.
- ఈయూతో భవిష్యత్తు సంబంధాలపై యూకేలో రెఫరెండం నిర్వహించొచ్చు
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








