సుష్మా స్వరాజ్ రాజకీయ జీవితం ముగిసినట్లేనా? :అభిప్రాయం

ఫొటో సోర్స్, Sergei Bobylev
- రచయిత, ప్రదీప్ సింగ్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్
నేటి వైజ్ఞానిక యుగంలో 66 ఏళ్ల వయసు పెద్ద ఎక్కువేమీ కాదు. అదే రాజకీయాల్లో అయితే దానిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
కానీ భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మాత్రం దానిని విశ్వసిస్తున్నట్లు కనిపించడం లేదు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ఆమె ప్రకటించారు.
సాధారణ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె ఈ ప్రకటన చేయడం చూస్తే, ఏదో అనుకోనిది జరిగినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలో 80, 90 ఏళ్ల వయసులో కూడా రిటైర్మెంట్ అనే మాటనే కొందరు అలర్జీగా భావిస్తుంటే, ఆమె ఈ ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఆమె ఆరోగ్యం గురించి తెలిసిన వారికి, ఆమె ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు తెలుసు.
అలాంటి వారిలో మొదటి వ్యక్తి.. ఆమె భర్త, మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్. సుష్మా ప్రకటన తర్వాత ఆయన, ''ఒకానొక సమయం తర్వాత మిల్కా సింగ్ కూడా పరుగును ఆపేయాల్సి ఉంటుంది. మీరు గత 41 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.'' అని ట్వీట్ చేశారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం ద్వారా ఆమె ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయానికి మార్గం చూపారు. అయితే రాజకీయాల్లో ఇలాంటి సంప్రదాయాలు చాలా అరుదు.
రాజకీయాల్లో సునీల్ గవాస్కర్
ఆమె ఎలాగైతే 25 ఏళ్ల చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారో, అంతే తొందరగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. దీని ద్వారా ఆమె ఎవరికైనా అసౌకర్యం కలిగిస్తున్నారు అంటే అది తన రాజకీయ గురువు అద్వానీకే.
కానీ ఈ ప్రకటన ద్వారా సుష్మా స్వరాజ్ రాజకీయాల్లో సునీల్ గవాస్కర్ అయిపోయారు. గవాస్కర్‌ను అడిగినట్లే ఆమెను కూడా ప్రజలు 'ఇప్పుడే ఎందుకు?' అనే ప్రశ్న అడగొచ్చు.
సుష్మా స్వరాజ్ మంచి వక్త, పార్లమెంట్ సభ్యురాలు, పాలనాదక్షత కలిగిన వ్యక్తి. ఒకప్పుడు బీజేపీలో అటల్ బిహారీ వాజ్ పేయి తర్వాత అత్యంత సమర్థులైన వక్తలలో ప్రమోద్ మహాజన్, సుష్మా స్వరాజ్‌ల పేర్లు వినిపించేవి. దిల్లీలోని సమర్థులైన నాయకుల్లో ఆమె పేరు నాలుగోది. మిగతా ముగ్గురు - ప్రమోద్ మహాజన్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు. బీజేపీ రెండో తరం నాయకులందరి లాగే వీరు కూడా అటల్-అద్వానీ, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే.. అద్వానీ పెంచి పెద్ద చేసిన నాయకులు.
సుష్మా స్వరాజ్ రాజకీయ జీవితంలో 2009-14 మధ్యకాలంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పని చేసిన కాలాన్ని ఆమెకు అత్యంత ఉచ్ఛమైన దశగా పేర్కొనవచ్చు.

ఫొటో సోర్స్, Hindustan Times
అద్వానీ ప్రయత్నాలకు మద్దతు
అయితే ఆమె ఎన్నడూ బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టలేకపోయారు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది - ఆమెకు పార్టీ పనికన్నా, పార్లమెంట్ కార్యకలాపాలే ఎక్కువ ఇష్టం. రెండోది - ఆమెకు ఆరెస్సెస్ నేపథ్యం లేదు.
ఆమె తండ్రి సంఘ్‌లో ఉండేవారు. కానీ ఆమె భర్త జార్జ్ ఫెర్నాండెజ్‌కు న్యాయ సలహాదారు.
జనతా పార్టీ చీలిపోయినప్పుడు ఆమె బీజేపీలో చేరారు. ఆమెకు పార్టీలో ఎంత మంది స్నేహితులు ఉన్నారో, బయట కూడా అంతే మంది ఉన్నారు. గత నాలుగు దశాబ్దాలలో ఆమె 11 ఎన్నికలలో పోటీ చేశారు. వాటిలో మూడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి.
2013లో నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవడానికి అద్వానీ చేసిన ప్రయత్నాలకు ఆమె మద్దతు తెలిపారు. ఆ ప్రయత్నంలో చివరి వరకు ఆమె అద్వానీ వెంటే ఉన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times
పార్టీలో అపరిచితురాలే..
2014 ఎన్నికల్లో విజయం తర్వాత మోదీ ఆమెను క్షమిస్తారని చాలా మంది భావించలేదు. అయితే మోదీ విశాల హృదయం వల్లో, సుష్మా యోగ్యత కారణంగానో, ఆమెకు కేబినెట్‌లో స్థానం దక్కింది. అయితే ఆమె ప్రతికూల వాతావరణంలోనూ ఆమె నెగ్గుకొచ్చారు. గత నాలుగున్నర ఏళ్లుగా ఆమె మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
మోదీ-షాల బీజేపీలో సుష్మా స్వరాజ్ ఎప్పుడూ ఒక అపరిచితురాలే అని చెప్పొచ్చు. పార్టీ రాజకీయ నిర్ణయాలలో ఆమె పాత్ర చాలా పరిమితం.
గత కొన్నేళ్లుగా తన అనారోగ్యం కారణంగా ఆమె ఎన్నికల ప్రచారంలో ఆమె చురుకుగా లేరు. ఆమె స్థానాన్ని అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌లాంటి వారు ఆక్రమించారు. అందువల్లే రాబోయే ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనకున్నా, పార్టీకి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
జవాబు లేని ప్రశ్నలు
సుష్మా తన ప్రకటనలో తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మాత్రమే చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తును ఆమె పార్టీకే వదిలేశారు. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ కనుక మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ ఆమెను రాజ్యసభకు తీసుకువచ్చి, మళ్లీ మంత్రి పదవిని కట్టబెడుతుందా? ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మోదీకి ఆమెను మళ్లీ మంత్రి చేయడం ఇష్టమేనా అని అడగాల్సి ఉంటుంది. లేక అద్వానీ, జోషిలాగా ఆమెను కూడా మార్గదర్శక మండలిలో స్థానం కల్పిస్తారా?
సుష్మా స్వరాజ్ స్వభావాన్ని, రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. ఆమె దానికి అంగీకరించకపోవచ్చు.
మరి పార్టీ ఆమెకు ఏదైనా రాజ్యాంగబద్ధమైన పదవిని ఇస్తుందా? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ జవాబులే లేవు. వీటన్నిటికీ జవాబు ఇవ్వగలిగిన వ్యక్తి ఒకే ఒక్కరు - నరేంద్ర మోదీ. అయితే ఆయనను ఎవరు అడుగుతారు అనేదే ప్రశ్న.
(ఈ కథనంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. వాటిలోని వాస్తవాలు, అభిప్రాయాలతో బీబీసీ ఏకీభవించినట్లు కాదు. బీబీసీ వాటికి ఎలాంటి బాధ్యత కానీ, జవాబుదారీతనం కానీ వహించదు)
ఇవి కూడా చదవండి
- ఆస్ట్రేలియా కంటే 11 పరుగులు ఎక్కువ కొట్టినా... భారత్ ఓడింది
- ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి చైనాకు ఉద్వాసన?
- గజ తుపాను: ఆ విలయం మాటల్లో చెప్పలేనిది
- తెలంగాణలో 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధానిని పదవి నుంచి తొలగించే మార్గాలు ఇవే
- కంచుకోటలోనూ కమ్యూనిస్టులు ఎందుకు తడబడుతున్నారంటే..
- 2014 ఎన్నికల్లో ఆ గట్టు.. 2018లో ఈ గట్టు
- బీజేపీకి ఇది స్వర్ణయుగమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








