అభిప్రాయం: పాక్‌కు ఇక మాటలతో కాదు చేతలతో చెప్పాలి

సుష్మా స్వరాజ్ ప్రసంగం

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

    • రచయిత, ప్రొఫెసర్ ముక్తదర్
    • హోదా, బీబీసీ కోసం

ఐక్యరాజ్య సమితిలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పూర్తి ప్రసంగం నేను విన్నాను. ఆమె చైనా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

సుష్మా స్వరాజ్ ప్రసంగం మూడు భాగాలుగా ఉంది. మొదటి భాగంలో ఆమె తాము భారతదేశాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నామో, ఏయే పథకాలు అమలు చేస్తున్నామో చెప్పారు.

రెండో భాగంలో సుష్మ పాకిస్తాన్ గురించి మాట్లాడారు. ఆ దేశాన్ని 'టెర్రరిస్ట్ కంట్రీ'గా చెప్పారు. బిన్ లాడెన్ లాంటి వారి గురించి కూడా ప్రస్తావించారు.

మూడో భాగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'మల్టిటలేటరిజం'(బహుముఖ ప్రపంచం)లో ఎలాంటి సవరణలు తీసుకురావాలని అనుకుంటున్నారో చెప్పారు.

కానీ, ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద అంశంగా చైనా పాత్ర ఉంది. భారత్‌ను మెల్లమెల్లగా చుట్టుముట్టేందుకు అది పాకిస్తాన్‌లో ఒక ఓడరేవు నిర్మిస్తోంది. శ్రీలంకలో ఒక రేవుపై హక్కులు సంపాదించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దౌత్య అంశాల్లో చైనా ఎలాంటి పాత్ర పోషిస్తోందో దాని గురించి సుష్మ ఏం మాట్లాడలేదు.

అటు అమెరికా తన విదేశాంగ విధానం ద్వారా ప్రతి వేదికనూ బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ సహా అన్ని దేశాలపై ట్యారిఫ్(సుంకాలు) విధించింది. హెచ్1బీ వీసా ఇవ్వడంలో భారత్ పరిస్థితి మరింత జటిలం చేసింది.

సుష్మా స్వరాజ్ ప్రసంగం

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్

భారత్ దృష్టికోణం పెరగాలి

ఈ విషయాలన్నీ పక్కన పెడితే, భారత విదేశాంగ మంత్రి కేవలం పాకిస్తాన్, దేశంలో జరిగే ఎన్నికల గురించి మాట్లాడుతూ వచ్చారు. నాకు మాత్రం "భారత్ ప్రస్తుతం ఒక పెద్ద శక్తి అని, ప్రపంచంలోని పెద్ద ఆర్థికవ్యవస్థ అని, దేశానికి అణు శక్తి ఉందని, చాలా గౌరవం ఉందని.. ప్రపంచం ముందు చాటే అవకాశాన్ని సుష్మా స్వరాజ్ దూరం చేసుకున్నారేమో అనిపించింది.

ఇక్కడ ప్రధానమైన విషయం అమెరికా ప్రజాస్వామ్యం బలహీనం అయ్యింది. కానీ భారతదేశ ప్రజాస్వామ్యం, బహుళ మత వాదం, సివిల్ సొసైటీ, పత్రికా స్వేచ్ఛ అన్నీ బలంగా ఉన్నాయి.

భారత్ తీవ్రవాదం గురించే మాట్లాడాలని అనుకుంటే, సిరియా గురించి మాట్లాడి ఉండచ్చు, ఇరాక్ గురించి చెప్పి ఉండచ్చు. గ్లోబల్ టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి పాత్ర పోషించగలదో సుష్మ తన ప్రసంగంలో చెప్పి ఉండాల్సింది.

నాకైతే భారత్ తన దృష్టి కోణం మరింత పెరగాలని, అది అంతర్జాతీయంగా ఉండాలని అనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ చాలా ముఖ్యమైన దేశంగా మారిందని చెప్పగలిగేలా ఉండాలి.

సుష్మా స్వరాజ్ ప్రసంగం

ఫొటో సోర్స్, EUROPEAN PHOTOPRESS AGENCY

పాకిస్తాన్‌కు అంత ప్రాధాన్యం ఎందుకు?

పాకిస్తాన్ గురించి భారత్ రక్షణాత్మక ధోరణితో ఉంది. అలా చేయడం వల్ల రెండు జరుగుతాయి. ఒకటి ప్రస్తుతం ఉన్న భారత్ స్థాయి బలహీనమై, చిన్నదైపోతుంది. రెండోది అది పాకిస్తాన్ స్థాయిని పెంచుతుంది.

ఇప్పుడు మీరు ఊహించవచ్చు. ప్రపంచంలో ఒక ముఖ్యమైన దేశం తన ప్రసంగంలో మూడో భాగం పాకిస్తాన్ గురించే మాట్లాడుతోంది.

దక్షిణాసియాలో భారత్ ఎలాంటి పాత్ర పోషిస్తోందో చూస్తే, చుట్టుపక్కల ఉన్న ఎన్నో చిన్న చిన్నదేశాల్లో భారతదేశం ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది.

ఉదాహరణకు అమెరికా, యూరప్‌లో అఫ్గానిస్తాన్ అంశం చాలా పెద్దది. భారత్ అఫ్గానిస్తాన్‌ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది.

కానీ అంతర్జాతీయ స్థాయిలో తాము ఏమేం చేస్తున్నామో, స్వయంగా భారత ప్రభుత్వానికే తెలియడం లేదు అనిపిస్తోంది.

సుష్మా స్వరాజ్ ప్రసంగం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ కురేషీ

పాకిస్తానీల సంతోషం కోసమే కశ్మీర్ ప్రస్తావన

పాకిస్తాన్ తమ దేశ ప్రజలను సంతోషపెట్టడానికే మాటిమాటికీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతోంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఎలాంటి ప్రాధాన్యం ఉండదు.

అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ఇమేజ్ చాలా దిగజారిపోయింది. అది ఈ ఇమేజ్‌ను కూడా సరిదిద్దుకోడానికి ప్రయత్నిస్తుంది.

నా దృష్టిలో భారత్ పాకిస్తాన్‌తో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నేను సైన్యాన్నిఉపయోగించాలనే విషయం చెప్పడంలేదు. భారత్ ఆ దేశంపై ఆంక్షలు విధించి, సంబంధాలు తగ్గించుకుని, దానితో ఒక పరాయి దేశంలా ప్రవర్తిస్తే పాక్ బలహీనం అవుతుంది.

భారత్ మాటలు చాలా చెబుతుంది. కానీ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరిగే విచారణ మాత్రం బలహీనంగా ఉంటుంది. భారత్ ఆ దేశంపై మాటల దాడి తగ్గించి.. చేతలు చూపించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)