ఆస్ట్రేలియా కంటే 11 పరుగులు ఎక్కువ కొట్టినా... భారత్ ఓడింది

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 174 పరుగుల లక్ష్యాన్నిఅందుకునే క్రమంలో 17 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసింది.
శిఖర్ ధావన్ 76 ఆరు పరుగులతో రాణించగా, చివర్లో రిషబ్ పంథ్, దినేష్ కార్తీక్ ధాటిగా ఆడి భారత్‌కు విజయం అందించే ప్రయత్నం చేశారు.
ఓ దశలో 13ఓవర్లు ముగిసేసరికి 113పరుగలు చేసిన భారత్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరి 24బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన దశలో పంథ్, కార్తీక్‌లు దూకుడు పెంచారు.
పంథ్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటవ్వగా, దినేష్ కార్తీక్ 13బంతుల్లో 30 పరుగులు చేశాడు. కానీ, చివరి ఓవర్లో కార్తీక్ ఔటవ్వడంతో భారత ఓటమి ఖరారైంది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 17ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కానీ, మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అంపైర్లు లక్ష్యాన్ని 17 ఓవర్లలో 174పరుగులుగా సవరించారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 24బంతుల్లో 46 పరుగులు చేసి జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది.
రెండో టీ20 నవంబర్ 23న మెల్‌బోర్న్‌లో జరగనుంది.
రెండు జట్లూ 17ఓవర్లే ఆడినా... భారత్ లక్ష్యం ఎందుకు పెరిగింది?
‘అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్... రెండు జట్లూ 17 ఓవర్లే ఆడాయి. అలాంటప్పుడు డీఎల్‌ఎస్ పద్ధతిలో లక్ష్యాన్ని సవరించాల్సిన అవసరం ఏముందని చాలామంది భావిస్తారు. కానీ, ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగినప్పుడు వాళ్లు 17 ఓవర్లు మాత్రమే ఆడతారన్న సంగతి వాళ్లకు తెలీదు. మధ్యలో వర్షం పడటంతో అర్ధంతరంగా మ్యాచ్‌ను ఆపేయాల్సి వచ్చింది. అందుకే డక్‌వర్త్ లూయిస్ నియమాలకు అనుగుణంగా రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు లక్ష్యాన్ని పెంచారు’ అని చాద్ అనే క్రికెట్ అభిమాని ఒకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








