ప్రతి నెలా జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, ఈ ఆరు సూత్రాలు పాటించండి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అహ్మన్ ఖ్వాజా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రతి నెలా జీతాలు రావడానికి ముందే మీ దగ్గరున్న డబ్బు అయిపోతోందా? బడ్జెట్ లోపలే ఖర్చు పెట్టాలని అనుకుని, ప్రతి నెలా విఫలమవుతున్నారా?
మీరు ఆర్థిక పరమైన విషయాలలో ఎక్కడ తప్పు చేస్తున్నారో, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో మీకు తెలీక పోవచ్చు. దీనిపై మేం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్, రచయిత అయిన మెలిసా బ్రౌనీతో మాట్లాడగా ఆమె ఈ క్రింది ఆరు విలువైన సూచనలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
1. పోలికలు వద్దు
మనం పోల్చి చూసుకునే సంస్కృతిలో ఉంటున్నాం. గతంలోనూ ఇది ఉన్నా.. అప్పుడు మనం ఇరుగుపొరుగు వాళ్లతో మాత్రమే పోల్చుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో, కలిసిన వారందరితోనూ పోల్చుకోవడం ఎక్కువైంది. సోషల్ మీడియాలో మనకు కనిపించే వ్యక్తులతో నిరంతరం మన విలువను కొల్చుకుంటున్నాం.
దీనికి పరిష్కారం? వాళ్లను అన్‌ఫ్రెండ్ చేయడమో లేదా అన్‌ఫాలో చేయడమే.
షాపింగ్ అవసరం లేకుండానే మీలో ప్రేరణ నింపే వ్యక్తులను గుర్తించండి.

ఫొటో సోర్స్, Getty Images
2. 24/7 షాపింగ్ వద్దు
గతంలో సోమవారం నుంచి శనివారం వరకు కేవలం పగలు మాత్రమే షాపింగ్ చేసే అవకాశం ఉండేది.
కానీ ఆన్‌లైన్ షాపింగ్ వచ్చేశాక పరిస్థితి మారింది. రాత్రి టీవీలో సినిమా చూస్తూ బోర్ కొడితే చాలు.. మొబైల్ ద్వారా దేన్నైనా షాపింగ్ చేసేయొచ్చు.
ఇలా 24/7 గంటలూ షాపింగ్ చేయడానికి అడ్డుకట్ట వేసేందుకు మీరు ఎప్పుడు, ఎలా షాపింగ్ చేస్తారన్న దానిపై పరిమితులు విధించుకోండి.
రోజులో కేవలం ఏదో ఒక సమయంలో మాత్రమే షాపింగ్ చేయాలని గట్టి నిర్ణయం తీసుకోండి.
దీని వల్ల మీకు బోర్ కొట్టినపుడంతా షాపింగ్ చేసే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3. సులభమైన రుణాలు
కేవలం క్రెడిట్ కార్డులు మాత్రమే కాదు, 'జీతాల రోజు తీర్చేయండి', 'ఇప్పుడు కొనండి, తర్వాత తీర్చండి' అనే ప్రకటనలు మీపై ఆర్థిక భారాన్ని పెంచుతాయి. మనం క్రెడిట్ కార్డును ఉపయోగించేటప్పుడు కనీసం 10 శాతం ఎక్కువ ఖర్చు చేస్తామని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే దానిని మనం మన డబ్బుగా భావించం.
మీ వద్ద ఒకటికన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే, మీరు నెలనెలా ఎప్పుడో కానీ క్రెడిట్ కార్డు సొమ్ము తిరిగి చెల్లించకుంటే లేదా ప్రతి నెలా మీరు పొదుపు చేసిన సొమ్ము నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తుంటే.. ఎప్పుడూ అప్పు చేసి వస్తువులు తీసుకోకూడదని ఒక కఠిన నిర్ణయం తీసుకోండి.
క్రెడిట్ కార్డులను తగ్గించండి. దానికి బదులు గతంలో మాదిరి డెబిట్ కార్డులను ఉపయోగించండి.

ఫొటో సోర్స్, Getty Images
4. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
ఆహారం విషయంలో మనకు ఇప్పుడు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వేగన్, వెజిటేరియన్, హై కార్బ్, లో కార్బ్, హై ఫ్యాట్, లో ఫ్యాట్, ఆర్గానిక్ లేదా కేవలం పళ్లు.. ఇలా ఏ ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు మనం చాలా గందరగోళంలో ఉన్నాం.
ఆర్థికపరమైన అంశాలలో కూడా మన పరిస్థితి ఇదే.
ఎలా పొదుపు చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే దానిపై ఇప్పుడు మనకు ఎంతో సమాచారం అందుతుంటుంది. దీంతో ఏం చేయాలో తోచక గందరగోళంలో పడిపోతుంటాం.
అలాంటప్పుడు మళ్లీ మనం ప్రాథమిక సూత్రాల దగ్గరకు వెళ్లాలి. మనం ఏ రకంగా ఖర్చు పెడుతున్నాం, వేటిపై ఖర్చు చేస్తున్నాం, మన జీవిత లక్ష్యాలేమిటో మరోసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడు మన ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయం తీసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
5. యధాలాప జీవితం
మనలో చాలా మందిమి యధాలాపంగా జీవించేస్తున్నాం. చివరికి ఏదో ఒక రోజు మేల్కొని (తరచుగా 30లలో) 'నేనిక్కడికి ఎలా వచ్చిపడ్డాను?' అని ప్రశ్నించుకుంటుంటాం.
అలా కాకుండా, ఒక తెలివైన వినియోగదారునిగా ఉంటూ, జీవితంలో ముదుగానే ప్రణాళిక రూపొందించుకోండి.
'నాకు కావాల్సిన జీవితాన్ని రూపొందించుకుంటే, అది ఏ రకంగా ఉంటుంది?' అని ఆలోచించండి.
మీరు ఇప్పుడు చేస్తున్న ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక 30 రోజుల పాటు కేవలం కనీస అవసరాలపై మాత్రమే ఖర్చు పెట్టండి.
అప్పుడు మీరు ఒక తెలివైన వినియోగదారునిగా మారతారు.

ఫొటో సోర్స్, MOD
6. మీరు జీతంపై ఆధారపడ్డారని గుర్తుంచుకోండి
మనలో చాలా మంది నెల జీతంపై జీవిస్తున్న వాళ్లం. అందువల్ల మొత్తం జీతాన్ని కొన్ని భాగాలుగా విభజించండి. నెలవారీ చెల్లింపులకు ఎంత, సేవింగ్స్ అకౌంట్‌కు ఎంత? ఇంటి అద్దెకు ఎంత? ఇలా ముందే నిర్ణయించుకోండి. ఆ తర్వాత మిగిలిన దానిలోంచే ఖర్చు చేయండి.
తర్వాత పార్ట్ టైమ్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి మొదలైన వాటి ద్వారా ఇతర రకాలుగా ఏదైనా ఆదాయం వస్తుందేమో పరిశోధించండి.
ఇవి కూడా చదవండి
- నల్లగొండలో ఆడపిల్లల అమ్మకాలు ఆగిపోయాయా?... సంక్షేమ పథకాలతో సమస్య పరిష్కారమైందా?
- ఎంపీలుగా ఓడారు.. ఎమ్మెల్యే టికెట్ పట్టారు
- బ్రెగ్జిట్: థెరెసా మే ముసాయిదా బిల్లులో మార్పుల కోసం మంత్రుల ప్రయత్నం
- గరిమా అరోరా: ఆమె చేతి వంటకు ప్రపంచమే ఫిదా
- 'యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్జీ హత్య' - నిందిస్తున్న సీఐఏ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








