'క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్జీ హత్య' - నిందిస్తున్న సీఐఏ

సౌదీ యువరాజు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఖషోగ్జీ హత్యతో తమ క్రౌన్ ప్రిన్స్‌కు ఎలాంటి సంబంధమూ లేదని సౌదీ అరేబియా అంటోంది

సౌదీ అరేబియా సింహాసనానికి వారసుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్య జరిగినట్లుగా అమెరికా గూఢచార సంస్థ సీఐఏ భావిస్తోందని అమెరికా మీడియా పేర్కొంది.

ఖషోగ్జీ హత్యకు సంబంధించిన సాక్ష్యాధారలను బట్టి సీఐఏ ఈ అంచనాకు వచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అయితే, సౌదీ అరేబియా మాత్రం తమ క్రౌన్ ప్రిన్స్‌కు ఆ హత్యతో ఎలాంటి సంబంధమూ లేదని అంటోంది. ఆ హత్య ముందస్తు ప్రణాళికతో చేసిన 'రోగ్ ఆపరేషన్' (ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టే చర్య) అని పేర్కొంది.

ఖషోగ్జీ హత్య కేసులో దోషులందరినీ పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ శనివారం అన్నారు.

ఓ సదస్సులో పాల్గొనేందుకు పపువా న్యూ గునియా వెళ్లిన ఆయన మాట్లాడుతూ.. "ఈ హత్య కేసులో బాధ్యులందరినీ పట్టుకుని బోనులో నిలబెట్టాలని అమెరికా నిర్ణయించింది" అన్నారు.

అక్టోబర్ 2న టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఉన్న సౌదీ అరేబియా కాన్సులేట్ భవనంలో జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేశం ఇప్పటి వరకూ దొరకలేదు.

ఈ హత్య వెనుక పెద్ద తలలు ఉన్నాయని, ఉన్నత స్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని టర్కీ ఆరోపిస్తోంది.

జమాల్ ఖషోగ్జీ

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ అరేబియాకు చెందిన జమాల్ ఖషోగ్జీ... వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు వ్యాసాలు రాసేవారు.

అమెరికాలోని సౌదీ రాయబారికి క్రౌన్ ప్రిన్స్‌ సోదరుడు ప్రిన్స్ ఖలేద్ బిన్ సల్మాన్ చేసిన ఫోన్‌ కాల్ ఆధారంగా సీఐఏ ఈ అంచనాకు వచ్చిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

తన సోదరుడి ఆదేశాల మేరకు ఖషోగ్జీతో ఫోన్‌లో మాట్లాడిన ఖలేద్... ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్‌కు వెళ్తే ఎలాంటి ప్రమాదం ఉండదన్న 'భరోసా' ఇచ్చారని అరోపణలు ఉన్నాయి.

అయితే, దాదాపు ఏడాది కాలంలో తాను ఎన్నడూ ఖషోగ్జీతో మాట్లాడలేదని ఖలేద్ అన్నారు. అదృశ్యానికి ముందు రోజు వరకూ ఖషోగ్జీ లండన్‌లోనే ఉన్నారని, ఆయనతో తాను మాట్లాడనేలేదని, ఆయనకు ఎలాంటి సూచనలూ చేయలేదని ఖలేద్ చెప్పారు.

జమాల్ ఖషోగ్జీ

ఫొటో సోర్స్, Getty Images

తాజా మీడియా కథనాల మీద అమెరికా అధ్యక్ష కార్యాలయం, ఆ దేశ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి ఇప్పటికే సీఐఏ తెలియజేసిందని విస్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ బిన్ సల్మాన్‌కు ఆ హత్యకు పాల్పడిన ముఠా నుంచి వెళ్లిన ఫోన్ కాల్‌ను కూడా సీఐఏ నిపుణులు విశ్లేషించినట్లు తెలుస్తోంది.

"ఆ హత్యతో సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు సూచించే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. కానీ, అలాంటి ఆపరేషన్‌కు ఆయన ఆదేశాలు అవసరం ఉండే ఉంటుందని సీఐఏ భావిస్తోంది" అని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

వీడియో క్యాప్షన్, వీడియో: ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ దగ్గర ఏం జరిగింది?

ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి చంపారు

"కాన్సులేట్‌ భవనంలో ఖషోగ్జీకి ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ భవనంలోనే శవాన్ని ముక్కుముక్కలు చేశారు. తర్వాత ఆ శరీర భాగాలను ఓ స్థానిక 'సహాయకుడి'కి ఇచ్చారు" అని గురువారం రియాద్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌదీ డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షలాన్ బిన్ రాజిన్ షలాన్ చెప్పారు.

ఆ శరీర భాగాలు ఎక్కడ వేశారో కనుగొనేందుకు సోదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

ఈ కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో అయిదుగురికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్ వాదిస్తున్నారు.

సౌదీ ప్రభుత్వానికి చెందిన ఏజెంట్ల ముఠానే ఖషోగ్జీని హత్య చేసిందని టర్కీ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)