చైనా: జాతీయ గీతాన్ని ‘అవమానించినందుకు’ సోషల్ మీడియా స్టార్ అరెస్ట్

యాంగ్ కైలీ

ఫొటో సోర్స్, WEIBO

చేతులు ఊపుకుంటూ జాతీయ గీతాన్ని పాడినందుకు చైనాలో ఓ యువతి జైలుపాలయ్యారు. సోషల్ మీడియా వేదిక 'హుయా'లో లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న 20 ఏళ్ల యాంగ్ కైలీ.. అక్టోబర్ 7న కెమెరా ముందు చైనా జాతీయ గీతాన్ని నిర్లక్ష్యంగా పాడుతూ కనిపించారు.

లైవ్ స్ట్రీమింగ్ వేదిక హుయా ఆ వీడియోను డిలీట్ చేసి, ఆమె చానెల్‌ను నిషేధించింది. జాతీయ గీతాన్ని అలా పాడినందుకు బాధ్యత వహిస్తూ యాంగ్ కైలీ బహిరంగంగా క్షమాపణ కూడా కోరారు. కానీ యాంగ్ కైలీ చట్టాన్ని ఉల్లంఘించారని షాంఘై పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

''జాతీయ గీతం అన్నది దేశానికి ప్రతీక. పౌరులందరూ జాతీయ గీతాన్ని గౌరవిస్తూ, దాని ఔన్నత్యాన్ని కాపాడాలి. లైవ్ స్ట్రీమింగ్ వేదికలు చట్టానికి అతీతం కాదు'' అని పోలీసులు తెలిపారు.

చైనాలో గత ఏడాది అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం జాతీయ గీతాన్ని నిర్లక్ష్యంగా, అవమానపరచే విధంగా ఆలపించినవారికి 15రోజులవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

చైనాలో లైవ్ స్ట్రీమర్లు వేల సంఖ్యలో ఉన్నారు. తమ వీక్షకులను వినోదపరచడానికి కెమెరా ముందు ఆడుతూ పాడుతూ, తింటూ, అరుస్తూ.. ఎన్నో వేషాలు వేస్తారు.

ఇది కూడా ఓ సంపాదనా మార్గమే. ఆన్‌లైన్‌లో వీక్షకులు పంపే బహుమతులను వీళ్లు డబ్బు రూపంలోకి మార్చుకుంటారు.

2016సం.లోనే చైనా లైవ్ స్ట్రీమింగ్ మార్కెట్ విలువ 500 కోట్ల డాలర్లు ఉంటుందని ఓ అంచనా.

యాంగ్ కైలీ

ఫొటో సోర్స్, WEIBO

చట్టం తన పని తాను...

హుయాలో యాంగ్ కైలీ చానెల్‌ను నిషేధించడానికి ముందు ఆమెకు 4కోట్లకు పైగా అభిమానులుండేవారని స్థానిక మీడియా చెబుతోంది.

''యాంగ్ కైలీ.. జాతీయ గీతం చట్టాన్ని ఉల్లంఘించారు. అందుకే ఆమె చానెల్‌ను రద్దు చేస్తున్నాం. జాతీయ గీతం గౌరవాన్ని కాపాడటానికి, దాని ఔన్నత్యాన్ని చాటిచెప్పడానికి మేం కట్టుబడి ఉన్నాం'' అని గత వారం హుయా ప్రకటించింది.

అయితే యాంగ్ కైలీకి జైలు శిక్ష విధించడంపై వీబో, ట్విటర్ వేదికల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

'చట్టం చట్టమే.. దేనిపట్లయినా కాస్త గౌరవంతో నడుచుకోవాలి కదా..'

'ఇది సిగ్గు చేటు. ఆమె జాతీయ గీతాన్ని అవమానించింది. చట్టాన్ని అతిక్రమించింది' అంటూ కొందరు వ్యాఖ్యానాలు చేశారు.

మరికొందరు మాత్రం..

'ఆమె ఉద్దేశపూర్వకంగా జాతీయ గీతాన్ని అవమానించలేదు.'

'యాంగ్ కైలీకి ఇంత కఠినమైన శిక్ష విధించడం తప్పు' అంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు.

యాంగ్ కైలీ మాత్రం.. ''ఇలాంటి వెర్రి పని చేసినందుకు సిగ్గుపడుతున్నా. జాతీయ గీతాన్ని నిర్లక్ష్యంగా పాడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. జాతీయ గీతం చాలా పవిత్రమైనది. నా ప్రవర్తన చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది'' అంటూ క్షమాపణలు చెప్పారు. ఇకపై తన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలన్నిటినీ నిలిపివేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)