సౌదీ అరేబియా: అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచానికి ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
పాత్రికేయుడు జమాల్ ఖషొగ్జీ హత్యలో సౌదీ అరేబియాకు పాత్ర ఉన్నట్లు తేలితే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
మరోవైపు ఈ ఉదంతంపై సౌదీ మాత్రం తమకేమీ తెలియదంటోంది. ఖషొగ్జీని సౌదీ ఏజెంట్లే హతమార్చారన్న టర్కీ అధికారుల ఆరోపణలను ఖండించింది. తమపై ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో రాజకీయంగా, ఆర్థికంగా సౌదీ ఎంత కీలకంగా ఉంది.. అమెరికా చర్యలకే దిగితే ఆ ప్రభావం ఎలా ఉండనుందో చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
1. చమురు సరఫరా, ధరల పెరుగుదల
ప్రపంచ చమురు నిక్షేపాల్లో 18 శాతం సౌదీ అరేబియా వద్దే ఉన్నాయి. అంతేకాదు, ప్రపంచంలో చమురు ఎగుమతుల్లో సౌదీయే ప్రథమ స్థానంలో ఉందని 'పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి'(ఒపెక్) గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణమే సౌదీని అంతర్జాతీయ యవనికపై శక్తిమంతమైన దేశంగా నిలుపుతోంది.
అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా కానీ, ఇతర దేశాలు కానీ సౌదీపై ఆంక్షలు విధిస్తే ఆ దేశం కూడా అంతేస్థాయిలో ప్రతిస్పందించొచ్చు. తన చమురు ఉత్పత్తిని తగ్గించి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగేలా చేయొచ్చు.
'అల్ అరేబియా' వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక కథనంలో ఆ సంస్థ జనరల్ మేనేజర్ 'టర్కీ అల్దాఖిల్'.. ''సౌదీపై ఆంక్షలు విధిస్తే ప్రపంచం ఆర్థిక విపత్తు బారిన పడే ప్రమాదం ఉంది'' అని అభిప్రాయపడ్డారు. ''బ్యారల్ ముడి చమురు 80 డాలర్లకు చేరితేనే ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కానీ, సౌదీపై చర్యలు తీసుకుంటే ధరలు 200 డాలర్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు'' అని తన సంపాదకీయ వ్యాసంలో రాశారు. చివరకు అది ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై ప్రభావం చూపిస్తుంది.
2. మిలటరీ ఒప్పందాలు
రక్షణ బడ్జెట్ల విషయంలో సౌదీ అరేబియాది ప్రపంచ దేశాల్లో మూడో స్థానం. 2017లో సౌదీ అరేబియా అమెరికాతో 11 వేల కోట్ల డాలర్ల విలువై ఆయుధాల ఒప్పందం చేసుకుంది. గత పదేళ్ల కాలంలో ఒక్క అమెరికాతోనే 35 వేల కోట్ల డాలర్ల ఆయుధ ఒప్పందాలు చేసుకుంది. అందులో అమెరికా ఆయుధ ఎగుమతుల చరిత్రలోనే అత్యంత పెద్ద ఒప్పందం కూడా ఉంది.
అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల నుంచి కూడా సౌదీ పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఒకవేళ అమెరికా కనుక తనపై ఆంక్షలు విధిస్తే అప్పుడు సౌదీ తన రక్షణ అవసరాల కోసం చైనా, రష్యాల వైపు చూసే అవకాశం ఉంటుందని అల్దాఖిల్ తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP
3. భద్రత, ఉగ్రవాదం
మధ్య ప్రాచ్యంలో ఉగ్రవాదంపై పోరులో కానీ, భద్రత విషయంలో కానీ సౌదీ అరేబియాది కీలక పాత్ర అని పాశ్చాత్య దేశాలు చెబుతూ వస్తున్నాయి.
యెమెన్‌లో సౌదీ బలగాలు యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నప్పటికీ బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆ దేశంతో దగ్గరి సంబంధాలు కొనసాగించడాన్ని సమర్థించుకుంటున్నారు. బ్రిటన్ వీధుల్లో ప్రజలు సురక్షితంగా తిరగగలిగేలా సౌదీ సహకారం అందిస్తోందంటూ అందుకు కారణం చూపుతున్నారు.
ఇస్లాం మత ఆవిర్భావ స్థలమైన సౌదీ అమెరికా నేతృత్వంలో... ఐఎస్‌పై పోరాడుతున్న అంతర్జాతీయ సంకీర్ణ కూటమిలో సభ్యదేశంగా ఉంది. గత ఏడాది సౌదీ 40 ముస్లిం దేశాలను కలుపుకొంటూ ఉగ్రవాద నిరోధానికి గాను ఇస్లామిక్ సైన్యాన్ని ఏర్పరిచింది.
ఇప్పుడు ఖాషొగ్జీ అదృశ్యం తరువాత అమెరికా కనుక సౌదీపై చర్యలకు దిగితే సౌదీతో అమెరికా, పాశ్చాత్య దేశాల మధ్య సమాచార పంపిణీ అన్నది గతంగా మిగిలిపోతుందని అల్దాఖిల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
4. ప్రాంతీయ కూటములు
మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని పరిమితం చేయడం కోసం సౌదీ అమెరికాతో కలిసి పావులు కదిపింది. మధ్యప్రాచ్యవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా సున్నీ, షియా అధికార కేంద్రాలు సంక్షోభాలను రగిలించాయి.
సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించేందుకు గాను అక్కడి తిరుగుబాటు వర్గాలకు సౌదీ అరేబియా మద్దతుగా నిలవగా... అసద్‌ను అధికారంలో కొనసాగించేందుకు రష్యాతో కలిసి ఇరాన్ సహకరిస్తోంది.
ఇప్పుడు అమెరికా కనుక సౌదీతో తన వైఖరిని మార్చుకుంటే అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవచ్చని.. రష్యా, సౌదీలు.. ఫలితంగా సౌదీ, ఇరాన్ మధ్య కూడా సయెధ్య కుదరొచ్చని అల్దాఖిల్ తన వ్యాసంలో రాసుకొచ్చారు.
5. వాణిజ్యం, పెట్టుబడులపై ప్రభావం
అమెరికా చెబుతున్నట్లుగానే చర్యలకు దిగితే సౌదీ విపణికి అమెరికా సంస్థలు దూరమైనా ఆశ్యర్యపోనవసరం లేదని అల్దాఖిల్ తన వ్యాసంలో విశ్లేషించారు.
సౌదీతో అమెరికా వస్తు, సేవల వాణిజ్యం 2017లో 4,600 కోట్ల డాలర్ల మేర ఉంది. అంతేకాదు.. రెండు దేశాల మధ్య వాణిజ్యం కారణంగా 2015లో అమెరికాలో 1,65,000 మందికి ఉద్యోగాలు దొరికాయని అమెరికా వాణిజ్య శాఖ అంచనా వేసింది.
సౌదీలో పౌర హక్కుల కార్యకర్తలు, మహిళా హక్కుల ఉద్యమ కారులను విడిచిపెట్టాలంటూ కెనడా పిలుపునివ్వడంతో ఆ దేశంపై సౌదీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ దేశంతో కొత్తగా చేపట్టబోయే వాణిజ్యాన్నంతటినీ నిలిపివేసింది. అంతేకాదు కెనడా నుంచి ఆహార దినుసుల దిగుమతినీ ఆపేసింది. ప్రభుత్వ ఉపకార వేతనాలతో కెనడాలో చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులనూ వెనక్కు పిలిపించాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. ‘ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
- సిరియా: ఇది సైన్యాల మధ్య పోరాటం కాదు.. ప్రజలపై జరుగుతున్న యుద్ధం
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- ట్విటర్ ఫేక్ ఖాతాల ప్రక్షాళన: తెలుగు ప్రముఖుల ఫాలోవర్లలో అసలెందరో, నకిలీలెందరో తెలుసుకోండి
- అమెరికా మధ్యంతర ఎన్నికలు: డోనల్డ్ ట్రంప్ భవిష్యత్తుకు ఇవెంత కీలకం?
- డోనల్డ్ ట్రంప్: పర్యావరణ శాస్త్రవేత్తలకు 'రాజకీయ అజెండా' ఉంది
- మొఘలుల పాలనలో నవరాత్రి వేడుకలు ఎలా జరిగేవి?
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








