డోనల్డ్ ట్రంప్: పర్యావరణ శాస్త్రవేత్తలకు 'రాజకీయ అజెండా' ఉంది

ఫొటో సోర్స్, AFP
పర్యావరణ శాస్త్రవేత్తలకు 'రాజకీయ అజెండా' ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించారు. భూతాపం పెరగడానికి మానవ కార్యకలాపాలు కారణమనే వాదనపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, పర్యావరణ మార్పులు జరగడం బూటకం కాదని నమ్ముతున్నట్లు చెప్పారు.
సీబీఎస్ మీడియా నిర్వహించిన '60 మినిట్స్' కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించే తుది హెచ్చరిక ఇదేనని శాస్త్రవేత్తలు ప్రకటించిన వారంలోపే ట్రంప్ ఇలా మాట్లాడటం గమనార్హం.
మానవ కార్యకలాపాల వల్లే పర్యావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలందరూ అంగీకరిస్తున్నారు.
పెరుగుతున్న భూతాపంపై వాతావరణ మార్పులను అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ 'ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్' (ఐపీసీసీ) గత వారం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భూమి సగటు ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగిపోతోందని హెచ్చరించింది.
''మానవ కార్యక్రమాల వల్ల భూ ఉష్ణోగ్రతలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల పారిశ్రామిక విప్లవం కంటే ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత పెరిగింది'' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేని స్థాయిలో సత్వరం ఫలితమిచ్చే చర్యలు చేపట్టాలని ఆ నివేదికలో తెలిపారు.
వాతావరణ మార్పులతో సహా అనేక విషయాలపై ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. అవి:
"నేను పదవి చేపట్టడానికి ముందు రోజే ఉత్తర కొరియాతో యుద్ధానికి అమెరికా దాదాపు సిద్ధమైంది."
"రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హత్యలతో సంబంధం బహుశా ఉండవచ్చు, కానీ, నేను వాళ్ళను నమ్ముతున్నాను. అది మా దేశంలో జరిగింది కాదు."
"2016 ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంది. చైనా కూడా జోక్యం చేసుకుందని అనుకుంటున్నా"
ఇంకా, వలస బాలలను వేరుచేసే విధానాన్ని' తిరిగి తీసుకొస్తారో లేదో చెప్పడానికి ఆయన నిరాకరించారు. కానీ, అక్రమ వలసలపై చర్యలుంటాయని ట్రంప్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పులపై ట్రంప్ ఏమన్నారు?
శాస్త్రవేత్తల మాటలు చూస్తుంటే 'ఓ పెద్ద రాజకీయ అజెండా' వారికి ఉన్నట్లు కనిపిస్తోందని ఆదివారం నాటి ఇంటర్య్వూలో ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు.
''ఇది అబద్ధం అని అనుకోవడం లేదు. కానీ, ఏదో కాస్త తేడా ఉండొచ్చని అనుకుంటున్నా'' అని చెప్పారు.
''మానవ కార్యకలాపాల వల్లే వాతావరణ మార్పులు జరుగుతున్నాయా? అనేది నాకు తెలియదు. కానీ, ఇక్కడో విషయం చెప్పాలి. కోట్లకొద్ది డబ్బును ఇవ్వాలనుకోవడం లేదు. లక్షలాది ఉద్యోగాలను వదులుకోవాలనుకోవడం లేదు. ప్రతికూల పరిస్థితులను కల్పించను.'' అని పేర్కొన్నారు.
భూతాపం దానంతటదే వెనుకటి స్థాయికి చేరుకుంటుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పునరుత్పాదక శక్తి రంగం కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది: రోగెర్ హర్రబిన్, బీబీసి పర్యావరణ విశ్లేషకులు
వాతావరణ మార్పులపై ట్రంప్ అభిప్రాయాలు చర్చనీయాంశంగా మారాయి.
కొంతమంది శాస్త్రవేత్తలు కూడా మానవ ప్రమేయం వల్లే ప్రస్తుత వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయనే వాదనను నిరాకరిస్తున్నారు.
అయితే, ఓ సహజ చక్రంలా వాతావరణం మళ్లీ సాధారణ స్థితికి వస్తోందని భావించడం లేదని చెబుతున్నారు.
ఉద్గారాల తగ్గింపునకు కోట్ల రూపాయిలు ఇవ్వాలనుకోవడం లేదని ట్రంప్ చెబుతున్నారు. పునరుత్పాదక శక్తి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించకుండా మిగిలిన ప్రభుత్వాలు కూడా ట్రంప్ దారిలోనే నడుస్తున్నాయి.
ఉద్గారాలు వెల్లడించే ఫ్యాక్టరీలు మూసివేయడం వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి పర్యావరణ రహిత పరిశ్రమల్లో ఉపాధి కల్పించవచ్చు. కానీ, ఇంగ్లండ్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు.
అమెరికాలో బొగ్గు పరిశ్రమలో కంటే సౌర పరిశ్రమలో ఎక్కువ ఉద్యోగాలు సృష్టించవచ్చు. అయితే, అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ విషయం తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
శాస్త్రవేత్తల మాటేమిటి?
ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఇతరత్రా భారీ చర్యలు చేపడితేనే వాతావరణ మార్పులను నియంత్రించగలమని గత వారం విడుదల చేసిన నివేదికలో ఐపీసీసీ వెల్లడించింది.
2030 నాటికి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను 45 శాతానికి అంటే 2010 స్థాయికి తీసుకరావవడం, బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం, అలాగే, 2.7 చదరపు మైళ్ల భూమిని వినియోగంలోకి తేవడం చేయాలని సూచించింది.
ఈ చర్యలు చేపట్టకపోతే వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
గతంలో ట్రంప్ ఏమన్నారంటే?
2016 ఎన్నికల సమయంలో వాతావరణ మార్పులు అనేది ఒట్టి బూటకం అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, పదవి చేపట్టినప్పటి నుంచి దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోకుండా తప్పించుకుంటున్నారు.
భూతాపాన్ని నియంత్రించేందుకు అమెరికాతో పాటు, 187 దేశాలు సంతకం చేసిన 'పారిస్ క్లైమెట్ ఛేంజ్ అగ్రిమెంట్' నుంచి వైదొలుగుతున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే, అమెరికా వ్యాపారాలు, కార్మికులకు నష్టంలేని కొత్త ఒప్పందాలపై చర్చలు జరపడానికి సిద్ధమని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి.
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- #గమ్యం: పైలట్ కావాలని అనుకుంటున్నారా..
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- రూ.10 కాయిన్స్: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








