భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'.. టూర్ ఆఫ్ ద డ్రాగన్‌

భూటాన్ సైకిల్ రేస్

ఫొటో సోర్స్, MELYN MCKAY

మిగతా ప్రపంచానికి దూరంగా ఉన్నట్లుండే భూటాన్ చాలా ఏళ్లు పర్యటకులకు పరిమిత అనుమతే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. అందుకు ఎంచుకున్న మార్గాల్లో.. కఠినమైన క్రీడలు ఒకటి. ఫిల్మ్‌మేకర్ అలెక్స్ బెస్కోబీ చెప్తున్న స్వీయ అనుభవమిది.

భూటాన్‌లో ఒక సెప్టెంబర్ చలి ఉదయం.. సమయం తెల్లవారుజామున రెండు గంటలు. కఠినబాటలో 268 కిలోమీటర్ల కష్టతర ప్రయాణం ముందుంది.

నాకు.. రాజధాని థింపూలోని ఫినిష్ లైన్‌కు మధ్య నాలుగు పర్వత మార్గాలున్నాయి. ఒక్కొక్కటి 10,000 అడుగులకు పైగా ఎత్తైనవి. మంచి శారీరక దారుఢ్యం, తట్టుకునే శక్తి గల ప్రపంచ స్థాయి అథ్లెట్లు వీటిని అధిగమించటానికి 11 గంటల కన్నా ఎక్కువ సమయం పట్టింది.

ఈ టూర్ ఆఫ్ ద డ్రాగన్ (టీఓడీ) నిర్వాహకులు చెప్పినట్లు.. నిజమైన ప్రమాదాలు ముందు పొంచివున్నాయి.

''ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'' అని ఈ టూర్ ఆఫ్ ద డ్రాగన్‌కు పేరు. ఒకవైపు కఠినమైన కొండ ప్రాంతాలు.. మార్గంలో ఎటునుంచైనా దాడిచేయగల అడవి పులులు, చిరుతలు, ఎలుగులు.. మరి ఇది అంత కఠోరమైన రేస్ కాకుండా ఎలా ఉంటుంది?

ఈ రేసులో మరో 47 మంది మాత్రమే పాల్గొన్నారు. వారిలో చాలా మంది నాలా కాదు. భూటాన్, ఇతర దేశాలకు చెందిన నిఖార్సయిన సైకిలింగ్ పోటీదారులు.

వాంగ్చుక్ నామ్గే

ఫొటో సోర్స్, ALEX BESCOBY

ఫొటో క్యాప్షన్, వాంగ్చుక్ నామ్గే ఇప్పటివరకూ ఇంత దూరం సైకిల్ తొక్కలేదు

'ఇది నా కల'

స్టార్ట్ లైన్ దగ్గర నా పక్కన ఉన్న యువకుడి పేరు వాంగ్చుక్ నామ్గే. వయసు జస్ట్ 17 ఏళ్లు. అందరిలోకీ చిన్నవాడు.

''ఈ రేసును పూర్తి చేయటం నా కల'' అని చెప్పాడు.

అతడు అంతకుముందెన్నడూ ఇంత దూరం సైకిల్ తొక్కలేదు. కానీ.. నెలల తరబడి తీసుకున్న శిక్షణతో అతడి నరాలు బలపడ్డాయి. వాటితో పాటే.. లక్షన్నర రూపాయల ప్రైజ్ మనీ గెలిచే అవకాశం కూడా.

నా పక్కన మరోవైపు ఉన్న వ్యక్తి రింజిన్ రోర్బు. అతడు చాలా పేరున్న భూటాన్ సైకిల్ రైడర్. నలబై ఆరేళ్ల నోర్బు.. ఎనిమిదోసారి ఈ రేస్‌లో పాల్గొంటున్నాడు.

''ఈ రేసులో పాల్గొంటూ ఎపుడైనా ఎవరైనా చనిపోయారా?'' అని అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనతో అడిగాను.

''నో. ఇప్పటివరకైతే లేదు'' అని అతడు చిన్నగా నవ్వుతూ చెప్పాడు. ''మా ప్రధానమంత్రికి దవడ విరిగింది. అయినా ఆయన రేసు పూర్తిచేశారు'' అన్నాడు.

రింజిన్ రోర్బుకి ఇది ఎనిమిదో టూర్ ఆఫ్ ద డ్రాగన్

ఫొటో సోర్స్, ALEX BESCOBY

ద ల్యాండ్ ఆఫ్ ద థండర్ డ్రాగన్ అని ముద్దు పేరు గల భూటాన్ ప్రజల గురించి తెలుసుకోవటం చాలా బాగుంది. ఇండియా - చైనాల మధ్య చిక్కుకుపోయినట్లుండే ఈ దేశంలో కేవలం 7,50,000 మంది జనాభా ఉన్నారు.

భూటాన్ యువరాజు జిగ్యెల్ ఉగ్యెన్ వాంగ్చుక్ కూడా మంచి సైకిలిస్టే. ఆయనే ఈ టూర్ ఆఫ్ ద డ్రాగన్‌ను 2010లో ప్రారంభించారు. ఫ్రెండ్స్ మధ్య పోటీగా. కానీ.. భూటాన్‌లో రాచ కుటుంబానికి ఎంత గౌరవం ఉందంటే.. ఈ పోటీ ఒక జాతీయ ఆటగా మారిపోయింది.

యువరాజు కూడా రేస్‌లో పాల్గొనటానికి సంసిద్ధమై వచ్చాడు. ముప్పై నాలుగేళ్ల జిగ్యెల్.. అందరి దగ్గరా ఆగుతూ వ్యక్తిగతంగా పలకరించాడు. వెన్నెముకలు నిటారుగా ఉంచి తలలు వంచారు.

''ప్రశాంతంగా ఉండండి.. క్షేమంగా ఉండండి'' అని ఆయన భరోసా కలిగించే గొంతుతో నాకు చెప్పారు.

సైకిల్ రేసులో ఊహించని అవరోధాలివి

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని నిమిషాలకు కాషాయ వస్త్రం ధరించిన బౌద్ధ సన్యాసులు ప్రార్థనలు చేశారు. రేసును ప్రారంభిస్తూ గన్ పేలింది. ఆకాశంలో రంగురంగుల కాగితం ముక్కలు మేఘంలా ఆవరించాయి.

సూర్యోదయానికి ముందు చీకటి అతి పెద్ద ప్రమాదం.

సూర్యుడు ఉదయించటానికి ముందటి మంచు తెర వెనుక పశువుల మంచుగడ్డల్లా ఉన్నాయి ఆవులు. నా సైకిల్ హ్యాండిల్‌కు ఉన్న చౌకబారు టార్చ్ వాటిని గుర్తించలేకపోయింది.

అవి కదలవు. భూటాన్‌లో అన్ని రకాల జంతు వధపై నిషేధం ఉన్నందువల్ల వచ్చిన నిర్భీతి వల్ల కావచ్చు. లేదంటే మా చుట్టూ యథేచ్ఛగా పెరుగుతున్న గంజాయి వల్ల కావచ్చు.

సైకిల్ రేసర్లను ఉత్సాహపరచటానికి చిన్నారులు బారులుతీరారు

ఫొటో సోర్స్, MELYN MCKAY

ఐదు గంటల తర్వాత ఎట్టకేలకు సూర్యుడు ఉదయించాడు. వస్తూనే కొత్త సమస్యలు తెచ్చాడు. ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోయింది. పల్చటి కొండ గాలిలో నా చర్మం ఎర్రగా మారిపోయింది.

ఐదు గంటల పాటు కొండ ఎక్కటానికి పడన శ్రమ దానికదే ఒక నరకప్రాయమైన యాతన. భూటాన్‌లో మొదటి రోడ్డును 1962లో వేశారు. అందులో చాలా భాగం ఇంకా నిర్మాణంలోనే ఉంది.

సైకిల్ గేర్లలో అతి తక్కువ గేరు మీద.. బెల్లపు పాకపు వంటి మడ్డిలో అంగుళం అంగుళం పాకుతూ ఒక్కో మైలు సాగుతున్నాను. అంతలోనే గాలి నీలంగా మారింది. నాకు కొత్త కొత్త తిట్లు వస్తున్నాయి.

అందరిలోకీ చిట్టచివరలో ఉన్నాను. ఎంతో బాధతో నెమ్మదిగా కదులుతున్నాను. నా వెనుక స్వీపర్ బస్సులోని డ్రైవర్.. నా కృషిని తన స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో లైవ్‌లో చూపిస్తూ తన బోర్‌ను పొగొట్టుకుంటున్నాడు.

అలెక్స్ బెస్కోబీ

ఫొటో సోర్స్, MELYN MCKAY

ఫొటో క్యాప్షన్, బెల్లపు పాకపు వంటి మడ్డిలో అంగుళం అంగుళం పాకుతూ ఒక్కో మైలు సాగానిలా

సంస్కృతి వర్సెస్ ఆదాయం

మొబైల్ ఫోన్లు భూటాన్‌లోకి 2003 లోనే.. టెలివిజన్ వచ్చిన నాలుగేళ్ల తర్వాత వచ్చాయి. కానీ ఇప్పుడవి ఈ దేశంలో నూరు శాతం చొచ్చుకుపోతున్నాయి.

దేశంలో విసిరేసినట్టుగా అక్కడక్కడా పల్చగా నివసించే జనాలు.. ఒకప్పుడు.. ప్రాణాంతకమైన పర్వత మార్గాల్లో వారాల తరబడి కాలి నడకన నడుచుకుంటూ వచ్చే వార్తాహరుల మీద ఆధారపడేవారు.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా భూటాన్ ప్రజలను ఎన్నడూ లేనంతగా అనుసంధానిస్తోంది. నా కష్టాలను సెకన్లలోనే దేశమంతా ప్రసారం చేస్తోంది.

భూటాన్‌లో రెక్కలొచ్చింది కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే కాదు.. పర్యాటక రంగం కూడా వేగంగా పెరుగుతోంది.

భూటాన్ సైకిల్ రేస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూటాన్‌లో ఇప్పుడు మొబైల్ ఫోన్లు వేగంగా విస్తరిస్తున్నాయి

ఈ దేశం చాలా కాలం పాటు పర్యాటకాన్ని ధనవంతులైన కొద్ది మందికి మాత్రమే పరిమితం చేసింది. తన సుందరమైన పర్యావరణాన్ని స్వతంత్ర సంస్కతిని సంరక్షించుకోవటానికి రోజు వారీ పద్ధతిలో భారీ వీసా ఫీజులు వసూలు చేసేది.

అయితే.. భారతదేశంతో చేసుకున్న భాగస్వామ్య ఒప్పందం కారణంగా.. గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు భూటాన్ సందర్శనకు వస్తున్నారు.

చాలా మంది తమ సొంత కార్లు, సరఫరాలు తెచ్చుకుంటారు. దేశవ్యాప్తంగా పుట్టుకొస్తూ పెరిగిపోతున్న తక్కువ బడ్జెట్ హోటళ్లలో స్వల్ప కాలం పాటు ఉండిపోతారు.

''స్థూల జాతీయానందం'' మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుందని పేరుపడ్డ భూటాన్ విశిష్ట చరిత్ర, సంస్కతి మీద పర్యటకుల ఆసక్తిని, వస్తున్న అదనపు ఆదాయాన్ని కొందరు ఆహ్వానిస్తుంటే.. ఈ దేశంలో చాలా అరుదుగా కనిపించే భేదాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వీటి మధ్య సరైన సంతులనం సాధించటం రాబోయే కొత్త ప్రభుత్వపు అజెండాలో ముఖ్యాంశమవుతుంది. భూటాన్ చరిత్రలోనే కేవలం మూడో ఎన్నికలు ఈ అక్టోబర్‌లో జరుగుతున్నాయి.

భూటాన్ సైకిల్ రేస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూటాన్ జాతీయ క్రీడ విలువిద్య

బహుశా.. ఆ సంతులనాన్ని కనుగొనటానికి ఈ సైక్లింగ్‌ ఒక మార్గం కావచ్చు. దీనిద్వారా.. అంతర్జాతీయ అథ్లెట్లను ఆకర్షించటంతో పాటు.. తన సంస్కృతి, పర్యావరణాల్లో ఉత్తమమైన వాటిని ప్రదర్శిస్తోంది.

భూటాన్ ప్రజలు సంప్రదాయంగా విలువిద్య అంటే ఎక్కువ మక్కువ చూపుతారని ప్రతీతి. అది ఈ దేశపు జాతీయ క్రీడ.

అయితే.. తమ దేశపు యువ అథ్లెట్లు సైక్లింగ్‌ను కూడా ఒక ప్రత్నామ్నాయ క్రీడగా ఎంచుకునే చూడాలని భూటాన్ ఒలింపిక్ కమిటీ (బీఓసీ) కాంక్షిస్తోంది.

ఈ టూర్ ఆఫ్ ద డ్రాగన్‌లో పాలుపంచుకోవటానికి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత సైకిలిస్టుల ద్వారా.. భవిష్యత్ భూటాన్ ప్రపంచ చాంపియన్‌కు స్ఫూర్తి లభించగలదని ఆ సంస్థ సెక్రటరీ జనరల్ సోనామ్ కర్మ త్సేరింగ్ నమ్ముతున్నారు. కఠినమైన భూటాన్ భౌగోళిక ప్రాంతం ఉన్నతస్థాయి సైకిలింగ్‌కు నికార్సయిన పట్టుగొమ్మ అవుతుందని ఆయన భావిస్తున్నారు.

సైక్లింగ్‌ మీద రాచ కుటుంబానికి గల మక్కువ కూడా సాయపడింది.

భూటాన్ ప్రజలు ఎంతగానో ఇష్టపడే రాజు పదవీవిరమణ తర్వాత సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన థింపూ పరిసరాల్లోని కొండల్లో తన సంప్రదాయ దుస్తుల్లో సైక్లింగ్ చేస్తూ తరచుగా కనిపిస్తుంటారు.

భూటాన్ సైకిల్ రేస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజధాని థింపూ నగరానికి పర్యాటకుల రాక పెరిగింది

తిరిగి ఈ నిర్దాక్షిణ్యమైన పర్వతాల దగ్గరికి వస్తే.. ఫినిష్ లైన్ దిశగా నా సైకిల్ నెమ్మదిగా సాగుతోంది.

చివరికి.. 14 గంటలకు పైగా ఆత్మక్షోభిత, అద్భుత స్ఫూర్తివంతమైన కష్టం తర్వాత నేను 200 కిలోమీటర్ల దగ్గర కాళ్లెత్తేశాను. ఇంత దూరం వరకూ రాగలగటం నన్ను.. ఆన్‌లైన్‌లో పెరుగుతున్న నా ఫాలోయర్లను కూడా చాలా ఆశ్చర్యపరిచింది.

''చిట్టచివరి మనిషి...'' అంటూ.. కొద్ది రోజుల తర్వాత నేను భూటాన్ ఒలింపిక్ కమిటీ కార్యాలయానికి వెళ్లినపుడు.. త్సేరింగ్ హాస్యమాడారు. ఈ రేసు గురించి ఆయన లక్ష్యం గురించి మాట్లాడటానికి వెళ్లాను నేను.

''ఇది భూటాన్ 'టూర్ డి ఫ్రాన్స్' అవ్వొచ్చు'' అన్నది ఆయన చెప్పిన మాట.

నావరకూ ఈ రేసు ముగిసినా.. వచ్చే సంవత్సరం జరిగే పదో టూర్ ఆఫ్ ద డ్రాగన్ రేసుకి మరింత ఎక్కువ మంది సైకిల్ రైడర్లను ఆకర్షిస్తుందని బీఓసీ ఆశిస్తోంది. కానీ దానికో పరిమితి ఉంది అని త్సేరింగ్ ఉద్ఘాటించారు.

''మా ఆత్మను అమ్మకానికి పెట్టకుండా ప్రపంచ స్థాయి రేస్ జరపాలన్నది మా ఆకాంక్ష'' అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, హిమాలయన్ వయాగ్ర: కిలో రూ.70 లక్షలు మాత్రమే

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)