GROUND REPORT- రోహింజ్యా సంక్షోభం: 'మమ్మల్ని ఇక్కడే చంపేయండి... మయన్మార్‌కు మాత్రం తిప్పి పంపకండి'

మరీనా బేగం
    • రచయిత, కీర్తి దూబే, బీబీసీ ప్రతినిధి
    • హోదా, దిల్లీ రోహింజ్యా శరణార్థి శిబిరం నుంచి

''మేం అక్కడికి వెళ్లగానే మమ్మల్ని మళ్లీ రేప్ చేస్తారు. మంటల్లో తగలబెడతారు. మా పిల్నల్ని ముక్కలుగా నరికేస్తారు. మా అత్తగారింట్లో 10-15 మంది ఉండేవారు. అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఎవరినీ ప్రాణాలతో వదలలేదు. మమ్మల్ని మళ్లీ అక్కడికి పంపిస్తున్నారు. ముస్లింలమైనంత మాత్రాన మేం మనుషులం కాదా?''

మనీరా బేగం కన్నీళ్లతో చెప్పిన మాటలివి. హిజాబ్‌తో తన కన్నీళ్లు తుడుచుకుంటూ తమాయించుకుంది.

దిల్లీ లోని కాళింది కుంజ్‌లోని రోహింజ్యా శరణార్థి శిబిరంలో నివసిస్తున్న మనీరా భర్త 15 రోజుల కిందట చనిపోయాడు.

ఆ వేదన నుంచి కోలుకోకముందే తనను మయన్మార్ తిరిగి పంపిస్తారన్న భయం ఆమెను ఆవరించింది.

వీడియో క్యాప్షన్, రెండు వారాల వ్యవధిలో ఇద్దరు రోహింజ్యా శరణార్థుల నేతల హత్య, శరణార్థుల్లో పరిస్థితి ఏంటి ?

ఓ పత్రం తెచ్చిపెట్టిన భయం...

రోహింజ్యా కేసులో జోక్యం చేసుకోవటానికి భారత సుప్రీంకోర్టు అక్టోబర్ 4వ తేదీన తిరస్కరించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏడుగురు రోహింజ్యా ముస్లింలను మయన్మార్ తిప్పి పంపించింది.

ఆ ఏడుగురు వ్యక్తులనూ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు గాను 2012లో విదేశీయుల చట్టం కింద అరెస్ట్ చేశారు.

వారిని గత ఆరేళ్లుగా అసోం లోని సిల్చార్ సెంట్రల్ జైలులో నిర్బంధించారు. ఈ ఘటన తర్వాత భారతదేశంలో నివసిస్తున్న దాదాపు 40,000 మంది రోహింజ్యాలలో తమను తిరిగి మయన్మార్ పంపించేస్తారన్న భయం విస్తరించింది.

దిల్లీలోని వేర్వేరు కాలనీలలో నివసిస్తున్న రోహింజ్యా ముస్లింలు.. తమను భారతదేశం నుంచి ఏ క్షణంలోనైనా బహిష్కరించవచ్చని భయపడుతున్నారు.

మరోవైపు, దిల్లీ పోలీసులు ఈ శరణార్థులకు ఒక ఫామ్ (ధ్రువీకరణ పత్రం వంటిది) ఇస్తున్నారు. దీంతో వీరి భయం ఇంకా పెరుగుతోంది. ఆ ఫామ్ పూర్తిచేసి ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని రోహింజ్యాలు చెప్పారు.

దిల్లీ రోహింజ్యా శరణార్థి శిబిరం

ఫొటో సోర్స్, BBC / PRITAM

ఫొటో క్యాప్షన్, మయన్మార్ తిప్పి పంపించేస్తారని దిల్లీలోని శరణార్థి శిబిరంలోని రోహింజ్యాలు భయపడుతున్నారు

ఈ పత్రం ఆధారంగా సేకరించిన సమాచారంతో తమను మయన్మార్ తిప్పి పంపించాలని ప్రభుత్వం భావిస్తోందని వీరు అనుకుంటున్నారు.

ఈ పత్రం బర్మీస్, ఇంగ్లిష్ భాషల్లో ఉంది. బర్మీస్ భాష వల్ల.. ఈ జనంలో భయం మరింతగా పెరిగింది. ఈ పత్రం మయన్మార్ రాయబార కార్యాలయం సరఫరా చేస్తోందని వీరు అంటున్నారు.

అటువంటి ఫామ్ గురించి మాట్లాడటానికి జామియా నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) సంజీవ్ కుమార్ నిరాకరించారు.

ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మాత్రం ఫోన్‌లో మాట్లాడుతూ, ''మాకు పై నుంచి ఆదేశాలు వచ్చాయి'' అని చెప్పారు.

''వాళ్లు భారతీయులు కాదు. వాళ్లు బయటివారు. ఈ పరిస్థితిలో వారి గురించి పూర్తి సమాచారం మేం తెలుసుకుంటాం'' అని ఆగ్నేయ దిల్లీ డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ పేర్కొన్నారు.

దిల్లీ లోని కాళింది కుంజ్‌లో 235 మంది, శ్రమ్ విహార్ ప్రాంతంలో 359 మంది రోహింజ్యా శరణార్థులు నివసిస్తున్నారు.

దిల్లీ పోలీసులు వారికి ఇచ్చిన పత్రాల్లో.. వారి వ్యక్తిగత వివరాలు, మయన్మార్‌లో వారికి సంబంధించిన సమాచారాన్ని అడిగారు.

మయన్మార్‌లో వారి గ్రామం ఏది, వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారి తల్లిదండ్రుల వృత్తి ఏమిటి? వారి పౌరసత్వం ఏమిటి... వంటి వివరాలు నింపాల్సి ఉంది.

మరీనా బేగం భర్త 15 రోజుల కిందట చనిపోయాడు

ఫొటో సోర్స్, BBC / PRITAM

ఫొటో క్యాప్షన్, మరీనా బేగం భర్త 15 రోజుల కిందట చనిపోయాడు

'ఆ ఫామ్ నింపకపోయినా.. వెళ్లక తప్పదు'

మరీనా తన నాలుగేళ్ల కొడుకుని చూస్తూ, ''ఆ దేశానికి తిరిగి వెళ్తే మేం మా పిల్లలకు చదువు చెప్పించలేం. బతుకుతెరువు చూసుకోలేం. కనీసం మా బతుకులు కూడా మేం బతకలేం. నా భర్త 15 రోజుల కిందట చనిపోయాడు. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నా తల్లిదండ్రులను చంపేశారు. మేం ఎలాగో ప్రాణాలతో బయటపడి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని మళ్లీ అక్కడికి పంపిస్తున్నారు. మాకు భయంగా ఉంది. మేం వెళ్లం'' అని చెప్పారు.

పోలీసులు ఇచ్చిన పత్రాన్ని నింపాలన్న అంశం గురించి ఆమె మాట్లాడుతూ, ''కొద్ది రోజులుగా పరిస్థితులు దిగజారుతున్నాయి. పోలీసులు ఒక పత్రం ఇచ్చారు. దానిని నింపాలని వారు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. అది మమ్మల్ని వెనక్కి పంపించటానికి ఉద్దేశించిన పత్రమని మా కాలనీకి 'బాధ్యుడైన' వ్యక్తి (ప్రతి శిబిరంలో న్యాయ సంబంధిత వ్యవహారాలను చూసే వ్యక్తి) చెప్తున్నారు. ఈ ఫామ్ నేను నింపాల్సిన అవసరం లేదు. 'నువ్వు దీనిని నింపకపోయినా.. తిరిగి వెళ్లాల్సిందే' అని పోలీసులు అంటున్నారు'' అని వివరించారు.

''నిన్న కూడా ఒక పోలీసు వచ్చారు. మా ఇంటిని 2012లో కూల్చేశారు. ఇప్పుడు నేను అక్కడ ఏం చేయాలి? అక్కడ మాకు మిగిలింది ఏమీ లేదు. ఆ పత్రంలో ఏం రాసి ఉందనేది పోలీసులు స్పష్టంగా చెప్పలేదు. ఆ పత్రం అవసరమని... కాబట్టి నింపాలని నాకు చెప్పారు. దీంతో నేను వారం రోజుల కిందట ఆ పత్రం నింపి ఇచ్చాను. అది పోలీసులకు తిరిగి చేరలేదని నాకు ఇప్పుడు తెలిసింది'' అని ఆమె పేర్కొన్నారు.

మరీనా తల్లి హలీమా ఖాటూన్ కూడా ఇదే శిబిరంలో నివసిస్తున్నారు. ఆమె హిందీ మాట్లాడలేరు. కానీ ముడుతలు పడిన ఆమె ముఖంలో విచారం గూడుకట్టుకుంది.

''నేను వెళ్లను. ఇంతకుముందు కూడా బంగ్లాదేశ్ తిరిగి మయన్మార్‌కు అప్పగించిన జనాన్ని చంపేశారు. మేం వెనక్కు వెళ్లం. భారత ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడే చంపేయటం నయం. కానీ మేం ఆ దేశానికి తిరిగి వెళ్లబోం'' అని ఆమె అన్నారు.

మరీనా తల్లి హలీమా ఖాటూన్

ఫొటో సోర్స్, BBC / PRITAM

'... ఆ రోజు వస్తే మాకు మేమే తిరిగివెళ్తాం'

దిల్లీలోని శ్రమ్ విహార్ శరణార్థి శిబిరానికి పోలీసులు మంగళవారం వచ్చారు. ఆ పత్రాన్ని గురువారం సాయంత్రానికల్లా నింపి ఇవ్వాలని అందులోని వారికి చెప్పారు.

అక్కడ నివసిస్తున్న మొహమ్మద్ తాహిర్ తిరిగి మయన్మార్ వెళ్లటం గురించి ఎంతగా భయపడుతున్నాడంటే, అతడు ఒంటరిగా కూర్చుని తనతో తానే భయం భయంగా మాట్లాడుకుంటున్నాడు.

రాత్రి భోజనం వండుకోవటానికి చేపలు శుభ్రం చేసుకుంటున్నాడు తాహిర్. అకస్మాత్తుగా, ''మేం అక్కడికి ఎందుకు వెళ్లాలి? మేం ఆ ప్రాంతపు పౌరులం కాకపోతే ఎందుకు తిరిగివెళ్లాలి? అణచివేతను ఎలా భరించాలి?'' అంటూ గొణగటం మొదలుపెట్టారు.

''పోలీసులు వచ్చారు. ఆ ఫత్రం నింపాలని చెప్పారు. మేం తిరిగి వెళ్లాలనుకోవటం లేదు. అయినా.. మా బూథిడాంగ్ గ్రామంలో ఊచకోత జరిగింది. మా ఇంటి ఆడవాళ్లను వాళ్లు తీసుకెళ్లిపోయి అత్యాచారం చేశారు. దానిని మేం ఎలా భరించగలం? మేం మా ప్రాణాలను దక్కించుకుంటూ రావాల్సి వచ్చింది. మా అంకుల్ అక్కడే నివసిస్తున్నారు. వారిని ఇంటి నుంచి బయటకు రానీయటం లేదని, మార్కెట్‌కు కూడా వెళ్లనీయటం లేదని ఆయన చెబుతున్నారు'' అని అతడు వచ్చీ రాని హిందీలో చెప్పాడు.

మొహమ్మద్ తాహిర్ ప్రస్తుతం దిల్లీలోని శరణార్థి శిబిరంలో ఉన్నాడు

ఫొటో సోర్స్, BBC / PRITAM

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ తాహిర్ ప్రస్తుతం దిల్లీలోని శరణార్థి శిబిరంలో ఉన్నాడు

''పోలీసులు రాత్రీ పగలూ ఇక్కడికి వస్తున్నారు. ఆ పత్రం నింపాలని చెప్తున్నారు. మేం దానిని నింపితే మమ్మల్ని వెనక్కి పంపిస్తారు. 'తిరిగి వెళ్లాలని అతడే స్వయంగా కోరుకుంటున్నాడ'ని వాళ్లు చెప్తారు. మయన్మార్‌లో మా ప్రాణాలకు భద్రత ఉన్న రోజున.. మాకు మేముగా వెళతాం. మమ్మల్ని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అయినా.. మేం భారతదేశ పౌరులం కాదు. మాకు ఆధార్ కార్డూ లేదు. ఐక్యరాజ్యసమితి అందించిన శరణార్థి కార్డు ప్రాతిపదికగా మేం ఇక్కడ ఉన్నాం'' అని అతడు చెప్పాడు.

ఈ శిబిరానికి సంబంధించిన చట్టపరమైన పనులన్నీ మొహమ్మద్ ఉస్మాన్ చూస్తాడు. శరణార్థుల భాషలో చెప్తే.. అతడు ఈ శిబిరానికి 'బాధ్యుడు'.

''మాకు గత నెలలో కూడా ఒక పత్రం ఇచ్చారు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఆ పత్రాన్ని నింపాలి. ఆ తర్వాత మా శరణార్థి కార్డును కాపీ తీసుకున్నారు. మయన్మార్‌కు సంబంధించిన మా వివరాలన్నిటినీ దానిపై రాయాలన్నారు. మా ఊరు, మా కుటుంబ సభ్యులు, మేం ఇండియాకు ఎలా వచ్చాం అనే వివరాలు రాయమన్నారు'' అని ఆయన తెలిపారు.

దిల్లీలోని శరణార్థి శిబిరాల్లో పంపిణీ చేసిన పత్రాలు
ఫొటో క్యాప్షన్, దిల్లీలోని శరణార్థి శిబిరాల్లో పంపిణీ చేసిన పత్రాలు

''అక్టోబర్ 7వ తేదీన ఆ పోలీస్ అధికారి మళ్లీ ఆ పత్రం తీసుకుని వచ్చారు. మేం ఈ పత్రాలు నింపిన తర్వాత మమ్మల్ని కూడా వెనక్కు పంపిస్తారని, 4వ తేదీన మయన్మార్‌కు తిప్పి పంపించిన ఏడుగురు వ్యక్తుల్లో.. మొహమ్మద్ యూనస్, మొహమ్మద్ సలీంలు మాకు చెప్పారు. మేం ఈ సమాచారం ఇవ్వాలనుకోవటం లేదు. ఈ పత్రం బర్మీస్ భాషలో ఉంది. అది అనుమానాలను బలపరుస్తోంది. కానీ ఈ పత్రాన్ని నింపాలని పోలీసులు మాపై ఒత్తిడి తెస్తున్నారు'' అని పేర్కొన్నారు.

ఏ అంతర్యుద్ధమైనా, సంక్షోభమైనా అతి పెద్ద బాధితులు మహిళలే. మెర్దీనా అటువంటి ఓ మహిళ. ఈ శిబిరంలో ఒక చిన్న చీకటి గదిలో ఆమె నివసిస్తోంది.

ఈ ఇంట్లో కేవలం ఒక చాప ఉంది. బయట ఒక మట్టి పొయ్యి ఉంది.

మట్టి గోడల మీద ఒక గోనెసంచి పైకప్పుగా కప్పిన గది అది. ఆ గోనె సంచి గాలికి ఎగురుతోంది. కానీ మెర్దీనాకు ఇప్పుడిదే ఆమె ఇల్లు.

మెర్దీనా

ఆమె ఒడిలో నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. ''మా ఊరి ఆడపిల్లలను నా కళ్లముందే రేప్ చేశారు. నా తల్లిదండ్రులను ముక్కలుగా నరికేశారు. నేను ఒంటరిగా అక్కడి నుంచి తప్పించుకోగలిగాను. మా పొరుగువాళ్లతో కలిసి ఇక్కడికి వచ్చాను. మా దేశంలో మమ్మల్ని హింసిస్తున్నారు. మేం బయటపడిన మురికి కూపంలోకి మమ్మల్ని మళ్లీ పంపిస్తున్నారు. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ కొడుకు ఉన్నాడు. ఆ దుర్మార్గపు ప్రపంచానికి నేను తిరిగి వెళ్లలేను'' అని ఆమె చెప్పింది.

దిల్లీలో ఉండగా తాను ప్రశాంతంగా జీవించగలనని ఆమె నమ్ముతున్నారు. ఆమె కొడుకును ఆమె నుంచి ఎవరూ లాగేసుకోరు.

శరణార్థి శిబిరంలో ఓ బాలుడు

ఫొటో సోర్స్, BBC / PRITAM

గుర్తింపు కోసం ఆరాటం...

మయన్మార్‌కు తిప్పి పంపిన ఏడుగురు శరణార్థులనూ ఇప్పటివరకూ పౌరులుగా గుర్తించలేదని ఈ శరణార్థులు చెప్తున్నారు.

రాయబార కార్యాలయం ఒక గుర్తింపు కార్డును జారీ చేసింది. వారు మయన్మార్‌లో నివసించేవారని అందులో పరిగణించారు కానీ.. వారికి పౌరసత్వ హోదా ఇవ్వలేదు.

మరోవైపు, భారతదేశంలో నివసిస్తున్న రోహింజ్యా ముస్లింలు శరణార్థులు కారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సెప్టెంబర్‌లో ఒక ప్రకటన పేర్కొన్నారు. ''వాళ్లు నిబంధనల ప్రకారం ఆశ్రయం పొందలేదు. మానవ హక్కుల గురించి మాట్లాడే ముందు దేశ భద్రత చాలా ముఖ్యమైనది'' అని చెప్పారు. ఈ ప్రకటన రోహింజ్యా ముస్లింలలో భయాన్ని ఇంకా పెంచింది.

దిల్లీలో నివసిస్తున్న రోహింజ్యా ముస్లింలు మయన్మార్ తిరిగి వెళ్లటానికి నిరాకరించటం లేదు. కానీ, పౌరులుగా తమ గుర్తింపును నిర్థరించాల్సిన అవసరముందని వారు అంటున్నారు. తమ గుర్తింపు ఐక్యరాజ్యసమితి శరణార్థి పత్రం ప్రకారం కాకుండా ఒక దేశపు పౌరులుగా గుర్తింపు కావాలని వారు కోరుకుంటున్నారు.

వీడియో క్యాప్షన్, మారని రోహింజ్యాల దీన గాథ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)