మియన్మార్ సైన్యం ‘మారణహోమం’పై విచారణ: ఐరాస

ఫొటో సోర్స్, Reuters
మియన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో మారణహోమం, ఇతర ప్రాంతాల్లో సాగించిన అమానుషకాండపై ఆ దేశానికి చెందిన మిలటరీ అధికారులను విచారించాలని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది.
అంతే కాకుండా.. మియన్మార్ ప్రభుత్వాధినేత ఆంగ్ సాన్ సూచీ ఈ హింసాకాండను నిలువరించడంలో విఫలమయ్యారంటూ నివేదిక తీవ్రంగా విమర్శించింది.
వందలాది మందితో మాట్లాడి రూపొందించిన ఈ నివేదిక.. సైన్యంలోని ఆరుగురు సీనియర్ మిలటరీ అధికారులను విచారించాలని అభిప్రాయపడింది.
మిలటరీ ఒక పద్ధతి ప్రకారం రోహింజ్యాలను నిర్మూలించే ప్రయత్నం చేసిందని , హింసాకాండకు సంబంధించిన కేసులను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు అప్పగించాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
హత్యలు, మహిళలపై సామూహిక అత్యాచారాలు, పిల్లలలపై దాడులు, గ్రామాలకు గ్రామాలను తగలబెట్టడం లాంటి చర్యలను మిలటరీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించుకోజాలదని నివేదిక పేర్కొంది.

నివేదికలో ఇంకా ఏం ఉంది?
మియన్మార్‌లో, ముఖ్యంగా రఖైన్ రాష్ట్రంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై మార్చి 2017లో ఐక్యరాజ్య సమితి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.
రఖైన్ రాష్ట్రంలో రోహింజ్యా మిలిటెంట్ల దాడుల అనంతరం మయన్మార్ మిలటరీ పెద్ద ఎత్తున జాతినిర్మూలన కార్యక్రమాలకు పాల్పడింది.
అనంతరం జరిగిన హింసలో సుమారు 7 లక్షల మంది రోహింజ్యాలు మియన్మార్‌ను వదిలి పారిపోయారు.
ఆ సందర్భంగా రోహింజ్యాలపై ఒక పద్ధతి ప్రకారం హింసాకాండకు పాల్పడ్డారని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవి అత్యంత తీవ్రమైన నేరాలని ఐక్యరాజ్యసమితి నివేదిక అభిశంసించింది.
ప్రత్యక్ష సాక్షులు, ఉపగ్రహ చిత్రాలు, ఫొటోలు, వీడియోల ఆధారంగా ఈ నివేదికను వెలువరించారు.

ఫొటో సోర్స్, Reuters
ఎవరెవరిపై ఆరోపణలు చేశారు?
అనేక మంది సైనికాధికారులతో పాటు కమాండర్ ఇన్ చీఫ్ మిన్ ఆంగ్ హ్లయింగ్, ఆయన డిప్యూటీలదే దీనికి ప్రధాన బాధ్యత అని ఐక్యరాజ్యసమితి నివేదిక ఆరోపించింది.
అత్యాచారాలను చూసీచూడనట్లు వదిలేయడం ద్వారా ప్రభుత్వ అధికారులూ నేరాలకు సహకరించారని తెలిపింది.
ఆంగ్ సాన్ సూచీ కూడా ప్రభుత్వ అధినేతగా తన అధికారాన్ని సక్రమంగా ఉపయోగించి హింసాకాండను అరికట్టడంలో విఫలమయ్యారని నివేదిక విమర్శించింది.
మిలటరీ జరిపిన నేరాలపై సెప్టెంబర్ 18న ఐక్యరాజ్య సమితి సమగ్ర నివేదికను విడుదల చేయనుంది.
ఇవికూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








