‘హెరాయిన్ ప్యాకెట్లను ఎప్పుడు, ఎక్కడ పడేలా విసరాలో వారికి బాగా తెలుసు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరవింద్ చాబ్డా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని ధనోవా కలాన్ గ్రామం. ఆ గ్రామం భారత-పాకిస్తాన్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. సరిహద్దుల్లో నిత్యం పహారా ఉంటుంది. కానీ, అక్కడ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ మాత్రం నిరాటంకంగా సాగిపోతుంది.
ఇటీవలే ఆ ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పంజాబ్ పోలీసుల గస్తీ కూడా పెరిగింది. పోలీసులు, బీఎస్‌ఎఫ్ సిబ్బంది మఫ్టీలో కూడా తిరుగుతుంటారు.
అంతేకాదు, రెండు దేశాల సరిహద్దుల మధ్య విద్యుత్ కంచె ఉంది. రాత్రివేళల్లో దీంట్లో కరెంట్ ప్రవహిస్తుంటుంది.
ఇక్కడున్న ధనోవా గ్రామంలో సుమారు 1400 మంది ఓటర్లున్నారు. వీరిలో చాలా మందికి కంచెకు అటూఇటూ కూడా భూములున్నాయి. పొలం పనుల కోసం సరిహద్దులు దాటే ఈ గ్రామస్థులను పూర్తిగా తనిఖీ చేశాకే వెళ్లనిస్తారు.
గత ఏడాది ఈ గ్రామానికి చెందిన బక్షీస్ సింగ్ పాకిస్తాన్ వైపు ఉన్న తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లినపుడు జరిగిన సంఘటనను మాజీ సర్పంచ్ సుఖదేవ్ సింగ్ ఇలా వివరించారు - ''బక్షీస్ సింగ్‌కు తెల్లని పౌడర్ ఉన్న కొన్ని ప్యాకెట్లు దొరికాయి. వాటి గురించి అతను బీఎస్‌ఎఫ్‌కు చెప్పాడు. దీంతో వాళ్లు వచ్చి ఆ హెరాయిన్ ప్యాకెట్లను, బక్షీస్ సింగ్‌ను కూడా తీసుకెళ్లిపోయారు.''
మొత్తం గ్రామమంతా కదలివెళ్తే కానీ బీఎస్‌ఎఫ్ సిబ్బంది ఆయన్ను వదిలిపెట్టలేదు.
అలాంటి ప్యాకెట్లు తరచుగా తమ పొలాల్లో కనిపిస్తుంటాయని, వాటిని ఎవరు పడేస్తారో తమకు తెలీదని సుఖదేవ్ సింగ్ తెలిపారు.

సరిహద్దుల్లో ఇలా ప్యాకెట్ల ద్వారా హెరాయిన్ స్మగ్లింగ్ జరగడం సర్వసాధారణమని బీఎస్‌ఎఫ్, నిఘా అధికారులు చెబుతారు.
అమృత్‌సర్, తార్న్‌తరన్ జిల్లాలకు చెందిన కొందరు రైతులు ఇలా తరచుగా తమ పొలాల్లో మాదకద్రవ్యాల ప్యాకెట్లు పడుతుంటాయని తెలిపారు. ''ఎక్కడ, ఏ సమయంలో హెరాయిన్ ప్యాకెట్లను విసరాలో స్మగ్లింగ్ చేసే వాళ్లకు కచ్చితంగా తెలుస్తుంది'' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని రైతు ఒకరు బీబీసీకి తెలిపారు.
ఎవరి కమీషన్ వాళ్లకు..
ఒక్కోసారి రైతులు, కూలీలు కూడా ఈ స్మగ్లింగ్‌లో పాలు పంచుకుంటారు. హెరాయిన్ ప్యాకెట్లు భారత భూభాగంలో పడగానే వాటిని వాళ్లు తమ ఇంటికి తీసుకెళతారు. కొరియర్లు లేదా 'పాంథీలు' వాళ్ల ఇంటికి వచ్చి ఈ ప్యాకెట్లు తీసుకెళ్తారని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు.
వీరు ఆ ప్యాకెట్లను రైతుల ఇంటి నుంచి తీసుకెళ్లి దగ్గర్లో ఉన్న పట్టణాల్లో ఉన్న ఇతర కొరియర్లకు అందిస్తారు. అక్కడి నుంచి అవి మాదకద్రవ్యాలను విక్రయించే వ్యాపారుల వద్దకు, అక్కడి నుంచి కస్టమర్లకు చేరతాయి.
''ఈ దందాలో పాలు పంచుకునేవారందరికీ ఎవరి కమీషన్ వాళ్లకు అందుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారన్నది మాత్రం ఎవరికీ తెలీదు. అందుకే వాళ్లను పట్టుకోవడం అంత సులభం కాదు'' అని సరిహద్దుల్లో పని చేసే ఒక ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు.
భారత్‌లోకి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడానికి అనేక రకాల పద్ధతులను ఆశ్రయిస్తున్నారు.
''స్మగ్లర్లు భూమి కింద సొరంగాలు తవ్వుతారు. ఫెన్సింగ్ కింద పైపులు చొప్పించి వాటిద్వారా స్మగ్లింగ్ చేస్తారు. కొన్నిసార్లు ఫెన్సింగ్ పైనుంచే వాటిని విసురుతారు'' అని కేంద్ర మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌదరి 2016లోమాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌పై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

95 శాతం హెరాయిన్.. 5 శాతం ఆయుధాల స్మగ్లింగ్
పాకిస్తాన్‌తో పంజాబ్ రాష్ట్రానికి 553 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది. ఈ సరిహద్దుకు మొదటి అంచెలో బీఎస్ఎఫ్ బలగాలు రక్షణగా ఉంటాయి. ఆ తర్వాత రెండో అంచెలో పంజాబ్ పోలీసులు ఉంటారు.
ఈ సరిహద్దు పొడవునా కంచె ఉంటుంది. సుమారు 20 బెటాలియన్ల బీఎస్‌ఎఫ్ బలగాలు నిరంతరం సరిహద్దుల్లో నైట్ విజన్ డివైజెస్, ఇతర అత్యాధునిక గ్యాడ్జెట్లతో పహారా కాస్తుంటాయి.
సరిహద్దుల్లోని ఫెన్సింగ్ పొడవునా ఫ్లడ్ లైట్లు వెలుగుతుంటాయి. అయితే కాలువలు, పొగమంచు, పొదలు లాంటి వాటిని ఆసరాగా చేసుకుని స్మగ్లింగ్ జరుగుతోందని బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు.
సరిహద్దుల్లో 95 శాతం హెరాయిన్ స్మగ్లింగ్, 5 శాతం ఆయుధాల స్మగ్లింగ్ జరుగుతోంది.
ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడడం ఎక్కువైంది. 2016లో 230 కిలోల హెరాయిన్ పట్టుబడగా, గత ఏడాది అది 279 కిలోలకు పెరిగింది. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లోనే సుమారు 164 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, iStock
మాదక ద్రవ్యాలు ఎలా వస్తున్నాయి?
''పంజాబ్‌లో హెరాయిన్ ఉత్పత్తి కావడం లేదు. అది సరిహద్దులకు ఆవల నుంచి వస్తోంది. అయితే ఇప్పుడు కొంత వరకు దానిని నియంత్రించగలిగాం'' అని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బ్రామ్ మోహింద్ర తెలిపారు.
హెరాయిన్ చాలా వరకు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్.. అక్కడి నుంచి మన దేశానికి వస్తోందని బోర్డర్ జోన్ ఐజీ రాజేశ్ కుమార్ జైస్వాల్ తెలిపారు.
''ఒకవేళ పంజాబ్ సరిహద్దులో నిఘా ఎక్కువ పెడితే వాళ్లు రాజస్థాన్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తారు. అక్కడ ఒత్తిడి పెరిగితే మరో చోటికి.. ఇలా సాగుతుంది వాళ్ల దందా'' అని వివరించారు జైస్వాల్.
జలంధర్ జోన్ ఐజీ ప్రమోద్ బన్ మాట్లాడుతూ.. స్మగ్లర్ల వ్యూహం తరచుగా మారుతుంటుందని, వాళ్లు ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండరని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటి దొంగలు
అయితే సరిహద్దుల్లో పని చేసే సిబ్బంది హస్తం కూడా ఈ స్మగ్లింగ్‌లో ఉందని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
2016లో కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజిజు 2016 జూన్‌లో రాజ్యసభలో మాట్లాడుతూ.. 2014 నుంచి ఈ మాదక ద్రవ్యాల వ్యవహారంలో 68 మంది బీఎస్‌ఎఫ్, పంజాబ్ హోమ్‌గార్డ్స్, పంజాబ్ పోలీసులు, రైల్వే రక్షక దళం, చండీగఢ్ పోలీసులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ఆగాలంటే ముందు వీరిని నియంత్రించడం ప్రభుత్వం ముందున్న పెనుసవాలు.
ఇవికూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








