సౌదీ మాపై యుద్ధం ప్రకటించింది: హిజ్‌బుల్లా

ఫొటో సోర్స్, AFP
సౌదీ అరేబియా లెబనాన్‌పై యుద్ధం ప్రకటించిందని హిజ్‌బుల్లా నేత హసన్ నజ్రల్లా ఆరోపించారు. దీంతో లెబనాన్‌లో ఉద్రిక్తత మొదలైంది. లెబనాన్ ప్రధాని సాద్ అల్-హరిరి తన పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రధాని సాద్ అల్-హరిరి చేత సౌదీ బలవంతంగా రాజీనామా చేయించిందని, ఇజ్రాయెల్‌ను లెబనాన్‌కు వ్యతిరేకంగా పురిగొల్పుతోందని హిజ్‌బుల్లా నేత హసన్ ఆరోపించారు.
శనివారం హరిరి మీడియాతో మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని అందుకే రాజీనామా చేశానని అన్నారు. అయితే ఎవరి వల్ల తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. హిజ్‌బుల్లా, ఇరాన్ లపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
అల్-హరిరిని సౌదీలో గృహనిర్బంధంలో ఉంచి, సౌదీ ప్రభుత్వం తనకు అనుకూలంగా పావులు కదుపుతోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్-హరిరి వెంటనే లెబనాన్‌కు తిరిగి రావాలని అధ్యక్షుడు మిషెల్ ఓవన్, ఇతర రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అల్-హరిరి రాజీనామాను అధ్యక్షుడు మిషెల్ ఇంకా ఆమోదించలేదు. రాజీనామా తర్వాత అల్-హరిరి ఇంతవరకూ ఏ బహిరంగ ప్రకటనా చేయలేదు.

ఫొటో సోర్స్, Reuters
హిజ్‌బుల్లా నేత ఏమన్నాడు?
లెబనాన్‌లో అంతర్యుద్ధం జరిగేలా సౌదీ ప్రభుత్వం పావులు కదుపుతోందని హసన్ నజ్రల్లా అన్నారు. ఈ పరిణామాలపై హసన్ ఓ వీడియో టేపును విడుదల చేశారు.
''సౌదీ అధికారులు లెబనాన్‌తో పాటుగా లెబనాన్‌లోని హిజ్‌బుల్లా మీద కూడా యుద్ధం ప్రకటించింది. హిజ్‌బుల్లా మీద యుద్ధం అంటే లెబనాన్‌పై యుద్ధం చేయడమే..'' లెబనాన్‌పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యానికి సౌదీ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టచెబుతోందని ఆయన ఆరోపించారు.
అల్-హరిరి రాజీనామా వెనుక సౌదీ హస్తం ఉందని, లెబనాన్‌పై కొత్త నాయకత్వాన్ని ఆపాదించేందుకు సౌదీ ప్రయత్నిస్తోందన్నారు.
హసన్ నజ్రల్లా తీరు ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఆయన మాటల వేడి పొరుగు దేశాలకూ విస్తరిస్తుందని బీబీసీ మధ్యప్రాశ్చ్య దేశాల ఎడిటర్ సెబాస్టియన్ ఉషర్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి?
సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న విభేదాల్లో లెబనాన్ చిక్కుకుంటోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అల్-హరిరి రాజీనామా ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది.
ఇరాన్ సౌదీ దేశాల మధ్య విభేదాలకు లెబనాన్‌ను పావుగా వాడుకోవద్దని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్‌సన్ హెచ్చరించారు. లెబనాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు.
ఈ వివాదం విధ్వంసకర పరిస్థితులకు దారితీస్తుందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటర్రెస్ అన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుఎల్ మ్యాక్రోన్ ఈ గురువారం సౌదీలో ఆకస్మికంగా పర్యటించారు. లెబనాన్‌లో పరిస్థితులను అధికారులతో చర్చించారు. లెబనాన్‌లో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొనాల్సిన అవసరాన్ని సౌదీ నేతలకు ఆయన వివరించారు.
ఇరాన్ సౌదీపై సైనిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లో ఉన్న సౌదీ పౌరులు వెంటనే తిరిగి వచ్చేయాలని సౌదీ ప్రభుత్వం పేర్కొంది. అయితే సౌదీ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా స్పందన
సౌదీ విదేశాంగ మంత్రితో తాను మాట్లాడానని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ రెక్స్ టిల్లర్సన్ అన్నారు.
''లెబనాన్ ప్రధాని సాద్ అల్-హరిరి రాజీనామా అంశంలో తమ ప్రమేయం లేదని ఆయన చెప్పారు. అల్ - హరిరి తన ఇష్టానికి వ్యతిరేకంగా రాజీనామా చేశారని కూడా తనకు తెలియదని చెప్పారు.''
సాద్ అల్-హరిరి వెంటనే లెబనాన్ తిరిగి వెళ్లి పరిస్థితులను చక్కబడేలా చూడాలని రెక్స్ సూచించారు.
లెబనాన్‌ను అంశంలో ఇరాన్‌తో పాటుగా సౌదీ ప్రభుత్వాన్ని కూడా ఆయన పరోక్షంగా హెచ్చరించారు.








