జమాల్ ఖషోగ్జీ హత్య పక్కా పథకం ప్రకారమే, అత్యంత క్రూరంగా జరిగింది: టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్

ఫొటో సోర్స్, Getty Images
జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్యకు కొన్ని రోజుల ముందే ప్రణాళిక జరిగిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ అన్నారు.
పథకం ప్రకారం, అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో అత్యంత క్రూరంగా ఖషోగ్జీ హత్య జరిగినట్లు తమవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఖషోగ్జీ శవం ఎక్కడుంది, ఎవరి ఆదేశాలతో ఈ హత్య జరిగింది అన్న ప్రశ్నలకు సౌదీ అరేబియా సమాధానం చెప్పాలని ఎర్డొగాన్ డిమాండ్ చేశారు.
నిందితుల విచారణ ఇస్తాంబుల్‌లోనే జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు 18 మంది అనుమానితులను సౌదీ అరేబియాలో అరెస్టు చేసినట్లు టర్కీ అధికార పార్టీ ఎంపీల సమావేశంలో ఆయన వెల్లడించారు.
ఆ హత్య జరగడానికి ముందు సౌదీకి చెందిన 15 మంది మూడు బృందాలుగా వేరువేరు విమానాల్లో ఇస్తాంబుల్ చేరుకున్నారని ఎర్డొగాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హత్యకు ఒకరోజు ముందు ఆ బృందాల్లోని కొందరు బెల్‌గ్రాడ్ అటవీ ప్రాంతానికి వెళ్లారని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలోనే ఖషోగ్జీ శవాన్ని పడేసినట్లుగా అనుమానిస్తూ టర్కీ పోలీసులు గతవారం గాలించారు.
వివాహానికి సంబంధించిన పత్రాల కోసం ఖషోగ్జీ వస్తున్నారన్న విషయం ముందే తెలుసుకున్న ఆ బృందం సౌదీ కాన్సులేట్ భవనంలోని సీసీ కెమెరాలను ఎలా తొలగించిందో కూడా ఎర్డొగాన్ వివరించారు.
అరెస్టు చేసిన ఆ 18 మందిని ఇస్తాంబుల్‌లోనే విచారించాలని, ఖషోగ్జీ హత్యలో పాత్రధారులందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, ఖషోగ్జీ హత్యకు సంబంధించి టర్కీ సేకరించిన ఎలాంటి ఆధారాలనూ ఆయన బయటకు విడుదల చేయలేదు.
అనుమానితుల్లో ఇస్తాంబుల్‌కు వచ్చిన ఆ 15 మందితో పాటు, మరో ముగ్గురు కాన్సులేట్ అధికారులు ఉన్నారని ఎర్డొగాన్ చెప్పారు.
ఖషోగ్జీ హత్య సౌదీ యువరాజు ఆదేశాల మేరకే జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తుండగా, ఎర్డొగాన్ మాత్రం ఆ యువరాజు పేరును ప్రస్తావించలేదు.

ఫొటో సోర్స్, AFP
'ఖషోగ్జీ గెటప్‌లో సౌదీ ఏజెంట్'
హత్య జరిగిన రోజే ఆ బృందంలోని ఒక వ్యక్తి ఖషోగ్జీకి చెందిన దుస్తులు, కళ్ల జోడు, గడ్డం ధరించి ఇస్తాంబుల్ నుంచి రియాద్‌కు విమానంలో వెళ్లినట్లు గుర్తించామని ఎర్డొగాన్ తెలిపారు.
ఖషోగ్జీ దుస్తులు వేసుకుని, నకిలీ కళ్ల జోడు, నకిలీ గడ్డం పెట్టుకుని సౌదీకి చెందిన ఓ వ్యక్తి కాన్సులేట్ నుంచి బయటకు వెళ్తున్నట్లుగా ఉన్న దృశ్యాలను సోమవారం సీఎన్‌ఎన్ చానెల్ ప్రసారం చేసింది.
సౌదీ ఏమంటోంది?
ఖషోగ్జీ కాన్సులేట్ భవనం నుంచి క్షేమంగా బయటకు వెళ్లారంటూ కొన్ని రోజుల పాటు చెప్పిన సౌదీ అరేబియా, తర్వాత ఆయన మరణించారని అంగీకరించింది.
కాన్సులేట్ భవనంలో జరిగిన ఒక గొడవలో ఆయన హత్యకు గురయ్యారని చెప్పింది.
అయితే ఈ హత్య వెనుక సౌదీ యువరాజుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్ అల్-జుబెయిర్ ఈ హత్య ఒక 'దారుణ తప్పిదం' అని ఫాక్స్ న్యూస్‌కు చెప్పారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశంతోనే ఖషోగ్జీ హత్య జరిగిందన్న వాదనలను ఆయన ఖండించారు.
ఖషోగ్జీ శవం ఎక్కడ ఉందో తనకు తెలియదని మంత్రి అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి 18 మందిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. మహమ్మద్ బిన్ సల్మాన్ ఇద్దరు అనుచరులను తొలగించామని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
సౌదీ పెట్టబడుల సదస్సుపై ప్రభావం పడుతుందా?
రియాద్ నగరంలో సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది.
అయితే, ఖషోగ్జీ హత్యను నిరసిస్తూ 40 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావడంలేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నట్లు కొన్ని సంస్థలు ప్రకటించాయి. అయినప్పటికీ కొన్ని వందల కంపెనీలు హాజరవుతున్నట్లు బీబీసీ అరబ్ వ్యవహారాల ఎడిటర్ సెబాస్టియన్ ఉషర్ తెలిపారు.
- సౌదీ అరేబియా: పాశ్చాత్య దేశాలకు ఎందుకంత ముఖ్యం?
- జమాల్ ఖషోగ్జీ హత్య; 'నగ్నసత్యాన్ని' వెల్లడి చేయబోతున్న టర్కీ
- 'జమాల్ ఖషోగ్జీ హత్యకు... యువరాజుకు ఏ సంబంధం లేదు' - సౌదీ అరేబియా
- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బిలియనీర్స్... ఏ దేశంలో ఎందరున్నారు?
- అమృత్సర్ విషాదం: రైల్వే ట్రాక్ మీద పోగొట్టుకున్న బిడ్డను కలిసిన తల్లి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









