జమాల్ ఖషోగ్జీ హత్య; 'నగ్నసత్యాన్ని' వెల్లడించిన టర్కీ అధ్యక్షుడు ఎర్దొగాన్

ఖషోగ్జీ హత్యపై అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ కార్యాలయంలో హత్యకు గురైన సంఘటనకు సంబంధించి 'నగ్నసత్యం' వెల్లడి చేస్తామని టర్కీ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రకటన కూడా చేశారు.

Presentational grey line

‘పక్కా పథకం ప్రకారమే, అత్యంత క్రూరంగా ఖషోగ్జీ హత్య’

జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్యకు కొన్ని రోజుల ముందే ప్రణాళిక జరిగిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ అన్నారు.

పథకం ప్రకారం, అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో అత్యంత క్రూరంగా ఖషోగ్జీ హత్య జరిగినట్లు తమవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

ఖషోగ్జీ శవం ఎక్కడుందో సౌదీ అరేబియా చెప్పాలని ఎర్డొగాన్ డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకు 18 మంది అనుమానితులను టర్కీ పోలీసులు అరెస్టు చేసినట్లు టర్కీ అధికార పార్టీ ఎంపీల సమావేశంలో ఆయన వెల్లడించారు.

అయితే, ఖషోగ్జీ హత్యకు సంబంధించి టర్కీ సేకరించిన ఎలాంటి ఆధారాలనూ ఆయన బయటకు విడుదల చేయలేదు.

ఆ హత్య జరగడానికి కొన్ని గంటల ముందు సౌదీకి చెందిన 15 మంది మూడు బృందాలుగా వేరువేరు విమానాల్లో ఇస్తాంబుల్‌ చేరుకున్నారని ఎర్డొగాన్ చెప్పారు.

Presentational grey line

రిసప్ తాయిప్ ఎర్దొగాన్ తమ అధికార పక్షమైన ఏకే పార్టీ సభ్యులతో సమావేశం కాబోతున్నారు. ఖషోగ్జీ అక్టోబర్ 2న కాన్సులేట్ కార్యాలయంలో హత్యకు గురైనట్లు తమ వద్ద ఆధారాలున్నాయని టర్కీ అధికారులు చెబుతున్నారు.

ఇన్నాళ్ళూ మాటలు మార్చుతూ వచ్చిన సౌదీ అధికారులు ఎట్టకేలకు దుర్మార్గమైన కుట్రతో ఖషోగ్జీ హత్యకు గురైనట్లు ప్రకటించారు.

టర్కీ అధ్యక్షుడు ఎర్దొగాన్ తన పార్టీ సభ్యులతో సమావేశం అవుతున్న మంగళవారం నాడే సౌదీ అరేబియాలో కీలకమైన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ప్రారంభమవుతోంది. ఖషోగ్జీ ఉదంతంతో ఆ సందడి దాదాపు కనిపించకుండా పోయింది. చాలా దేశాలు, వ్యాపార ప్రముఖులు ఇప్పటికే ఈ సదస్సు నుంచి తప్పుకున్నారు.

వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి ఖషోగ్జీ హత్య మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వివిధ దేశాల నేతలు డిమాండ్ చేశారు.

జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యలో సౌదీ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నా, అమెరికా మాత్రం ఆ దేశంతో చర్చలు జరుపుతోంది.

సోమవారం అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ సౌదీ యువరాజు మినూచెన్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు.

ఖషోగ్జీ హత్యపై అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ మాట ఎలా మార్చింది?

సౌదీ అధికారులు మొదట ఖషోగ్జీ కాన్సులేట్‌కు వచ్చిన రోజే తిరిగి వెళ్లిపోయారని చెప్పారు.

గత శుక్రవారం మొదటిసారి ఖషోగ్జీ మరణించాడని సౌదీ మొట్టమొదటిసారి చెప్పింది. ఒక గొడవలో ఆయన చనిపోయారని తెలిపింది.

సోమవారం సౌదీ అరేబియా ఖషోగ్జీది హత్యగా గుర్తించింది. కానీ ఆ హత్యకు జరిగిన కుట్రపూరిత ఆపరేషన్ గురించి సౌదీ యువరాజుకు తెలీదని చెప్పింది.

ఈ హత్యకు బాధ్యులైనవారందరినీ కఠినంగా శిక్షిస్తామని సౌదీ విదేశాంగ మంత్రి అదెల్ అల్-జుబెయిర్ ఫాక్స్ న్యూస్‌కు చెప్పారు.

ఖషోగ్జీ హత్యపై అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

రియాద్ చర్చలు ఏం చెబుతున్నాయి?

సౌదీ రాజధాని రియాద్‌లో అమెరికా అధికారులు-సౌదీ యువరాజుకు మధ్య అంతరంగిక చర్చలు జరిగాయి.

ఈ సమావేశంలో మినూచెన్, సౌదీ యువరాజు మధ్య ఆర్థిక సంబంధాలు, తీవ్రవాదం అణచివేత, ఖషోగ్జీ హత్యకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయని అమెరికా ప్రతినిధి తెలిపారు.

సౌదీ మీడియా మాత్రం సౌదీ ఈ చర్చలు అరేబియా-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మీదే జరిగాయని చెప్పాయి.

అమెరికా అధికారులు చర్చలు జరుపుతున్నా, మిగతా పశ్చిమ దేశాలకు చెందిన నేతలు, వ్యాపారులు వచ్చే వారం రియాద్‌లో జరగనున్న భారీ పెట్టుబడుల ఫోరం నుంచి తప్పుకున్నారు.

ఖషోగ్జీ హత్యను ఖండించిన వివిధ దేశాధినేతలు ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ హత్యపై స్పష్టత ఇవ్వకుంటే సౌదీకి ఆయుధాల ఎగుమతులు నిలిపివేస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు.

ఇటు సౌదీతో మల్టీ బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం రద్దు చేసుకుంటామని కెనెడా ప్రధాని కూడా ఆ దేశాన్ని హెచ్చరించారు.

ఖషోగ్జీ హత్యపై అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖషోగ్జీ హత్యపై దర్యాప్తు

టర్కీ అధ్యక్షుడిపై అందరి దృష్టి

టర్కీ మీడియా ఖషోగ్జీ హత్య గురించి లీకులు ఇస్తున్నా.. ఆ దేశాధ్యక్షుడు ఇప్పుడు ఏ 'నగ్న సత్యం' బయటపెడతారా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.

ఖషోగ్జీ మరణం వెనుక పూర్తి వివరాలు బయటపెడతామని టర్కీ స్పష్టం చేసింది. దానిపై వెనకడుగు వేసేది లేదని చెప్పింది.

అయితే టర్కీ అధ్యక్షుడు చెబుతున్న ఆ 'నగ్న సత్యం', సౌదీ కాన్సులేట్‌లో సంభాణలకు సంబంధించిన 'ఆడియో టేపు' గురించేనా, లేదంటే ఖషోగ్జీ హత్యకు సౌదీ బృందం తీసుకొచ్చినట్లు చెబుతున్న 'ఎముకల రంపం' వివరాలు బయటపెడతారా అని అంతా ఎదురుచూస్తున్నారు.

ఖషోగ్జీ హత్య గుట్టు వీడాలంటే మరికొంత సమయం వేచిచూడక తప్పదు.

మరోవైపు 'దావోస్ ఇన్ ది డెజర్ట్' పేరుతో జరిగే పెట్టుబడుల సమావేశాల నుంచి సుమారు 40 మంది ఆహ్వానితులు తప్పుకున్నారు. ఈ సమావేశాలు మంగళవారం రియాద్‌లో ప్రారంభం కానున్నాయి.

అయితే, వందలాది మంది ప్రతినిధులు ఇప్పటికీ ఈ సమావేశాలకు హాజరవుతున్నారని బీబీసీ అరబ్ ప్రతినిధి తెలిపారు. వీరి మధ్య వివిధ అంశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఖషోగ్జీ హత్యతో సౌదీ భవిష్యత్తు ప్రమాదంలో పడిందనట్టు కనిపిస్తోందన్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)