అభిప్రాయం: #Metooతో మహిళలు ఏం సాధించారంటే...

నిరసనలో పాల్గొన్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సింధు వాసిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేను సహితం, నేను సహితం, నేను సహితం

#MeToo, #MeToo, #MeToo

గత ఏడాది అక్టోబర్‌లో అమెరికాలో ప్రారంభమైన #MeToo ఉద్యమం భారత్ చేరినపుడు మహిళలు సోషల్ మీడియాలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పడం ప్రారంభించారు.

భారత్‌లో #MeToo ఉద్యమం ఇంత తీవ్రంగా మారుతుందని, పెద్ద పెద్ద వారిపై ప్రశ్నలు తలెత్తుతాయని అప్పటివరకూ ఎవరూ అనుకోలేదు.

భారత్‌లో గత అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు చూస్తే చాలా మార్పు వచ్చింది.

సోషల్ మీడియాలో ఈదుతున్న ఒక చిన్న #MeToo హ్యాష్‌ ట్యాగ్‌ను భారత మహిళలు తమ యుద్ధనాదంగా మార్చేశారు. కానీ ప్రతి ఉద్యమం లాగే దీన్ని కూడా అనుమానించారు. లెక్కలేనన్ని ప్రశ్నలు సంధించారు.

నిరసన తెలుపుతున్న యువత

ఫొటో సోర్స్, Getty Images

కానీ #MeTooతో ఏం జరుగుతుంది?

నెల క్రితం వరకూ చాలా మంది కుళ్లు జోకులు వేస్తూ, ముఖంపై నవ్వు పులుముకుని ఈ #MeToo వల్ల ఏమవుతుందిలే? అనేవారు. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగేటపుడు వారి కళ్లల్లో నిజమైన ఆందోళన కనిపించేది.

ఈ ఉద్యమం కొందరికి ఇంటర్నెట్‌ ట్రెండ్‌లా ఉండిపోతుందేమో అనే ఆందోళన కూడా కలిగేది.

కానీ ఇప్పుడు ఆ వెకిలి నవ్వులకు కూడా #MeToo ద్వారా సమాధానం దొరికిందని చెప్పడం అతిశయోక్తి కాదు. దాని వల్ల మహిళలు సాధిస్తున్న విజయాలు చూసి కూడా వాళ్లు కలత చెందుతున్నారు.

#MeToo వల్ల ఎలాంటి విజయాలు దక్కాయి? దానికి సమాధానం ఇదే...

ఎం.జె.అక్బర్, మాజీ కేంద్ర మంత్రి

ఫొటో సోర్స్, Getty Images

మోదీ సర్కారు నుంచి రాజీనామా

ఎంజే అక్బర్ విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది #MeToo శక్తి, విజయం కూడా. అది కూడా, ఈ ప్రభుత్వంలో రాజీనామాల సంప్రదాయం లేదని చెప్పిన మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయన తప్పుకున్నారు.

"లేదు.. లేదు. ఇందులో మంత్రుల రాజీనామా లేఖలు ఉండవు సోదరా.. ఇది యూపీఏ ప్రభుత్వం కాదు! ఎన్డీయే ప్రభుత్వం".

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఈ మాట ఓడిపోవటం, #MeToo విజయం అయ్యింది.

భారత రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వంలో అయినా ఒక కేంద్ర మంత్రి లైంగిక వేధింపుల ఆరోపణలతో రాజీనామా చేయడం ఇదే మొదటిసారి. అదే #MeToo విజయం.

విజయోత్సాహంలో మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

మహిళల ఓటు బ్యాంకు శ్రీకారం

భారత్‌లో మహిళల ఓటు బ్యాంకు లేదు. ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇందులో చాలావరకూ నిజం ఉంది.

పార్లమెంటులో మహిళలకు సంబంధించిన అంశాలపై ఏడాదికి ఎన్నిసార్లు చర్చలు జరుగుతాయి.

ఒకవేళ జరిగినా, సభలో మహిళా అంశాలపై సభ్యులు ఎంత సీరియస్‌గా చర్చిస్తుంటారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళలకు సంబంధించిన అంశాలు 'మహిళా భద్రత'ను దాటి ముందుకెందుకు వెళ్లవు.

మహిళల ఓటు బ్యాంకు లేదు. అందుకే వాళ్లు ఏం చెప్పినా, ఎంత చెప్పినా, పాలకులకు ఎలాంటి తేడా కనిపించదు. వినిపించదు.

రాజకీయ పార్టీలకు దళితుల ఓటు బ్యాంకు ఉంటుంది. వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకు ఉంటుంది. ముస్లిం ఓటు బ్యాంకు ఉంటుంది. కానీ మహిళా ఓటు బ్యాంకు మాత్రం ఉండదు.

దానికి బహుశా మహిళలను లెఫ్ట్‌ లేదా రైట్‌ అని లెక్కించపోవడం కారణం అయ్యుంటుంది.

మహిళలు సాధారణంగా 'హిందూ దేశం' కోసం ఉత్సాహం చూపించరు. విపక్షాలతో కలిసి 'ప్రభుత్వాలను దుమ్మెత్తిపోసే' స్పాన్సర్డ్ నినాదాలు కూడా చేయరు.

దీనికి కారణం మహిళలు కులం, మతం, సామాజిక-ఆర్థిక అసమానతలు, పితృస్వామ్యం లాంటి వాటిలో విభజనకు గురయ్యారు. పాలక వర్గాల్లో కదలిక తీసుకొచ్చేంతగా వాళ్లు ఎప్పటికీ ఒక్కతాటిపైకి రాలేకపోయారు.

మొదట అలాంటిదేం లేదు అంటూ గంభీరంగా కనిపించిన ఎంజే అక్బర్ తర్వాత రాజీనామా చేశారంటే అది ఆయన సొంత నిర్ణయం కాదనేది సుస్పష్టం.

కచ్చితంగా ఆయనపై రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, లేదా పార్టీ ఇమేజ్ కాపాడుకోడానికే తీసుకొచ్చుండచ్చు.

రాజీనామాకు కారణం ఏదైనా కావచ్చు. కానీ దానితో మహిళలు తమ ఓటు బ్యాంకు సృష్టించుకునే దిశగా కఠిన ప్రయాణం ప్రారంభించారనే సంకేతం మాత్రం కచ్చితంగా లభించింది.

క్యాండిల్ ర్యాలీలో యువతులు

ఫొటో సోర్స్, Getty Images

రాజీనామాలు, విచారణలు, ఇంకా ఏన్నో..

ఎంజే ఆక్బర్‌కు మాత్రమే రాజీనామా చేయాల్సిన పరిస్థితి రాలేదు.

హిందుస్తాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ ప్రశాంత్ ఝా, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ కేఆర్ శ్రీనివాస్, బిజినెస్ స్టాండర్డ్ విలేఖరి మయాంక్ జైన్ కూడా రాజీనామాలు చేయాల్సొచ్చింది.

  • టైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గౌతమ్ అధికారి అమెరికా థింక్ ట్యాంక్ టీమ్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది.
  • మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల్లో తమ దగ్గర పనిచేస్తున్న విలేఖరులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రచురితం అయ్యాయి. ఆ కేసుల్లో జరుగుతున్న విచారణ గురించి వారు బహిరంగంగా చెప్పాల్సి వచ్చింది.
  • మహిళా శిశు సంక్షేమ శాఖ #MeTooIndia ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఫిర్యాదులపై విచారణకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని సిఫారసు చేసింది. అయితే కేంద్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇలాంటి కేసులను మంత్రి బృందం(GoM) చూస్తుందనే వార్తలు వస్తున్నాయి.
  • 'ఫాంటమ్' లాంటి ప్రొడక్షన్ కంపెనీ ముక్కలైంది. నెట్‌ఫ్లిక్స్ 'సేక్రెడ్ గేమ్స్ సీజన్-2' ప్రస్తుతానికి నిలిపివేసింది.
  • నందితా దాస్, జోయా అఖ్తర్, మేఘనా గుల్జార్, కొంకణా సేన్ శర్మ, గౌరీ షిండే లాంటి 11 మంది ప్రముఖ మహిళా నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నటులతో కలిసి పనిచేయం అంటూ ప్రకటించారు.
  • లైంగిక వేధింపులు వచ్చిన ఒక కమెడియన్ ఉన్న ఎపిసోడ్స్ అన్నిటినీ ఎ.ఐ.బి సంస్థ.. ఇంటర్నెట్ నుంచి తొలగించింది. అందులో ఉన్న ఇద్దరు టాప్ కమెడియన్లు సెలవులో వెళ్లారు. హాట్‌స్టార్ 'ఆన్ ఎయిర్ విత్ ఎ.ఐ.బి సీజన్-3' రిలీజ్ రద్దు చేసింది.

ఇవన్నీ #MeToo విజయాలే

తనుశ్రీ దత్తా

ఫొటో సోర్స్, Getty Images

క్షమాపణ, సిగ్గుపడడం.. అంగీకారం

#MeToo వల్ల సాధించిన మరో పెద్ద విజయం ఒకటుంది. అనురాగ్ కశ్యప్, వికాస్ బహల్ తమ తప్పు ఒప్పుకున్నా లేదా చేతన్ భగత్, రజత్ కపూర్ లాంటి వారు బహిరంగ క్షమాపణ అడిగినా.. మహిళలు లైంగిక ఆరోపణలు చేసినవారిలో చాలా మంది వాటిని స్వీకరించారు. లేదా ఆ ఆరోపణలను స్వీకరించాల్సి వచ్చింది.

చాలా మంది ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన పాత ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. కొందరు మహిళలు తమపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పినా వారిని నమ్మనందుకు, వారినే తిరిగి ప్రశ్నించినందుకు తమను క్షమించాలని అడుగుతున్నారు. ఇది #MeTooకు దక్కిన మరో విజయం.

ఏమిటీ లైంగిక వేధింపులు?

ఈ మధ్య రెండు ప్రశ్నలకు ఎక్కువగా జవాబులు వెతుకుతున్నారు.

లైంగిక వేధింపులు అంటే?

అంగీకారం అంటే?

ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనప్పటికీ వీటిని ఒక మూలకు నెట్టేశారు. కానీ ఈరోజు అవి మూలల్లోంచి అందరి ముందుకూ వచ్చాయి.

‘లైంగిక వేధింపులు’, ‘అంగీకారం’ పదాల నిర్వచనం కోసం అందరూ వెతుకుతున్నారు.

పురుషులు బహుశా ఇప్పుడు మొదటిసారి 'వేధింపులు' అంటే ఏమిటి? అని అడుగుతున్నారు. ఇది కూడా లైంగిక వేధింపుల్లోకి వస్తుందా? అని తెలుసుకుంటున్నారు.

ఇల్లస్ట్రేషన్ చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

నేను ఆ అబ్బాయిని వేధించానా?

"అరే, నేను తనకు ఒకేసారి 60 మేసేజ్‌లు పంపించాను. తను విసిగిపోయాడేమో, తను వద్దన్నాడు. అయినా నేను మేసేజ్ చేస్తూ వచ్చాను. నేను అతడిని హెరాస్ చేశానా?"

"తెలీదు, బహుశా చేశావేమో.."

ఇది ఇద్దరు అమ్మాయిల మధ్య సంభాషణ.

అమ్మాయిలు కూడా ఇప్పుడు అబ్బాయిలు ఇష్టాయిష్టాల గురించి అంతే తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

తెలిసో తెలీకో ఎవరైనా అబ్బాయిని వేధించానా? అని అమ్మాయిలు గుర్తు చేసుకుంటున్నారు. అది కూడా #MeToo సాధించిన విజయమే.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, iStock

కదనరంగంలో మహిళలు.. కేవలం మహిళలే!

మహిళల యుద్ధం పురుషుల చేతుల్లో కాకుండా స్వయంగా మహిళల చేతుల్లో ఉండటం బహుశా ఇదే మొదటి సారి.

ఈ మహిళలు నిర్భయంగా తమ కథలు ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నారు. అందులో పురుషులను ఎలాంటి జోక్యం చేసుకోనీయడం లేదు.

తాము ఎంత మాట్లాడాలో, ఎంత దాచిపెట్టాలో వాళ్లు పురుషుల దగ్గర చెప్పించుకోవడం లేదు.

మహిళలు తమ విజయంలో పురుషులకు భాగం ఇవ్వడం లేదు. ఇవన్నీ #MeToo విజయాలే.

ఇదంతా బయటపెట్టడం తమకు మంచిదేనా, కాదా? అనే విషయం కూడా వాళ్లు పురుషులను అడగడం లేదు.

'నీ మంచి కోసమే మాట్లాడుతున్నా' అనే అవకాశాన్ని కూడా పురుషులకు దక్కకుండా చేశారు. ఇది #MeToo విజయం!

తల్లులు, కూతుళ్లను #MeToo అంటే ఏంటి? అని అడుగుతున్నారు.

బీబీసీ ఇండియా బోల్ కార్యక్రమంలో ప్రజ్ఞా శ్రీవాస్తవ్ "మా అమ్మ నన్ను #MeToo గురించి అడిగారు. ఎందుకంటే, ఆమె ఒక టీచర్‌గా పనిచేశారు. తన చుట్టుపక్కల జరిగిన లైంగిక వేధింపుల గురించి రాయాలనుకుంటున్నాను" అని చెప్పారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ మారుమూల పల్లెలో ఒక తల్లి తన కూతురిని #MeToo గురించి అడగడం #MeToo సాధించిన విజయం.

యువతి

ఫొటో సోర్స్, TRAILER GRAB

ఇక మహిళలు, బాధలను మనసులో దాచుకోరు!

నా సహచరుడు వికాస్ త్రివేది తన బ్లాగ్‌లో "తమపై జరిగిన లైంగిక వేధింపుల కథలను మనసులోనే దాచుకుని చనిపోయిన మహిళలు ఎందరో" అని రాశారు.

కానీ ఇక భవిష్యత్తులో మహిళలు మనసులో లైంగిక వేధింపుల బాధలు దాచుకుని చనిపోరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)