అభిప్రాయం: పార్లమెంట్ ద్వారానే రామమందిరం నిర్మిస్తామన్న భగవత్ ప్రకటనలో అర్థమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేష్ ప్రియదర్శి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు మోహన్ భగవత్ విజయ దశమి రోజున తన 84 నిమిషాల ప్రత్యేక ప్రసంగంలో చాలా విషయాలు మాట్లాడారు. వాటితోపాటు "ప్రభుత్వం చట్టం చేయాలి, చట్టం ద్వారా రామ మందిరం నిర్మించాలి. ఈ విషయంలో మన సన్యాసులు ఎలాంటి చర్యలు చేపట్టినా మేం వాళ్లకు అండగా నిలుస్తాం" అన్నారు.
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలనే ఉద్యమం రాజకీయమే, మతపరమైనది కాదు అనే విషయం లాల్‌కృష్ణ అడ్వాణీ లిబర్‌హాన్ విచారణ కమిటీకి చెప్పారు. ఇప్పుడు తమను తాము సాంస్కృతిక సంస్థగా చెప్పుకునే ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలక్ తాజా ప్రకటన కూడా పూర్తిగా రాజకీయమైనదే.
మోహన్ భగవత్‌ను అధికారికంగా 'పరమ పూజ్యులు'గా పిలిచుకునే నేతల పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. సర్‌సంఘ్‌చాలక్‌ను వారు అలా సంభోదించడం సంప్రదాయంగా వస్తోంది. ఆరెస్సెస్ బీజేపీకి మాతృసంస్థ, అందుకే దీనిని ఒక సాధారణ ప్రకటనగా భావించకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక గేమ్ ప్లాన్ ఏంటో చూద్దాం. మన సన్యాసులు ఏ చర్యలు చేపట్టినా మేం దానికి అండగా ఉంటాం అని భగవత్ ప్రకటించారు.
ఇక్కడ సన్యాసులు ఎవరు?. వాళ్లంతా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థ అయిన విశ్వ హిందూ పరిషత్ సన్యాసులు-మహంతులే.
వీళ్లంతా అక్టోబర్ 4న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి రామమందిరం నిర్మించాలని కోరారు.
"మందిరం అక్కడే నిర్మిస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతాం". అని భగవత్ మొదట్లో కూడా చాలాసార్లు చెప్పారు. కానీ, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆయన తాజా ప్రకటన చేశారు.
అంతే కాదు అక్టోబర్ 29న అయోధ్య వివాదాస్పద భూమి యాజమాన్య హక్కుల కేసులో సుప్రీంకోర్టులో వాదనలు కూడా మొదలవనున్నాయి.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
ఎన్నో ప్రశ్నలు
సుప్రీంకోర్టు తీర్పు రాకముందే పార్లమెంటులో ఆర్డినెన్సు ద్వారా లేదా బిల్లు పాస్ చేసి రామ మందిరం నిర్మించాలని మోదీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసినా, వాటిపై నైతిక, రాజకీయ ప్రశ్నలు తలెత్తుతాయి.
వాటన్నిటికంటే ముందు అలా చేయడం సుప్రీంకోర్టు పరిధి, రాజ్యాంగ భావనలకు అనుగుణంగా ఉందా అనే ప్రశ్న వస్తుంది.
భూమి యాజమాన్య హక్కుల కేసు, బాబ్రీ మసీదును కూల్చిన నేరపూరిత కుట్ర కేసులు రెండూ కోర్టులో ఇంకా నడుస్తున్నాయి.
ఇవి సెటిల్ కావడానికి ముందే పార్లమెంటు ద్వారా మందిరం నిర్మించాలని ప్రయత్నిస్తే దేశంలో న్యాయ వ్యవస్థను అవమానించినట్టే అనుకోవాలి.
అయితే, సుప్రీంకోర్టుకు ఇలాంటి అవమానాలు ఇంతకు ముందుకూడా జరిగాయి. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు పరిహారం తీసుకునే హక్కు కల్పించినపుడు, రాజీవ్ గాంధీ హయాంలో పూర్తి మెజారిటీ ప్రభుత్వం 1986లో పార్లమెంటులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఎందుకూ పనికిరాకుండా చేసింది.
ఇక ఇక్కడ తలెత్తే రెండో ప్రశ్న, ఏదైనా ఒక మతం కోసం ప్రార్థించే స్థలం నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దేశం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. భారత దేశంలో సెక్యులర్ రాజ్యాంగం ఉంది. అది న్యాయం అందించే విషయంలో పౌరులందరికీ సమాన హక్కులను అందిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని వైపుల నుంచీ ఒత్తిడి
జై షాపై కేసులు, నీరవ్ మోదీ పలాయనం, రఫేల్ డీల్‌పై ప్రశ్నలు, ఉపాధిలో విఫలం, పెరిగిన చమురు ధరలు, తగ్గిన మోదీ జనాదరణ అన్నీ బీజేపీ, సంఘ్ రెండింటిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
రామమందిరం నిర్మిస్తామనే హామీ కూడా వట్టిదే అని, రామమందిరం కట్టకపోయినా, పార్టీ కోసం భారీ ప్రధాన కార్యాలయం కట్టుకుంది అనే విమర్శలు కూడా బీజేపీ తరచూ వినాల్సి వస్తోంది.
ఒకప్పుడు "మా అభివృద్ధి ట్రాక్ రికార్డుతోనే వచ్చే ఎన్నికల్లో పోరాడతాం" అని బీజేపీ చెప్పుకునేది. కానీ ఇప్పుడు వాళ్ల దగ్గర అభివృద్ధి పేరుతో చూపించడానికి బహుశా ఏదీ లేదు.
అందుకే, మతపరమైన నమ్మకం కలిగించడం వాళ్లకు చాలా సులభమైన, సమర్థవంతమైన పరిష్కారంగా కనిపిస్తోంది. ఆ నమ్మకం కలిగించడానికి వారికి రామ మందిరంను మించిన ఆశం వేరే ఏదీ ఉండదు.
మహారాష్ట్రలో మరాఠాలు, గుజరాత్‌లో పటేళ్లు, రాజస్థాన్-హర్యానాలో జాట్లు అసంతృప్తితో ఉండడం కూడా గమనించాల్సిన విషయమే. ఎస్సీ-ఎస్టీ యాక్ట్ గురించి దళితులు, వెనుకబడిన వర్గాలు ఇప్పటికే కోపంగా ఉన్నాయి.
ఇక మార్పుల తర్వాత అగ్రవర్ణాలు కూడా మోదీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. కులాల ఆధారంగా ఓటర్లను విభజించడం వల్ల బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతోంది.
మందిరం అంశాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల కులాలవారీగా కాకపోయినా, హిందువులుగా అయినా జనం ఓట్లు వేస్తారని సంఘ్, బీజేపీ అనుకుంటున్నాయి. అది బీజేపీకి లాభమే అవుతుంది.
ఇక్కడ ఉన్న ఇంకో విషయమేంటంటే, దానికోసం బీజేపీ మందిరం నిర్మించాల్సిన అవసరం కూడా లేదు. ఆ ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తే చాలు. ఇక ఇందులో తమను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ హిందువులకు శత్రువులుగా చూపించడం కూడా బీజేపీకి చాలా సులభం.

ఫొటో సోర్స్, TWITTER @RSSORG
ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఇంకొకటి ఉన్నట్టుంది. ముస్లింలు లేదా రాజ్యాంగం గురించి ఎవరు పట్టించుకుంటారు. రామమందిర నిర్మాణాన్ని ఏ పార్టీలూ వ్యతిరేకించలేవని మోహన్ భగవత్ స్పష్టంగా చెప్పేశారు.
వాళ్లన్నది నిజమే. 'టెంపుల్ రన్'లో మోదీతో పోటీ పడుతున్న రాహుల్ గాంధీ 'సాఫ్ట్ హిందుత్వ'ను ఇప్పటికే స్వీకరించారు. ఇక రామ మందిరం అంశంపై సంఘ్, బీజేపీతో ఆయనెందుకు పోరాటం చేస్తారు?
అయోధ్య రామమందిరం కోసం బీజేపీ పార్లమెంటులో బిల్ లేదా ఆర్డినెన్సు తెస్తే, రాజకీయంగా దానిని బలంగా అడ్డుకోడానికి ఎలాంటి అవకాశాలూ లేవు. ఒకవేళ దీనికి సవాళ్లు ఎదురైనా, అది బీజేపీకి టానిక్‌లా పనిచేస్తుంది.
బీజేపీకి ఆ విషయం చాలా బాగా తెలుసు. అందుకే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆ దిశగా ఏవైనా ప్రయత్నాలు జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
బీజేపీ ఆరెస్సెస్‌కి ఈ ప్రయత్నంలో న్యాయపరమైన సవాళ్లు కచ్చితంగా ఎదురయ్యే అవకాశం ఉంది. వాటి పరిణామాలు ఏవైనా కావచ్చు. బీజేపీ తమ ప్రచార వ్యూహాల్లో వాటిని ప్రస్తావిస్తుంది. ఓట్లు అడుగుతుంది.
హిందూ దేశంలో, రాముడు పుట్టిన చోట మందిరం నిర్మించడానికి కష్టాలు ఎదురవుతున్నాయని హిందువులకు చెబుతుంది. సొంత దేశంలో హిందువులు ఎంత నిస్సహాయులవుతున్నారో వివరిస్తుంది.. వారి ఓట్ల కోసం ఇంకా చాలాచాలా చెబుతుంది.
మొత్తానికి జరిగేదంతా చూస్తుంటే "స్మార్ట్ సిటీ, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా లాంటి నినాదాలు ఎన్ని ఉన్నా, బీజేపీ మళ్లీ 1990 నాటి అదే మలుపులోకి చేరుకుంటోంది. "మందిరం అక్కడే కడతాం" అనే మాటను మళ్లీ మళ్లీ వినిపించేందుకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు.. ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








