అమృత్‌సర్ రైలు ప్రమాదం: రైల్వే ట్రాక్‌ మీద పోగొట్టుకున్న బిడ్డను కలిసిన తల్లి కథ

బిడ్డను కలిసిన తల్లి కథ

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN/BBC

    • రచయిత, రవిందర్ సింగ్ రాబిన్
    • హోదా, బీబీసీ కోసం

పది నెలల తన బిడ్డను ఒడిలోకి తీసుకోగానే రాధిక కన్నీళ్లు ఆగలేదు. అప్పటివరకూ వెంటాడుతున్న భయంకరమైన జ్ఞాపకాలన్నిటినీ ఆమె ఆ క్షణంలో మర్చిపోయారు.

అక్టోబర్ 19న అమృత్‌సర్‌లో రావణ దహనం రోజున జరిగిన రైలు ప్రమాదంలో రాధిక తీవ్రంగా గాయపడి స్పృహకోల్పోయారు. అదే సమయంలో ఆమె తన బిడ్డను కూడా దూరమయ్యారు.

రాధికకు మెలకువ వచ్చింది. ఆ సమయంలో ఆమె తన బిడ్డ అసలు ఈ లోకంలో ఉన్నాడో లేదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. గాయపడ్డ ఆమెను అమన్‌దీప్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.

రాధిక కోలుకోగానే తన బిడ్డను వెతుక్కునే ప్రయత్నం చేశారు. ఆస్పత్రిలో కనిపించిన అందర్నీ బిడ్డ గురించి అడిగారు. కానీ ఏ వివరాలూ తెలీలేదు. తను ప్రాణాలతో ఉన్నా, పంచ ప్రాణాలైన బిడ్డ దూరమవడంతో రాధిక తల్లడిల్లిపోయారు.

కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(డీఎల్ఎస్ఎ) చివరికి విడిపోయిన ఆ తల్లీబిడ్డలను కలిపింది. ఆస్పత్రిలో ఉన్న రాధిక చేతికి ఆమె బిడ్డ విశాల్‌ను అందించింది. కొడుకును చేతుల్లోకి తీసుకోగానే అప్పటివరకూ ఆమెలో ఉన్న బాధంతా మాయమైంది.

ఒక్క రాధికకే కాదు, డిఎల్ఎస్ఎ మరో మూడు కుటుంబాల్లో కూడా సంతోషాలు నింపింది. ఈ ప్రమాదంలో దూరమైన చిన్నారులను తిరిగి అయినవారితో కలిపింది.

రాధిక కుటుంబం, సోదరి ప్రీతి కుటుంబంతో కలిసి దసరా వేడుకలు చూడ్డానికి వెళ్లింది. రైల్వే ట్రాక్ దగ్గర నుంచి రావణ దహనం చూస్తోంది. అప్పుడే హఠాత్తుగా రైలు దూసుకురావడంతో ఆమె, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.

ఆపరేషన్ తర్వాత ఇప్పుడు ఆమె మాట్లాడగలుగుతున్నారు. కొడుకు తన ఆరేళ్ల కూతురితో కలిసి ఆడుకుంటుంటే వాళ్లనే చూస్తూ ఉండిపోతున్నారు.

బిడ్డను కలిసిన తల్లి కథ

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN/BBC

తల్లీబిడ్డలు ఇలా కలిశారు

రైలు ప్రమాదం తర్వాత పోలీసులు, అధికారులు గాయపడ్డవారిని కాపాడడంలో నిమగ్నమయ్యారు. ఒక దగ్గర పరిహారం కోసం ఫైల్ తయారవుతుంటే, మరో చోట చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలు చేపడుతున్నారు.

అదే సమయంలో డీఎల్ఎస్ఎ ఆ ప్రమాదంలో చెల్లాచెదురైన కుటుంబాలను కలిపే ప్రయత్నంలో ఉంది.

బాధితుల కోసం గురునానక్ దేవ్ ఆస్పత్రిలో, సివిల్ హాస్పిటల్లో రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్‌, డీఎల్ఎస్ఎ సెక్రటరీ సుమిత్ మక్కర్ బీబీసీకి చెప్పారు.

గురు నానక్ దేవ్ ఆస్పత్రిలో పర్యటించినపుడు ఆయన బాధితురాలు ప్రీతిని కలిశారు. ఆమె తలపై గాయాలున్నాయి.

ఆయనకు మూడున్నరేళ్ల ఆరుష్ అనే పిల్లాడు కనిపించాడని చెప్పారు. ఆ పిల్లాడి తల్లిదండ్రులు చనిపోయారన్నారు.

కొంతమంది ఆస్పత్రి నుంచి పిల్లాడిని డిశ్చార్జ్ చేసి ఉత్తర్ ప్రదేశ్ తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. మేం వారి వివరాలు అడిగినపుడు ఆరుష్ తల్లి పేరు ప్రీతి అని తెలిసింది.

ప్రీతి తన బిడ్డను గుర్తించేలా ఆరుష్‌తోపాటు మరో ఆరుగురు పిల్లల ఫొటోలు కూడా చూపించాం. ఆమె తన బిడ్డను గుర్తుపట్టగలిగారు. దాంతో ఆరుష్‌ను ప్రీతికి అప్పగించాం అని మక్కర్ చెప్పారు.

బిడ్డను కలిసిన తల్లి కథ

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN/BBC

రైల్వే ట్రాక్‌పై దొరికిన విశాల్

అలాగే సివిల్ ఆస్పత్రిలో పర్యటించినపుడు ఆయనకు పది నెలల విశాల్ వివరాలు కూడా తెలిశాయి. ఆ పిల్లాడి తల్లిదండ్రులు కూడా చనిపోయారని అందరూ అనుకున్నారు.

మీనాదేవి అనే మహిళకు విశాల్ రైల్వే ట్రాక్‌పై దొరికాడు. చిన్నారిని చికిత్స కోసం ఆమే ఆస్పత్రికి తీసుకొచ్చింది.

"మాకు ఆ మహిళపై సందేహం వచ్చింది. ఆమె గురించి ఆరా తీశాం. దాంతో ఆ పిల్లాడు తనకు రైల్వే ట్రాక్‌పై దొరికినట్టు ఆమె చెప్పింది. దాంతో విశాల్‌ను మేం మా రక్షణలోనే ఉంచాం" అని మక్కర్ తెలిపారు.

"యూపీ నుంచి తన సోదరి రాధిక బిడ్డతోపాటు అమృత్‌సర్ వచ్చిందని ప్రీతి మాకు చెప్పారు. అందరం కలిసి దసరా వేడుకలు చూడ్డానికి వెళ్లామని, ఇప్పుడు ఆమె వివరాలు కూడా తెలీడం లేదన్నారు."

"అప్పుడే మాకు అమన్ దీప్ ఆస్పత్రిలో ఉన్న రాధిక గురొచ్చారు. దాంతో ఆమెకు కూడా విశాల్‌తోపాటు మరికొంతమంది పిల్లల ఫొటోలు చూపించాం. రాధిక కూడా తన బిడ్డను గుర్తుపట్టగలిగారు" అని మక్కర్ చెప్పారు.

పిల్లలను చూసుకోడానికి రాధికకు తోడుగా డీఎల్ఎస్ఎ కొంతమంది మహిళా అధికారులను కూడా పంపించింది.

బిడ్డను కలిసిన తల్లి కథ

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పుడు జరిగింది?

అమృత్‌సర్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జోడా ఫాటక్ దగ్గర దసరా వేడుకలు నిర్వహించారు.

సుమారు 7 వేల మంది రావణ దహనం చూడడానికి మైదానంలో గుమిగూడారు.

ఆ మైదానంలో రెండున్నర వేలకు మించి జనం పట్టరని చెబుతున్నారు.

అందరూ మైదానంలోకి వచ్చిపోవడానికి ఒకే ఒక దారి ఉంది.

మైదానంలో ఒక భాగంలో స్టేజ్ వేశారు. దాని వెనక వీఐపీలు వచ్చిపోవడానికి ఏర్పాట్లు చేశారు.

ప్రమాదం జరిగినపుడు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ కూడా అక్కడే ఉన్నారు.

ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం ప్రమాదం తర్వాత కౌర్ అక్కడ్నుంచి వెంటనే వెళ్లిపోయారు.

మైదానంలో ఒక గోడ ఉంది. అది రైల్వే లైన్, మైదానాలను వేరు చేస్తుంది. జనం గోడపై, రైల్వే ట్రాక్‌ దగ్గర ఉన్నారు.

ప్రమాదం సాయంత్రం సుమారు ఆరున్నర గంటలప్పుడు జరిగింది. కానీ పోలీసులు, అంబులెన్సులు మాత్రం దాదాపు గంట తర్వాత అక్కడికి చేరుకున్నాయి.

అమృత్‌సర్‌లోని వివిధ ఆస్పత్రుల్లో గాయపడ్డవారికి ఇంకా చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో 59 మంది మృతి చెందారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)