అమృత్‌సర్ విషాదం: 58 మంది మృతికి అసలు బాధ్యులు ఎవరు? రైల్వేనా.. పోలీసులా.. నిర్వాహకులా?

- రచయిత, రవీందర్ సింగ్ రాబిన్
- హోదా, బీబీసీ కోసం
చూస్తుండగానే.. క్షణాల్లో ఘోరం జరిగిపోయింది.. రైలు జనాలను చక్రాల కింద నలిపేస్తూ దూసుకెళ్లింది. కాసేపటి ముందు వరకూ వాళ్లంతా నవ్వుతూ సరదాగా ఉన్నారు. చప్పట్లు కొడుతూ రావణ దహనం చూస్తున్నారు. వాళ్లలో చాలా మంది రైలు వెళ్లాక పట్టాలపై విగతజీవులుగా కనిపించారు.
పంజాబ్ అమృత్‌సర్‌లో శుక్రవారం రావణ దహనం సమయంలో జరిగిన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. సంతోషం, సంతాపంగా మారిపోయింది. ఘటన ఎలా జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలిసింది. కానీ అది ఎందుకు జరిగింది అనేదానిపై మాత్రం ఇప్పటికీ ప్రశ్నలు అలాగే ఉన్నాయి.
కొంతమంది రైల్వేను దోషిగా చూపిస్తుంటే, కొందరు పోలీసులను నిందిస్తున్నారు. ఇంకొంతమంది తప్పు రైల్వే ట్రాక్‌పై నిలబడిన వాళ్లదే అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఈ ఘటనకు నిర్వాహకుల నిలువెత్తు నిర్లక్ష్యమే కారణం అంటున్నారు.
ప్రస్తుతం అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఇంకొకటి ఉంది. నిర్వాహకులకు ధోబీ ఘాట్ ప్రాంతంలో రావణ దహనం నిర్వహించడానికి పోలీసులు, అమృత్‌సర్ కార్పొరేషన్ నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయా, లేదా?
ఘటన జరిగిన వెంటనే, అమృత్‌సర్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ధోబీ ఘాట్‌లో దసరా వేడుకలు నిర్వహించడానికి తామెలాంటి అనుమతులూ ఇవ్వలేదన్నారు.
అయితే శనివారం డిప్యూటీ కమిషనర్ అమ్రిక్ సింగ్ పవార్ మాత్రం వాటిని నిర్వహించడానికి తన కార్యాలయం అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. కానీ ఆయన ఇంకోమాట కూడా అన్నారు. అక్కడ దసరా వేడుకలకు అమృత్‌సర్ కార్పొరేషన్ అనుమతులు ఇవ్వకపోతే పోలీసులు ఇచ్చిన రక్షణ అనుమతి కూడా దానంతట అదే రద్దైపోతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
తప్పు ఎక్కడెక్కడ జరిగింది?
అమృత్‌సర్ కార్పొరేషన్ కమిషనర్ సోనాలీ గిరి "మేం అక్కడ దసరా వేడుకలకు ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు" అని స్పష్టం చేశారు.
ఇటు అమృత్‌సర్ మేయర్ కరమ్‌జీత్ సింగ్ రింటూ కూడా బీబీసీతో "నాకు తెలిసి నిర్వాహకులు అనుమతులకు అసలు అప్లికేషనే పెట్టలేదు. ఇలాంటి కార్యక్రమాలకు ఫైర్ బ్రిగేడ్ డిపార్ట్‌మెంట్, ఆరోగ్య శాఖ అనుమతి కూడా అవసరం అవుతుంది. కానీ నిర్వాహకులు మాత్రం ఎవరిదగ్గరా అనుమతి తీసుకోలేదు" అన్నారు.
అయితే ఇన్ని వివాదాల మధ్య ఇప్పుడు ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. దీనిని అక్టోబర్ 15న రాశారు. దసరా కమిటీ అధ్యక్షుడు సౌరభ్ మదన్ మీఠూ డీసీపీకి ఈ లేఖ రాశారు. అందులో ఆయన దసరా వేడుకలు నిర్వహిస్తున్నామని, వాటికి రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్దు, ఆయన భార్య డాక్టర్ నవజోత్ కౌర్ సిద్దు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. వారికి పోలీసు సెక్యూరిటీ అవసరం ఉంటుందని, ప్రజలకు కూడా భద్రత కల్పించాలని కోరారు.
అయితే దీనికి సంబంధించి మీఠూను సంప్రదించాలని ప్రయత్నించాం. కానీ ఆయనతో మాట్లాడలేకపోయాం. ఆయన మొబైల్ ఫోన్ ఆప్ చేసినట్టు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Google EARTH
మోహకంపురా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ అక్టోబర్ 17న విడుదల చేసిన ఒక రిపోర్టులో తనకు ఒక మెయిల్ వచ్చిందన్నారు. అందులో దసరా కార్యక్రమాల కోసం లౌడ్ స్పీకర్ ఉపయోగించడానికి అనుమతి కోరినట్టు చెప్పారు. ఆ సమావేశంలో సుమారు 20 వేల మంది పాల్గొనవచ్చని, ఒక నియమిత పరిధి దాటిన తర్వాత లౌడ్ స్పీకర్లు అనుమతిస్తారని ఆయన తన రిపోర్టులో తెలిపారు.
ధోబీ ఘాట్ ప్రాంతంలో ఎకరం కంటే తక్కువ ఉన్న ఈ మైదానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 20 వేల మంది పట్టరు. ఈ గ్రౌండ్‌లోకి రావడానికి, పోవడానికి ఒకే ఒక గేట్ ఉంది. అది కూడా పది అడుగుల వెడల్పే ఉంటుంది. మైదానంలో రెండో వైపు ఒక స్టేజ్ వేశారు. వీఐపీల రాకపోకల కోసం దాని వెనుక ఏర్పాట్లు చేశారు.
రైల్వే ట్రాక్ ఉన్న వైపు అందరికీ రావణ దహనం కనిపించేలా నిర్వాహకులు ఒక పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Reuters
విచారణ ప్రారంభం
ఒక సీనియర్ పోలీస్ అధికారి స్వయంగా దసరా వేడుకల ఏర్పాట్లన్నీ చూసుకున్నారని అక్కడ ఉన్నవాళ్లు చెబుతున్నారు.
"రైల్వే అడిషినల్ డీజీపీ ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు కమిటీని నియమించారని" పోలీస్ డైరెక్టర్ జనరల్ సురేష్ ఆరోరా బీబీసీకి చెప్పారు.
ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఆదేశాలతో పంజాబ్ హోంమంత్రిత్వశాఖ అమృత్‌సర్ ఘటనపై మేజిస్ట్రేట్ స్థాయి దర్యాప్తు జరపించాలని జలంధర్ కమిషనర్ బలదేవ్ పురుషార్థ్‌ను ఆదేశించింది.
అమృత్‌సర్‌లో దసరా వేడుక సందర్భంగా జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 59 మంది మృతి చెందారు. నగర శివార్లలోని జోడా ఫాటక్ దగ్గర రావణ దహనం జరుగుతున్న సమయంలో రైలు దూసుకెళ్లడంతో కనీసం 150 మంది గాయపడ్డారు. వారికి ఇప్పటికీ చికిత్స అందిస్తున్నారు.
ఇవికూడా చదవండి:
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాష
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- అమెరికా: జంతువుల ఎక్స్‌రేలు చూస్తారా..
- పాశ్చాత్య దేశాలకు సౌదీ అరేబియా ఎందుకంత అవసరం?
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








