అమృత్‌సర్ రైలు ప్రమాదం: చెల్లీ! ఏమయ్యావు? అన్నయ్య ఆరాటం

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ డోగ్రా.. ఈ అమృత్‌సర్ వాసి తన చెల్లెలు పూజ కోసం నిన్న రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాడు. అమృత్‌సర్‌లోని జోడాఫాటక్ వద్ద రావణ దహనాన్ని చూసేందుకు కుటుంబంతో వెళ్లిన ఆయన చెల్లెలు మళ్లీ తిరిగి రాలేదు. ఎక్కడుందో, ఏమైందో.. గాయపడిందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియక ఆయన తల్లడిల్లుతున్నాడు.
అమృత్‌సర్‌లో రావణ దహనం పెను విషాదం మిగిల్చింది. మంటల్లో కాలిపోతూ కూలుతున్న రావణుడి బొమ్మ తమపై ఎక్కడ పడుతుందోనని పరుగులు తీసిన జనం రైలు పట్టాలపైకి చేరడం.. అదే సమయంలో రైలు దూసుకురావడంతో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం తరువాత ఇప్పటికీ కొందరి ఆచూకీ దొరక్కపోవడంతో స్థానికులు తమవారి కోసం రోదిస్తూ గాలిస్తున్నారు. రాహుల్‌దీ అదే పరిస్థితి.

ఫొటో సోర్స్, GurupreetSinghChawla/bbc
రాహుల్ సోదరి పూజ కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమానికి చూడ్డానికి వెళ్లగా అదేసమయంలో ప్రమాదం జరిగింది. పూజ భర్త అమన్, కుమార్తె కాశిష్(7), కుమారుడు నకుల్(12)ల మృతదేహాలను రాహుల్ ఆసుపత్రి మార్చురీలో చూశాడు. కానీ, చెల్లెలు పూజ మృతదేహం మాత్రం ఎక్కడా కనిపించలేదు.
''సాయంత్రం 6.30కి నాకు ఫోనొచ్చింది. జోడా రైల్వే క్రాసింగ్ వద్ద పెద్ద ప్రమాదం జరిగింది. చాలా మంది చనిపోయారని సమాచారం అందింది. తానూ రావణ దహనం చూసేందుకు జోడా రైల్వే క్రాసింగ్ వద్దకు వెళ్తున్నట్లు నా చెల్లెలు అంతకుముందే నాకు చెప్పింది. ఈ ప్రమాదం సంగతి తెలియగానే నా చెల్లెలకు, బావకు ఫోన్లు చేశాను. కానీ, అందరి ఫోన్లూ స్విచ్ఛాప్ అని వచ్చింది.
వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాద స్థలానికి వెళ్లాను. సుమారు 25 నిమిషాలు అక్కడ వెతికాను కానీ ఎవరి జాడా లేదు.
మళ్లీ అక్కడి నుంచి వాళ్లింటికి తిరిగి వెళ్లాను. అక్కడి నుంచి హాస్పిటల్‌కు వెళ్లాను.
ఎమర్జెన్సీలో... మార్చురీలో.. ఇలా అంతటా వెతికాను.
బాధితుల్లో కొందరిని గురునానక్ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసి అక్కడికీ వెళ్లి వెతికాను.. ఫలితం లేదు.
అక్కడి నుంచి ఆర్మీ హాస్పిటల్‌కు వెళ్లమంటే వెంటనే అక్కడికి పరుగులు తీశాను.. అక్కడి నుంచి అమన్‌దీప్ హాస్పిటల్, గురు రాందాస్ హాస్పిటల్.. ఇలా అన్ని ఆసుపత్రులూ తిరిగాను.
ఇప్పటికీ వారు ఏమయ్యారో తెలియలేదు'' అంటూ రాహుల్ రోదిస్తున్నాడు.
అక్టోబర్ 19న సాయంత్రం ఈ ప్రమాదం జరగ్గా రాహుల్ ఆ రోజు రాత్రంతా హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. చివరకు శనివారం(అక్టోబర్ 20) ఉదయం మళ్లీ సివిల్ హాస్పిటల్ మార్చురీలోనే పూజ భర్త అమన్, ఇద్దరు పిల్లల మృతదేహాలు ఆయన గుర్తించారు.

ఆసుపత్రులన్నీ తిరిగాను
అమృత్‌సర్‌కే చెందిన వ్యాపారి విజయ్ కుమార్ తన కుమారుడిని ఈ ప్రమాదంలో కోల్పోయారు. సాయంత్రం ప్రమాద ఘటన తెలిసిన తరువాత తన కుమారుడి కోసం ఆయన అక్కడి ఆసుపత్రులన్నీ వెతికారు కానీ ఫలితం లేకపోయింది.
శనివారం ఉదయం సివిల్ హాస్పిటల్‌లో గుర్తు తెలియని మృతదేహం ఒకటుందని చెప్పగా అక్కడికి వెళ్లి అది తన కుమారుడు మునీశ్‌దేనని గుర్తించి కన్నీరుమున్నీరవుతున్నారు విజయ్ కుమార్.
ఇవి కూడా చదవండి:
- వారెన్ బఫెట్ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- హార్వ ర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ‘ఆసియా దరఖాస్తుదారులపై వివక్ష’
- చిన్నపిల్లలకు గ్రోత్ హార్మోన్లు.. బ్రోకర్ల దారుణాలు
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








