హార్వ ర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ‘ఆసియా దరఖాస్తుదారులపై వివక్ష’... కేసు విచారణ ప్రారంభం

ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు, మైనారిటీ జాతీయులకు సంబంధించి కీలక పరిణామాలకు దారితీయగల ఒక కేసుపై సోమవారం విచారణ మొదలైంది.

హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రవేశాల ప్రక్రియను తప్పుబడుతూ వాషింగ్టన్ డీసీకి చెందిన 'స్టూడెంట్స్ ఫర్ ఫెయిర్ అడ్మిషన్స్' అనే ఒక గ్రూపు బోస్టన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కేసు వేసింది.

హార్వర్డ్ యూనివర్సిటీ ప్రవేశాల కార్యాలయం ఇతర జాతుల వారికి ప్రోత్సాహం అందించేందుకు ఆసియా దరఖాస్తుదారులపై వివక్ష చూపిస్తోందని ఆ గ్రూపు ఆరోపించింది.

ఈ ఆరోపణను హార్వర్డ్ విశ్వవిద్యాలయం తోసిపుచ్చుతోంది. విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో 'జాతి' అనేది ఒక చిన్న అంశం మాత్రమేనని చెబుతోంది. ఈ ప్రక్రియను విశ్వవిద్యాలయం గోప్యంగా నిర్వహిస్తోంది.

అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ వర్సిటీ ఒకటి. ఏటా 42 వేల దరఖాస్తులు వస్తే వడపోతల తర్వాత దాదాపు 1,600 మందికి మాత్రమే ఇది ప్రవేశాలు కల్పిస్తుంది.

హార్వర్డ్ వర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు

విచారణ ప్రారంభం కావడానికి ముందు, జాతిని ఒక అంశంగా పరిగణించే ప్రవేశాల విధానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేర్వేరు గ్రూపులు బోస్టన్‌ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించాయి.

విద్యలో జాతి ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడం పౌర హక్కుల ఉల్లంఘన అవుతుందని ప్రకటించాల్సిందిగా కోర్టును 'స్టూడెంట్స్ ఫర్ ఫెయిర్ అడ్మిషన్స్' గ్రూపు కోరుతోంది.

దరఖాస్తును పరిశీలించేటప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం జాతిని పరిగణనలోకి తీసుకుంటోందని, ఇది అనుచితమని, ఈ విధానంవల్ల ఆసియన్-అమెరికన్లకు సమాన అర్హతలు కాకుండా ఎక్కువ అర్హతలు ఉంటేనే ప్రవేశాలు లభిస్తాయని 'స్టూడెంట్స్ ఫర్ ఫెయిర్ అడ్మిషన్స్' అంటోంది.

ఇతర జాతుల వారికి అవకాశాలు కల్పించేందుకుగాను ఏసియన్ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేసే విధానాన్ని హార్వర్డ్ వర్సిటీ అనుసరిస్తోందని ఈ గ్రూపు ఆరోపిస్తోంది. ప్రవేశాల్లో 'జాతుల మధ్య సమతౌల్యాన్ని' పాటించేందుకు వర్సిటీ కోటా విధానాన్ని అనుసరించడం ఫెడరల్ చట్టానికి విరుద్ధమని ఆరోపిస్తోంది.

జాతులను పరిగణించకుండా, గ్రేడ్లు మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే ప్రవేశాలు పొందే ఆసియా విద్యార్థుల సంఖ్య రెండింతలవుతుందని, ఎందుకంటే ఆసియా విద్యార్థులు బాగా చదువుతారని ప్రస్తుత విధానాన్ని వ్యతిరేకిస్తున్నవారు వాదిస్తున్నారు.

నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విచారణ ప్రారంభం కావడానికి ముందు, జాతిని ఒక అంశంగా పరిగణించే ప్రవేశాల విధానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేర్వేరు గ్రూపులు బోస్టన్‌ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించాయి.

సమగ్ర విధానం అనుసరిస్తాం: హార్వర్డ్

ఈ కేసుతో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల విధానాలపై మరింత చర్చ జరిగే అవకాశముంది. విశ్వవిద్యాలయాల్లో భిన్నత్వాన్ని ప్రోత్సహించేందుకు జాతిని ఒక అంశంగా పరిగణనలోకి తీసుకొనేందుకు కోర్టులు గతంలో వర్సిటీలను అనుమతించాయి. ఈ విధానాన్ని 'అఫర్మేటివ్ యాక్షన్' అంటారు.

పూర్వ విద్యార్థుల, దాతల సంతానం విషయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఎలాంటి విధానాన్ని అనుసరిస్తోందనే విషయం, ఇతర అంశాలు ఈ కేసు విచారణలో వెల్లడయ్యే అవకాశముంది.

ప్రవేశాల సమయంలో విద్యార్థులను మదింపు చేయడానికి సమగ్ర విధానాన్ని అనుసరిస్తామని, జాతి అనేది కేవలం ఒక చిన్న అంశమేనని హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెబుతోంది. ఆసియా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, వారి ప్రాతినిధ్యం 23 శాతంగా ఉందని పేర్కొంటోంది.

ఎంపిక కావడానికి గ్రేడ్లు మాత్రమే ఉంటే చాలదని హార్వర్డ్ వర్సిటీ డీన్ రాకేశ్ ఖురానా డబ్ల్యూబీయూఆర్ సంస్థతో వ్యాఖ్యానించారు. ''మా వర్సిటీలో చదవడం పట్ల నిజంగా బాగా ఆసక్తి ఉండే విద్యార్థుల కోసం చూస్తాం. పరీక్షల్లో మాత్రమే మంచి ప్రతిభ చూపేవారిని కాకుండా, అన్ని అంశాల్లో రాణించేవారికి ప్రాధాన్యమివ్వాలనుకుంటాం'' అని ఆయన వివరించారు.

ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

హార్వర్డ్‌తో పాటు 'ఐవీ లీగ్' పరిధిలోకి వచ్చే ఇతర విద్యాసంస్థలు, అమెరికా పౌర హక్కుల సంఘం (ఏసీఎల్‌యూ) ఈ విషయంలో హార్వర్డ్‌కే మద్దతిస్తున్నాయి. విద్యతోపాటు ఇతర అంశాలను, అలాగే జాతిని పరిగణనలోకి తీసుకొనే ప్రవేశాల విధానం విద్యాసంస్థల్లో భిన్నత్వాన్ని పెంచుతుందని ఏసీఎల్‌యూ న్యాయస్థానానికి సమర్పించిన ఒక పత్రంలో తెలిపింది.

వివక్ష కారణంగా తరతరాలుగా వెనకబాటుకు గురైన మైనారిటీలకు అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన అఫర్మేటివ్ యాక్షన్‌ను వ్యతిరేకిస్తూ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ ఎడ్వర్డ్ బ్లమ్ 'స్టూడెంట్స్ ఫర్ ఫెయిర్ అడ్మిషన్స్'ను ఏర్పాటు చేశారు.

డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కేసులో ఈ గ్రూప్‌కు మద్దతు తెలుపుతూ కోర్టులో ఓ పత్రం దాఖలు చేసింది.

గతంలో టెక్సాస్ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా కూడా ఎడ్వర్డ్ బ్లమ్ కేసు వేశారు. శ్వేత జాతీయుడైన ఒక విద్యార్థి వివక్షకు గురయ్యారని ఆ కేసులో ఆరోపించారు. కేసును 2016లో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

బోస్టన్ కోర్టులో విచారణ రెండు మూడు వారాలపాటు సాగుతుందని భావిస్తున్నారు. కేసు ఓడిపోయినవారు సుప్రీంకోర్టులో అప్పీలు చేసే అవకాశముంది.

యేల్ వర్సిటీపై న్యాయశాఖ విచారణ

మరోవైపు- యేల్ విశ్వవిద్యాలయం ఆసియా విద్యార్థులపై వివక్ష చూపిస్తోందా అనే అంశంపై న్యాయశాఖ విచారణ చేపట్టింది. తాము వివక్ష చూపడం లేదని యేల్ యూనివర్శిటీ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)