హైదరాబాద్ టెస్ట్: వెస్టిండీస్‌ను కుప్పకూల్చిన ఉమేశ్ యాదవ్... టెస్ట్ సిరీస్ భారత్ కైవసం

ఫొటో సోర్స్, Getty Images
ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ధాటికి తట్టుకోలేక వెస్టిండీస్ కుప్పకూలింది. హైదరాబాద్ టెస్టులో కొత్త చరిత్ర లిఖించాలని ఉబలాటపడిన వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో ఉమేష్ జోరుకు తలవంచాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ అయ్యింది.
హైదరాబాద్ టెస్టును, సిరీస్‌ను గెలుచుకోవడానికి భారత జట్టు ముందున్న లక్ష్యం కేవలం 72 పరుగులే. ఆ లక్ష్యాన్ని భారత ఓపెనర్లు కేవలం 17 ఓవర్లలోనే అధిగమించి తిరుగులేని ఘన విజయం సాధించారు.
ఓపెనర్లు లోకేష్ రాహుల్, పృథ్వీ షా చెరో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
10 వికెట్ల తేడాతో ఈ టెస్టును గెలుచుకున్న భారత జట్టు, 2-0 తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఆ విధంగా భారత జట్టు అయిదు రోజుల టెస్టును మూడు రోజుల్లోనే ముగించింది.

ఫొటో సోర్స్, Getty Images
వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ మొదటి ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేశాడు. రోస్టన్ చేజ్‌తో కలిసి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
స్వదేశంలో వెస్టిండీస్ జట్టు మీద ఒక ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లకు పైగా భారత జట్టు బౌలింగ్ చేయడం గత నాలుగేళ్లలో ఇదే మొదటి సారి. మొత్తానికి తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 311 పరుగులు చేసింది.
వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ ధాటిగా బ్యాటింగ్ చేయడమే కాకుండా 56 పరుగులకు అయిదు వికెట్లు తీశాడు.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
దుమ్ము రేపిన ఉమేష్ యాదవ్
మూడో రోజు ఆట ప్రారంభం అయ్యే సమయానికి ఇరు జట్లు పోటాపోటీగా కనిపించాయి. కానీ, ఉమేష్ యాదవ్ తన మెరుపులాంటి బంతులతో మ్యాచ్‌ను 'వార్ వన్‌సైడ్' అన్నట్లుగా మార్చేశాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన ఉమేష్, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 45 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు పడగొట్టాడు.
ఉమేష్ దెబ్బకు వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 46.1 ఓవర్లు మాత్రమే ఆడి 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆ జట్టులో సునీల్ ఎంబ్రీస్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ముగ్గురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు. వారిలో ఇద్దరిని ఉమేషే ఔట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ 133 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. అలా స్వదేశంలో ఒకే టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో భారత 'ఫాస్ట్ బౌలర్'గా రికార్డు సృష్టించాడు.
అంతకుముందు కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్ ఈ ఘనత సాధించారు.
మొదటి ఇన్నింగ్స్‌లో ఉమేష్ కేవలం 88 పరుగులకే 6 వికెట్లు తీసి స్వదేశంలో గత 20 ఏళ్లలో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా మరో రికార్డు నమోదు చేశాడు.
1999లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీనాథ్ ఈ ఘనతను సాధించాడు. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు ఇప్పుడు ఉమేష్ ఆ రికార్డు సొంతం చేసుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు ఒక ఇన్నింగ్స్, 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ టెస్టుతో కొత్త రికార్డులు
- భారత జట్టు స్వదేశంలో 10 టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్ విజయ పరంపర 2013 నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది.
- స్వదేశంలో 10 టెస్టు సిరీస్‌లు గెలుచుకోవడం అన్నది గతంలో ఆస్ట్రేలియా రెండు సార్లు చేసింది. 1994 నుంచి 2000 మధ్యలో ఒకసారి, మళ్లీ 2004- 2008 మధ్యలో ఒకసారి ఆస్ట్రేలియా స్వదేశంలో 10 సరీస్‌లను గెలుచుకుంది.
- సొంత గడ్డ మీద భారత్‌కు ఇది 101వ టెస్టు విజయం. అందుకు హైదరాబాద్ వేదిక కావడం విశేషం.
- వెస్టిండీస్ మీద భారత్‌కు ఇది 20వ టెస్టు విజయం. 1994 తర్వాత స్వదేశంలో భారత జట్టు వెస్టిండీస్ చేతిలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు?
- ఫ్రెంచ్ సావిత్రి దేవికి జర్మన్ హిట్లర్‌కు ఏమిటి సంబంధం?
- కాలు లేకపోయినా క్రికెట్లో సూపర్‌స్టార్
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- 'రోజూ ఒక గుడ్డు తినండి.. ఇక డాక్టర్‌కు దూరంగా ఉండండి!'
- 'తల్లి కాబోయే లక్షల మంది మహిళలకు ఇదో శుభవార్త'
- ఫుట్‌బాల్ జ్ఞాపకాలు: లక్ష మంది ప్రేక్షకులపై భారత్ విజయం
- బ్రిటన్ను భయపెట్టిన మేజిక్ మహారాజు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








