విరాట్ కోహ్లీ? స్టీవ్ స్మిత్? జో రూట్? ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సైమన్ హుఘెస్
- హోదా, క్రీడా విశ్లేషకులు
తాజాగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఇద్దరు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 593 పరుగులు చేశాడు. దీంతో 2014లో అవే ఇంగ్లీషు మైదానాల్లో 'అంటిన మరక'ను తుడిచేసుకున్నాడు.
ఈ టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ వరుస శతకాలతో చెలరేగిపోయాడు. తన జట్టును విజయ తీరానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
మరి ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు ఎవరు?
కేవలం టెస్టుల్లో పరుగులను మాత్రమే చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం సులువుగా చెప్పేయొచ్చు. కానీ, కీలకమైన ఇతర అంతర్జాతీయ ఫార్మాట్లనూ పరిగణనలోకి తీసుకుని ఆటలో వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తేనే అర్థవంతంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP/Getty Images
నా పరిశీలన ప్రకారం ప్రపంచ టాప్ 5 బ్యాట్స్‌మెన్ల జాబితా ఇలా ఇది (అవరోహణ క్రమంలో):
5. రోహిత్ శర్మ (భారత్)
వయసు: 31, టెస్టులు: 25, పరుగులు: 1,479, సగటు: 39.97
పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో అత్యంత దూకుడుగా ఆడే భారత ఆటగాడిగా రోహిత్ శర్మకు పేరుంది. ఓపెనర్‌గా క్రీజులో అడుగుపెట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడు.
చూస్తుండగానే... ఎంతో అలవోకగా బ్యాటింగ్ చేస్తూ శతకాల పంట పండిస్తాడు.
అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో రోహిత్ 18 శతకాలు చేశాడు. టెస్టుల్లో మాత్రం మూడు సెంచరీలే సాధించాడు.
భారత్‌లోని మైదానాల్లో ఆడేందుకే రోహిత్ ఎక్కువ ప్రాధాన్యమిస్తారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారత్‌లో ఆడిన టెస్టు మ్యాచుల్లో ఇతని సగటు స్కోర్ 85, విదేశాల్లో ఆ సగటు 25 మాత్రమే.
రోహిత్ పేరిట మూడు వన్డే డబుల్ సెంచరీలు కూడా నమోదై ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
4. కేన్ విలియమ్సన్ (న్యూజీలాండ్)
వయసు: 28, టెస్టులు: 65, పరుగులు: 5,338, సగటు: 50.35
డిఫెన్స్‌ను చాలా చాకచక్యంగా ఆడే ఆటగాడు కేన్ విలియమ్సన్. మైదానంలో ఎక్కడ ఖాళీ కనిపించినా అక్కడి నుంచి బంతిని సునాయసంగా బౌండరీని దాటించేస్తూ ఫీల్డర్‌ను ముప్పుతిప్పలు పెడతాడు.
ఇతని బ్యాటు ఆయుధమేమీ కాదు కానీ, ఖాళీ స్థలం ఎక్కడ కనిపిస్తే అటువైపు బంతిని పంపించేసే పరికరం అది.
గతంలో న్యూజీలాండ్ దిగ్గజ ఆటగాడు మార్టిన్ క్రో పేరిట ఉన్న రికార్డును ఈ ఏడాది మార్చిలో కేన్ విలియమ్సన్ బ్రేక్ చేశారు.
ఇంగ్లాండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో తన టెస్టు కెరీర్‌లో 18వ శతకం సాధించి, న్యూజీలాండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
టెస్టు, వన్డే రెండు ఫార్మాట్లలోనూ అంతే ప్రభావవంతంగా ఆడతాడు.

ఫొటో సోర్స్, Getty Images
3. జో రూట్ (ఇంగ్లండ్)
వయసు: 27, టెస్టులు: 74, పరుగులు: 6,279, సగటు: 51.04
సులువుగా కదలడం... అద్భుతమైన బ్యాక్- ఫుట్ గేమ్... క్రీజులో స్థిరత్వం... ఇవే జో రూట్‌కి అనుకూలమైన విషయాలు.
టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ వ్యవధిలో 6,000 పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా ఇటీవలే రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో ఈ రికార్డు సాధించిన మూడో అతిపిన్న ఆటగాడు ఇతడే.
సచిన్ 26 ఏళ్ల 213 రోజుల వయసులో, అలస్టైర్ కుక్ 27 ఏళ్ల 43 రోజుల వయసులో 6,000 పరుగులు చేయగా, జో రూట్ 27 ఏళ్ల 214 రోజులకు ఈ రికార్డు సాధించాడు.
కోహ్లీ లాంటి పవర్ ప్లేయర్ మాత్రం కాదు. కానీ, కోహ్లీలాగే ఇతడు కూడా బ్యాటింగ్ విషయంలో తనకున్న అలవాట్లను కొన్నింటిని మార్చుకున్నాడు.
అయితే, అర్ధశతకాలను శతకంగా మలచడంలో రూట్ ఇబ్బందిపడుతున్నాడు.
ఇటీవల భారత్‌తో జరిగిన ఫైనల్ టెస్టులో ఒక శతకం సాధించాడు. 13 నెలల వ్యవధిలో ఇతడు చేసిన తొలి సెంచరీ అది. అదే వ్యవధిలో 9 అర్ధ శతకాలు చేశాడు.
మొత్తమ్మీద 41 అర్ధ శతకాల్లో ఇతడు సెంచరీ దాకా తీసుకెళ్లింది 14 మాత్రమే. బహుశా, అది ఫిట్‌నెస్‌కి సంబంధించిన సమస్య అయ్యుంటుంది.
అందుకే ఫిట్‌నెస్‌పై రూట్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
2. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
వయసు: 29, టెస్టులు: 64, పరుగులు: 6,199, సగటు: 61.37
2017-18లో ఇంగ్లండ్‌తో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ సగటు స్కోరు 63.75. టెస్టు చరిత్రలో సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అంతటి స్కోరు సాధించిన ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు.
అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు తేలడంతో ఇతని సగటు 61.37గానే (పాత సగటు) ప్రస్తుతం ఐసీసీ పరిగణనలోకి తీసుకుంటోంది.
గడచిన నాలుగేళ్లలో స్వదేశంలో స్మిత్ సగటు స్కోరు 96. ఇతర దేశాల్లో ఆ సగటు 57.
ఎల్‌బీడబ్ల్యూ రూల్‌లో ఔట్ అవ్వకుండా తప్పించుకునేందుకు ఆఫ్ స్టంప్‌ని కవర్ చేస్తూ ఆడతాడు స్మిత్. దాని వల్ల బౌలర్లకు సులువుగా లెగ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం లభిస్తుందని అందరూ భావిస్తారు. కానీ, స్మిత్‌ది చాలా సునిశిత దృష్టి, లెగ్ సైడ్ పడే బంతుల్ని కూడా సులువుగా ఆడగల నేర్పు ఇతని సొంతం.
అర్ధ శతకాలను సెంచరీ దాటించడంలో కోహ్లీ తర్వాతి స్థానం స్మిత్‌దే. ఇతడు 49 శాతం అర్ధ శతకాలను సెంచరీ దాకా తీసుకెళ్లాడు.
స్మిత్‌పై ఉన్న నిషేధం 2019 ఏప్రిల్‌లో ముగియనుంది. అదే ఏడాది జరిగే ప్రపంచ కప్‌లో ఆడేందుకు త్వరగా కోలుకోవడమే ఇతడి ముందున్న సవాల్.

ఫొటో సోర్స్, Getty Images
1. విరాట్ కోహ్లీ (భారత్)
వయసు: 29, టెస్టులు: 71, పరుగులు: 6,147, సగటు: 53.92
దేనికీ రాజీపడని స్వభావం, అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.
సొంతగడ్డపై తాను ఎన్ని పరుగులు చేసినా సంతృప్తిచెందడు. ఇంకాఇంకా పరుగులు రాబట్టాలన్న దాహంతో కనిపిస్తుంటాడు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియాలో కోహ్లీ అద్భుతమైన స్కోర్ సాధించాడు. కానీ, తర్వాత 2014లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా మాత్రం అత్యంత పేలవంగా ఆడాడు.
జేమ్స్ అండర్సన్ స్వింగ్ బౌలింగ్‌తో బాగా ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆ టెస్టు సీరీస్‌లో విరాట్ సగటున 13 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే, ఈసారి తన క్రీజు ముందుకు వచ్చి ఆడటం ద్వారా ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

ఫొటో సోర్స్, Sky Sports
తాజా పర్యటనలో 'ఇంగ్లిష్ పిచ్'లు తమకు ప్రతికూలంగా ఉన్నా కోహ్లీ సగటున 59 పరుగులు సాధించాడు. ఇతర ఆటగాళ్లెవరూ ఇతని దరిదాపులోకి కూడా వెళ్లలేకపోయారు. దాని ద్వారా ప్రస్తుత తరంలో తనంతటి అత్యుత్తమ ఆల్-రౌండ్ బ్యాట్స్‌మెన్ మరెవరూ లేరని కోహ్లీ నిరూపించాడు.
స్టీవ్ స్మిత్ తిరిగి బ్యాట్ పట్టి పోటీకి వచ్చే దాకా కోహ్లీకి తిరుగులేదు.
ఇవి కూడా చదవండి:
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- నాబార్డ్ రిపోర్ట్: వ్యవసాయ ఆదాయంలో దిగజారిన ఆంధ్రప్రదేశ్, జాతీయ సగటు కన్నా కాస్త మెరుగ్గా తెలంగాణ
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారు’
- ఇలాగైతే.. లండన్‌లో తెలుగోళ్లకు ఇల్లు కష్టమే!
- భారత్‌లో దొరకని భారతీయ వంటకం!
- మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి
- పవన్ కల్యాణ్‌కు ఫిన్లాండ్ విద్యా విధానం ఎందుకంతగా నచ్చింది?
- సహారా ఎడారి వెంట ప్రహరీ కట్టండి.. స్పెయిన్‌కు డోనల్డ్ ట్రంప్ సలహా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








