Ground Report - సిరియా: ఇడ్లిబ్‌లో అంతం కానున్న సుదీర్ఘ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, CARA SWIFT
- రచయిత, జెర్మీ బోవెన్
- హోదా, బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్, ఇడ్లిబ్ ప్రావిన్స్, సిరియా
సిరియా అంతర్యుద్ధం ఇడ్లిబ్‌లో ముగియవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, సిరియా ప్రజలకు మరో వ్యధను కలిగించే కొత్త రూపం తీసుకోవచ్చు.
ఇడ్లిబ్ యుద్ధ రంగంలో ప్రభుత్వ దళాల వైపు నేను ప్రయాణించాను. ఇదో నగరం. రాష్ట్రంలో ఎక్కువ భాగం.
ఈ నగర పరిధిలో 30 లక్షల మంది పౌరులు., బహుశా 90 వేల మంది తిరుగుబాటుదారులు ఉన్నారు. వారిలో దాదాపు 20 వేల వరకూ కరడుగట్టిన జిహాదీ అతివాదులు ఉంటారని అంచనా.
ఈ యుద్ధం ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
ఇదంతా సిరియాను ధ్వంసం చేయటానికి జరుగుతున్న విదేశీ కుట్ర అని ప్రభుత్వం నిరతరం ఆరోపిస్తోంది.
కానీ, యుద్ధం తొలి నాళ్లలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి నేను వెళ్లాను. స్వేచ్ఛా నినాదాలు చేస్తున్న నిరసనకారులతో మాట్లాడాను. తాము కోరుకుంటున్నది సిరియా వినాశనం కాదని, ప్రభుత్వ పతనమని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
అది చాలా కాలం కిందటి నాటి మాట.
యుద్ధం చాలా మారిపోయింది. అనేక దశల్లోకి మారుతోంది.
తిరుగుబాటు బృందాలు విడిపోతూ, కలసిపోతూ మళ్లీ విడిపోతూ కొత్త కూటములుగా రూపాంతరం చెందాయి.
విభిన్న తిరుగుబాటుదారుల మధ్య తేడాను చూడటానికి పాలకులు ఎల్లప్పుడూ తిరస్కరిస్తూనే ఉన్నారు. అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కి వాళ్లందరూ ఉగ్రవాదులే.
కానీ, అతివాదులు కాని సాయుధ తిరుగుబాటుదారులు కూడా ఉన్నారు. వారు తమకు మిత్రులుగా కనిపించిన పాశ్చాత్య దేశాల సాయం కోసం అర్థించినా ఆ సాయం అందలేదు. వారిని ఏరివేశారు.

ఫొటో సోర్స్, AFP
యుద్ధం, తిరుగుబాటు, ముగింపు... అసద్ పాలనకు - ఇస్లామిక్ సాయుధులకు, కొన్నిసార్లు జిహాదీ సాయుధ బృందాలకు మధ్య పోరులా మారిపోయింది.
రష్యా 2015లో నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకున్నప్పటి నుంచీ.. అసద్ ప్రభుత్వం తిరుగుబాటుదారుల చేతుల్లోని చిన్నా పెద్దా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇందుకు అనుసరించిన వ్యూహాలు.. చర్చలు, హెచ్చరికలు, బలప్రయోగం.
2016 ఆరంభంలో అలెప్పోలో ప్రభుత్వ బలగాల విజయం ఒక నిర్ణయాత్మక సందర్భం. డమాస్కస్‌లో తిరుగుబాటుదారుల అంతిమ పరాజయం, గత వేసవిలో నైరుతి ఈశాన్యాన్ని తిరిగిస్వాధీనం చేసుకోవటం కూడా అంతే ముఖ్యమైన ఘట్టాలు.

ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక శక్తుల చేతుల్లో ఉన్న పెద్ద ప్రాంతం ఇడ్లిబ్ ఒక్కటే.
కదన రంగంలో ఇస్లామిక్ సాయుధ బృందాలు తరచుగా మారుతున్నాయి.
ఇడ్లిబ్‌లో ఆధిపత్యం ఉన్న అటువంటి ఒక సాయుధ బృందం... హయత్ తాహ్రిర్ అల్-షామ్ (హెచ్‌టీఎస్). సిరియా జిహాదిస్టులతో పాటు విదేశీ జిహాదిస్టులనూ ఇది యుద్ధంలోకి దించుతోంది.
ఇది సిరియాలో అల్-ఖైదాతో లింకున్న అల్-నుస్రా బృందానికి మరో రూపం. అల్-నుస్రాను ఒక ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి, చాలా మధ్యప్రాచ్య, పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి.
నేను సందర్శించిన యుద్ధ రంగంలోని సైనిక మోహరింపు ప్రాంతాల్లో.. ఇసుక సంచులు, భారీ లారీ టైర్లతో ఏర్పాటుచేసిన బారికేడ్లు, అడ్డుకట్టలు, ఫైరింగ్ పొజిషన్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
రష్యా సైనిక బలగాలు కూడా కనిపించాయి. అయితే, తమను వీడియో తీయకుండా ఉండేందుకు వారు తమ టెంట్లు, కందకాల్లోకి వెళ్లిపోయారు.
సిరియా ప్రజల్లో ఒక తరం జీవితం రూపురేఖలను మార్చేసిన ఈ యుద్ధంలో.. నేను సందర్శించిన వేర్వేరు కదన రంగాల గురించి - ప్రభుత్వం - తిరుగుబాటుదారులు ఇరువైపులా చూసిన ప్రాంతాల గురించి - ఆలోచించకుండా ఉండటం కష్టం.
ఈ యుద్ధం మొదలైనపుడు రెండు వైపులా తుపాకులు పట్టుకుని నిలుచున్న వారు చిన్న పిల్లలు.
ఈ విధ్వంసం భీకరమైనది. ఇందులో మరణాలు అత్యంత దారుణం.
కనీసం ఐదు లక్షల మంది చనిపోయారని అంచనా. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.

ఫొటో సోర్స్, CARA SWIFT
ఇదంతా ముగిసిన తర్వాత అధ్యక్షుడు అసద్ అధికారంలోనే కొనసాగుతారు. ఈ విజయంతో ఆయన మరింత బలోపేతమవుతారు.
ఆయన ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురయింది. భారీ మూల్యం చెల్లించి నిలబడింది.
మానవ హక్కుల సంస్థలు చాలా విశ్వసనీయమైనవని చెప్తున్న తమ అధ్యయనాల్లో, ఈ యుద్ధంలో ఇప్పటివరకూ అతిపెద్ద హంతకులు సిరియా ప్రభుత్వ బలగాలేనని చెబుతున్నాయి.
ఈ ఆరోపణను రక్షణమంత్రిత్వశాఖలోని, యుద్ధ రంగంలోని సిరియా సైనిక జనరల్స్ ముందు ఉంచాను. దానిని వారు తిరస్కరించారు. తమ సొంత ప్రజలను తాము ఎందుకు చంపాలనుకుంటామని వారు ప్రశ్నించారు.
ఇడ్లిబ్ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ శిథిలమైపోయాయి. దాదాపు పూతిగా విధ్వంసమైపోయాయి.

ఫొటో సోర్స్, AFP
ఆ గ్రామాల మధ్య నుంచి ప్రయాణిస్తున్నపుడు... ఒకప్పుడు ఇక్కడ నివసించిన ప్రజలు ఏమైపోయారోనని నాకు అనిపించింది.
వాళ్లందరూ నిర్వాసితులయ్యారు. కొందరు విదేశాల్లో శరణార్థులుగా ఉండి ఉండాలి. ఇంకొందరు చనిపోయి ఉండాలి.
వారి పాత ఇళ్ల గుండా ఈ పోరాటం పుడుతూ చస్తూ ప్రవహించింది. శిధిలమైన ఖాళీ దయ్యాల నగరాల అలలను మిగిల్చింది.
యుద్ధానికి ముందు 1.2 కోట్ల మందిగా ఉన్న సిరియా జనాభాలో సగం మంది ఈ యుద్ధంలో తమ ఇళ్లు కోల్పోయారు.
ఈ వారంలో ఇడ్లిబ్ లోపల, చుట్టుపక్కల తుపాకులు మౌనంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఈపాటికి సిరియన్ అరబ్ ఆర్మీ, దాని రష్యా, ఇరాన్ మిత్రులు ఎదురుదాడి చేయాల్సి ఉంది.
ఇడ్లిబ్ పరిమాణం, అందులో ఉన్న సాయుధ తిరుగుబాటుదారుల సంఖ్యను చూస్తే ఈ పోరాటంలో రక్తం ఏరులై ప్రవహిస్తుందని భావించారు.
అయితే, ఈ ప్రావిన్స్ చుట్టూ నిస్సైనిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయటానికి రష్యా, టర్కీలు అంగీకరించటంతో ఈ దాడిని వాయిదావేశారు.
తిరుగుబాటు బృందాలన్నీ తమ భారీ ఆయుధాలను బుధవారం లోగా ఈ ప్రాంతం నుంచి ఉపసంహరించాలని.. హెచ్‌టీఎస్ సహా ‘రాడికల్’ గ్రూపులు కూడా అక్టోబర్ 15 లోగా తమ ఫైటర్లను ఉపసంహరించుకుని తీరాలని స్పష్టంచేశారు.
ఇప్పటివరకూ.. టర్కీ మద్దతున్న ఒకే ఒక్క తిరుగుబాటు కూటమి మాత్రమే దీనిని పాటించినట్లు చెప్పింది.

ఫొటో సోర్స్, AFP
అయితే, హెచ్‌టీఎస్ సహా ఇతర గ్రూపులు కూడా తమ భారీ ఆయుధాలను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రణాళికకు అనుగుణంగా నడుచుకునేలా హెచ్‌టీఎస్, ఇతర జిహాదీ వాదులను ఒప్పించటానికి, బెదిరించటానికి గల మార్గాలను టర్కీ వెదుకుతోంది.
వారు అంగీకరించకపోతే, ఈ ఏడాది ముగిసేలోగా మరో విడత పోరాటాన్ని, దానితోపాటు మరింత మంది పౌరుల మరణాలను చూడాల్సి వస్తుంది. ఇంకా చాలా మంది ఇళ్లు కోల్పోతారు. ప్రజల భయాందోళనలను, బాధలను నివారించడం కూడా కష్టమవుతుంది.
ఈ రక్తసిక్త పోరు ముగింపు దిశగా నడుస్తున్న భావన దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.
తిరుగుబాటును ప్రభుత్వం దాదాపుగా అణచివేసింది. కానీ, సిరియాలో రక్తం చిమ్మటానికి చాలా మార్గాలున్న విషయం మరవరాదు.

ఫొటో సోర్స్, AFP
దేశంలోని పలు ప్రాంతాలను ప్రధాన విదేశీ శక్తులు ఆక్రమిస్తున్నాయి లేదా బాంబులతో దాడి చేస్తున్నాయి. అవి పరస్పరం ఎదురుపడినపుడు పరిస్థితులు విషమించే ప్రమాదం బలంగా ఉంది.
కుర్దులు ఒక ప్రాంతాన్ని విభజించుకున్నారు.. దానిని వారు సులభంగా వదిలిపెట్టరు.
ఇడ్లిబ్‌లో మరో భారీ సమరమనే పీడకల వెంటాడుతూనే ఉంది.
దీనంతటి కేంద్ర బిందువుగా.. అధ్యక్షుడు అసద్.. ఆయన కుటుంబం ఉంది.

ఫొటో సోర్స్, AFP
అసద్‌లు పతనమవుతారని పశ్చిమ దేశాల్లో చాలా ఏళ్లుగా జోస్యం చెప్పారు. పతనం తప్పదని అనుకున్నారు. కానీ.. రష్యా, ఇరాన్‌ల సహకారంతో అసద్‌లు నిలబడ్డారు. ఇంకా బలపడుతున్నారు.
వారితో వ్యవహరాలు నెరపటానికి, వాస్తవాన్ని గుర్తించటానికి, ఎంత అయిష్టంగా అయినా సరే భవిష్యత్తులో కలిసి సాగవలసిన సమయం ఆసన్నమైందని పశ్చిమ దేశాల్లో కొందరు వాదిస్తున్నారు.
అధ్యక్షుడు అసద్‌కి అంతర్జాతీయ పునరావాసం అనేది నిజంగా ఒక విజయమే అవుతుంది.
ఆయన ప్రభుత్వం, దాని బలగాల చేతుల్లో చితికిపోయిన వారందరికీ.. అనేక రక్తసిక్త సంవత్సరాలకు అది ఒక భయంకర ముగింపు అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- #MeToo: మహిళా జర్నలిస్టులు మౌనం వీడేదెప్పుడు?
- GROUND REPORT- రోహింజ్యా సంక్షోభం: 'మమ్మల్ని ఇక్కడే చంపేయండి... మళ్ళీ మయన్మార్‌కు పంపకండి'
- వివాదంలో ట్రంప్ కుటుంబం: వారికి అంత సంపద ఎలా వచ్చింది? ట్రంప్ తండ్రి ఏం చేసేవారు?
- స్టాక్ మార్కెట్లు: నష్టాలు ఇప్పట్లో ఆగేనా?
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
- నేను వేశ్యగానే ఉంటా : వ్యభిచార వృత్తిలో కొనసాగే హక్కు కోసం పోరాడిన మహిళ
- పాము కాటు: ఏ పాములు ప్రమాదకరం? కాటేసినపుడు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








