సిరియా: భారీ పేలుడుతో కూలిన భవనం.. 39 మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
సిరియాలో ఆయుధ స్మగ్లర్లు మందుగుండు నిల్వ ఉంచిన భవనం భారీ పేలుడుతో కుప్పకూలి 12 మంది చిన్నారులు సహా 39 మంది చనిపోయారు.
తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఉన్న ఇద్లిబ్ ప్రావిన్స్‌లోని సర్మదా పట్టణంలో ఈ పేలుడు సంభవించింది. ఇంకా పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియడం లేదు.
తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న చిట్టచివరి ప్రాంతం ఇద్లిబ్. సిరియా సాయుధ బలగాలు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోబోతున్నాయి. రష్యా, ఇరాన్‌ల సాయంతో సిరియా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పలు తిరుగుబాటు, జిహాదీ బృందాల మీద దాడులు చేపట్టి పురోగతి సాధించింది.
టర్కీ సరిహద్దుకు సమీపంలో ఉన్న సర్మదా పట్టణంలో ఆదివారం కుప్పకూలిన భవనం శిధిలాలను తొలగించటానికి, చిక్కుకుపోయిన వారిని వెలికితీయటానికి.. సహాయ సిబ్బంది బుల్‌డోజర్లను ఉపయోగించినట్లు ఏఎఫ్‌పీ కరెస్పాండెంట్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ భవనంలో పౌరులు చాలా మంది ఉన్నారు. అది శిథిలాల కుప్పగా మారింది’’ అని ఇద్లిబ్ సివిల్ డిఫెన్స్ బృందానికి చెందిన హాటెమ్ అబు మార్వాన్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ పేర్కొంది.
అక్కడ ఇంకా డజన్ల మంది ఆచూకీ తెలియటం తెలియటం లేదని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ చెప్పింది.
ఈ పేలుడులో చనిపోయిన మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని కొన్ని వార్తలు సూచిస్తున్నాయి.
ఆ భవనంలో ఉన్న ప్రజల్లో చాలా మంది జిహాదీ ఫైటర్ల కుటుంబాలకు చెందినవారని భావిస్తున్నారు. సిరియాలోని ఇతర ప్రాంతాల నుంచి ఇద్లిబ్‌లో తలదాచుకోవటానికి వీరు వచ్చారని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








