హైదరాబాద్: 'ఐఎస్‌తో సంబంధాలున్న ఇద్దరు యువకుల అరెస్టు'- ఎన్ఐఏ

ఫొటో సోర్స్, AFP
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై హైదరాబాద్‌లో ఇద్దరు యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది.
మొహమ్మద్ అబ్దుల్లా బాసిత్, మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ అనే ఈ ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.
హైదరాబాద్‌లోని హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన బాసిత్ వయసు 24 ఏళ్లు కాగా, చాంద్రాయణగుట్టలో ఉండే ఖాదర్ వయసు 19 ఏళ్లు.
ఐఎస్‌పై భారత్‌లో నిషేధం ఉంది.
భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకుగాను ఐఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో బాసిత్, ఖాదర్ పోషించిన పాత్రను నిర్ధరించాల్సి ఉందని, అందుకే వీరిని అరెస్టు చేశామని ఎన్ఐఏ చెప్పింది.
ఐఎస్ ఆధ్వర్యంలో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు బాసిత్, ఖాదర్ సంసిద్ధత వ్యక్తంచేశారని తమ దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.
''భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలపై షేక్ అజర్ ఉల్ ఇస్లాం, మొహమ్మద్ ఫర్హాన్ షేక్, అద్నాన్ హసన్ అనే ముగ్గురు ఐఎస్ సభ్యులను లోగడ అరెస్టు చేశాం. వీరిపై 2016 జులైలో దిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశాం. షేక్ అజర్ ఉల్ ఇస్లాం, మొహమ్మద్ ఫర్హాన్ షేక్ తర్వాత వారి నేరాన్ని అంగీకరించారు. వారికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మరో నిందితుడు అద్నాన్ హసన్‌పై విచారణ కొనసాగుతోంది'' అని ఎన్ఐఏ పేర్కొంది.
ఇదే కేసులో ఇతర నిందితులపై దర్యాప్తు సాగిస్తుండగా, విశ్వసనీయమైన వర్గాల నుంచి తమకు కొంత సమాచారం అందిందని, అద్నాన్ హసన్‌తో సంబంధాలున్న హైదరాబాద్ యువకుడు బాసిత్, మరికొందరు నిరంతరం ఒకరినొకరు సంప్రదించుకొంటూ ఐఎస్ కార్యకలాపాల వ్యాప్తికి యత్నిస్తున్నట్లు గుర్తించామని ఎన్ఐఏ తెలిపింది.
''ఈ నేపథ్యంలో ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఏడు చోట్ల సోదాలు నిర్వహించాం. సోదాల్లో స్వాధీనమైన సామగ్రిని హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాం. ఈ క్రమంలోనే, ఐఎస్ ఆధ్వర్యాన భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు బాసిత్, ఖాదర్ సంసిద్ధత వ్యక్తంచేసినట్లు గుర్తించాం'' అని ఎన్ఐఏ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో ముస్లింల సమస్యల గురించి మనకు అవగాహన ఉందా?
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- ఒసామా బిన్ లాడెన్ తల్లి: నా బిడ్డ చిన్నప్పుడు చాలా మంచివాడు
- ఇరాక్: ఎన్నికల్లో జాతీయవాద కూటమికి అత్యధిక స్థానాలు
- అమ్మాయిలకు మీసాలు, గడ్డం ఎందుకు వస్తాయి?
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- ‘పీరియడ్స్‌కు ముందు ఆమె మూడ్ హఠాత్తుగా మారిపోయేది...’
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








