ఇరాక్: ఎన్నికల్లో జాతీయవాద కూటమికి అత్యధిక స్థానాలు

ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఒక షియా మిలీషియా మాజీ అధినేత అయిన మొఖ్తాదా సదర్ నేతృత్వంలోని జాతీయవాద 'సేరౌన్' కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. ఇరాక్‌పై అమెరికా దాడికి వ్యతిరేకంగా ఇరాక్‌లో రెండు తిరుగుబాట్లకు మొఖ్తాదా సదర్ లోగడ నాయకత్వం వహించారు.
ఇరాక్ వ్యవహారాల్లో ఇరాన్ ప్రమేయాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎన్నికల్లో మొఖ్తాదా సదర్ పోటీచేయలేదు. కాబట్టి ఆయన ప్రధానమంత్రి కాలేరు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఇరాన్ మద్దతున్న ఆయన ప్రత్యర్థుల కారణంగా ఆయన పలు సంవత్సరాలుగా ఇరాక్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడో స్థానానికి అల్-అబాదీ కూటమి
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్‌పై) విజయం సాధించామని నిరుడు డిసెంబరులో ఇరాక్ ప్రకటించిన తర్వాత జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికలు ఇవే. మే 12న జరిగిన ఈ ఎన్నికల్లో 44.5 శాతం పోలింగ్ నమోదైంది. 329 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ శనివారం వెల్లడించింది.
సేరౌన్ కూటమి 54 స్థానాల్లో గెలవగా, ఇరాన్ అనుకూల ఫతా కూటమి 47 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రధాని హైదర్ అల్-అబాదీ ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి మూడో స్థానానికి పడిపోయింది. కూటమికి 42 సీట్లు వచ్చాయి.
అల్-అబాదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుత ఫలితాలతో ప్రభుత్వ ఏర్పాటు సంక్లిష్టంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
అల్-అబాదీ ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి తృతీయ స్థానానికి పరిమితమైనప్పటికీ, వివిధ పక్షాల మధ్య జరగనున్న చర్చల అనంతరం ఆయన మళ్లీ ప్రధాని పదవిని చేపట్టే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ 90 రోజుల్లో పూర్తికావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








