వివాదంలో ట్రంప్ కుటుంబం: వారికి అంత సంపద ఎలా వచ్చింది? ట్రంప్ తండ్రి ఏం చేసేవారు?

ఫొటో సోర్స్, Getty Images
డోనల్డ్ ట్రంప్ కుటుంబం మరోసారి వార్తల్లోకి వచ్చింది. కానీ, ఈసారి ఆయన పిల్లలకు బదులు తల్లిదండ్రులు, సోదరులు పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కారు.
ట్రంప్ తండ్రి ఫ్రెడ్ రియల్ ఎస్టేట్ రంగంలో బడా వ్యాపారి. ఆయన సంపన్నుడిగా ఎదిగే క్రమంలో వేల కోట్ల డాలర్ల పన్నులను ఎగవేశారని, ఆ సంపదే డోనల్డ్ ట్రంప్ సహా ఆయన వారసులందరికీ సంక్రమించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల కథనం రాసింది.
తన తండ్రి కేవలం ఒక మిలియన్ డాలర్లు మాత్రమే తనకు ఇచ్చాడని, ఆ డబ్బుతోనే తాను అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించానని ట్రంప్ గతంలో చెప్పారు. కానీ, ఆయన మాటలు అబద్ధమని, తండ్రి నుంచి ట్రంప్‌కు 400 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదే అందిందని న్యూయార్క్ టైమ్స్ చెబుతోంది.
తల్లిదండ్రుల నుంచి అందిన డబ్బును దాచిపెట్టేందుకు ట్రంప్, ఆయన సోదరులు నకిలీ సంస్థలను సృష్టించారని ఆ పత్రిక ఆరోపించింది. కానీ, ట్రంప్ సోదరుడు రాబర్ట్ వాటిని ఖండించారు. ఈ క్రమంలో ట్రంప్ కుటుంబ నేపథ్యం కూడా చర్చనీయమైంది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ఎవరు? ఆయన సంపద ఎంత? ఫ్రెడ్ భార్య మేరీ యాన్ ఏం చేసేవారు?
ఫ్రెడ్ పూర్తి పేరు ఫ్రెడిరిక్ క్రైస్ట్ ట్రంప్. ఆయన తల్లిదండ్రులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఫ్రెడ్ తండ్రి మొదట్నుంచీ రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉండేవారు. ఆయన బాటలోనే ఫ్రెడ్ కూడా ఆ వ్యాపారంలోకే అడుగుపెట్టారు. చిన్న వయసులోనే తల్లి ఎలిజబెత్ క్రైస్ట్ పేరిట ఫ్రెడ్ ఓ రియల్ ఎస్టేట్ సంస్థను నెలకొల్పారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, యుద్ధానంతరం అమెరికాలోని మధ్య తరగతి ప్రజల కోసం అందుబాటు ధరల్లో ఫ్రెడ్ గృహ సముదాయాలను నిర్మించారు. ఆ ప్రాజెక్టులతో భారీగా డబ్బు సంపాదించారు. ఈ ప్రాజెక్టులన్నీ ప్రభుత్వ రాయితీలతో నిర్మించినవే. ఈ కాంట్రాక్టుల ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారనే ఆరోపణలపై 1954లో సెనేట్ ఎదుట ఫ్రెడ్ విచారణ ఎదుర్కొన్నారు.
నల్ల జాతీయులకు, ప్యూర్టోరికాకు చెందిన ప్రజలకు తన ఇళ్లను అద్దెకు ఇవ్వకుండా వివక్ష చూపారని 1970ల్లో ఫ్రెడ్‌పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనపైన పౌర హక్కుల ఉల్లంఘన కేసును నమోదు చేశారు. ఆ సమయంలో డోనల్డ్ ట్రంప్ తన వాక్పటిమతో తండ్రికి మద్దతుగా మాట్లాడుతూ పత్రికల్లో నిత్యం ప్రముఖంగా కనిపించేవారు. కొన్నాళ్లకు ఆ కేసును కొట్టేశారు.
మరోవైపు డోనల్డ్ ట్రంప్ చిన్నాన్న(ఫ్రెడ్ ట్రంప్ చిన్న తమ్ముడు) జాన్ ట్రంప్ అమెరికాలో శాస్త్రవేత్తగా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన 44 ఏళ్ల పాటు ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. క్యాన్సర్ చికిత్సతో పాటు అణు రంగంలో కీలక మార్పులకు ఆయన పరిశోధనలు పునాది వేశాయి. ఇప్పటికీ ఆయన పేరును డోనల్డ్ ట్రంప్ నిత్యం తన ప్రసంగాలలో ప్రస్తావిస్తుంటారు.

మేరీ యాన్ - డోనల్డ్ ట్రంప్ తల్లి
డోనల్డ్ ట్రంప్ తల్లి మేరీ యాన్, మెక్‌లియోడ్ స్కాట్‌లాండ్‌లోని ఓ దీవిలో పుట్టి పెరిగారు. స్వదేశంలో ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు 18 ఏళ్ల వయసులో, ఇళ్లలో పనిమనిషిగా ఉపాధి పొందే ఉద్దేశంతో న్యూయార్క్‌కు ఆమె వలస వచ్చారు.
ఆరేళ్ల తరువాత ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడరిక్ ట్రంప్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ పైన ‘క్వీన్స్’ అనే సంపన్నుల ప్రాంతంలో వాళ్లు స్థిరపడ్డారు. ఐదుగురు పిల్లల్లో డోనల్డ్ ట్రంప్ నాలుగోవాడు. యాన్ 1942లో అమెరికా పౌరసత్వం పొందారు.

ఫొటో సోర్స్, Getty Images
మేరీ యాన్ బ్యారీ - డోనల్డ్ ట్రంప్ సోదరి
డోనల్డ్ ట్రంప్ పెద్దక్క మేరీ యాన్ ట్రంప్ బ్యారీకి అమెరికాలోని థర్డ్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్‌లో సీనియర్ జడ్జిగా మంచి పేరుంది. కానీ, డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆమె ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
1999లో నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆమెను ఆ పోస్టుకు నామినేట్ చేశారు. 1983లో రోనల్డ్ రీగన్ ఆమెను న్యూజెర్సీ డిస్ట్రిక్ జడ్జిగా ఎంపిక చేశారు.
‘నేను ఓ ఆస్పత్రిలో ఉన్నప్పుడు డోనల్డ్ ప్రతి రోజూ నన్ను చూడటానికి వచ్చేవాడు. అది చాలు, తనకు నాపై ఉన్న ప్రేమ గురించి చెప్పడానికి’ అంటారు మేరీ.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ - డోనల్డ్ ట్రంప్ అన్న
మొదట తండ్రి వ్యాపారంలోకే అడుగుపెట్టిన ఫ్రెడ్ జూనియర్, తరువాత పైలట్‌గా మారారు. చిన్న వయసులోనే మద్యానికి బానిసైన ఫ్రెడ్ జూనియర్ కొన్నాళ్లకు పైలట్ వృత్తిని వదిలేశారు. చివరికి 1981లో 43ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు.
తన సోదరుడి మరణం చూశాకే, జీవితంలో మద్యం, డ్రగ్స్ ముట్టుకోకూడదని, సిగరెట్లు తాగకూడదని నిర్ణయించుకున్నట్లు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
‘మా అన్నయ్య ప్రభావం నాపైన చాలా ఉంది. మన జీవితం ఎక్కడ ఎలా ముగిసిపోతుందో చెప్పలేం అనడానికి అతడి జీవితమే ఉదాహరణ’ అని డోనల్డ్ ట్రంప్ చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలిజబెత్ ట్రంప్ గ్రౌ
డోనల్డ్ ట్రంప్ కంటే నాలుగేళ్లు పెద్దయిన ఎలిజబెత్ ఓ రిటైర్డ్ బ్యాంకర్. ఆమె సినీ నిర్మాత జేమ్స్ గ్రౌను పెళ్లి చేసుకున్నారు.
రాబర్ట్ ట్రంప్
డోనల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ కుటుంబ వ్యాపారంలోనే స్థిరపడ్డారు. ప్రచారానికి దూరంగా ఉండే రాబర్ట్ న్యూయార్క్‌లో ప్రశాంత జీవితం గడుపుతున్నారు.
తాజాగా ఆయన తండ్రి ఆస్తుల విషయంలో ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో రాబర్ట్ వాటిని ఖండించారు.
ఇవి కూడా చదవండి
- పందొమ్మిది గంటల పాటు ఎక్కడా ఆగకుండా విమాన ప్రయాణం
- స్టాక్ మార్కెట్లు: నష్టాలు ఇప్పట్లో ఆగేనా?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
- బ్రిటన్ కంటే భారత్‌లోనే బిలియనీర్లు ఎక్కువ: అయితే సామాన్యులకు లాభమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








