ప్రయాణాల్లో వాంతులు ఎందుకు అవుతాయి? వీటిని అరికట్టడం ఎలా?

వాహన ప్రయాణాల్లో వాంతులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇఫ్తెకార్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బస్సు, కారు, రైలు, విమానం.. వాహనం ఏదైనా సరే.. ప్రయాణంలో వాంతులు చేసుకోవడం అనేక మంది విషయంలో సర్వ సాధారణం.

వైద్య పరిభాషలో దీనిని మోషన్ సిక్‌నెస్ అని పిలుస్తున్నారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రయాణంలో వాంతులు చేసుకోవడానికి మనస్సు, కళ్ళు, శరీర సమతుల్యత మధ్య సంబంధం ఉందా?

ప్రయాణంలో వాంతి కాకుండా నిరోధించే మార్గాలేమైనా ఉన్నాయా?

ప్రయాణంలో తల తిరగడం, వాంతులు, తలనొప్పి, విశ్రాంతి లేక పోవడం వంటి సమస్యలతో బాధ పడటాన్ని మోషన్ సిక్‌నెస్ అంటారు ఈ సమస్య తరచుగా బస్సు, కారు, రైలు, ఓడ, విమాన ప్రయాణాలలో ఏర్పడుతుంది.

కొంతమంది ఘాట్‌రోడ్లలో ప్రయాణించేటప్పుడు మలుపుల వద్ద ఇలాంటి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు.

భూమిపైన వాహనాల్లో ప్రయాణించేటప్పుడు వాంతులు వచ్చినట్టు, నౌకలు, పడవలపై సముద్రయానం, విమానయానాల్లోనూ ఇలాంటి సమస్యే ఎదురుకావచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బస్సు, కారు, రైలు, విమానం, ప్రయాణం, వాంతులు

ఫొటో సోర్స్, Getty Images

మోషన్ సిక్‌నెస్ అంటే?

ప్రయాణం చేసేటప్పుడు వాంతులు ఎందుకు అవుతాయో దిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మొహ్‌సిన్ వలీ వివరించారు.

"మనం ప్రయాణించేటప్పుడు కళ్ళు, చెవుల నుంచి మెదడు వేర్వేరు సంకేతాలను అందుకుంటుంది" డాక్టర్ మొహ్‌సిన్ వలీ చెప్పారు.

"మీరు కారులో లేదా బస్సులో కూర్చుని, కిందకు చూస్తూ లేదా పుస్తకం చదువుకుంటూ ఉంటే మీరు కదలడం లేదని మీ కళ్లు మెదడుకు చెబుతాయి. కానీ మీ చెవుల్లోని బ్యాలెన్సింగ్ సిస్టమ్ మీ శరీరం కదులుతోందని మెదడుకు చెబుతుంది. ఈ సంకేతాలు శరీరంలోకి విషపూరితమైన పదార్ధం ఏదో ప్రవేశించిందని శరీరాన్ని భావించేలా చేస్తాయి. విషాన్ని ఎలా ఎదుర్కోవాలో శరీరానికి తెలిసిన ఏకైక మార్గం దానిని బయటకు పంపడం. అంటే వాంతి చేసుకోవడం" అని వలీ వివరించారు.

దీని నివారణకు మార్గం కిటికీలోంచి దూరంగా చూడటం. దీని వల్ల కళ్లు, చెవుల నుంచి వచ్చే సంకేతాలను మెదడు సమతుల్యం చేస్తుంది. శరీరానికి కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

బస్సు, కారు, రైలు, విమానం, ప్రయాణం, వాంతులు

మోషన్ సిక్‌నెస్ గురించి బీబీసీ 2015లో ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం మేరకు వాహన ప్రయాణంలో వాంతులు చేసుకోవడం ప్రతీ ముగ్గురిలో ఒకరిని ప్రభావితం చేసే వ్యాధి.

ఇది ఎప్పుడు, ఎవరికి వస్తుందో చెప్పలేమని, దీనికి చికిత్స కూడా లేదని ఈ కథనం తెలిపింది.

"శరీరంలో సమతుల్య వ్యవస్థ మధ్య సమన్వయం లోపించినప్పుడు మోషన్ సిక్‌నెస్ వస్తుంది. ఇది ప్రధానంగా చెవిలోపల ఉండే సమతుల్య అవయవం వెస్టిబ్యులర్ వ్యవస్థకు అనుసంధానమై ఉంటుంది" అని దిల్లీలోని ఎయిమ్స్‌లో న్యూరాలజిస్టు డాక్టర్ మంజరి త్రిపాఠి చెప్పారు.

మనం బస్సు , కారు, రైలు లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు , కళ్లు చెవులు శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదకుడు అందే సమాచారం తప్పుగా వెళుతుంది. ఇది శరీర సమతుల్యతలో పాల్గొనే అవయవాలను మరింత సున్నితంగా చేస్తుంది. దీంతో మెదడు కాండం, హైపోథాలమస్ వంటి భాగాలు ఉత్తేజితమవుతాయి. ఇది మైకం, వికారానికి దారి తీస్తుంది.

సరళంగా చెప్పాలంటే చెవి లోపల సమతుల్య వ్యవస్థ, శరీర కదలికను గ్రహించే వాటిలో ఏర్పడే ఆటంకాల వల్ల మోషన్ సిక్‌నెస్ వస్తుంది.

"మన శరీరాల్లో ఇంద్రియాలనే ప్రత్యేక సెన్సర్లు ఉన్నాయి. ఇవి బాహ్య, అంతర్గత మార్పులను గ్రహించి మెదడుకు సంకేతాలను పంపుతాయి" అని డాక్టర్ త్రిపాఠి చెప్పారు.

బస్సు, కారు, రైలు, విమానం, ప్రయాణం, వాంతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రయాణానికి ముందు తేలిగ్గా తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రయాణాల్లో వికారం ఎందుకు?

ప్రయాణ సమయంలో వికారం సమస్య అందరికీ ఒకేలా ఉండదు. కొంతమంది ప్రయాణం ప్రారంభించిన వెంటనే అసౌకర్యంగా భావిస్తారు. మరి కొంతమందికి చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇలాంటి భావన కలుగుతుంది. ఎగుడుదిగుడుగా ఉండే రహదారులు, కొండ ప్రాంతాల్లో ప్రయాణం, వాహనంలో కుదుపులు, వాహనంలో దుర్వాసన కూడా ఈ సమస్యను తీవ్రం చేస్తాయి.

"మన మెదడులో ఒక ద్రవం ఉంటుంది. మనం ప్రయాణించేటప్పుడు ఇది కదిలి దానిలో ఉత్పన్నమయ్యే కంపనాలు మెడను చేరతాయి. మెడ కదలికతో ఈ కంపనాలు పుర్రెకు ప్రయాణిస్తాయి. ఈ ప్రక్రియ మెదడు సమతుల్యతను దెబ్బ తీస్తుంది" అని డాక్టర్ మొహ్‌సిన్ వలీ చెప్పారు.

ప్రయాణానికి ముందు ఏం తిన్నాం, ఎంత తిన్నాం అనేది కూడా ముఖ్యమని ఆయన అన్నారు.

ఖాళీ కడుపుతో ప్రయాణం: గుండె, మెడ నరాలతో అనుసంధానమై పొట్టలో ఉండే వేగస్ నాడి మరింత చురుగ్గా మారుతుంది. ఇది మెదడు, శరీరంపై ప్రభావం చూపుతుంది. తల తిరుగుతున్న అనుభూతిని కలిగిస్తుంది.

బాగా తిన్న తర్వాత ప్రయాణం: కడుపునిండా తిని వాహనంలో కూర్చున్న తర్వాత అది అరగడానికి చాలా సమయం పడుతుంది. వాహనంలో కుదుపులు, ఇతర అంశాల వల్ల ఫుల్‌గా తిని వాహనం ఎక్కే వారికి త్వరగా వాంతులు రావచ్చు. అందుకే ప్రయాణానికి ముందు తేలికపాటి భోజనం తినమని వైద్యులు సిఫార్సు చేస్తారు.

మోషన్ సిక్‌నెస్ కేవలం ప్రయాణానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని డాక్టర్ మొహ్‌సిన్ వలీ చెబుతున్నారు. ఇది కొన్నిసార్లు మెదడు వ్యాధికి సంకేతం కావచ్చు లేదా మందుల దుష్ప్రభావం కావచ్చు. కొన్ని సందర్భాల్లో మోషన్ సిక్‌నెస్ బ్రెయిన్ ట్యూమర్‌కు కూడా సంకేతం కావచ్చు. ప్రయాణ సమయంలో తరచుగా వాంతులు అవుతుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

బస్సు, కారు, రైలు, విమానం, ప్రయాణం, వాంతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రయాణాల్లో వాంతి రాకుండా నిపుణులు అనేక మార్గాలను సూచించారు.

ఏం చేయాలి?

ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండాలంటే ఈ అంశాలు పాటించవచ్చు.

భోజనం: ప్రయాణానికి ముందు ఎక్కువగా తినకూడదని డాక్టర్ వలీ సూచిస్తున్నారు.

ఖాళీ కడుపుతో ప్రయాణించవద్దు: తేలికపాటి భోజనం లేదా స్నాక్స్ తీసుకోండి.

ఔషధాలు: వైద్యులు సూచించిన వాంతుల నివారణ మాత్రలు తీసుకోవచ్చు.

వాహనంలో నిద్ర: కదులుతున్న వాహనంలో నిద్ర పోకండి. నిద్రవల్ల సమతుల్యత చెదిరిపోతుంది. వాంతులయ్యే అవకాశాలు పెరుగుతాయి.

వికారంగా అనిపిస్తే: ప్రయాణంలో వికారంగా అనిపిస్తే వాహనాన్ని పక్కన ఆపి కాస్త విశ్రాంతి తీసుకోండి. శరీరం కుదుటపడిన తర్వాత ప్రయాణం ప్రారంభించండి. బస్సులు, విమానాల్లో ఇలా ఆగడం కుదరకపోవచ్చు కాబట్టి కవర్లు తీసుకెళ్లడం ఉత్తమం.

నిర్లక్ష్యం చేయద్దు: పదే పదే వాంతులు అవుతుంటే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి

పుస్తక పఠనం: కదులుతున్న వాహనంలో చదవడం వల్ల చలన ఆరోగ్యం మెరుగుపడుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన పరిశోధనా పత్రం చెబుతోంది

కదలికలు తగ్గించండి: తల, భుజాలు, నడుము, మోకాళ్ల కదలికను తగ్గించండి. ముందువైపు చూసే సీటులో కూర్చోండి లేదా ముందు సీటును ఎంచుకోండి. వీలైతే, వాహనాన్ని మీరే నడపండి.

పొగ తాగకండి: ధూమపానం చేసేవారికి వాంతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిగరెట్‌లో ఉండే నికోటిన్ వాంతి అయ్యే పరిస్థితిని తీవ్రం చేస్తుంది.

సంగీతం వినండి: తేలికైన, ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం వల్ల వికారం తగ్గి, ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన పరిశోధన చెబుతోంది.

మోషన్ సిక్ నెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోషన్ సిక్‌నెస్ పురుషుల కంటే మహిళల్లో ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి

ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువా?

మోషన్ సిక్‌నెస్ పురుషుల కంటే మహిళల్లో ఎక్కువని, స్త్రీలలో శారీరక, హార్మోన్ల సమస్యల వల్ల వారికి వాంతి వస్తుందని డాక్టర్ మంజరి త్రిపాఠి చెప్పారు.

మహిళల్లో మోషన్ సిక్‌నెస్ ఎక్కువగా ఉండటానికి మరో కారణం రక్త పోటు అని డాక్టర్ మొహ్‌సిన్ వలీ వివరించారు. సాధారణంగా పురుషులలో మహిళల కంటే సగటు రక్తపోటు ఎక్కువ.

మహిళల్లో ఎక్కువ మంది ఇంటి పనులు చేసేటప్పుడు, ముఖ్యంగా వంట చేసేటప్పుడు ఎక్కువ సేపు నిలబడతారు. దీని వల్ల వారిలో రక్తపోటు తగ్గుతుంది. దీనినే పోశ్చరల్ హైపోటెన్షన్ అంటారు. ఇది తలతిరగడం, వికారాన్ని పెంచుతుంది.

మహిళల శరీరంలో క్రమం తప్పకుండా జరిగే హార్మోన్ల మార్పులు కూడా ముఖ్యమైన అంశం. రుతుస్రావం సమయంలో శరీరంలో ఉప్పు, నీరు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యత నిరంతరం మారుతూ ఉంటుంది.

మహిళల్లో రుతుస్రావం ఎక్కువైతే బీపీ పడిపోతుంది. దీని వల్ల మోషన్ సిక్‌నెస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్ వలీ అన్నారు.

పురుషుల కంటే మహిళల మెదడు పరిమాణం సగటున 150 మిల్లీలీటర్లు తక్కువగా ఉంటుందని డాక్టర్ వలీ చెబుతున్నారు. దీనివల్ల మహిళలు మెదడుపై బాహ్య ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)