హైదరాబాద్, బెంగళూరు సహా దేశంలోని నగరాల్లో నడవటం ఎందుకంత కష్టం?

భారత రోడ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చెరిలాన్ మొలన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలోని ఫుట్‌పాత్‌లపై సౌకర్యవంతంగా నడవగలుగుతున్నారా? దారిలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నారు? అని పాదచారులను అడిగితే, వారు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో లెక్క చెప్పకపోవచ్చు. కానీ చాలా ఫుట్‌పాత్‌లు అధ్వాన్నంగా ఉన్నాయని ఖచ్చితంగా చెబుతారు.

వీధుల్లో నడుస్తున్న ప్రజల అభిప్రాయాలను సేకరించడం ప్రారంభించిన అరుణ్ పాయ్ ఈ విషయాన్ని గ్రహించారు.

“వీధుల్లో నడుద్దాం” అని బెంగళూరు నగరవాసులను ఆహ్వానిస్తూ ఇటీవల ఒక “ఫన్ చాలెంజ్”ను నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో పాల్గొనేవారు 11 కిలోమీటర్ల దూరం, దారి పొడవునా ఉన్న ఫుట్‌పాత్‌లపై నడుస్తూ- చెత్త, విరిగిన సిమెంట్ పలకలు, ఫుట్‌పాత్‌ను ఆక్రమించిన షాపులు వంటి అడ్డంకులన్నింటినీ లెక్కించాలి. ఆ ఫుట్‌పాత్‌లకు 1-5 మధ్య రేటింగ్ ఇవ్వాలి.

“ఫుట్‌పాత్‌లు బాగాలేవని స్థానిక నాయకులకు అర్జీలు పెట్టడం కాకుండా, అందులో ఖచ్చితమైన సమస్యలు గుర్తించి చర్యలు తీసుకోమని చెప్పండి” అని అరుణ్ అన్నారు.

నడకను ప్రోత్సహించేందుకు ‘బెంగళూరు వాక్స్‌’ పేరుతో ఒక కమ్యూనిటీ గ్రూపును ప్రారంభించారు అరుణ్. పాదచారులు సౌకర్యవంతంగా నడిచేట్టుగా రోడ్లు ఉండేందుకు కృషి చేస్తున్న వారిలో అరుణ్ ఒకరు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫుట్‌పాత్

ఫొటో సోర్స్, Getty Images

పాదచారుల మేనిఫెస్టో

దిల్లీలో “దిల్లీ బై సైకిల్” అనే టూర్ కంపెనీ సైక్లింగ్, వాకింగ్ కోసం నగరాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి కృషి చేస్తోంది. దీనిపై అవగాహన కల్పించేందుకు నడక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాకింగ్ యాప్‌లను రూపొందించారు. మార్పు కోసం రాజకీయ నాయకుల మద్దతు కూడా తీసుకుంటున్నారు.

దేశంలోని అతిపెద్ద నగరాల్లో కూడా సరైన ఫుట్‌పాత్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. తరచుగా దుకాణాలు, పార్క్ చేసిన వాహనాలు, పశువులు కూడా ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తాయి. కొన్ని చోట్ల నిరుపేదలు ఫుట్‌పాత్‌లను తమ నివాసంగా చేసుకుంటారు.

ఇక, ఖాళీగా ఉన్న ఫుట్‌పాత్‌ల నిర్వహణ కూడా అంతంత మాత్రమే. విపరీతమైన ట్రాఫిక్‌ ఉండే రోడ్ల వెంట నడుచుకుంటూ వెళ్లడం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంటుంది.

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ముంబయిలోని ‘వాకింగ్ ప్రాజెక్ట్’ అనే గ్రూప్, నగరంలోని రోడ్ల దుస్థితిని హైలైట్ చేస్తూ గత నెల “పాదచారుల మేనిఫెస్టో'ని విడుదల చేసింది.

మెరుగైన పార్కింగ్ సౌకర్యం, వీధుల్లో షాపుల కోసం నిర్ణీత జోన్‌లు, పాదచారులకు, వికలాంగులకు ఉపయోగకరంగా ఉండే కారిడార్లను ఏర్పాటు చేయాలని మేనిఫెస్టో ద్వారా డిమాండ్ చేశారు.

"దేశంలోని నగర జనాభాలో దాదాపు 50 శాతం మంది ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు నడక మార్గాన్నే ఎంచుకుంటారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేట్ రవాణాను ఉపయోగించే 11 శాతం, ఆటోలు, బస్సులలో ప్రయాణించే 15 శాతం మందితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కానీ, రోడ్డు భద్రతకు సంబంధించిన విధి విధానాలు రూపొందించే విషయంలో పాదచారులను ఎక్కువగా పరిగణనలోకి తీసుకోవడం లేదు" అని వాకింగ్ ప్రాజెక్ట్ కన్వీనర్ వెందాంత్ మాత్రే చెప్పారు.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ, కోల్‌కతా లాంటి మహానగరాలతో సహా దేశంలోని దాదాపు అన్ని నగరాల్లోనూ పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్లు

ఫొటో సోర్స్, Getty Images

రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం.. ద్విచక్ర వాహనదారుల తర్వాత పాదచారుల మరణాలు అత్యధికంగా ఉన్నాయి.

2022లో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 10,000 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 21,000 మంది గాయపడ్డారు.

"రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు తరచుగా స్పీడ్ బ్రేకర్లు లేదా కొత్త సిగ్నల్‌ను పెట్టడం వంటి చేస్తారు. కానీ, అధిక జనసంచారానికి అనుగుణంగా ఇంటర్-కనెక్ట్ ఫుట్‌పాత్‌లు అవసరం" అని వెందాంత్ మాత్రే చెప్పారు.

పాదచారుల సమస్యలను పరిష్కరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

2019లో పరిశోధకులు చెన్నైలో 100 కి.మీ. కొత్త ఫుట్‌పాత్‌లతో పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, పౌరుల ఆరోగ్యం, భద్రతలపై ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేశారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 9 శాతం నుంచి 27 శాతం మంది వాహనాలపై వెళ్లేందుకు బదులుగా నడిచేందుకు ఇష్టపడ్డారు. ఈ మార్పు గ్రీన్‌హౌస్ వాయువులు, ఇతర కాలుష్య పదార్థాలు తగ్గేలా చేసిందని పరిశోధకులు గుర్తించారు. ఫుట్‌పాత్‌లు మహిళలు, అల్పాదాయ వర్గాలకు కొత్త అవకాశాలను సృష్టించాయని, వారికి డబ్బు ఆదా చేయడంలో సహాయపడతాయనీ తెలుసుకున్నారు.

విదేశాల్లోని రోడ్లు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నడకను వ్యాయామంగానే చూడటంతో..

వికలాంగులు, మహిళలకు ప్రత్యేక అవసరాలు ఉంటాయని, దానికి అనుగుణంగా ఫుట్‌పాత్‌లను మెరుగ్గా మార్చాల్సిన అవసరం ఉందని ఈ సర్వే అభిప్రాయపడింది.

“మంచి ఫుట్‌పాత్‌లు ఎలా ఉండాలో చాలామందికి తెలియదు. ప్రత్యేకించి వారు విదేశాలకు వెళ్లకపోవడం లేదా పాదచారుల కోసం మెరుగైన సౌకర్యాలున్న ప్రదేశాలను చూడకపోవడం వల్ల కావొచ్చు” అని మాత్రే అన్నారు.

అందుకే దేశంలో ఫుట్‌పాత్‌లకు సంబంధించిన విషయాల్లో కావలసినంత ఆందోళన లేదంటున్నారు మాత్రే. చాలామంది ప్రజలు నడకను వ్యాయామంగా లేదా తీరిక సమయంలో చేసే పనిలా చూస్తారని, అందుకే వారికి వాకింగ్ ట్రాక్‌లు, పార్క్‌లే గుర్తొస్తాయని ఆయన చెప్పారు.

"భారత నగరాల్లో తిరిగేందుకు నడక అత్యంత పొదుపైన మార్గం. పర్యావరణానికి కూడా ఇది మంచిది. మన నాయకులు ప్రజా రవాణాపై ఎంత శ్రద్ధ పెడతారో పాదచారులకు కావలసిన మౌలిక సదుపాయాలపై కూడా అంతే శ్రద్ధ చూపాల్సిన సమయం ఇది" అని మాత్రే అభిప్రాయపడ్డారు.

రద్ధీగా ఉండే రోడ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలా ఫుట్‌పాత్‌లు కనిపించవు

రోడ్లపై కార్ల రద్దీ సమస్యను పరిష్కరించడంపై అధికారులు ఎక్కువ దృష్టి పెట్టడమే ప్రధాన సమస్య అని సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గీతం తివారీ అభిప్రాయపడ్డారు.

"ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు అధికారులు ఫుట్‌పాత్‌లను చిన్నవిగా చేస్తారు లేదా పూర్తిగా తొలగిస్తారు. ఈ విధానం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. వాహనాల రద్దీపై దృష్టి పెడుతూనే పాదచారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే దీర్ఘకాలంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించగలం" అని తివారి చెప్పారు.

రోడ్లు, రహదారుల డిజైనింగ్ ప్రమాణాలను నిర్దేశించే జాతీయ సంస్థ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని తివారి అన్నారు.

సైక్లిస్టులు, పాదచారులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నగరాలు తమ సొంత నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ పాలసీ(ఎన్ఎంటీపీ)ని అమలు చేయొచ్చని సూచిస్తున్నారు.

‘’కానీ, ప్రస్తుతం కొన్ని నగరాలు మాత్రమే ఎన్ఎంటీపీతో ప్రయోగాలు చేశాయి. మరిన్ని నగరాలు కూడా ఇటువంటి ప్రయోగాలు చేయాలి" అని తివారీ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)