జూలియా పాస్ట్రానా: ప్రపంచంలోనే ‘అత్యంత వికారమైన’ మహిళగా ముద్ర, ఈమె శవంతో భర్త దేశాల పర్యటనలు, 153 ఏళ్లకు ఖననం, ఏంటి ఈ కథ?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే ‘అత్యంత వికారమైన’ మహిళగా యూరప్‌లో 19వ శతాబ్దానికి చెందిన ఒక మహిళ ప్రచారం పొందారు.
ఆమె పేరు జూలియా పాస్ట్రానా. అరుదైన జన్యు సంబంధిత వ్యాధి కారణంగా జూలియా ముఖం మొత్తం వెంట్రుకలతో ఉండేది.
ఆమె సర్కస్‌లో పనిచేసేవారు.
జూలియా 1860లో చనిపోయారు. తర్వాత ఆమె మృతదేహాన్ని తీసుకొని ఆమె భర్త చాలా ఏళ్ల పాటు వివిధ దేశాల్లో పర్యటించారు. చివరకు నార్వేలో ఆ ప్రయాణం ముగిసింది.
జూలియా చనిపోయిన 150 ఏళ్ల తర్వాత, ఆమె అవశేషాలను ఆమె స్వస్థలమైన మెక్సికోకు తరలించి ఖననం చేశారు.
2013లో జూలియా అవశేషాలను ఖననం చేశారు.


జూలియాకు ఉన్న వ్యాధి ఏంటి?
జూలియా 1834లో జన్మించారు. ఆమె హైపర్‌ట్రికోసిస్ అనే వ్యాధితో బాధపడేవారు. ఈ వ్యాధి కారణంగానే ముఖం మొత్తం వెంట్రుకలతో, అసాధారణ దవడలతో ఆమె ఇబ్బందిపడ్డారు.
ఇలాంటి ఆహార్యం కారణంగా జూలియాను అందరూ ‘కోతి’ అని లేదా ‘ఎలుగుబంటి’ అని పిలిచేవారు.

ఫొటో సోర్స్, Getty Images
వినోద కార్యక్రమాలను నిర్వహించే థియోడ లాంట్‌ను 1850లలో ఆమె కలిశారు. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. జూలియా ప్రదర్శించిన అనేక సంగీత, నృత్య కార్యక్రమాలను థియోడ నిర్వహించారు.
మాస్కోలో 1860లో కుమారుడికి జన్మనిచ్చాక జూలియా చనిపోయారు. ఆమెకు ఉన్న వ్యాధితోనే జన్మించిన ఆ శిశువు కొన్ని రోజులు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మృతదేహంతో భర్త ప్రయాణం
జూలియా విషాద కథ మరణంతోనే ముగిసిపోలేదు. ఆమె చనిపోయాక కూడా ఆమె మృతదేహంతోనే థియోడ వివిధ దేశాల్లో పర్యటించడం కొనసాగించారు. చివరకు ఆయన నార్వేకు చేరుకున్నారు.
1976లో మరో ఘటన జరిగింది. జూలియా అవశేషాలు దొంగతనానికి గురయ్యాయి. ఎవరో వాటిని తీసుకెళ్లి చెత్తలో పడేశారు. అయితే పోలీసులు ఆమె అవశేషాలను గుర్తించారు.
తర్వాత ఆమె అవశేషాలను ఓస్లో యూనివర్సిటీలో ఉంచారు.
జూలియా బాడీని తిరిగి అప్పగించాలంటూ 2005లో మెక్సికో ఆర్టిస్టు లారా ఆండెర్సన్ బార్బాటా ఒక ప్రచారాన్ని ప్రారంభించారు.
‘‘చరిత్రలో స్థానం దక్కించుకునే, ప్రపంచ జ్ఞాపకాలలో నిలిచిపోయే, తన గౌరవాన్ని తిరిగి దక్కించుకునే హక్కు జూలియాకు ఉంది’’ అని న్యూయార్క్ టైమ్స్ పేపర్‌తో లారా అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
స్వస్థలంలో ఖననం
మెక్సికోలోని సినాలోవా డి లెవా నగరంలో జూలియా అవశేషాలను తెల్లటి రోజాలు అలంకరించిన శవపేటికలో ఉంచి ఖననం చేశారు. దీన్ని చూసేందుకు ప్రజలంతా ఆ నగరానికి పోటెత్తారు.
‘‘మానవజాతి క్రూరత్వాన్ని జూలియా ఎదుర్కొన్నారు. ఆమె జీవించిన తీరు చాలా గర్వకారణం’’ అని జూలియా ఖననం సమయంలో సినాలోవా గవర్నర్ మరియో లోపెజ్ అన్నారు.
‘‘ఒక వ్యక్తి మరొకరి చేతిలో వస్తువుగా మారకూడదు’’ అని ఫాదర్ జెమ్ రెయిస్ రెటాన్ వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














