క్రొషె లేస్: నరసాపురం మహిళల చేతుల్లో ఇమిడిన యూరోపియన్ ఆర్ట్

నరసాపురం, ఆంధ్రప్రదేశ్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న రుస్తంబాద గ్రామంలోని రామాలయం దగ్గర్లో ఒక ఇంటి అరుగు మీద కూర్చుని, ఒక చేతి వేళ్ల మధ్య సన్నని ఇనుప సూదితో, మరో చేతి వేళ్ల మధ్య వేగంగా, ఎంతో ఒడుపుగా దారాన్ని లాగుతూ అందమైన అల్లికగా (క్రొషె లేస్ - Crochet Lace) మలుస్తున్నారు నలుగురు మహిళలు.

వారంతా గృహిణులుగా ఉంటూ, ఉదయం ఇంటి పని, వంట పని చక్కబెట్టి, మధ్యాహ్నపు తీరిక వేళల్లో అరుగు మీదకు చేరి, కబుర్లు చెప్పుకుంటూ ఈ అల్లికల పనిచేస్తున్నారు. నరసాపురం పట్టణం కేంద్రంగా, చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో ఎందరో గ్రామీణ మహిళలకు ఇది కొసరు ఆదాయం తెచ్చిపెట్టే నైపుణ్యం.

ఇది కేవలం కళ అనో, వృత్తి అనో చెప్పలేం. కళాత్మకంగా ఉండే, కొద్దిపాటి నైపుణ్యం అవసరమైన చేతి వృత్తి.

బీబీసీ న్యూస్ తెలుగు

దీనిపై వచ్చే ఆదాయం కుటుంబం గడిచేంత ఉండదు కాబట్టి, మహిళలు తీరిక సమయాల్లో చేసుకునే వ్యాపకంగా స్థిరపడింది.

అలా వేలాది మహిళల నుంచి సేకరించిన అల్లికలను, వందల సంఖ్యలో ఉన్న ఏజెంట్లు సేకరిస్తే, పదుల సంఖ్యలో ఉన్న ఎగుమతిదారులు విదేశాలకు పంపుతూ ఉంటారు.

నరసాపురం, ఆంధ్రప్రదేశ్

మిషనరీలు తెచ్చిన యూరోపియన్ ఆర్ట్

క్రొషె లేస్ యూరప్ దేశాలకు చెందిన కళ. యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో దీనికి ఎక్కువ డిమాండ్. దాదాపు 150-200 ఏళ్ల కిందట ఈ కళ భారత్‌కు పరిచయమైంది.

‘‘ఈ కళను 19వ శతాబ్దంలో యూరోపియన్ క్రైస్తవ మిషనరీలు గోదావరి జిల్లాలకు తీసుకువచ్చారు. అక్కడి దళిత మహిళలకు వారు ఈ నైపుణ్యం నేర్పారు. వారు అల్లిన క్రొషె లేసులను మిషనరీలు ఎగుమతి చేసేవి. కరవు సమయంలో వారికి ఇదో గొప్ప సాయంగా నిలిచింది. కానీ, క్రమంగా దళితుల నుంచి ఓసీ కులాల వారు కూడా ఇందులో పెరిగారు.

1900లలో చదలవాడ జోనా, చదలవాడ జోసెఫ్ అనే ఇద్దరు టీచర్లు మిషనరీల నుంచి ఈ వ్యాపారం తీసుకుని ప్రారంభించారని తెలుస్తోంది.

రచయిత్రి మరియా మీస్ తన ‘లేస్ మేకర్స్ ఆఫ్ నరసాపూర్: ఇండియాన్ హౌజ్ వైవ్స్ ప్రొడ్యూస్ ఫర్ ద వరల్డ్ మార్కెట్’ పుస్తకంలో ఈ కళ ఈ ప్రాంతానికి రావడం నుంచి మొదలు స్థానిక మహిళల ఆర్థిక స్థితిగతులు, పని వాతావరణం, కులం పాత్రపై విపులంగా రాశారు’’ అని బీబీసీతో చెప్పారు మట్టా శ్రీ హర్ష సాయి.

హర్ష దిల్లీలోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్నారు.

జర్మన్ మార్క్సిస్ట్, ఫెమినిస్ట్ రచయిత్రి అయిన మరియా మీస్ నరసాపురం ప్రాంతంలో వ్యక్తిగతంగా పర్యటించి అధ్యయనం చేసి రాసిన పుస్తకమే ‘లేస్ మేకర్స్ ఆఫ్ నరసాపూర్’.

1982లో ప్రచురించిన ఈ పుస్తకంలో ఆనాటి ఆర్థిక స్థితిగతులను ప్రధానంగా చర్చించారు.

నరసాపురం, ఆంధ్రప్రదేశ్

ఈ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుంది.?

నరసాపురం ప్రాంత క్రొషె లేస్ పరిశ్రమ 90 శాతం పైగా అసంఘటితంగా (అనార్గనైజ్డ్) ఉంటుంది. ముందుగా ఈ క్రొషె ఎగుమతిదారులు విదేశాల నుంచి ఆర్డర్ తెచ్చుకుంటారు. ఆ ఆర్డర్‌కి తగ్గట్టుగా డిజైన్లను పేపర్ మీద గీస్తారు. తరువాత దారం రీళ్లను సేకరించి, నిపుణులైన మహిళలకు దారం అందించి, కాగితం మీద ఉన్న డిజైన్‌కి శాంపిల్ తయారు చేయిస్తారు.

ఆ శాంపిల్ డిజైన్‌ను ఇతర మహిళలకు ఇచ్చి, తమకు కావాల్సిన డిజైన్‌లో కావల్సినన్ని అల్లికలు చేయించుకుంటారు. ఈ ప్రక్రియ అంతా ఏజెంట్లుగా పిలిచే మధ్యవర్తుల ద్వారా జరుగుతుంది.

ఏజెంట్లు గ్రామగ్రామాన తిరిగి మహిళలకు ఆ దారపు కండెలు, డిజైన్ శాంపిళ్లు ఇచ్చి, తగిన గడువు ఇచ్చి, తమకు కావాల్సిన డిజైన్లు చేయించుకుంటారు. పూర్తయిన డిజైన్లకు డబ్బులు చెల్లించి ఎగుమతిదారుకు చేరుస్తారు. దారపు కండెల బరువు ఆధారంగా, కేజీల చొప్పున ధర నిర్ణయిస్తారు.

‘‘నేను 7వ తరగతి చదివేప్పుడు మా అమ్మ దగ్గర లేస్ నేర్చుకున్నా. నాకు లేస్ అల్లిక అంటే ఇష్టం. దాదాపు 15 ఏళ్ల నుంచి చేస్తున్నా. ముందు టైంపాస్ కోసం నేర్చుకున్నా. రోజుకు 4 గంటలు పనిచేస్తా. దీని మీద ఆదాయం పెద్దగా రాదు. చిల్లర ఖర్చులకు వస్తుంది. అరకేజీ దారంతో రెండు ఓవర్ కోట్లు ఆరు రోజుల్లో అల్లుతా’’ అని బీబీసీతో చెప్పారు రుస్తుంబాదకు చెందిన ముత్యవేణి.

నరసాపురం, ఆంధ్రప్రదేశ్

అల్లిక తీరుని బట్టి అరకేజీ దారం కుడితే రూ.150 నుంచి రూ.400 వరకూ వస్తుంది. అరకేజీ దారం కుట్టడానికి మూడు నుంచి వారం రోజులు కూడా పడుతుంది. నెలకు ఐదు వందల నుంచి రెండు వేల వరకూ సంపాదించే మహిళలు ఉంటారు. కానీ, స్థిరంగా ఇంత అని ఉండదు.

మహిళ ఆ కుట్టుపనిపై వెచ్చించిన సమయం, అల్లిక ఎంత క్లిష్టమైనదనే దాని ఆధారంగా ఈ ధర ఉంటుంది.

‘‘చదువుకునే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ఆ అమ్మాయిలు ఇది నేర్చుకోరు. కొత్తగా నేర్చుకునే వారి సంఖ్య తగ్గుతోంది. గతంలో నెలకు 500 లేదా వెయ్యి కేజీల అల్లికలు సేకరించేవాళ్లం. అయితే ఇప్పుడు నెలకు 200 కేజీలు సేకరించడం కూడా కష్టంగా ఉంది.

ఆర్డర్లు తగ్గాయి, కుట్టే మహిళల సంఖ్యా తగ్గింది. ఈ వ్యాపారం ఒక్కోసారి బావుంటుంది. ఒక్కోసారి బాగోదు. డిజైన్‌ను బట్టి ధర చెల్లిస్తాం. ఏ గ్రామంలో ఏ మహిళలు ఇవి కుడతారు, ఎవరు వేగంగా చేస్తారు.. వంటి విషయాలు మాకు తెలుసు’’ అని బీబీసీతో చెప్పారు సీతారామపురానికి చెందిన ఏజెంట్ చిమ్మిలి ప్రసాద్.

నరసాపురం, ఆంధ్రప్రదేశ్

క్రొషె నుంచి టెక్స్‌టైల్ వరకూ

ప్రధానంగా ఈ అల్లికలన్నీ విదేశాలకు ఎగుమతి అవుతాయి. ఒకప్పుడు ఎక్కువగా టేబుల్ క్లాత్, టీవీ కవర్, డైనింగ్ టేబుల్ మ్యాట్, ఇతర డ్రెస్సులపై అలంకరణగా లేదా అదనపు లేయర్ డిజైన్‌గా.. ఇలా రకరకాల పద్ధతుల్లో ఈ లేస్ డిజైన్లను చేసేవారు. అమ్మాయిల టీ షర్టులపై కోట్ తరహాలో కూడా వాడతారు.

యూరప్, అమెరికా దేశాల్లో చవకగా వస్తువులు అమ్మే వన్ డాలర్ స్టోర్లలో ఇవి విరివిగా దొరికేవి.

2015 తరువాత నుంచి క్రమంగా ఈ పరిశ్రమ క్షీణిస్తూ వచ్చింది. ఇక్కడ కొత్తగా నేర్చుకునే మహిళలూ తగ్గారు. ఎగుమతులకూ డిమాండ్ తగ్గింది. దీంతో పరిశ్రమను నిలబెట్టుకోవడానికి కొత్తపుంతలు తొక్కుతున్నారు ఎగుమతిదారులు.

టెక్స్‌టైల్ – క్రొషె కలిపి కొత్త బ్లెండ్ సృష్టించి వ్యాపారం చేస్తున్నారు. దుప్పట్లు, దిండు కవర్లు, ఆట బొమ్మలు, నాప్కిన్లు, టవల్స్, డ్రీమ్ క్యాచర్ వంటి నోవల్టీ వస్తువులు.. ఇవన్నీ క్లాత్‌తో చేయించి, దానికి అంచుగానో, అలంకరణగానో ఈ క్రొషె లేస్‌ను ఉంచడం ఇప్పుడు ట్రెండ్‌గా నడుస్తోంది. వీటినే ఇప్పుడు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు.

అలాగే, ఇక్కడ కొన్ని పెద్ద కంపెనీల వారు సొంతంగా డిజైనర్లను కూడా పెట్టుకుని కొత్త రకాల డిజైన్లతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో క్లాత్‌కి సంబంధించిన కీలకమైన పని మొత్తం ఇతర రాష్ట్రాల్లో చేయించి, దానికి క్రొషె భాగాన్ని మాత్రం నరసాపురం పరిసరాల్లో చేయిస్తారు.

గతంలో సంప్రదాయంగా ఆర్డర్లు ఇచ్చే దేశాల నుంచి డిమాండ్ తగ్గగా, ఈ క్లాత్ – క్రొషె బ్లెండ్‌కి కొత్తగా నార్వే, జర్మనీ వంటి మార్కెట్లు ఏర్పడుతున్నాయి.

నరసాపురం, ఆంధ్రప్రదేశ్

బీబీసీ పర్యటించినప్పుడు పూర్తిగా లేస్‌తో మాత్రమే అల్లే అమ్మాయిల ఓవర్ జాకెట్, బ్రా పాంటీ సెట్ చేతులతో అల్లుతూ కనిపించారు కొందరు. మరికొందరు అప్పటికే అల్లిన లేస్ డిజైన్లను క్లాత్‌కి జతచేస్తూ కనిపించారు.

కొందరు మత చిహ్నాలను, మత చిహ్నాలు ఉండే అలంకరణలకు లేస్ బోర్డర్ చేస్తూ కనిపించారు. ఇంకొందరు ఈ క్రొషె లేస్‌తోనే పిల్లలు ఆడుకునే బొమ్మలు, స్త్రీల వస్త్రాలకు లేస్ అలంకరణలు, ఇతర అలంకరణ వస్తువులు చేస్తున్నారు. వాటిని విదేశాలకు ఎగుమతి చేయడంతో పాటు స్థానికంగా కూడా అమ్ముతున్నారు.

నరసాపురం, ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ సాయం అంతంతమాత్రమే..

చేతివృత్తుల అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేస్ పార్క్‌ను, భారత ప్రభుత్వం ఒక అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ తాజాగా డయింగ్ యూనిట్, ఇతరత్రా యూనిట్లు ప్రారంభించగా, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ప్రధానంగా శిక్షణ మీద దృష్టి పెట్టింది.

వాస్తవానికి, ఈ పరిశ్రమలో ప్రభుత్వ జోక్యం, ప్రభుత్వ సాయం తక్కువే.

గతంలో చాలామంది ఎగుమతిదారులు ప్రభుత్వ సహకారంతో దేశ విదేశాల్లో ట్రేడ్ ఎక్స్‌పోలకు వెళ్లి అక్కడ మార్కెటింగ్ చేసేవారు. కానీ, అది కూడా లాభసాటి కాకపోవడంతో క్రమంగా తగ్గింది. ఇప్పుడు కేవలం ఒకట్రెండు కంపెనీలు మాత్రమే అలా చేస్తున్నాయి.

అలాగే, కుటీర పరిశ్రమ తరహాలో చేసేవారూ ఉన్నారు. కార్పొరేట్ తరహాలో అన్ని చట్టపరమైన అనుమతులతో, కార్మిక చట్టాలు, అంతర్జాతీయ స్థాయి కార్మిక మార్గదర్శకాలన్నీ పాటించే సంస్థలూ ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థల ఆడిటింగ్ కూడా ఇక్కడి కంపెనీల్లో జరుగుతూ ఉంటుంది.

ఈ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించే సంస్థలు, తమను కుటీర పరిశ్రమలతో కలిపి చూపించడాన్ని ఇష్టపడవు. దానివల్ల తాము ప్రమాణాలు పాటించడం లేదన్న అభియోగం ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆర్డర్లు పోతాయని వారి ఆందోళన.

నరసాపురం, ఆంధ్రప్రదేశ్

‘‘2000 ప్రాంతంలో వ్యాపారం బావుండేది. 2018 నుంచి తగ్గుతూ వచ్చింది. కోవిడ్ తరువాత కొత్త దేశాల్లో కొత్త మార్కెట్లు పరిచయం అవుతున్నాయి. ఇప్పుడు క్రమంగా టెక్స్‌టైల్‌తో కలిపి క్రొషె చేస్తున్నాం. ముందు ముందు మళ్లీ ఈ రంగం వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. గతంలో యూరప్‌లోని జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ నుంచి అలాగే, ఉత్తర అమెరికాలో ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు జపాన్, డెన్మార్క్, బెల్జియం వంటి దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి’’ అని బీబీసీతో చెప్పారు సీతారామపురానికి చెందిన ఎగుమతిదారు అడ్డగళ్ల బాబీ.

లేస్ అల్లికలను ఏజెంట్ల ద్వారా గ్రామీణ మహిళల నుంచి సేకరిస్తారు బాబీ. టెక్స్‌టైల్‌ పనులను తన సంస్థలోని మహిళా సిబ్బందితో చేయిస్తారు. లేస్ పని రాకపోయినా, కుట్టుమిషన్ వచ్చిన మహిళలకు ఇలాంటి సంస్థల్లో ఉపాధి దొరుకుతోంది.

‘‘ఈ రంగంలో ప్రభుత్వ పాత్ర తక్కువే. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణ విషయంలో మాకు అసంతృప్తి ఉంది. వారు శిక్షణ పేరుతో కొన్ని రోజుల కార్యక్రమం పెడతారు. కొత్తగా నేర్పేది ఏమీ ఉండదు. కానీ, ఆ రోజుల్లో మాకు ఎగుమతులు ఆలస్యం అయిపోతున్నాయి. పరోక్షంగా వారు పరిశ్రమకు నష్టం చేస్తున్నారు. వారు పరిశ్రమతో అనుసంధానం కావాలి’’ అన్నారు బాబీ.

నరసాపురం, ఆంధ్రప్రదేశ్

'ఇటలీ ఆర్డర్ ఒకటే చేతిలో ఉంది'

ఇక్కడ ఎగుమతిదారులు మెజార్టీ ఓసీ కులాలకు చెందిన వారు. అయితే ‘గోదావరి డెల్టా స్త్రీల లేసు పనివారి సహకార సంఘం’ అనే ప్రైవేటు సొసైటీని మాత్రం ఒక దళిత మహిళ నడుపుతున్నారు.

1978లో హేమలత అనే మహిళ ఈ సొసైటీని స్థాపించారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా మహిళలకే పని ఇచ్చేవారు. అప్పట్లో 600 మంది సభ్యులతో వెలిగిన ఈ సంస్థ ఇప్పడు 100-150 మంది సభ్యులకు పరిమితమైంది.

‘‘మాకు గతంలో చాలా ఆర్డర్లు ఉండేవి. ఇప్పుడు బాగా తగ్గాయి. అప్పట్లో యూఎస్, జపాన్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాకు ఆర్డర్లు చేశాం. ప్రస్తుతం ఇటలీ ఆర్డర్ ఒకటే చేతిలో ఉంది. దీంతో మేం కొత్త ప్రయోగాలు చేస్తున్నాం. జీన్స్‌తో లేస్, కళంకారి లేస్, లేస్‌తో అల్లిన బొమ్మలు వంటివి చేస్తున్నాం. మహిళలకు గతంలో ఇచ్చినంత పని ఇవ్వలేకపోతున్నాం. అయితే, మళ్లీ ఈ రంగానికి మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతున్నా’’ అని బీబీసీతో చెప్పారు ఈ సొసైటీ నిర్వాహకురాలు శాంతి.

ప్రభుత్వం ఇచ్చే శిక్షణ, ఈ వృత్తివారికి ప్రభుత్వం కల్పించే ఇతర సౌకర్యాలు, ఆ శిక్షణపై ఏజెంట్లు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై ప్రభుత్వ అధికారులను బీబీసీ సంప్రదించింది, వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)