కేంద్ర బడ్జెట్ 2024: అమరావతికి 15,000 కోట్లు, అది రుణమా, గ్రాంటా?

అమరావతిలో బుద్ధుడి విగ్రహం
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు సమకూరుస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

ఇప్పుడు ఈ నిధుల విషయంపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది.

ఈ మొత్తాన్ని గ్రాంటు రూపంలో కాకుండా అప్పుగా కేంద్ర ప్రభుత్వం అందించనుందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మాత్రం దీనికి కౌంటర్‌గా అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంటుందంటూ ప్రచారం చేస్తున్నారు.

ఇంతకీ ఈ బడ్జెట్‌లో చెప్పిన 15 వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అప్పు రూపంలో సమకూర్చుతుందా లేక గ్రాంటు రూపంలో ఇస్తుందా? అనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి దాకా స్పష్టమైన సమాధానం రాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
వీడియో క్యాప్షన్, కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు ఏమిచ్చారంటే

బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు?

బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారు? తర్వాత ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు? అనేది ఒకసారి చూద్దాం.

కేంద్ర బడ్జెట్-2024-25ను జులై 23న పార్లమెంటులో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని చెప్పారు.

‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి, మల్టీ‌లేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందేందుకు ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు సమకూరుస్తాం. వచ్చే సంవత్సరాల్లోనూ అదనపు నిధులు సమకూరుస్తాం’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు.

‘‘మొట్టమొదటిసారిగా ఐదేళ్ల తర్వాత కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు లభించింది. దీంతో నమ్మకం పెరిగే పరిస్థితి వచ్చింది. అమరావతి క్యాపిటల్‌కు స్పెషల్ ఫైనాన్స్ సపోర్టు మల్టీ లేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా 15 వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. బడ్జెట్‌లో ఫైనాన్స్ మినిష్టర్ స్పష్టంగా చెప్పారు’’ అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు ప్రసంగంలో కూడా ఎక్కడా కేంద్రం చెప్పిన రూ.15 వేల కోట్లు గ్రాంటా? అప్పా? అనే స్పష్టత లేదు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రెస్‌మీట్‌లో నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు?

బడ్జెట్ ప్రసంగం తర్వాత దిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు.

అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె చెప్పారు.

ఆ సందర్భంలో అమరావతి కోసం ప్రకటించిన రూ.15 వేలు కోట్లు గ్రాంటు రూపంలో ఇస్తారా.. లోన్ (అప్పు) రూపంలో ఇస్తున్నారా? అని ఒక విలేఖరి ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్టు మేరకు స్టేట్ క్యాపిటల్ బిల్డ్ (నిర్మాణం) చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హెల్ప్ చేయాలని యాక్టులోనే ఉంది. క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డ్ చేయడానికి మేం అసిస్టెన్స్ ఇవ్వాలి. మేం చెప్పిన 15 వేల కోట్లు వరల్డ్ బ్యాంకు అసిస్టెన్స్ వాళ్లకు (ఏపీకి) తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవ్వాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది. అది వాళ్లు ఇస్తారా.. ఇవ్వలేరా? మేం సెంట్రల్ నుంచి గ్రాంటు ఇచ్చుకుంటామా.. ఇవన్నీ చూసి వాళ్లతో మాట్లాడుకుని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి క్యాపిటల్ లేకుండా పది సంవత్సరాలు వెళ్లిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని ఉండాలి. భారత దేశంలో క్యాపిటల్ లేకుండా ఒక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రానే. యాక్టు ప్రకారం ఈపాటికే అక్కడ క్యాపిటల్ ఉండాల్సింది’’ అని ఆమె అన్నారు.

దీంతో అమరావతికి సమకూర్చుతామన్న 15 వేల కోట్ల రూపాయలు రుణమా, గ్రాంటా అనే విషయంపై స్పష్టత లేదు. ఇందులో ఎక్కువ భాగం అప్పుగా, కొంత భాగం గ్రాంట్‌‌గా సమకూరుస్తారా? లేక అందులో ఎంత భాగం అప్పు ఉంటుంది? ఎంత భాగం గ్రాంట్ ఉంటుంది? వంటి విషయాలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.

మంత్రి నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

అమరావతికి ప్రకటించిన రూ. 15 వేల కోట్లు రుణమా.. లేదా గ్రాంటు అన్న విషయంపై విజయవాడ లయోలా కళాశాల ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ అనంత్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.

‘‘బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు.

అమరావతి నిర్మాణానికి మల్టీ లేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా 15 వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని చెప్పారు.

సాధారణంగా ఈ ఏజెన్సీలు వరల్డ్ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు వంటివి ఉంటాయి.

వాటి నుంచి ఆ మొత్తాన్ని అందిస్తామని నిర్మలాసీతారామన్ చెప్పారు. అది రుణంగానే వస్తుంది.

నేరుగా రాష్ట్రాలు ఆయా ఏజెన్సీల నుంచి అప్పులు తీసుకోవడానికి ఇబ్బంది కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని రాష్ట్రానికి ఇస్తారు.

తర్వాత ఆ మొత్తాన్ని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. ఏజెన్సీల నుంచి తీసుకున్నప్పుడు అది అప్పుగానే పరిగణించాలి’’ అని అనంత్ చెప్పారు.

కౌంటర్‌పార్ట్ ఫండింగ్ ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పినప్పటికీ, అది ఎంత శాతమనే విషయాన్ని చెప్పలేదని ఆయన బీబీసీకి వివరించారు.

ఏజెన్సీల తరఫున ఎంత శాతం ఇస్తారు.. కేంద్రం ప్రభుత్వం నుంచి ఎంత శాతం ఇస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)