ఆంధ్రప్రదేశ్: మాస్టర్ ప్లాన్ మార్పుతో అమరావతి భవితవ్యం మారిపోతుందా? పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయా?

అమరావతి

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN

ఫొటో క్యాప్షన్, అమరావతి
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతికి సంబంధించిన మాస్టార్ ప్లాన్ మారుస్తూ గెజిట్ విడుదల చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, తుది నిర్ణయం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీయే) అడుగులు వేసింది. అయితే, దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అమలులోకి వస్తే అమరావతి భవితవ్యాన్ని తారుమారుచేసే నిర్ణయమవుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు.

రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో సీజేఐ విచారణ జరగాల్సి ఉండగా, ఈ కేసుపై గతంలో తాను న్యాయ సలహా ఇచ్చి ఉన్నందువల్ల ఇప్పుడు ఈ కేసు విచారణను చేపట్టబోనని చీఫ్ జస్టిస్ యుయు లలిత్ తెలిపారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి, దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది చర్చనీయాంశం అవుతోంది.

అమరావతిలో భవనాలు (ఫైల్ ఫొటో)
ఫొటో క్యాప్షన్, అమరావతిలో భవనాలు (ఫైల్ ఫొటో)

ప్రభుత్వ గెజిట్ ప్రకారం..

సీఆర్డీయే చట్టం 2014 సెక్షన్ - 53(డి) ప్రకారం ల్యాండ్ ఫూలింగ్ కింద సమీకరించిన మొత్తం విస్తీర్ణంలో కనీసం 5 శాతం గృహ నిర్మాణాలకు కేటాయించవచ్చు అనే అంశాన్ని ప్రభుత్వం ఆధారంగా మార్చుకుంది.

ఇటీవల జరిగిన సమావేశాల్లో ఏపీ అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందిన బిల్లుకు గవర్నర్ రాజముద్ర వేయడంతో చట్ట రూపం దాల్చింది.

ఏపీ సీఆర్డీయే చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ లేదా జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో సవరణలు చేయడానికి ప్రత్యేక అధికారి లేదా ఎవరైనా ఇంఛార్జ్ ప్రతిపాదనలపై ముందుకు సాగేందుకు అవకాశం కల్పించారు.

దానిని అనుసరించి కొత్త జోన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆర్ 5 పేరుతో హౌసింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు అక్టోబర్ 28 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కురగల్లు, నిడమర్రు, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల భూములు U1 రిజర్వ్ జోన్‌లో ఉన్నాయి. కాలుష్య రహిత పరిశ్రమల జోన్, టౌన్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, బిజినెస్ పార్క్ జోన్ వంటి వాటి పరిధిలోకి వస్తాయి.

ఈ గ్రామాల భూములను కొత్త ప్రతిపాదనల ప్రకారం R5 జోన్‌గా మారుస్తున్నారు. దాని ద్వారా 900.97 ఎకరాల భూమిని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించబోతున్నారు. పేదలు, అర్హులందరికీ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఏ జోన్ నుంచి ఎంత భూమిని హౌసింగ్ జోన్‌లో చేర్చబోతున్నారనే వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. వాటిపై అభ్యంతరాలు, అభిప్రాయాలను నవంబర్ 11లోగా ఏపీ సీఆర్డీయే కి తెలియజేయాలంటూ ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదలయ్యింది.

నిర్మాణపనులు జరుగుతున్న ఏపీ హైకోర్టు అదనపు భవనాలు.
ఫొటో క్యాప్షన్, నిర్మాణపనులు జరుగుతున్న ఏపీ హైకోర్టు అదనపు భవనాలు.

ఏం జరగనుంది..

ప్రస్తుతం తాత్కాలిక సెక్రటేరియేట్, హైకోర్టు ఉన్న ప్రాంతమే కాకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతిపాదిత పాలనా కేంద్రానికి చేరువలో ఈ భూములున్నాయి. ఈ అయిదు గ్రామాల భూములను పేదలకు, ఇతరులకు నివాస స్థలాలుగా పంచాలని ప్రభుత్వం నిర్ణయించడం తొలుత వేసిన అమరావతి మాస్టర్ ప్లాన్‌లో కీలక మార్పు అవుతుంది.

గతంలో సీఆర్డీయే రూపొందించిన ప్లాన్ ప్రకారం, సెక్రటేరియట్ సహా అన్ని కీలక కార్యాలయాలు నిర్మించాల్సిన ప్రాంతానికి ఆనుకుని పేదల కాలనీలు వస్తాయి. ప్రతిపాదిత కార్యాలయాలకు వెళ్లాల్సిన మార్గంలోనే ఈ హౌసింగ్ జోన్ ఉంటుంది. అటు గుంటూరు, ఇటు విజయవాడ నుంచి ఎవరు ప్రధాన రాజధాని ప్రాంతానికి చేరుకోవాలన్నా ఈ హౌసింగ్ జోన్ దాటి వెళ్లాల్సి ఉంటుంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ పథకం కింద అందిస్తున్న సెంటు, సెంటున్నర స్థలం చొప్పున అక్కడ కూడా కేటాయిస్తే, నిర్మాణాలకు పట్టాదారులు సిద్ధమయితే సంబంధిత 900 ఎకరాల్లో పెద్ద కాలనీలు ఏర్పడతాయి. వేల కొద్దీ పేదల ఇళ్లు నిర్మితమవుతాయి.

వాటికి అనుగుణంగా గతంలో ప్రతిపాదించిన ప్రణాళికను మార్చాల్సి ఉంటుంది. అంటే అమరావతి ప్రాజెక్టు దాదాపుగా తలకిందులవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పేదల వాడలు నిర్మిస్తారా?

సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా వేసిన మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసి అమరావతి ప్రాంత భూములను దుర్వినియోగం చేసే ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకుంటోందని అమరావతి పరిరక్షణ సమితి ఆరోపిస్తోంది.

ప్రభుత్వం ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చిన సెంటు, సెంటన్నర స్థలాల్లో ఇళ్ల నిర్మాణం వల్ల మురికివాడలు వెలుస్తున్నాయని, ఇది అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణ ప్రతిపాదనలకు పూర్తి విరుద్ధమని హైకోర్ట్ న్యాయవాది ఎల్.సుధాకర్ అభిప్రాయపడ్డారు.

"మాస్టర్ ప్లాన్‌లోనే జోన్ 3లో పేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. రాజధాని గ్రామాల్లో భూమిలేని పేదలను గుర్తించారు. 14వేల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే 89 ఎకరాలు కేటాయించారు. టిడ్కో పథకంలో 5024 ఇళ్లు నిర్మించారు. బహుళ అంతస్తుల భవనాల కారణంగా అందరికీ నివాసయోగ్యంగా ఉంటుంది. అందుకు భిన్నంగా 40,50 వేల మంది పేదలకు దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ మారుస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది. అమరావతి మీద కక్షతో, రాజధాని నగర భవిష్యత్తును దెబ్బతీయాలనే కుట్ర కనిపిస్తోంది" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న రెండో ప్రయత్నమిదని సుధాకర్ అన్నారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు కుదరవని 2020 మార్చిలో ఏపీ హైకోర్టు చెప్పిందంటూ గుర్తు చేశారు. ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదన్నారు.

దాదాపు 90 శాతం పనులు పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
ఫొటో క్యాప్షన్, దాదాపు 90 శాతం పనులు పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

రాజధానిలో పేదలు ఉండకూడదా?

రాజధాని నగరం పేరుతో పేదలకు చోటు లేకుండా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో మార్పులు అవసరమని తాడేపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దొంతిరెడ్డి ప్రవీణ్ అన్నారు.

రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు గతంలో చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారని, ఈసారి చట్టం ప్రకారం జరుగుతున్న ప్రయత్నాన్ని నిలువరించలేరని ఆయన అన్నారు.

"రాజధాని భూముల్లో 900 ఎకరాలు పేదలకు కేటాయిస్తే తప్పవుతుందా? తాడేపల్లి, ఉండవల్లి మాత్రమే కాకుండా విజయవాడ నగరంలోనూ వేల మంది పేదలు ఇళ్లు లేకుండా ఉన్నారు. వారందరికీ నివాసయోగ్యం కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంటోంది. దీనిని ఆహ్వానించాలి. రాజధాని అంటే ప్రజలు లేకుండా నిర్మించే భవనాలు కాదు. పేదలు కూడా ఉండాలి. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు. అందులో పని చేసేందుకు సిబ్బంది ఎక్కడి నుంచి రావాలి? పాత ప్లాన్ ప్రకారం దరిదాపుల్లో ఎక్కడా పేదలకు అవకాశం ఉండదు. అందుకే మార్పు చేస్తున్నారు. ఇప్పటికే సెక్రటేరియేట్, హైకోర్టులో పనిచేసే కిందస్థాయి సిబ్బంది కూడా దూరం నుంచి రావాల్సి వస్తోంది. అలాంటి సమస్య ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని" ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తానంటే అమరావతి ఉద్యమకారులకు, విపక్షాలకు రుచించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రయత్నం హర్షించదగ్గదని పేర్కొన్నారు.

ఇది రాజకీయ వ్యూహమే..

అమరావతి నగర నిర్మాణం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఆర్ 5 జోన్ విషయంలో విపక్షాలు ఆచితూచి స్పందించాలని నిర్ణయించుకున్నాయి.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనే రీతిలో ప్రచారం చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రతిపక్ష టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రక్రియలో న్యాయపరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నందున వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని స్పందించాలనే ఆలోచనతో ఉంది.

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్న తరుణంలో తాజా నిర్ణయం కూడా అందుకు కొనసాగింపుగా చూడాలని సీనియర్ జర్నలిస్ట్ పి.చంద్రశేఖర్ అన్నారు.

"ప్రాంతీయంగా సమీకరణాలు ప్రారంభించింది. విశాఖ గర్జన, తిరుపతి సభ, కర్నూలులో కార్యక్రమాలు అన్నీ ప్రభుత్వ తీరుని చాటుతున్నాయి. అధికారపక్షమే ముందుండి నడిపిస్తోంది. అదే సమయంలో హైకోర్టు తీర్పు మీద స్టే కోరుతూ ప్రభుత్వం వేసిన పిటీషన్ నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఒకవైపు ప్రభుత్వ పరంగా చట్టం పరిధిలో సాగుతూ, రెండోవైపు ప్రజలను సమీకరించాలనే సంకల్పానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆ క్రమంలోనే రాజధాని మాస్టర్ ప్లాన్ మార్పు ద్వారా అమరావతి నగర స్వరూపాన్నే మార్చేసేందుకు సంకల్పించినట్టు భావించాలి" అంటూ ఆయన బీబీసీతో అన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎవరూ అడ్డు చెప్పరు కానీ, అమరావతి పరిస్థితులు వేరు అన్నది గుర్తించాలని అన్నారు. రాజధాని కోసం ఏ ప్రాంతంలో ఏది నిర్మిచాలనే నిర్ణయాన్ని తిరగదోడడం ద్వారా అమరావతిపై ప్రభుత్వం తన వైఖరిని చాటుతున్నట్టు గ్రహించాలన్నారు. హౌసింగ్ జోన్ ఏర్పాటు అమరావతి ప్రతిపాదనలపై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, వైఎస్ జగన్: ‘మూడు రాజధానులపై ముందుకే.. వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)