Morbi Bridge: ‘‘నా దగ్గరున్న తాడుతో 15 మృతదేహాలను బయటకు తీశా’’: ప్రమాద ఘటనను వివరించిన ప్రత్యక్షసాక్షి

ఫొటో సోర్స్, AFP
గుజరాత్‌లోని మోర్బీలో జరిగిన వంతెన ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 141 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత పరిస్థితులను రిపోర్ట్ చేసేందుకు బీబీసీ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. ఎటు చూసినా వారికి బాధాకరమైన దృశ్యాలే కనిపించాయి.
ఓ యువకుడు ఏడుస్తూ బీబీసీ ప్రతినిధులకు ఎదురయ్యారు. ఏం జరిగిందని బీబీసీ ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించారు. ''బ్రిడ్జి కూలినప్పుడు నేను, నా చెల్లి బ్రిడ్జి మీద ఉన్నాం. నేను బతికి బయటపడ్డాను. కానీ, నా చెల్లెలు ఇంకా కనిపించ లేదు. తనకు ఆరేళ్లు ఉంటాయి. ఆమె కోసమే వెతుకుతున్నాను'' అని ఆ యువకుడు వెల్లడించారు.
''నిన్న సాయంత్రం నుంచి వెతుకుతున్నా. ప్రభుత్వాసుపత్రికి వెళ్లాను అక్కడ లేదు. చాలాచోట్ల వెతికాను. కానీ కనిపించలేదు'' అని ఆ యువకుడు వివరించాడు.
కూలి పని చేసుకుని జీవించే ఆ యువకుడు బ్రిడ్జికి కొద్ది దూరంలోనే నివాసం ఉంటున్నారు. ఆ రోజులు అన్నాచెల్లెలు, అందరు పర్యాటకుల మాదిరిగానే బ్రిడ్జి మీదకు వచ్చారు. అప్పుడే ప్రమాదం జరిగింది.

బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య సహాయక సిబ్బందితో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు.
ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న కుమార్ రెస్క్యూ ఆపరేషన్‌లో తమ బృందాలు ఎదుర్కొంటున్న సవాళ్లను బీబీసీతో పంచుకున్నారు.
''ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉంది. పైగా అది ఎక్కువగా మురుగు నీరు. లోపల మనుషులు ఉన్నారని గుర్తించడం చాలా కష్టమైంది. రాత్రి పూట డైవర్లు నీళ్లలో లైటు వేసుకుని దిగినా మృతదేహాలు కనిపించలేదు. ఇది పెద్ద సమస్య'' అని ఆయన అన్నారు.
అక్కడి నీళ్లను తోడివేయడం చాలా కష్టమైన ప్రక్రియ అని ప్రసన్న కుమార్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బీబీసీ అసోసియేట్ జర్నలిస్టు రాకేశ్ అంబాలియా సాయంత్రం 6.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
''ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అంబులెన్స్‌లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. నీటిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించడంలో స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు'' అని అంబాలియా చెప్పారు.
''నేను అక్కడికి చేరుకునే సరికి పెద్ద ఎత్తున కేకలు వినిపిస్తున్నాయి. అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కొంతమంది వంతెన రెయిలింగ్‌ను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. కొంతమంది నీళ్లలో పడిన వంతెన భాగాలపై ఎక్కి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికే చాలామంది నీటిలో మునిగిపోయారు. మిగిలిన వారు రక్షించాలంటూ కేకలు వేస్తున్నారు'' అని అంబాలియా చెప్పారు.
''ఓ వ్యక్తి నీళ్లలోంచి బయటకు వస్తూ, నేనెలాగో బతికిపోయాను. లోపల చాలామంది ఉన్నారు. వాళ్లను రక్షించండి'' అని అరుస్తూ పరిగెత్తారని అంబాలియా అన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే నగరంలోని అంబులెన్స్‌లన్నీ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని నగరాల నుంచి అంబులెన్స్‌లను కూడా పిలిపించారు. మోర్బీ అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
''నేను తాడుతో 15 మృతదేహాలను బయటకు తీశాను''
విరిగిపోయిన బ్రిడ్జి ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలో రమేశ్ భాయ్ జిలారియా నివసిస్తున్నాడు.ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారని ఆయన వెల్లడించారు.
"నేను ఈ దగ్గరలోనే ఉంటాను. ప్రమాదం జరిగిందని తెలిసింది. నేను వెంటనే తాడుతో అక్కడికి వెళ్లాను. ఆ తాడు సహాయంతో 15 మృతదేహాలను బయటకు తీశాను'' అని ఆయన బీబీసీతో అన్నారు.
"నేను వచ్చేసరికి, విరిగిన వంతెనపై యాభై నుండి అరవై మంది వేలాడుతున్నారు. వారిని జాగ్రత్త పైకి తీసుకొచ్చాం. నేను తీసిన మృతదేహాలలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు'' అని రమేశ్ భాయ్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షి అయిన సుభాష్ భాయ్ మాట్లాడుతూ '' పని ముగించుకుని నేనూ, నా స్నేహితుడూ బ్రిడ్జి దగ్గర కూర్చున్నాం. ఒక్కసారిగా బ్రిడ్జి విరిగిన శబ్దం వినిపించింది. వెంటనే అటువైపు వెళ్లి వాళ్లను రక్షించే ప్రయత్నం చేశాం'' అని సుభాష్ భాయ్ వెల్లడించారు.
''కొందరు ఈదుకుంటూ బయటకు వస్తున్నారు. మరికొందరు నీట మునిగి చనిపోయారు. ముందుగా పిల్లలను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత ఒక పైపు తీసుకుని, దాని సహాయంతో పెద్ద వాళ్లను కాపాడే ప్రయత్నం చేశాం. నేను ఎనిమిది తొమ్మిది మందిని రక్షించాను. రెండు మృతదేహాలను బయటకు తీశా" అని సుభాష్ భాయ్ వివరించారు.
''అంతా క్షణాల్లో జరిగిపోయింది. కొంతమంది బ్రిడ్జికి వేలాడుతున్నారు. చేతులు నొప్పి పుట్టడంతో కొందరు బ్రిడ్జిని వదిలేసి నీళ్లలో పడిపోతున్నారు. అందులో దాదాపు 7 నెలల గర్భం ఉన్న మహిళ కూడా ఉన్నారు. ఆమె నీళ్లలో పడిపోవడం చూసి నేను షాకయ్యాను'' అని బ్రిడ్జి సమీపంలో టీ అమ్ముకునే ఓ వ్యక్తి ఏఎన్ఐ వార్తా సంస్థకు తాను చూసిన విషయాలను చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
''వాళ్లలో కొందరిని రక్షించడానికి నేను ప్రయత్నించా. కొందరిని ఆసుపత్రికి పంపగలిగా'' అని ఆ వ్యక్తి వెల్లడించారు.
''ఓ చిన్నపాప నీళ్లలో పడిపోయింది. మేం ఆమెను రక్షించాం. అప్పటికి ఆమె బతికే ఉండటంతో మేం చాలా సంతోషించాం. కానీ, ఆసుపత్రికి తీసుకెళుతుండగా మా కళ్ల ముందే చనిపోయింది'' అని ఆయన వివరించారు.
'' నేను, నా కొడుకులు ఇద్దరు రాత్రంగా వాళ్లను ఆసుపత్రికి పంపే సహాయక చర్యల్లోనే ఉన్నాం. వీళ్లను ఆసుపత్రికి చేర్చడానికి మా ఇంట్లో ఉన్న రెండు వాహనాలను స్థానికులకు ఇచ్చాం'' అని బ్రిడ్జి సమీపంలో నివసించే హసీనా బెన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
''నేను కొంతమంది పిల్లలను నా చేతుల మీదుగా ఆసుపత్రికి తీసుకెళ్లా. కానీ వాళ్ల ప్రాణాలు అప్పటికే పోయాయని ఆసుపత్రికి వెళ్లాక తెలిసింది'' అంటూ హసీనా కన్నీరు పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
‘‘ఇలాంటి దృశ్యాలు నా జీవితంలో చూడలేదు’’
విరాల్ భాయ్ దోషి అనే గ్రామస్థుడు తాను ఇక్కడ చూసిన ఘోరమైన విషాదాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. రాత్రంతా ఆయన నదిలో దొరికిన వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించడంలో సహకరించారు.
ఇప్పటి వరకు దాదాపు 135 మృతదేహాలను తొలగించినట్లు బ్యాంకు మేనేజర్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దీపేష్ భానుశాలి బీబీసీకి తెలిపారు. ’’చాలా మంది తప్పిపోయారు. కుటుంబ సభ్యుల మృతదేహాలు లభ్యం కావడం లేదని పలువురు వాపోతున్నారు. అందువల్ల నదిలో ఇంకా మృతదేహాలు ఉండొచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
సమీపంలోని సివిల్ ఆసుపత్రికి వెళ్లిన ఫోటో జర్నలిస్ట్ విపిన్ మాట్లాడుతూ ‘‘ఆసుపత్రిలో ఎక్కడ చూసినా మృతదేహాలు. జనం ఏడుస్తున్నారు. డాక్టర్లు వస్తున్నారు, పేషెంట్‌ని చూసి వెళ్లిపోతున్నారు. ఆసుపత్రిలో సాధారణం కంటే రద్దీ ఎక్కువగా ఉంది.’’ అంటూ అసుపత్రి వద్ద పరిస్థితులను వివరించారు.
ఈ ప్రమాదంలో కొందరు తమ పిల్లలను పోగొట్టుకున్నారు, మరికొందరు జీవిత భాగస్వామిని కోల్పోయారు, మరికొందరు తమ దగ్గరి బంధువులను శాశ్వతంగా కోల్పోయారు.

‘‘మా చొక్కాలతో కాపాడాం’’
ఘటన జరిగిన సమయంలో ఆ దారిలోనే వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కాంతిబాయి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే కాంతీ భాయ్.
‘‘ నేను ఇక్కడనుంచి వెళ్తుంటే వంతెన తెగి పడిపోయి కనిపించింది. నేను వెంటనే ఆ వీడియో పంపించి అందర్నీ ఇక్కడకు రమ్మన్నాను. కార్యకర్తలు, నేను అందరం లోపల దూకాం. కనీసం 160 మందిని బయటకు తీశాం. తర్వాత అధికారులకు ఫోన్ చేశాం. 160 మందిని సజీవంగా కాపాడాం. ఐదారు డెడ్ బాడీలు వెలికి తీశాం. 140 మంది చనిపోయారని తెలిసింది’’ అన్నారాయన.
‘‘మేమంతా చొక్కాలు తీసి బాధితులకు అందించి వారిని బయటకు లాగాం. తర్వాత ట్యూబులు రావడంతో మేం ఆ ట్యూబులపై కూర్చోపెట్టి కాపాడాం’’ అని ఆయన వివరించారు.
ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో మరో తీవ్ర విచారకరమైన వార్త, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఈ ప్రమాదంలో చనిపోవడం. జామ్ నగర్ జిల్లా దేవాని గ్రామానికి చెందిన ఒక కుటుంబం నిన్న మోర్బీలో ఉంది. ఆ కుటుంబ సభ్యులు బ్రిడ్జ్ మీదకు వచ్చారు. ఆ సమయంలోనే బ్రిడ్జి కూలిపోవడంతో కుటుంబంలోని ఏడుగురు సభ్యులు మరణించారు. వీరిలో 5 గురు చిన్నారులు కావడం మరింత విషాదం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇవి కూడా చదవండి:
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
- ఇక్కడ 60 వేల మంది కోటీశ్వరులున్నారు
- పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక విమానాశ్రయం నిర్మిస్తున్న భారత్...దీని లక్ష్యాలేంటి?
- అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్
- మహిళను ‘ఐటెం’ అని పిలవడం నేరమేనా, కోర్టులు ఏం చెప్పాయి, నటి ఖుష్బూ వివాదమేంటి ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













