Samantha-Myositis: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’.... ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే?

ఫొటో సోర్స్, @Samanthaprabhu2
సమంత తన అనారోగ్యం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు.
తనకు కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి నిర్ధరణ అయినట్లు సమంత శనివారం తెలిపారు.
త్వరలోనే ఈ వ్యాధి నుంచి కోలుకుంటానని, ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు సమంత చెప్పారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద త్వరలో విడుదల కానుంది.
ఈ మేరకు ఈనెల 27వ తేదీన యశోద సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
యశోద సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల స్పందన ఎంతో బాగుందంటూ సమంత సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన సమంత తన అనారోగ్యం గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఒక ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు.
ఆ ఫొటోలో సమంత చేతికి సెలైన్ పైప్‌తో పాటు ప్లాస్టర్ అంటించి ఉన్నాయి. ఆమె ముందు ఒక మైక్ ఉంది.

ఫొటో సోర్స్, ANI
''యశోద ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. మీతో నాకు ఉన్న ఈ ప్రేమ, అనుబంధమే నాకు జీవితంలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన మనోబలాన్ని ఇస్తుంది.
కొన్ని నెలల క్రితమే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన 'మయోసైటిస్' అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది.
వ్యాధి కాస్త నయం అయ్యాక ఈ విషయం మీతో చెప్పాలనుకున్నా. కానీ ఇది తగ్గడానికి మేం అనుకున్నదాని కంటే కాస్త ఎక్కువ సమయమే పడుతోంది.
అన్ని విషయాల్లో ప్రతీసారి బలంగా ముందుకెళ్లలేమనే సంగతి మెల్లిగా నాకు ఇప్పుడే తెలుస్తుంది.
త్వరలోనే ఇది పూర్తిగా నయం అవుతుందని వైద్యులు పూర్తి నమ్మకంతో చెబుతున్నారు.
శారీరకంగా చూసుకున్నా లేదా ఉద్వేగాల పరంగా చూసుకున్నా నేను మంచిరోజులను, చెడు రోజులను రెండింటినీ చూశాను.
ఇక దీన్ని నేను భరించలేను అని అనుకున్న ప్రతీసారి దాన్నుంచి బయటపడ్డాను. ఇది కూడా అంతే.
దీన్నుంచి కోలుకునే దిశగా మరో రోజు గడిచిపోయింది. లవ్యూ. ఈ సమయం కూడా గడిచిపోతుంది'' అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆమె ట్వీట్ చేసిన వెంటనే అభిమానులు, సహ నటులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు స్పందించారు.
సమంత పోస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ నటి శ్రీయా శరణ్ రిప్లై ఇచ్చారు. ''ఎప్పటిలాగే నువ్వో అద్భుతం'' అంటూ ఆమె స్పందించారు.
బాలీవుడ్ నటులు కృతి సనన్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌లతో పాటు తెలుగు హీరోయిన్ రాశీ ఖన్నా స్పందించారు.
గతంలో సమంత ఆరోగ్యం గురించి పుకార్లు వచ్చాయి. ఆమెకు ఆరోగ్యం బాలేదని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా తనకు వచ్చిన వ్యాధి గురించి సమంత తెలిపింది.

ఫొటో సోర్స్, Samantha/instagram
అసలేంటి ఈ మయోసైటిస్
'మయోసైటిస్' అనేది అరుదైన వ్యాధి. ఇది కండరాల దీర్ఘకాల వాపునకు సంబంధించినది. ఇందులో రకాలు ఉంటాయి. కొన్ని రకాల మయోసైటిస్ వల్ల చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి.
ఈ వ్యాధిని నిర్ధారించడం కూడా కష్టం. ఇది రావడానికి గల కారణాలు కొన్నిసార్లు తెలియవు. ఈ వ్యాధి లక్షణాలు వేగంగా కనిపించవచ్చు లేదా నెమ్మదిగా కూడా కనిపిస్తాయి.
కండరాల నొప్పులు, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు.
అమెరికాలో ఏడాదికి 1600-3200 వరకు కొత్త కేసులు వెలుగు చూస్తుంటాయని దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది ప్రజలు మయోసైటిస్‌తో జీవిస్తున్నారని 'హెల్త్ లైన్' వెబ్‌సైట్ పేర్కొంది.
ఇది పెద్దల్లోనే కాదు, పిల్లలకు కూడా రావచ్చు. పురుషుల కన్నా ఎక్కువగా మహిళలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Samantha/instagram
మయోసైటిస్ రకాలు
ఈ వ్యాధిలో అయిదు రకాలున్నాయి. 1. డెర్మటోమయోసైటిస్, 2. ఇంక్లూసన్-బాడీ మయోసైటిస్, 3. జువెనైల్ మయోసైటిస్, 4. పాలీమయోసైటిస్, 5. టాక్సిక్ మయోసైటిస్.
ఇక 'డెర్మటోమయోసైటిస్'తో బాధపడేవారికి కండరాలపై ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. దీన్ని గుర్తించడం చాలా సులభం. శరీరంపై ఊదా-ఎరుపు రంగులో దద్దుర్లు వస్తాయి.
ముఖం, ఛాతీ, మెడ, వీపు, కనుగుడ్లలో కూడా ఈ దద్దుర్లు కనిపిస్తాయి.
చర్మం పొడిబారడం, కూర్చున్న స్థితి నుంచి పైకి లేవలేకపోవడం, అలసటతో పాటు మెడ, వీపు, భుజంలోని కండరాలు బలహీనపడటం, మింగడంలో ఇబ్బంది, గొంతు మారడం, కండరాలు నొప్పులు, కీళ్ల వాపులు, బరువు తగ్గడం, గుండె లయ తప్పడం వంటి లక్షణాలు కనబడతాయి.
'ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్' మహిళల కన్నా ఎక్కువగా పురుషుల్లో కనబడుతుంది. వయసు 50 దాటిన వారిలో ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి.
మణికట్టు, వేళ్లు, తొడ కండరాల్లో బలహీనతతో ఇది ప్రారంభం అవుతుంది. శరీరంలో ఒకవైపు భాగం ఎక్కువగా ప్రభావితం అవుతంది. ఇది జన్యుపరమైనది అని నమ్ముతారు.
నడవడంలో ఇబ్బంది, బ్యాలెన్స్ కోల్పోవడం, తరచుగా కింద పడుతుండటం, కూర్చున్న స్థితి నుంచి లేవలేకపోవడం, కండరాల నొప్పి, కండరాలు బలహీనం కావడం వంటి లక్షణాలు కనబడతాయి.

ఫొటో సోర్స్, samantharuthprabhuoffl/insta
జువైనల్ మయోసైటిస్ 18 ఏళ్ల లోపు వయస్సు వారికి వస్తుంది. బాలుర కంటే రెట్టింపుగా బాలికలు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. కండరాలు బలహీనం కావడం, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి.
కనుగుడ్లలో ఊదారంగు మచ్చలు కనబడటం, అలసట, మూడీనెస్, కడుపునొప్పితో పాటు మెట్లు ఎక్కలేకపోతారు, దుస్తులు వేసుకోవడంలో ఇబ్బంది, కదల్లేకపోతారు.
'పాలిమయోసైటిస్' బారినపడి వారు చిన్న చిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పిపెడతాయి. పాలియయోసైటిస్ ప్రతీ కేసు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో అదనంగా ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా వస్తాయి.
కండరాల నొప్పి, కండరాలు బలహీనం కాడం, మింగడంలో ఇబ్బంది, కింద పడిపోవడం, అలసట, సుదీర్ఘంగా పొడి దగ్గు, చేతులపై చర్మం గట్టిగా కావడం, శ్వాసలో ఇబ్బంది, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనబడతాయి.
టాక్సిక్ మయోసైటిస్ అనేది కొన్ని రకాల ఔషధాలు, నిషేధిత మందుల కారణంగా వస్తుందని భావిస్తున్నారు.
ఈ వ్యాధికి కారణమయ్యే చాలా సాధారణ మందుల్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్స్ ఉన్నాయి. అయితే, ఇది చాలా అరుదుగా సంభవించే వ్యాధి. మిగతా వాటికి కనిపించే లక్షణాలే దీనికి కూడా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, samantharuthprabhuoffl/insta
కారణాలు
మయోసైటిస్ రావడానికి గల కచ్చితమైన కారణాలపై నిపుణులు బిన్నాభిప్రాయాలను కలిగి ఉన్నారు.
ఇది ఒక ఆటోఇమ్యూన్ కండీషన్ అని భావిస్తున్నారు. ఈ కండీషన్‌లో మన రోగనిరోధకశక్తి కండరాలపై ఎదురుదాడి చేస్తుంది.
చాలా కేసుల్లో ఇది ఎందుకు వచ్చిందో తెలియదు. అయితే గాయం లేదా ఇన్ఫెక్షన్‌లు కూడా ఇది రావడంలో పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
రుమాటాయిడ్ అర్థరైటిస్, లుపుస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల... కామన్ కోల్డ్, ఫ్లూ, హెచ్‌ఐవీ వంటి వైరస్‌ల వల్ల... డ్రగ్ టాక్సిసిటీ వల్ల కూడా మయోసైటిస్ రావొచ్చని పరిశోధకులు నమ్ముతున్నారు.
ఎలా గుర్తిస్తారు?
ఇది అరుదైన వ్యాధి కావడంతో దీన్ని నిర్ధారించడం కూడా కష్టమే.
ఈ వ్యాధిని రక్తంలో డ్యామేజయిన కండరాలను పరీక్షించడం, శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ స్థాయిని పరీక్షించడం, శరీరంలో యాండీబాడీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా గుర్తిస్తారు. ఇందుకోసం ఎలక్ట్రోమయోగ్రఫీ, మజిల్ బయాప్సీ, జెనిటిక్ టెస్టింగ్ వంటి పరీక్షలు చేస్తారు.

ఫొటో సోర్స్, samantharuthprabhuoffl/insta
చికిత్స ఉందా?
ఈ వ్యాధి సోకిన వ్యక్తి శరీర లక్షణాలను బట్టి ప్రత్యేకమైన చికిత్స అందించాల్సి ఉంటుందని హెల్త్‌లైన్ వెబ్‌సైట్ పేర్కొంది.
మయోసైటిస్ అనే ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి తగ్గాలంటే, తొలి దశలోనే ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్ రూపంలో హైడోస్ స్టెరాయిడ్లు ఇస్తారు.
వీటితో పాటు శరీరంలో అదనపు ఇమ్యూనిటీ తగ్గించడానికి ఇమ్యూనో సంప్రీసెంట్స్ కూడా ఇస్తారు. కొందరికి ఈ హైడోస్ స్టెరాయిడ్ల వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు కూడా వచ్చే ప్రమాదముంది. ఈ మందుల వల్ల ఎముకలపై ప్రతికూల ప్రభావం పడకుండా ఇతర సప్లిమెంట్లు కూడా వాడాల్సి ఉంటుంది.
ఈ వ్యాధి స్వభావం రీత్యా సరైన చికిత్స అందించడం కోసం వైద్యులు, థెరపీలో పలు మార్పులు చేస్తుంటారు.
ఫిజికల్ థెరపీ, వ్యాయామం, స్ట్రెచింగ్, యోగా వంటివి చేయడం ద్వారా కండరాలు పటిష్టంగా, చురుగ్గా మారతాయి.
ఇవి కూడా చదవండి:
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
- పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక విమానాశ్రయం నిర్మిస్తున్న భారత్...దీని లక్ష్యాలేంటి?
- చర్చిలో స్నేహం చేసింది.. ఆస్తి కోసం ఆమెను చంపి తల, మొండెం వేరుచేసి దూరంగా పడేసింది
- ఇక ట్విటర్ క్రిప్టోకరెన్సీ చెల్లింపులను అంగీకరిస్తుందా
- ఇక్కడ 60 వేల మంది కోటీశ్వరులున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














