సమంత రూత్‌ప్రభు: ‘అవే పనులు పురుషులు చేస్తే ఎందుకు ప్రశ్నించరు? విలువలు లేని ఈ సమాజాన్ని మనమే నిర్మించుకున్నాం’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, instagram/samantharuthprabhuoffl
నాగ చైతన్య, సమంత విడాకులకు కారణాలు ఇవే అంటూ మీడియా, సోషల్ మీడియాల్లో వస్తున్న కథనాలపై సమంత స్పందించారని ఈనాడు రాసింది.
ఆ కథనం ప్రకారం.. మేం భార్యాభర్తలుగా విడిపోతున్నాం' అంటూ నాగ చైతన్య, సమంత ప్రకటించిన తర్వాత మీడియాలో, సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతోమంది సమంత గురించి రకరకాల కథనాలు రాశారు.
'ఫలానా వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే సమంత ఇలా చేసింది', 'ఆ సినిమాల్లో శ్రుతి మించి నటించడమే ఇందుకు కారణం', 'సమంత పిల్లలను వద్దనుకుంది' అంటూ తమకి ఇష్టం వచ్చినట్టు కథనాలు రాశారు.
ఈ కథనాలపై సమంత తొలిసారిగా స్పందించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా రూమర్స్‌కు చెక్‌పెడుతూ పోస్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు.
నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు.
విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి చేయడం దారుణం. మీరనుకునే విధంగా ఎన్నడూ చేయను. మీరు నన్ను ఎంత బాధపెట్టినా చెదరను'' అని సమంత ట్వీట్ చేసింది.
ఈ వివరణ ఇవ్వడానికి ముందు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రచయిత్రి ఫరిదా చెప్పిన మాటల్ని సమంత పోస్ట్ చేశారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
''మహిళలు చేసే పనులు ఎప్పుడూ నైతికంగా ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు... పురుషుల్ని ఎందుకు ప్రశ్నించరు? అవే పనులు పురుషులు చేస్తే అస్సలు ప్రశ్నించరు. ప్రాథమికంగా ఎటువంటి విలువలు లేని ఈ సమాజాన్ని మనమే నిర్మించుకున్నాం'' అని ఫరిదా .డి చెప్పిన మాటల్ని సమంత షేర్ చేశారు.

ఫొటో సోర్స్, TelanganaCMO/FB
త్వరలో సొంత స్థలంలో ఇళ్ల పథకం
సొంత జాగా ఉన్న ప్రజలు ప్రభుత్వ సాయంతో ఇల్లు నిర్మించుకునే పథకాన్ని త్వరలోనే తీసుకొస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఈనాడు ఒక కథనం రాసింది.
దాని ప్రకారం.. ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1500 మందికి లబ్ధి చేకూరేలా పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాల్లో సంక్షేమ పద్దు కింద పెట్టిన ఖర్చు కంటే ఈ ఏడేళ్లలో అయిదు రెట్లు అధికంగా ఖర్చు చేశామని ఆయన చెప్పారు.
రాజకీయాల కోసం రాష్ట్రాన్ని చులకన చేసి మాట్లాడొద్దని కేసీఆర్ విపక్షాలకు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐఎంపీఎస్ పరిధి 5 లక్షలు
డిజిటల్ లావాదేవీలకు ఊతమిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ద్వారా జరిగే ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది.
ప్రస్తుతం రూ.2 లక్షలుగా ఉన్న ఈ పరిధిని రూ.5 లక్షలకు పెంచారు. ఐఎంపీఎస్ పరిమితిని పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు చెప్పారు. ఆఫ్‌లైన్‌లోనూ రిటైల్ డిజిటల్ చెల్లింపులు కొనసాగేలా కృషి చేస్తున్నామన్నారు.
మరోవైపు వరుసగా 8వసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతున్నట్లు దాస్ తెలిపారు. రెపో 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతంగా ఉన్నది.
ఐఎంపీఎస్ అంటే?
ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ అనేది దేశంలో ఓ ఇన్‌స్టంట్ పేమెంట్ ఇంటర్-బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ బదిలీ వ్యవస్థ. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్ ద్వారా ఐఎంపీఎస్ సేవలు నిరంతరం జరుగుతాయి. బ్యాంక్ సెలవు దినాల్లోనూ ఈ సర్వీస్ పనిచేస్తుంది.

పిల్లి పోయిందని పోలీసులకు ఫిర్యాదు
తమ పెంపుడు పిల్లి కనిపించడం లేదని ఒక వ్యక్తి శుక్రవారం యాదాద్రి జిల్లా యాదగిరి గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ మన తెలంగాణ పత్రిక ఒక కథనం రాసింది.
ఆ కథనం ప్రకారం తన పెంపుడు పిల్లిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని, పిల్లి కనిపించకపోవడంతో పిల్లలు బెంగపెట్టుకున్నారని రామచంద్రారెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన గుజ్జుల రామచంద్రారెడ్డి ఏడు నెలలుగా పిల్లిని పెంచుకుంటున్నాడు. దానికి జిమ్మిగా పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు.
సెప్టెంబరు 29వ తేదీన పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని, దీంతో వృద్ధురాలైన తల్లితోపాటు సోదరుడి కుమారులు జశ్వంత్‌రెడ్డి, తనీష్‌రెడ్డి బెంగపెట్టుకున్నారని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశాడు.
పిల్లి కనిపించకుండా పోయిన నాటి నుంచి మూడు రోజులుగా నిద్రాహారాలు మానివేశారన్నారని తెలిపారు. గ్రామంలోని ఏ ఇంట్లో వెతికినా పిల్లి ఆచూకీ లభించలేదని, వెంటనే తమ పిల్లి ఆచూకీ తెలపాలని రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడి కుమారులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మలేరియా వ్యాక్సీన్: ఎప్పుడు వస్తుంది, ఎన్ని డోసులు వేసుకోవాలి? 7 ప్రశ్నలు, సమాధానాలు
- కశ్మీర్: వారం రోజుల్లో ఏడుగురు మైనారిటీలను కాల్చి చంపారు... జమ్మూలో నిరసన ప్రదర్శనలు
- నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న జర్నలిస్టులు మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి... రూ. 18,000 కోట్లతో బిడ్ గెల్చుకున్న టాటా సన్స్
- లఖీంపూర్ ఖేరీ: యూపీ ప్రభుత్వ తీరు బాగా లేదు, విచారణను వేరే ఏజెన్సీకి అప్పగించాలన్న సుప్రీం కోర్టు
- కాకినాడ పోర్ట్‌లో డ్రగ్స్ దిగుమతులు జరుగుతున్నాయా... అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం ఏంటి?
- ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: గెలుపోటములను ప్రభావితం చేసే ప్రధాన అంశాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













