తెలంగాణలో త్వరలో డిజిటల్ భూ సర్వే ... అక్షాంశ, రేఖాంశాలు నమోదు చేస్తామన్న కేసీఆర్ - ప్రెస్ రివ్యూ

కేసీఆర్

ఫొటో సోర్స్, TelanganaCMO/FB

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్‌ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్‌ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది.

సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించినట్లు కూడా ఈ కథనం తెలిపింది. గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్రంలో సమగ్ర సర్వే చేస్తామని ప్రకటించిన సీఎం మరోసారి సర్వేపై స్పందించారు. రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్‌ పనితీరుపై గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ఓఎస్డీ భూపాల్‌ రెడ్డితో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు ప్రకటించారు.

"ప్రభుత్వం జరిపిన సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్‌ తదితర సంస్కరణల వల్ల సాగు భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన కొద్ది పాటి సమస్యలు కూడా డిజిటల్‌ సర్వే వల్ల పరిష్కారమవుతాయి. నేను అసెంబ్లీలో ఇంతకుముందే ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ సర్వే నిర్వహిస్తాం. ప్రతీ భూమికి కో ఆర్డినేట్స్‌ ఇస్తాం. వాటిని ఎవరూ మార్చలేరు. కాబట్టి భవిష్యత్తులో కూడా హద్దుల పంచాయతీకి అవకాశం ఉండదు’’అని సీఎం అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడిచింది.

పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Telugu Desam Party/twitter

ఫొటో క్యాప్షన్, పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు.

అర్ధరాత్రి ప్రజాస్వామ్యం ఖూనీ-పంచాయతీ ఫలితాలపై చంద్రబాబు ఆరోపణ

గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు, వారికి కొమ్ముకాస్తున్న అధికారులు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లు ఈనాడు ఒక కథనం ఇచ్చింది.

ఈ ఎన్నికల్లో ఉన్మాదులు, రౌడీలు స్వైర విహరం చేశారని, కట్టడి చేయాల్సిన ఎన్నికల సంఘం తాము ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆయన గురువారంనాడు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిపింది.

చాలాచోట్ల లెక్కింపు ప్రక్రియను కావాలని ఆలస్యం చేసి విద్యుత్‌ సరఫరా నిలిపేసి ఫలితాలను తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

రాత్రి పూట ఓట్ల లెక్కింపు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని, మరుసటి రోజు లెక్కిస్తే నష్టమేంటని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశ్నించినట్లు ఈనాడు కథనం తెలిపింది.

తమ పార్టీ మద్ధతుదారులు గెలిచినచోట పోలీసులు వారిని బెదిరించి ఓడిపోయినట్లు ఒప్పుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారని, కౌంటింగ్‌ కేంద్రాలలో పోలీసులకు పనేంటని ఆయన ప్రశ్నించారు.

కుప్పంలో వైసీపీ గెలవలేదని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. కుప్పం ప్రజలు ఎంతో మంచి మనసున్నవారని, నిజాయితీపరులని, అలాంటి ప్రాంతాన్ని వైసీపీ నేతలు కలుషితం చేయాలని చూశారని, ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

సైనిక యోధులకు ఇచ్చే నజరానాను పదిరెట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, CMO Andhra Pradesh/twitter

ఫొటో క్యాప్షన్, సైనిక యోధులకు ఇచ్చే నజరానాను పదిరెట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం

సైనిక యోధులకు నజరానా పదిరెట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం

సైన్యంలో పని చేసి అవార్డులు పొందిన సాహసయోధులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేసే నజరానాలను పదిరెట్లు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించినట్లు సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

తిరుపతిలో జరిగిన ‘స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌’ సభలో పాల్గొన్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారని తెలిపింది.

పరమవీర చక్ర, అశోక చక్ర పతకాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకు రూ.10 లక్షలు చెల్లించేది. పరమ వీర చక్ర పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఆ మొత్తాన్ని పది రెట్లు పెంచి రూ.1 కోటి ఇవ్వనుందని సాక్షి పేర్కొంది.

మహావీర చక్ర, కీర్తి చక్ర పురస్కారాలకు ఇది వరకు రూ.8 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.80 లక్షలు, వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు రాష్ట్రం రూ.6 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.60 లక్షలు అందిస్తారని పేర్కొంది.

వీర మరణం పొందితే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు పరిహారం అందిస్తుందని ఈ కథనం పేర్కొంది.

ఇదిలా ఉంటే పరమవీర చక్ర, అశోక్‌చక్ర తదితర అవార్డు గ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నజరానాకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని పెంచుతామని తిరుపతిలో గురువారం సీఎం వై.ఎస్‌.జగన్‌ ప్రకటించిన వెంటనే సర్కారు జీఓ కూడా విడుదల చేసినట్లు సాక్షి కథనం వెల్లడించింది.

హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ 'ట్రీ సిటీ' జాబితాలో హైదరాబాద్‌

ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో)కు అనుబంధంగా పనిచేసే ‘ఆర్బర్‌డే ఫౌండేషన్‌' సంస్థ హైదరాబాద్‌ను 2020 సంవత్సరానికి ‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌'గా గుర్తిస్తున్నట్టు ప్రకటించిందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

భారత్‌లోనే కాకుండా దక్షిణాసియాలోనే ఈ ఘనతను దక్కించుకున్న మొదటి నగరంగా హైదరాబాద్‌ నిలిచిందని పేర్కొంది. ఆర్బర్‌డే ఫౌండేషన్‌ సంస్థ ప్రపంచంలోని 51నగరాలను ట్రీ-సిటీస్‌గా గుర్తించిందని ఈ కథనం తెలిపింది.

ఈ జాబితాలో ఎక్కువగా అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నగరాలే ఉన్నాయి. ఐదు ప్రాతిపదికల ఆధారంగా ఆర్బర్‌డే సంస్థ హైదరాబాద్‌ను వృక్ష నగరంగా ఎంపిక చేసింది. మొక్కలను పెద్ద సంఖ్యలో నాటడమే కాకుండా హైదరాబాద్‌ నగరంలో వాటి సంరక్షణకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించడం, చెట్ల సంరక్షణ, మొక్కల పెంపకంపై ప్రతి ఏటా ‘హరితహారం’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలలో పర్యావరణంపై చైతన్యం తీసుకురావడానికి కృషి చేయడంవంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుందని ఈ కథనం పేర్కొంది.

వీటితోపాటు నగరంలో మొక్కలు, చెట్ల పెంపకాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది బాధ్యతగా తీసుకోవడం, చెట్లను సంరక్షించడానికి చట్టాలను కఠినంగా అమలు పరచడం, జరిమానాలు విధించడం; మొక్కలను నాటడంలో సృజనాత్మక విధానాలను అవలంబించడం, వాటి సంరక్షణకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడాన్ని ఆర్బర్‌డే సంస్థ అభినందించిందని ఈ కథనం వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ గుర్తింపుపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ హ‌రిత‌హారం విజ‌య‌వంతం అయింద‌న‌డానికి ఇదే నిదర్శనమని అన్నారు. ట్రీ సిటీ ఆఫ్ ది వ‌రల్డ్‌గా హైద‌రాబాద్‌ను ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ గుర్తించడం చాలా సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నట్లు నమస్తే తెలంగాణ వెల్లడించింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)