ఆయుర్వేద వైద్యులు కొన్ని ఆపరేషన్లు చేయొచ్చన్న ఏపీ ప్రభుత్వ ఆదేశాలపై విమర్శలు ఏంటి?

సర్జరీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆయుర్వేద వైద్యులు కొన్ని రకాల సర్జరీలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చింది.

అయితే, ఈ నిర్ణయాన్ని అల్లోపతి వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ కూడా సమర్పించింది.

మరోవైపు తమకు అనస్థీషియాపై అవగాహన ఉందని, సర్జరీలు చేయగలమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ఇంతకీ వారికి అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి?

సత్య కుమార్ యాదవ్

ఫొటో సోర్స్, X/Satya Kumar Yadav

'ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయండి'

ఆయుర్వేదంలో పీజీ పూర్తి చేసి, అనుభవం ఉన్న వైద్యులు స్వతంత్రంగా శస్త్రచికిత్సలు చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ 2025 డిసెంబర్‌లో ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం 2020లో జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను అనుసరిస్తూ, ఆయుర్వేద పీజీ వైద్యులు రాష్ట్రంలో 58 రకాల శస్త్రచికిత్సలు చేసేందుకు అర్హులని వెల్లడించారు.

ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్స్‌ ఆఫ్‌ మెడిసిన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయుర్వేద వైద్యులకు ఈ అనుమతిస్తున్నట్టు తెలిపారు.

దీనికి సంబంధించి విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం 2020లోనే విడుదల చేసిందని, అయితే గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అన్నారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక వైద్య విధానంతో అనుసంధానించాలని నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు.

అయితే ఆయుర్వేద, ఆయుష్, నేచురోపతి డాక్టర్లు సర్జరీలు చేయడంపై వైద్యవర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో తాము ఆ మార్గదర్శకాలను అప్పట్లో అమలు చేయలేదని మాజీ మంత్రి, వైసీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు బీబీసీతో అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను వెంటనే ప్రవేశపెట్టాలని స్పష్టం చేసిన మంత్రి సత్యకుమార్‌.. ఆ మేరకు ఆయుర్వేద ఆసుపత్రుల్లో అవసరమైన ఆపరేషన్‌ థియేటర్లు, శస్త్రచికిత్సా పరికరాలు, ఇతర సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సర్జరీ

ఫొటో సోర్స్, Getty Images

ఏయే సర్జరీలు చేయొచ్చంటే...

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ కేంద్ర వైద్య మండలి 2020 నవంబర్‌లో జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అనుసరించి శిక్షణ పొందిన పీజీ ఆయుర్వేద వైద్యులు 58 రకాల శస్త్రచికిత్సలు చేయొచ్చు.

39 శల్య తంత్ర (జనరల్‌ సర్జరీ), 19 శాలక్య తంత్ర (కన్ను, చెవి, ముక్కు) సర్జరీలు ఈ జాబితాలో ఉన్నాయి.

వ్యతిరేకిస్తున్న అల్లోపతి వైద్యులు

మంత్రి సత్యకుమార్‌ ప్రకటనపై అల్లోపతి వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ ఇచ్చినట్టు ఐఎంఏ కార్యదర్శి, విజయవాడకు చెందిన డాక్టర్‌ బోస్‌ బీబీసీకి తెలిపారు.

"మన భారతీయ ఆయుర్వేద వైద్యానికి ఎవరైనా సెల్యూట్‌ చేయాల్సిందే. కానీ ప్రాచీన కాలానికి, ఆధునిక కాలానికి ఎంత తేడా ఉంటుందో ఆయుర్వేదంలో శస్త్రచికిత్సలకు, అల్లోపతిలో శస్త్రచికిత్సలకూ అంతే తేడా ఉంటుంది’’ అని బోస్ అన్నారు.

‘‘సర్జరీలు చేసేందుకు అల్లోపతి వైద్య విద్యార్థులు పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంటారు. కానీ, ఆయుర్వేద వైద్య విద్యార్థులకు కేవలం ఒక బ్రిడ్జ్‌ కోర్సుతోనో లేదా పరిమిత శిక్షణతోనో ఆపరేషన్‌లపై అవగాహన కలిగిస్తారు. ఆయుర్వేద విద్యలో సర్జరీ ఒక భాగం అనే కారణంతో, అల్లోపతి నిపుణులతో సమానంగా శస్త్రచికిత్సలకు అనుమతించడం ప్రజారోగ్యానికి ముప్పు కలిగించినట్టే" అని డాక్టర్‌ బోస్‌ వ్యాఖ్యానించారు.

వైద్య చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

'అల్లోపతీ వైద్యులకే కొన్నిసార్లు ఇబ్బందులొస్తున్నాయ్'

ఆపరేషన్‌ చేయడం అంటే శరీరంలో ఒక పర్టిక్యులర్‌ పార్ట్‌ తీసేయడమో, కలిపి కుట్టడమో కాదని రిటైర్డ్‌ అడిషనల్‌ డీఎంహెచ్‌వో, ఐఎంఏ విశాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎంవీవీ మురళీ మోహన్‌ వ్యాఖ్యానించారు.

"ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న నరాలకి, బ్లడ్‌ వెజల్స్‌కి డ్యామేజ్‌ జరగకుండా చూడాలి. ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌లో అనాటమీ ఉంటుంది. థర్డ్‌ ఇయర్‌లో పాథాలజీ ఉంటుంది. ఏ పార్ట్‌ ఏ రకమైన ఇన్ఫెక్షన్‌కి గురవుతుందనే సబ్జెక్ట్‌ నేర్చుకుంటాం. థర్డ్‌ ఇయర్‌ నుంచి ఐదో సంవత్సరం వరకు ఆపరేషన్లపై అవగాహన కలిగిస్తారు. ఇక పీజీ–ఎంఎస్‌లో మూడేళ్లపాటు ఆపరేషన్లపైనే నేర్పిస్తారు. అంత శిక్షణ పొందిన అల్లోపతి పీజీ వైద్యులే అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతున్నారు'' అని డాక్టర్‌ మురళీ మోహన్‌ వ్యాఖ్యానించారు.

డాక్టర్ బోస్ ఐఎంఏ సెక్రటరీ, విజయవాడ

ఫొటో సోర్స్, Doctor Bose

ఫొటో క్యాప్షన్, డాక్టర్ బోస్ ఐఎంఏ సెక్రటరీ, విజయవాడ

'ప్రభుత్వం పునరాలోచించాలి'

ఆయుర్వేద వైద్యులు సర్జరీలు చేయడంపై వాస్తవానికి 2020లోనే కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసినప్పటికీ దీనికి ఆయా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి.

‘‘చాలా రాష్ట్రాలు ఇందుకు అనుమతించలేదు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇది అమలవుతోంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండటంతో ఏపీలో కూడా అమలు చేయాలని చూస్తున్నారు తప్పించి వాస్తవంగా ఆచరణాత్మక ఆదేశాలేనా, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పూ లేనిదేనా అని ప్రభుత్వం పునరాలోచించుకోవాలి" అని ఐఎంఏ కార్యదర్శి డాక్టర్‌ బోస్‌ సూచించారు.

"ఆయుర్వేద వైద్యంపై ప్రభుత్వం మరింత ఖర్చు చేసి, ఆ ప్రాచీన వైద్యానికి మరింత ఊతం ఇవ్వాలి. అంతే కానీ వారికి అనుభవం లేని ఆపరేషన్లకు మాత్రం అనుమతినివ్వవద్దు" అని ఆయన స్పష్టం చేశారు.

ఆయుర్వేదం

ఫొటో సోర్స్, Getty Images

'అన్ని ఆపరేషన్లకూ అనుమతి లేనప్పుడు అభ్యంతరాలెందుకు?'

ఆయుర్వేద వైద్యులు మాత్రం ప్రభుత్వ చర్యలను సమర్ధిస్తున్నారు.

‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సర్జరీ' సుశ్రుతుడు అనుసరించింది ఆయుర్వేదమే కదా. ఇప్పుడు ఆధునిక వైద్యులు కూడా కొలిచేది సుశ్రుతుడినే. అలాంటిది ఆయుర్వేద పీజీ డాక్టర్లు సర్జరీలు ఎందుకు చేయకూడదు? కొన్ని నిర్దేశిత సర్జరీలకే కదా ప్రభుత్వం అనుమతిచ్చింది’’ అని ఆయుర్వేద మెడికల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సూళ్లూరుపేటకి చెందిన డాక్టర్‌ శివప్రసాద్‌ బీబీసీతో అన్నారు.

" సిడ్నీలో కూడా సుశ్రుత విగ్రహం పెట్టి ఫాదర్‌ ఆఫ్ ఇండియన్‌ సర్జరీగా పూజిస్తున్నారు. సుశ్రుతుడు ఆ కాలంలో సర్జరీకి వినియోగించిన పరికరాలే ఇప్పుడు ఆధునిక శైలిలో మార్పు చెందాయి" అని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని డాక్టర్‌ శివప్రసాద్‌ అన్నారు.

డాక్టర్‌ కోలా విజయ కుమారి

ఫొటో సోర్స్, Doctor Vijaya Kumari

ఫొటో క్యాప్షన్, డాక్టర్‌ కోలా విజయ కుమారి

'క్లిష్టమైన సర్జరీలు లేవు'

"ఆయుర్వేద పీజీ వైద్యులకు కేంద్రం అనుమతిచ్చిన దాంట్లో ఆధునిక అల్లోపతి వైద్యవిధానాలైన రోబోటిక్, లాప్రోస్కోపిక్‌ సర్జరీలు లేవు కదా. శల్య, శాలక్య విభాగాల్లోని చిన్న సర్జరీలకే అనుమతి ఉంది. అనుమతిచ్చిన 58 సర్జరీల్లో కాంప్లికేటెడ్‌ సర్జరీలు ఏమీ లేవు" అని విజయవాడలోని డాక్టర్‌ నోరి ఆయుర్వేద వైద్య కశాళాలకు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ కోలా విజయ కుమారి బీబీసీతో అన్నారు. దీనికి అల్లోపతి వైద్యులు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారామె.

"ఆయుర్వేద పీజీ విద్యార్థులకు అల్లోపతి చికిత్సా విధానంపై అవగాహన ఉంటుంది. ఆయుర్వేదంలో అనస్థీషియాలజీ కూడా ఉంది. అంతెందుకు.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఆయుర్వేద పీజీ డాక్టర్లు చాలాకాలం నుంచి సర్జరీలు చేస్తున్నారు'' అని డాక్టర్‌ విజయ కుమారి అన్నారు.

మరోవైపు "అది కేంద్ర గెజిట్‌. ఇప్పుడు మనం ఇంప్లిమెంట్‌ చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదేశాల ప్రకారం శిక్షణ పొందిన ఆయుర్వేద పీజీ వైద్యులు నిర్దేశించిన సర్జరీలు చేస్తున్నారు, ఇకపై చేస్తారు. అల్లోపతి వైద్యులకు అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వమే గెజిట్ ఇచ్చింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది కదా'' అని ఏపీ ఆయుష్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సాయి సుధాకర్‌ బీబీసీతో అన్నారు.

ఈ వ్యవహారంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్య కుమార్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)