డిప్రెషన్ ఔషధాలు: ఒకేరకమైన వ్యాధితో బాధపడేవారు కూడా వేరు వేరు మందులు వాడాలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గల్లఘర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డిప్రెషన్ నివారణకు వాడే మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలకు మొదటిసారిగా పరిశోధకులు ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ పరిశోధనలో వివిధ ఔషధాలు చూపే ప్రభావంలోని తేడాలను కూడా వెల్లడించారు.
చికిత్స మొదలుపెట్టిన తరువాత తొలి 8వారాల వ్యవధిలో రోగులపై మందులు చూపిన ప్రభావాన్ని విశ్లేషించగా, కొందరు 2కిలోల వరకు బరువు పెరిగినట్టు, మరికొందరిలో హృదయ స్పందన నిమిషానికి 21సార్లు మారినట్టు గుర్తించారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో దాదాపు 80 లక్షలమంది డిప్రెషన్ నివారణా మందులు వాడుతున్నారు.
ఈ దుష్ప్రభావాల వ్యత్యాసం రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా, వారు నిరంతరం మందులు వాడే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చని హెచ్చరించారు.
అయితే చికిత్సను సొంతంగా ఆపకూడదని, ప్రతి వ్యక్తికి, వారి అవసరాలకు సరిపోయే మందులను జాగ్రత్తగా ఎంపిక చేయాలని సూచించారు.
"డిప్రెషన్ నివారణ ఔషధాల మధ్య భారీ తేడాలు ఉన్నాయి" అని పరిశోధకులు, ప్రొఫెసర్ ఆలివర్ హోవెస్ చెప్పారు.
"ఇది కేవలం ఏదో ఒక రోగికి సంబంధించినది కాదు. చాలామంది ఆమందులు తీసుకుంటూ ఉంటారు కాబట్టి చిన్న మార్పులు కూడా జనాభాపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి" అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images

ఫలితాల్లో ఏం తేలింది?
యాంటిడిప్రెసెంట్స్ శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చాలాకాలంగా తెలుసు. అయితే, కింగ్స్ కాలేజ్ లండన్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఈ కొత్త అధ్యయనం వాటికి ర్యాంకింగ్ ఇచ్చింది. దీని వల్ల దుష్ప్రభావాలను పోల్చి చూడటం సులభం అవుతుంది.
సాధారణంగా డిప్రెషన్‌కు ఉపయోగించే 30 ఔషధాలకు సంబంధించిన 151 అధ్యయనాలను ఈ బృందం విశ్లేషించింది. ఇందులో 58,500కు పైగా రోగుల డేటా ఉంది.
అందరికీ దుష్ప్రభావాలు కనిపిస్తాయని కాదు, కానీ ఈ అధ్యయనం సగటున కలిగించే దుష్ప్రభావాలను (ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది) కనుగొంది:
- అగోమెలాటిన్ డ్రగ్ వాడుతున్న వారు దాదాపు 2.4 కిలోల బరువు తగ్గగా, మాప్రోటిలిన్ తీసుకునేవారు దాదాపు 2 కిలోల బరువు పెరిగారు.
- హృదయ స్పందన రేటును ఫ్లూవోక్సమైన్ నెమ్మదించేలా చేయగా, నార్ట్రిప్టిలిన్ ఔషధం వేగవంతం చేసింది. వీటి మధ్య ప్రతినిమిషానికి 21 స్పందనల వ్యత్యాసం నమోదైంది.
- రక్తపోటును డోక్సెపిన్‌తో పోలిస్తే నార్ట్రిప్టిలిన్ దాదాపు 11 ఎంఎంహెచ్‌జెడ్ ఎక్కువగా పెంచింది.
"స్పష్టంగా చెప్పాలంటే, ఏ రెండు యాంటిడిప్రెసెంట్లు ఒకేలా ఉండవు" అని లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ అథీషాన్ అరుముహామ్ అన్నారు.
"ఈ తేడాలు పెరిగి తీవ్రంగా మారవచ్చు, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచవచ్చు" అన్నారు.
దీనర్థం ఒకే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా వారి వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి వేర్వేరు డ్రగ్స్ అవసరం కావచ్చు.

"మేం పరిశీలించిన చాలా అధ్యయనాలు ఎనిమిది వారాల వ్యవధివి. కానీ, ఆ సమయంలో కూడా ప్రజల శారీరక ఆరోగ్యంలో భారీ మార్పులను గమనించాం" అని డాక్టర్ టోబీ పిల్లింగర్ బీబీసీ రేడియో 4 టుడే కార్యక్రమంలో అన్నారు.
"ఇది ఎవరినీ భయపెట్టాలని కాదు. ప్రజలు వారి వైద్యుడితో కలిసి చికిత్స నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడానికి సహాయపడాలని కోరుకుంటున్నా" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఏ ఔషధం మంచిది?
ఉదాహరణకు, సారా (32), జాన్ (44), జేన్ (56) డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ఊహిద్దాం.
వీరు ముగ్గురికి ‘డిప్రెషన్ ఉన్నట్టు’గా నిర్థరణ అయింది. వీరికి డిప్రెషన్ నివారణ మందులు సూచించారు.
కానీ వీరిలో ప్రతి ఒక్కరు ఆ మందుల వల్ల వచ్చే వివిధరకాల సైడ్‌ఎఫెక్ట్స్‌ను నిరోధించాలనుకున్నారు.
సారా బరువు పెరగకుండా ఉండాలనుకుంటున్నారు. జాన్‌కు ఇప్పటికే బీపీ ఉంది. ఇక జేన్‌కు అధిక కొలెస్ట్రాల్ ఉంది.
ఈ అధ్యయనంలో పనిచేసిన డాక్టర్ పిల్లింగర్ బీబీసీతో మాట్లాడుతూ, పై ముగ్గురిలో ప్రతి ఒక్కరికీ వారి ఆరోగ్య అవసరాల రీత్యా వేరు వేరు డిప్రెషన్ నివారణ ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
సారా బరువు బరువు పెరగడానికి దోహదపడని డిప్రెషన్ నివారణ మందులు తీసుకోవాలి. ఇందుకోసం ఆమె అమిట్రిప్టిలైన్, మిర్టాజ్‌పైన్‌కు (ఇవి బరువుపెరిగేలా చేస్తాయి) కు బదులుగా అగోమెలాటిన్, సెర్ట్రాలిన్ లేదా వెన్లాఫాక్సిన్ తీసుకోవాలి.
ఇక జాన్ వెన్లాఫాక్సిన్, అమిట్రిప్టిలైన్ లేదా నార్ట్రిప్టిలైన్ వంటి రక్తపోటును పెంచే యాంటిడిప్రెసెంట్స్ మానుకోవాలి. సిటలోప్రమ్, ఎస్కిటలోప్రమ్ లేదా పరోక్సెటైన్ వంటి మందులు ఆయనకు సురక్షితమైనవి.
ఇక జేన్ విషయానికొస్తే, వెన్లాఫాక్సిన్, డులోక్సెటైన్, పరోక్సెటైన్ వంటి అధిక కొలెస్ట్రాల్‌తో ముడిపడి ఉన్న మందులను వాడకూడదు. సిటలోప్రమ్ లేదా ఎస్కిటలోప్రమ్ ఆమెకు మంచి ఆప్షన్లు ఎందుకంటే అవి కొలెస్ట్రాల్‌ను పెద్దగా ప్రభావితం చేయవు.

ఫొటో సోర్స్, Getty Images
'ఈ ఫలితాలు ఉపయోగకరమైనవి'
కొన్ని యాంటిడిప్రెసెంట్లను 'మంచివి' అని, మరికొన్నింటిని 'చెడ్డవి' అని చెప్పడం సులభమేనని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఔషధం ప్రజలను భిన్నంగా ప్రభావితం చేస్తుంది. ప్రయోజనాలు, దుష్ప్రభావాలు రెండింటినీ కలిగి ఉంటుంది.
ఉదాహరణకు, అమిట్రిప్టిలైన్ బరువు, హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతుంది. కానీ, ఇది నొప్పి, నిద్రలేమికి కూడా సహాయపడుతుంది.
ఎస్ఎస్ఆర్ఐలు అనే అత్యంత సాధారణ యాంటిడిప్రెసెంట్‌లు - పరోక్సేటైన్, సిటలోప్రమ్, ఎస్కిటలోప్రమ్ సెర్ట్రాలైన్ వంటివి - సాధారణంగా తక్కువ శారీరక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.
ఫ్లూక్సేటైన్ (ప్రోజాక్) అనే ఎస్ఎస్ఆర్ఐ కొంత బరువు తగ్గడానికి, అధిక రక్తపోటుకు కారణమవుతుందని అధ్యయనంలో తేలింది.
డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఎంతమందికి వేరే డ్రగ్ తీసుకోవాలో చెప్పడం అసాధ్యం అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆండ్రియా సిప్రియాని అభిప్రాయపడ్డారు.
యూకేలో చౌకైన, జెనరిక్ ఔషధాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో, 85 శాతం ప్రిస్క్రిప్షన్లలో సిటలోప్రమ్, సెర్ట్రాలైన్ లేదా ఫ్లూక్సేటైన్ డ్రగ్స్ ఉంటాయని ఆయన అన్నారు.
ఈ కొత్త అధ్యయనంతో చాలా మారవచ్చని, ఎక్కువమంది తమకు బాగా సరిపోయే యాంటిడిప్రెసెంట్‌ను పొందడంలో సహాయపడవచ్చని ఆండ్రియా అన్నారు.

మరోవైపు, వైద్యులు, రోగులు సరైన ఔషధాన్ని ఎంచుకోవడంలో సహాయపడటానికి పరిశోధకులు ఉచిత ఆన్‌లైన్ టూల్ డెవలప్ చేస్తున్నారు.
ఈ అధ్యయనం చికిత్స మొదటి ఎనిమిది వారాలను మాత్రమే పరిశీలించింది. అయితే దీనికి మరిన్ని టెస్టులు అవసరమని డాక్టర్ పిల్లింగర్ అభిప్రాయపడ్డారు.
ఈ ఫలితాలు "కొత్తవి, ఉపయోగకరమైనవి"అని బాత్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ప్రసాద్ నిష్టాల అన్నారు.
నెలలు లేదా సంవత్సరాలుగా యాంటిడిప్రెసెంట్స్ తీసుకునే వ్యక్తులకు, ముఖ్యంగా దీర్ఘకాలిక డిప్రెషన్ ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














