ఒక్క బ్లడ్ టెస్ట్.. 50కి పైగా క్యాన్సర్లను గుర్తిస్తుంది

గలేరి పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫెర్గూస్ వాల్ష్‌
    • హోదా, మెడికల్ ఎడిటర్

ఒక రక్త పరీక్ష 50 రకాలకు పైగా క్యాన్సర్లను వేగంగా నిర్ధరించేందుకు సాయపడుతుందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది.

ఉత్తర అమెరికాలో చేపట్టిన ప్రయోగ ఫలితాల్లో.. ఈ పరీక్ష వివిధ రకాల క్యాన్సర్లను గుర్తించగలుగుతుందని వెల్లడైంది.

ఈ పరీక్షతో గుర్తించగలిగే క్యాన్సర్లలో మూడొంతుల రకాలకు ఇప్పటివరకు ఎలాంటి స్క్రీనింగ్ సౌకర్యం అందుబాటులో లేదు.

ఈ పరీక్షతో సగానికి పైగా క్యాన్సర్లను ప్రాథమిక దశలో గుర్తించగలిగారు. దాంతో బాధితులకు సత్వరమే చికిత్స అందించే, నయం చేసే అవకాశం ఏర్పడుతుంది.

గలెరీ టెస్ట్‌ అనే ఈ రక్త పరీక్షను అమెరికాకు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ గ్రెయిల్ రూపొందించింది.

కణితి విచ్ఛిన్నం అయి, రక్తంలో చేరే క్యాన్సర్ డీఎన్‌ఏకు చెందిన అంశాలను ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

ప్రస్తుతం దీనిపై ఎన్‌హెచ్ఎస్ ప్రయోగాలు జరుపుతోంది.

ఏడాది పాటు అమెరికా, కెనడాలో 25 వేల మందికి ఈ రక్త పరీక్ష చేశారు. వారిలో ప్రతి 100 మందిలో ఒకరికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి.

కాగా ఈ పరీక్షలో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినవారిలో 62 శాతం మందికి క్యాన్సర్ తరువాత దశల్లో నిర్ధరణైంది.

ఈ పరీక్ష క్యాన్సర్ స్క్రీనింగ్ విషయంలో ఉన్న విధానాలను ప్రాథమికంగా మార్చనుందని డేటా చూపిస్తుందని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ రేడియేషన్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, లీడ్ రీసెర్చర్ డాక్టర్ నిమా నబావిజాదే చెప్పారు.

నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేలా ప్రారంభ దశలోనే అనేక రకాల క్యాన్సర్‌లను గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుందని నిమా తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ పరీక్షలో నెగిటివ్ వచ్చిన 99 శాతం మందికి పైగా క్యాన్సర్ లేదని నిర్ధరణైంది.

ఈ పరీక్షలో గుర్తించిన క్యాన్సర్లలో మూడొంతుల రకాలకు ఎలాంటి స్క్రీనింగ్ సౌకర్యం లేదు.

వాటిల్లో ఓవెరియన్ (అండాశయం), లివర్ (కాలేయం), స్టమక్ (కడుపు), బ్లాడర్ (మూత్రాశయం), ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు ఉన్నాయి.

ఈ రక్త పరీక్షతో నిర్ధరించిన 10 కేసుల్లో తొమ్మిదింటిలో క్యాన్సర్ ఎక్కడ పుట్టిందో గుర్తించగలిగారు.

క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే నిర్ధరించడంలో ఈ రక్త పరీక్ష భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించనుందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

అయితే, ఈ రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ మరణాలను తగ్గించవచ్చా లేదా అనే దానికి మరింత ఆధారాలు కావాల్సి ఉందని ఈ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చెప్పారు.

'' మరణాల సంఖ్య తగ్గింపే లక్ష్యంగా తీసుకునే ర్యాండమైజ్డ్ స్టడీస్ డేటా.. గలెరీ ద్వారా ప్రారంభ దశలో గుర్తించిన క్యాన్సర్లతో ప్రజలను మరణాల నుంచి కాపాడవచ్చా లేదా? అనే దాన్ని నిరూపించడం అవసరం'' అని లండన్‌లోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌కు చెందిన ట్రాన్‌స్లేషనల్ క్యాన్సర్ జెనెటిక్స్ ప్రొఫెసర్ క్లేర్ టర్నబుల్ చెప్పారు.

శనివారం బెర్లిన్‌లోని యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ వద్ద ఈ ఫలితాలను విడుదల చేశారు.

కానీ, పూర్తి వివరాలను నిపుణులు తనిఖీ చేసే ప్రముఖ జర్నల్‌లో (పీర్ రివ్యూడ్ జర్నల్‌లో) ప్రచురించాల్సి ఉంది.

ఇంగ్లాండ్‌లోని 1,40,000 ఎన్‌హెచ్ఎస్ రోగులు పాల్గొన్న మూడేళ్ల ప్రయోగ ఫలితాలపై ఇది ఎక్కువగా ఆధారపడి ఉంది. వచ్చే ఏడాది ఈ ఫలితాలు ప్రచురితం కానున్నాయి.

ఈ ప్రయోగ ఫలితాలు కనుక విజయవంతమైతే, 10 లక్షల మందికి ఈ పరీక్షను విస్తరించనున్నామని ఎన్‌హెచ్ఎస్ అంతకుముందు చెప్పింది.

క్యాన్సర్ పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఫలితాలు చాలా కచ్చితమైనవిగా ఉన్నాయని గ్రెయిల్ బయోఫార్మా ప్రెసిడెంట్ సర్ హర్పాల్ కుమార్ చెప్పారు.

క్యాన్సర్ల వల్ల చనిపోయే చాలామంది, వీటిని చాలా ఆలస్యంగా కనుగొంటున్నారని బీబీసీ రేడియో 4 టుడే ప్రొగ్రామ్‌తో చెప్పారు సర్ హర్పాల్ కుమార్.

చాలా క్యాన్సర్లను అప్పటికే చాలా అడ్వాన్స్ దశలో ఉన్నప్పుడు గుర్తిస్తున్నట్లు తెలిపారు.

దాని గురించి వివరిస్తూ.. ఎక్కువ ప్రభావవంతంగా ఉండే, నయం చేయగలిగే చికిత్సలను అందించే అవకాశం ఉన్న తొలి దశలోనే వ్యాధిని గుర్తించడం తమ లక్ష్యం అని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)