రొమ్ము క్యాన్సర్ కేసుల్లో హైదరాబాద్‌ టాప్, రిజిస్ట్రీల డాటా ప్రమాద ఘంటికలు మోగిస్తోందా?

రొమ్ము క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

క్యాన్సర్ వివిధ రూపాల్లో విస్తరిస్తున్నట్లు ఇటీవల విడుదలైన డాటా చెబుతోంది. రొమ్ము క్యాన్సర్ కేసులు దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లోనే నమోదు అవుతున్నట్లు ఈ డాటా చెబుతోంది. ఈ తరహా క్యాన్సర్‌ బాధితుల్లో బెంగళూరు, చెన్నై తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), టాటా మెమోరియల్ సెంటర్ ఇటీవల (ఆగస్టు 20న) విడుదల చేసిన పరిశోధన వివరాలను దేశంలో క్యాన్సర్ వ్యాధి ఏ స్థాయిలో ఉందన్నది తేలింది.

లైవ్‌మింట్ వైబ్‌సైట్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలు ఈ డాటాకు సంబంధించి కథనాలు ప్రచురించాయి. ఈ కథనాల ప్రకారం, దేశంలోని 43 క్యాన్సర్ రిజిస్ట్రీల వద్దనున్న డేటా ప్రకారం... 2015 నుంచి 2019 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 7.08 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అలాగే క్యాన్సర్, క్యాన్సర్ సంబంధిత కారణాలతో 2.06 లక్షల మంది మృతి చెందారు.

ఐసీఎంఆర్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ వివరాల ప్రకారం...2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య దాదాపుగా 14.9 లక్షలని తేలింది.

2024 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య సుమారు 15.6 లక్షల మందికి చేరింది. ఈ కాలంలో క్యాన్సర్, క్యాన్సర్ సంబంధిత కారణాలతో 8.74 లక్షల మంది చనిపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హీనా ఖాన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి హీనా ఖాన్

మహిళల్లో అత్యధికంగా క్యాన్సర్ రేట్...

క్యాన్సర్ బారినపడుతున్నవారిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. వారిలోనూ రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ బాధితులే 40 శాతంమంది ఉన్నారు.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర పట్టణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని పట్టణాల్లో గొంతు క్యాన్సర్ కేసులు అధికంగా నమోదయ్యాయి.

క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

అసోఫాజియల్, స్టమక్ క్యాన్సర్ కేసులు ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా బయటపడ్డాయి. గర్భాశయ క్యాన్సర్ కేసులు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ప్రతి లక్షమంది మహిళల్లో 54 మంది రొమ్ము క్యాన్సర్ బాధితులే ఉన్నారు. బెంగళూరులో 48.7 మంది ఉన్నారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు ఎక్కువ మంది పురుషులే. అత్యధికంగా శ్రీనగర్‌లో ప్రతి లక్ష మందిలో 39.5 మంది ఉన్నారు.

గొంతు క్యాన్సర్ కూడా ప్రమాదఘంటికలు మోగిస్తోంది. అత్యధికంగా అహ్మదాబాద్‌లో ప్రతి లక్ష మందిలో 33.6 మంది, భోపాల్‌లో 30.4 మంది గొంతు క్యాన్సర్ బాధితులే.

క్యాన్సర్

ఫొటో సోర్స్, MIT

క్యాన్సర్ మృతుల సంఖ్యా ఆందోళనకరమే...

క్యాన్సర్ బాధితులు, క్యాన్సర్‌ కారణంగా మృతుల నిష్పత్తి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో ఉంది. క్యాన్సర్ రోగుల్లో మహిళల శాతం ఎక్కువగా ఉన్నా, మరణాల విషయంలో మాత్రం పురుషులే అధిక శాతం ఉన్నారు.

గొంతు, ఊపిరితిత్తులు, కాలేయం తదితర అవయవాలకు వస్తున్న క్యాన్సర్‌ అధికంగా పురుషుల మరణానికి కారణమవుతోంది.

పొగాకు వినియోగం, ధూమపానం ఇటీవల కాలంలో తగ్గుముఖం పడుతున్నప్పటికీ గొంతు క్యాన్సర్ రేట్ పెరుగుతోంది. మద్యపానం కూడా ఏడు రకాల క్యాన్సర్‌కు ప్రధాన హేతువు అవుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు...

దేశవ్యాప్తంగానున్న 43 రిజిస్ట్రీల్లో అత్యధికంగా ఈశాన్య భారతదేశంలోని ఐజ్వాల్‌లో క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి లక్షమంది పురుషుల్లో 198.4 మంది, ప్రతి లక్ష మంది మహిళల్లో 172.5 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు.

జాతీయ సగటు కన్నా ఇక్కడ ఎక్కువ శాతం క్యాన్సర్ రావడానికి పొగాకు వాడకం, ఉప్పులో నానబెట్టి ఆరబెట్టిన మాంసం, చేపలు తినడం వంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పంది కొవ్వు నుంచి తయారయ్యే సా-ఉమ్ తాగడం వంటివి ప్రధాన కారణాలుగా వైద్యులు భావిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడిన జర్నలిస్టు రవిప్రకాశ్

ఫొటో సోర్స్, Ravijharkhandi

ఫొటో క్యాప్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడిన జర్నలిస్టు రవిప్రకాశ్

'తెలుగు' రాష్ట్రాల్లోనూ క్యాన్సర్ ముప్పు...

రొమ్ము క్యాన్సర్, గొంతు క్యాన్సర్ కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ కేసుల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. ప్రతి లక్ష మంది మహిళల్లో 54 మంది ఈ రోగం బాధితులే.

ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్నం, బెంగళూరు, కొల్లాం, తిరువనంతపురం, మలబారు ప్రాంతం, చెన్నై, దిల్లీ తదితర మెట్రోపాలిటన్ నగరాలతో పాటు దక్షిణ భారతదేశంలో ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)