ఎనిమిది అవయవాలు తొలగించుకొని క్యాన్సర్‌ను జయించిన మహిళ

ఫేయ్ లూయిస్

ఫొటో సోర్స్, Faye Louise

ఫొటో క్యాప్షన్, క్యాన్సర్ వచ్చిందని తెలియడంతో ఫేయ్ లూయిస్ తన అంత్యక్రియలు ఎలా జరగాలనే దానిపై ప్లాన్ చేసుకున్నారు
    • రచయిత, క్రిస్టియన్ ఫుల్లర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంగ్లండ్‌కు చెందిన ఒక మహిళకు అరుదైన క్యాన్సర్ రావడంతో ఆమె ఎనిమిది అవయవాలు తొలగించాల్సి వచ్చింది. ఇపుడు ఆమె కోలుకొని విధుల్లో చేరారు.

వెస్ట్ ససెక్స్‌లోని హోర్‌షామ్‌కు చెందిన ఫేయ్ లూయిస్ కథ ఇది.

2023లో ఆమె అపెండిక్స్‌(ఆంత్రం)లో కణితి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో చనిపోతాననుకొని అంత్యక్రియలకు కూడా ప్లాన్ చేసుకున్నారు ఫేయ్. అయితే ఒక పెద్ద శస్త్ర చికిత్స ఆమె ప్రాణాలు నిలిపింది, క్యాన్సర్ నుంచి రక్షించింది.

గాట్విక్ విమానాశ్రయంలో ఫ్లైట్ డిస్పాచర్‌గా పని చేసే ఫేయ్ ఇపుడు తన ఉద్యోగానికి తిరిగి వచ్చారు.

క్యాన్సర్ నుంచి ఇలా బయటపడటం తనకు లభించిన 'గొప్ప క్రిస్మస్ బహుమతి' అని ఫేయ్ అన్నారు. ఈ సమయంలో ఇలా పనిచేస్తానని గత సంవత్సరం అనుకోలేదని ఫేయ్ అంటున్నారు.

"నా ఉద్యోగంలో శారీరక శ్రమ అవసరం. కానీ నాకు ఏవియేషన్‌ అంటే ఇష్టం. తిరిగి విధుల్లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది" అని ఆమె ‘బీబీసీ రేడియో ససెక్స్‌’తో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కుక్కను పట్టుకుని కూర్చున్న ఇద్దరు వ్యక్తులు

ఫొటో సోర్స్, Cancer Research UK

ఫొటో క్యాప్షన్, సూడోమైక్సోమా పెరిటోనితో ఫేయ్‌ బాధపడుతున్నట్లు 2023లో వైద్యులు గుర్తించారు

పీరియడ్స్ అనుకొని..

ఫేయ్ ఒక మాజీ మోడల్, 2023లో ఆమె పొట్టలో నొప్పి అనిపించింది. మొదట్లో పీరియడ్స్ కారణంగా అలా అవుతోందని ఆమె అనుకున్నారు.

అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తే ఆమె అండాశయంలో తిత్తి ఉన్నట్టు తేలింది. దీంతో ఆపరేషన్ చేయించుకున్నారు ఫేయ్.

అయితే, ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తర్వాత తెలిసింది. ఆమె సూడోమైక్సోమా పెరిటోని అనే అరుదైన ట్యూమర్‌తో బాధపడుతున్నారని వైద్యులు నిర్ధరించారు. దీని వలన పొత్తికడుపులో జెల్లీ (చిక్కని ద్రవం) లాంటి పదార్థం ఏర్పడుతుంది. కణితి చీలిపోయి ఆమె శరీరమంతా క్యాన్సర్ కణాలు వ్యాపించాయి. దీంతో ఫేయ్‌కు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆమె ఎనిమిది అవయవాలు తొలగించారు.

సర్జరీలో ప్లీహము, పిత్తాశయం, అండాశయం, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌లు, అపెండిక్స్, బొడ్డు బటన్, ఆమె కాలేయంలో కొంత భాగం, పొట్టను ఇతర అవయవాలకు అనుసంధానించే పెద్ద, చిన్న ఓమెంటమ్‌(పేగులో ఉండే తిత్తి)లను తొలగించారు.

ఫేయ్ లూయిస్

ఫొటో సోర్స్, Cancer Research UK

ఫొటో క్యాప్షన్, క్యాన్సర్ రీసర్చ్ యూకే సంస్థ కోసం ఫేయ్ లూయిస్ విరాళాలు సేకరిస్తున్నారు

ఇపుడు బాగుంది: ఫేయ్

ఫేయ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఆమెకు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది.

"ఫలితాల కోసం వేచి ఉండటం ఎపుడైనా ఒత్తిడి కలిగించేదే, అది నా క్రిస్మస్‌ వేడుకలపై ప్రభావం చూపుతుంది. కానీ నేను బలంగా ఉండటానికి, ముందుకు సాగడానికి ప్రయత్నిస్తాను" అని ఫేయ్ చెప్పారు.

"కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి, కానీ ఇప్పుడు అంతా బాగుంది" అని ఆమె అన్నారు.

ఫేయ్ తిరిగి ఉద్యోగంలో చేరారు, అంతేకాదు క్యాన్సర్ రీసర్చ్ యూకే అనే సంస్థ కోసం విరాళాలను కూడా సేకరించారు. స్లిన్‌ఫోల్డ్‌లోని రెడ్ లియోన్ పబ్‌లో నారింజ రంగు బురద పూసుకోవడం ఆమె విరాళాల సేకరణ కార్యక్రమాలలో ఒకటి. ఛారిటీ కోసం ఆమె ఇంగ్లండ్‌లోని స్టాన్మర్ పార్క్‌లో జరిగిన 'రేస్ ఫర్ లైఫ్‌' కూడా పూర్తి చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)